The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Itlu Neechilaka>>Itlu Nee Chiluka
ఇట్లు నీ చిలుక 153

శతరూప, రామదాసు లాస్ట్ బస్ కి చిత్తూరు నుంచి బయలుదేరారు. వారు హాస్పిటల్ చేరుకునేటప్పటికి రాత్రి పదకొండు గంటలైంది. వాళ్ళిద్దర్నీ చూస్తూనే సుశీలకు పోయిన ప్రాణం లేచొచ్చినట్టుఅనిపించింది. గత నాలుగు రోజులుగా కవిత దగ్గర ఒంటరిగా వుండాల్సి వస్తోంది. రామదాసు, శతరూప ఏ అర్థరాత్రో హాస్పిటల్ కి వస్తారు. తిరిగి తెల్లవారు జామున వేలిపోతారు. ఉలక్కుండా, పలక్కుండా నిస్తేజంగా పడుకున్న కవితకు కాపలా కాస్తూ కూర్చోవడం అంటే ఆమెకు విసుగ్గా వుంది.

ఇందుమతి ఇంట్లోంచి వెళ్లిపోవడం వల్ల ఆ తల్లి ఇంటికి కూడా పోకుండా నిద్రాహారాలు మాని వేడుకుతోందని తెలుసు ఇలాంటి సమయంలో ఒంటరిది ఎక్కడికని తిరగ్గలదు? అందుకే రామదాసు తోడు పోతుంటే కాదనడం లేదు. హాస్పిటల్లో విసుగ్గా వున్న భరిస్తోంది."టీ అన్గాల్లకు పాలుపోసే రంగమ్మ కొడుకు మోపెడ్ లో ఊరికి పోతున్నాడు. వెళ్ళనా'' భర్త రాగానే అడిగింది సుశీల. ఊర్లో పడితే తప్ప తనబుర్ర పనిచేయదని ఆమెకి అనిపిస్తోంది. భార్యకు ఏ సమాధానం చెప్పకుండా ఆయన మౌనంగా శతరూప వంక చూశాడు.

నాలుగురోజులుగా వెదుకుతున్నా కూతురి జాడ తెలియడం లేదు. తనతోపాటు ఆయన కూడా తిరుగుతున్నాడు. ఇంకా ఆయన్ని బాధపెట్టడం సబబు కాదని అనిపించింది. "వెళ్ళమను'' అన్నది శతరూప. "అయితే వేళ్ళవే'' అన్నాడు రామదాసు. సుశీల ముఖం అప్పుడు వెలిగింది. ఉత్సాహంతో ఆమె బయటికి కదిలింది. ఆమె ఊరు వెళ్ళిపోయాక రామదాసు, శతరూప ఇద్దరూ ముఖాలు కడుక్కున్నారు. ఆ సమయంలో ఏమీ తినాలనిపించలేదు. మధ్యాహ్నం కోలారులో తిన్న తిండి అంతే.

"రెండు అరటిపళ్ళన్నా తినమ్మా'' అంటూ రామదాసు లేచాడు. బజారుకెళ్ళి అరడజను పళ్ళు తెచ్చాడు. "తినమ్మా'' అని రెండు పళ్ళు తుంచి ఆమెకిచాడు. తను రెండు పళ్ళు తీసుకున్నాడు. ఆమెకి అప్పుడేమీ తినాలనిపించడం లేదు. కానీ తను తినకపోతే ఆయనా తినడు. ఆ కారణం చేతే పళ్ళను చేతుల్లోకి తీసుకుంది. కానీ తినాలనిపించడం లేదు. మనసంతా కూతురుపై వుంటే ఇక ఎక్కడి ఆకలి? ఎక్కడి దాహం? బాగా తాత్రవ్వడం వల్ల హాస్పిటల్ లో ఏ అలికిడీ లేదు.

అంతా నిశ్శబ్దాన్ని భరించలేక పోయాడు రామదాసు. తన మేనకోడలికి మతిస్థిమితం తప్పడం, తనకు ఎంతో ఆత్మీయురాలైన శతరూప కూతురు ఇందుమతి ఇంటినుంచి వెళ్లిపోవడం ఆయన్ని కలచివేస్తోంది. ఏమీ మాట్లాదపోతే గుండెంతా మండిపోతున్న భావన, అందుకే ఆయన ఏమైనా మాట్లాడదామని ప్రతిసారీ తలపైకెత్తుతాడు. కానీ ఏం మాట్లాడాలో తెలియదు. కన్నీరు తప్ప మరేదీ కనపడని శతరూపని చూసి ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. కవిత ఓ పదినిముషాల ముందే నిద్రలేచింది.

