ఆహారపదార్థాలు రెండు రకాలుగా ఉంటాయి. కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా కాలరీలను కలిగి ఉంటే మరికొన్ని కొద్దిపాటి కాలరీలే కలిగి ఉంటాయి. బరువు తగ్గాలని అనుకున్నప్పుడు ఎక్కువ కాలరీలు కలిగి ఉన్న ఆహార పదార్థాలని తక్కువ మోతాదులో భుజించాలి. తీపివస్తువులు, వరి, గోధుమ, జొన్న, దుమ్పకూరలు, క్రొవ్వు వుండే మాంసము, నెయ్యి, వెన్న, మీగడ, నూనె, వేపుడు కూరలు, మామిడి, చక్కరకేళి, ద్రాక్ష, సపోటా వంటి ఆహార పదార్థాలలో ఎక్కువ కాలరీలు ఉంటాయి. మద్య పానీయాలలో కూడా ఎక్కువ కాలరీలు ఉంటాయి. అందుకని బరువు తగ్గాలనుకున్నప్పుడు పై ఆహార పదార్థాలని చాలా తక్కువశాతంలో తీసుకోవాలి.
మన ప్రాంతంలో వరి, జొన్న ఎక్కువ తినడం అలవాటు. వరి అన్నం నుండే ఎక్కువ కాలరీలు లభ్యమవుతాయి. శరీర శ్రమ లేనివారిలో ఎక్కువ వరి అన్నం తినడంవల్ల అది క్రోవ్వుగా మారి ఒళ్ళు రావడానికి కారణం అవుతోంది. అందుకని వరి అన్నం, దుమ్పకూరలు తక్కువ మోతాదులో తినాలి. తోటకూర, బచ్చలి వంటి ఆకుకూరలు, కాకర, వంకాయ, దోస, మునగ, క్యాబేజి, కాలీఫ్లవర్, గుమ్మడి, ముల్లంగి, బీర, పోట్ల, టొమాటో వంటి కాయగూరల్లో తక్కువ కాలరీలు ఉంటాయి. బరువు తగ్గాలనుకున్నవారు అన్నం తగ్గించి పై ఆకుకూరలు, కాయగూరలు భుజించాలి. మాంసం తినేవాళ్ళు కోడిమాంసం, చేప, కాలేయము, కార్జము తీసుకోవచ్చు. కోడిగుడ్డు పచ్చది తీసివేసి తెల్లసొన, మీగడ తీసివేసిన పాలు, వెన్న తీసిన మజ్జిగ, తీపిలేని పానీయాలు, పంచదార లేకుండా కాఫీ, టీలు తీసుకోవచ్చు. డాల్డా, నెయ్యి మానివేయాలి. వీటికి బదులుగా సన్ ఫ్లవర్ ఆయిల్ వాడటం మంచిది. పళ్ళరసాలు, పళ్ళు, చాక్లెట్లు మానివేయాలి.
కొంతమంది బరువు తగ్గడానికి అన్నం మానివేశామని చెబుతూ ఉదయం ఓ అరడజను, రాత్రి ఓ అరడజను తక్కువ కాకుండా చపాతీలు వాటితోపాటు మరింత బంగాళాదుంప కూర తినేస్తూ ఉంటారు. దీనివల్ల బరువు ఏమీ తగ్గకపోగా మరింత పెరగడం జేరుగుతుంది. అన్నం మానేసి చపాతీలు తిన్నంత మాత్రాన బరువు తగ్గడం జరగదు. మనం తీసుకునే ఆహారాన్ని తగినంత తగ్గిస్తేనే బరువు తగ్గడం జరుగుతుంది. బరువు తగ్గాలనుకున్నప్పుడు మధ్యాహ్నం రెండు చపాతీలు, రాత్రి రెండు చపాతీలు మాత్రమే తీసుకోవాలి. ఒక్కొక్క చపాతీ 15 గ్రాములు బరువు కంటే ఎక్కువ వుండకూడదు. ఉదయం, సాయంత్రం టిఫిన్ రూపంలో ఏదైనా ఆహారం తేలికగా తీసుకోవచ్చు. టీ, కాఫీలలో పంచదారకి బదులుగా తీపిగా ఉండేందుకు శాకరీన్ టాబ్లెట్లు ఒకటి రెండు వేసుకోవచ్చు. చపాతీలు కాకుండా మామూలుగా భోజనం చేయాలనుకునేవారు ఉదయం భోజనంలోనూ, రాత్రి భోజనంలోనూ మూడేసి కప్పులకంటే ఎక్కువ అన్నం తినకూడదు. ఆకుకూరలు ఎక్కువ వాడవచ్చు.
|
|


