The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kalagantine Cheli>>Kalagantine Cheli
కలగంటినే చెలి - 44

జమునారాణి తన ఇంట్లో పని మానేసి వెళ్ళిపోతూ వుందని తెలిసిన వాసూ గుండె పగిలిపోయింది. స్కూల్లో ఇంట్రవెల్ బెల్ కొట్టినప్పుడు బడి వెనక్కి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ రోజు మధ్యాహ్నం టిఫిన్ క్యారియర్ లోని అన్నమంతా ఒక్క ముద్దయినా తినకుండా కుక్కలకి వేశాడు. సాయంకాలం స్కూల్ నుంచి వస్తూ తాటితోపు దగ్గర ఆగిపోయి తనివితీరా ఎద్చుకున్నాడు. అలా ఏడ్చి ఏడ్చి తల్లి చనిపోయినా ఇప్పుడిక నీళ్ళురావు అని అనిపించినప్పుడు లేచి ఇంటికి వచ్చాడు.

సాయంకాలం బాత్రూమ్ లోకి అన్యమనస్కంగానే నడిచాడు. జమునారాణికి బదులు తల్లి వచ్చింది. విషయం తెలుసుకాబట్టి జమున గురించి అడగలేదు. స్నానం అయిపోయాక డాబాదీడకి వెళ్ళాడు. జమునారాణి కనిపిస్తుందేమోనని ఆమె ఇంటివైపు మెడ సాగించి చూశాడు. కానీ ఆమె కనిపించలేదు. చీకట్లు విశాదంలా చుట్టూ పేరుకుపోతున్నాయి. అప్పుడిక డాబా దిగి కిందకి వచ్చాడు.

వీథి తిన్నెమీద కూర్చున్నాడు. చీకట్లో అయితే తనని ఎవరూ గుర్తుపట్టలేరు. అదే వెలుతురులో అయితే తను ఎదుస్తున్నట్లు పసికట్టేస్తారు. తల్లిదండ్రులు చూస్తే ఇక అంతేసంగతులు, వీపు పేలిపోతుంది. తిన్నెమీద ఓ మూల ఎవరికీ కనపడకుండా కూర్చున్నాడు. టైం ఎనిమిదవుతూ వుంది. కాలంతో పాటు చీకటి కూడా బాగా నలుపెక్కుతోంది. కిరోసిన్ దీపాలు చీకట్లమీద వాలిన మిణుగురు పురుగుల్లా వున్నాయి. గాలి ఏదో విషాదం బరువుకి మెల్లగా వీస్తోంది చలి లోకాన్నంతా తన గుప్పిట మూసినట్టుంది.

అయితే అతనికి చలిగా లేదు. గుండెలు పగిలిపోతున్నప్పుడు చలి ఎలా తెలుస్తుంది? అటే వీథిలోకి చూస్తున్నాడు. ఎవరో వస్తున్నా అలికిడి, తలతిప్పి చూశాడు. రంగనాథం వస్తున్నాడు. ఇంట్లో సామానులు ప్యాక్ చేయడానికి గోనె సంచులు కావాల్సి వచ్చాయి. వరలక్ష్మమ్మని అడగడానికి వస్తున్నాడు. అతన్ని చూస్తూనే వాసూకి ఉక్రోషం మొదలైంది. తన ఆట వస్తువును అతనే బలవంతంగా లాక్కెళుతున్నట్లు తోచింది.

దాంతో అతని మీద విపరీతమైన కోపం వచ్చింది. మెల్లగా తిన్నెమీద నుంచి దిగాడు. వీథిలో ఓ పక్క చేతులతో తడిమాడు. చిన్నరాయి దొరకింది. దాన్ని తీసుకుని బలంగా రంగనాథం పైకి విసిరాడు. చేయి వణకడం వల్ల గురి తప్పిందిగానీ నడుముకు తగిలింది. అతను బిత్తరపోయాడు. ఎఅరో రాయి విసిరినట్టు తెలుసుగానీ అదెవరో చీకట్లో తెలియడంలేదు.

"ఎవర్రా కొట్టింది?'' అతను అరుస్తున్నాడు.

వాసూ మెల్లగా అటునుంచి తప్పుకుని ఇంట్లోకి పరిగెత్తాడు. రంగనాధం అటూ ఇటూ చూసి, ఎవరూ కనిపించక పోవడంతో లోపలికి వెళ్ళాడు. అతను గోనెసంచులు తీసుకునే వరకూ చీకట్లోనే నక్కి వుండి తరువాత ఇంట్లోకి వెళ్ళాడు వాసు.