ఆమె నిద్రకి టైం అంటూ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు కన్ను మూస్తుంటుంది. అలా నిద్రలేచి బాత్రూమ్ కి వెళ్లొచ్చి తిరిగి మంచం మీద పడుకుంది. అలా కళ్ళు తెరిచి పైకప్పు కేసి చూస్తోంది. తన మంచానికి అటూ ఇటూ కుర్చీల్లో కూర్చున్న రామదాసుగానీ, శతరూపగానీ గమనించలేదు. ఆమె ధ్యాసలో ఆమె వుండడమే ఆమె జబ్బు. ఇందుమతి మనకి కనిపిస్తుందన్న నమ్మకం కూడా పోయింది. నాలుగు రోజులనుంచీ మనం తిరగని ప్రదేశం ఏమైనా వుందా? అతని మిత్రులు, బందువులు, శ్రేయోభిలాషులు ఇలా ప్రతి ఒక్కరి ఇంటికీ తిరిగాం. అయినా ఏమాత్రం లాభం లేకుండా పోయింది ఇప్పుడెలా?'' శతరూప మాట్లాడుతుంటే దుఃఖం అడ్డంపడింది.

"నిజమేనమ్మా నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఏం చేయాలో నాక్కూడా పాలుపోవడం లేదు'' రామదాసు క్కూడా ఏమీ తోచడం లేదు. ఇరవై ఐదేళ్ళు పెంచి పోషిచిన ముద్దుల కూతురు కనిపించకుండా పొతే ఆ కన్న తల్లి కడుపులో ఇప్పటికే ఎన్ని పేగులు తెగిపోయి ఉంటాయో ఆయన అర్థం చేసుకోగలడు. "ఎక్కడి వెళ్లుంటారు? అసలు ఇందూ ఆ కుర్రాడితో వెళ్ళింటుందంటారా?'' అంది శతరూప.

"మనమ్మాయి అతనితో క్లోజ్ గా ఉండటం వరకూ నిజమే. ఇందూ కనపడని క్షణం నుంచి అతనూ కనపడడం లేదు. అందులోనూ అతను మన ఇందూను తనతో వచ్చెయ్యడానికి పోర్నమి నుండి అమావాస్య వరకూ గడువుపెట్టిన విషయం నిజం అందులో మరే సందేహమూ మనకక్కరలేదు. వాళ్ళిద్దరూ వెళ్ళిపోయింది అమావాస్య రోజునే'' అన్నాడు రామదాసు.

"నిజంగానే ఇద్దరూ కలిసే వెళ్లుంటారా?'' ఆ కన్నతల్లికి ఇంకా శంక పోవడం లేదు.

"నేనూ నీలా బాధలు అనుభవించినవాడ్నే. కవిత కనపడకుండా వెళ్ళిపోయినా రోజు గుర్తుందా? ఎంతగా కదిలిపోయాను నేను. చలపతి కోసం వెదికితే అతనూ కనపడలేదు. అతని గురించి చిత్రకు తెలుసుంటుందని అనుకున్నాను. పోస్టాఫీస్ లో పనిచేస్తూ అతను చిత్ర ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. తీరా చిత్రను అడిగితే నాకు తెలియదంది. అప్పటి సంగతంతా గుర్తొచ్చి ఆయన గొంతు బాధతో బొంగురు పోతోంది. కానీ తమాయించుకుని తిరిగి చెప్పడం ప్రారంభించాడు.

"చలపతి కోసమని చిత్ర ఇంటికి వెళితే ఆ రోజు ...'' ఆయన ఆగాడు. కవిత కదిలినట్లనిపించింది. ఆమెవైపు ఓసారి చూసి "ఎంత అవమానించిందనుకున్నావ్? నాకైతే ఏమీ తెలియదంది. నాకప్పుడు ...''

"చిత్ర ... చి ... త్ర ... చిత్ర'' ఏదో నిద్రలో కలవరించినట్టు కవిత దిగ్గున లేచింది.

రామదాసు, శతరూప ఇద్దరూ అట్లా మాటలు రాక ఆమెవైపు చూస్తుండిపోయారు.

"చిత్ర ... చలపతి'' ఆమె ఏదో సంఘటన గుర్తొచ్చినట్టు, అయితే మాటలు మర్చిపోయినట్టు ఆ రెండు మాటలనే పదేపదే ఉచ్చరిస్తోంది. కళ్ళల్లో నీళ్ళు, హృదయంలో అన్ని రోజులు పేరుకు పోయిన విషాదం కరుగుతున్నట్టు ఆమెకు తెలియకుండానే వెక్కివెక్కి ఏడుపొస్తోంది.