(182).png)
నాగమణి వాళ్ళ నాన్నగానీ, అన్నగానీ ఈ పని చేయరు. మల్లన్న మాట్లాడే మాటల తీరు అనుమానాన్ని కలిగిస్తోంది. అతన్ని ఓ కంట కనిపెట్టాలి” చెప్పాడు విజయ్.
”మల్లన్న డాడీని చంపాదంటే నేను నమ్మలేక పోతున్నాను” అంది దేవయాని.
”ఇది కేవలం అనుమానమే! అతనికి గల ఇంట్రస్ట్ ఏమిటో తెలుసుకోవాలి” చెప్పాడు జగదీష్ నవ్వుతూ.
”నేను ఇవాళ వెళ్ళిపోవాలనుకొంటున్నాను!” అంది దేవయాని.
విస్మయంగా చూసింది నాగమణి. ”ఎక్కడికి?”
”హాస్టల్ కి!”
”ఇది నీ ఇల్లెనమ్మా!”
”నాకంటూ ఏదీ లేదు. ఈ ఆస్తి కావాలనేగా ముసలివాడని కూడా చూడకుండా డాడీని పెళ్ళి చేసుకున్నావు”
చెంప మీద చెళ్ మణి కొట్టినట్టనిపించింది నాగమణికి. ”చూడమ్మా! నేను … ఏం చేసుకుంటాను ఈ కోట్ల ఆస్తిని. వున్న వాడింట డబ్బు ఖర్చు లేకుండా మూలుగుతుంటే, లేని వాడి చేతికి పట్టెడన్నం దొరకడం లేదు. ప్రజాసేవ కోసం మనకున్న డబ్బుని ఖర్చు చేయాలను కున్నాను దేవయాని. మన కంపెనీలన్నింటికీ మేనేజింగ్ పార్ట్ నర గా నువ్వే అన్ని చూసుకోవాలి. నిన్నో ఇంటిదాన్ని చేయాలి. నీ బాధ్యత నా మీద లేదా చెప్పు!”
ఆమె నాగమణి ముఖంలోకి అదోలా చూసింది. ”నేనంటే నీకిష్టమని చెప్పావు కదా!” అడిగింది.
”అవును అన్నాను!”
విజయ్ దేవయాని భుజంపైన చెయ్యి వేశాడు. ”మణి మనసు ఎలాంటిదో నీకు తెలీదు దేవయానీ! ఆమె మాట కాదనకు! ఆమె తలదించుకుంది.
”ఇది పాపిష్టి ఆస్తి….!”
”కావచ్చు, నల్లడబ్బుని భరించలేకే కొందరు భక్తులు దేవుడికి కానుకగా హుండీలలో నోట్ల కట్టలు పడేస్తారు. ఆ డబ్బుని దేవుడు వాడుకోడు. ప్రజలకి ఉపయోగపడే విధంగానే ఖర్చుచేయబడుతుంది. అలాగే మన కంపెనీల్లో కార్మికులకి మంచి సౌకర్యము కల్పించవచ్చు. పేదపిల్లల చదువుకి, ఆడపిల్లల పెళ్ళిళ్ళకి ఉపయోగపడేలా చేయొచ్చు. మానవ సేవయే మాధవ సేవ అన్నారమ్మా! డబ్బు ఎప్పుడూ పాపిష్టిది కాదు. దాన్ని సంపాదించిన మనిషి పాపిష్టి వెధవ కాకూడదు!” అంది నాగమణి.
”నేను అలా ఆలోచించలేదు!” అంది మెల్లగా సిగ్గుపడుతున్నట్టుగా.
”మరొక్క మాట!” అంది నాగమణి దేవయాని తలపైన ఆప్యాయంగా నిమురుతూ.
”ఏమిటి?” అడిగింది దేవయాని.
ఆమె ఏమి అడగబోతుందో తెలిసినట్టుగా నవ్వాడు విజయ్. ”జగదీష్ చాలా మంచి వాడమ్మా! మీ డాడీవల్ల ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు, జీవితాన్ని పోగొట్టుకున్నాడు. అతనే ఫలానా అని వేలెత్తి చూపించే మచ్చ అతనికి కలిగించాడు మీ డాడీ. అది చెరపలేని మచ్చ! ఆ మచ్చ అతనికి పోవాలంటే అది నీ చేతుల్లో మాత్రమే వుంది”
”అంటే?” ఆమె గొంతు వణికింది.
జగదీష్ జరుగుతోన్న సంభాషణని ఆసక్తిగా వింటున్నాడు.
”ఇదంతా మీదే! నాకు మీరు, మీకు నేను… నువ్వు అతని జీవితంలో ప్రవేశిస్తే జనం కూడా నోరు మూస్తారు. అతనికి సమాజంలో గౌరవం లభిస్తుంది. వ్యక్తిగా అతను నాకు నచ్చాడు!” అంది.
ఒకసారి దేవయాని జగదీష్ కేసి చూసింది. ఇద్దరి చూపులు ఒక్కసారి కలిసి అంతలోనే తప్పించుకొన్నాయి.
”నీకు చాలా మంచి ఆలోచన వచ్చింది రియల్లీ! ఆలోచించుకో దేవయానీ! నాగమణి ఓ అభిప్రాయానికి వచ్చిందంటే ఎంతో ఆలోచించి గానీ రాదు!” అన్నాడు విజయ్.
”బావ మంచివాడని నాకు తెల్సు ఆంటీ!’ అంది దేవయాని.
మొదటిసారి దేవయాని ఆమెని ఆంటీ అని పిలిచింది. జగదీష్ కళ్ళు చెమర్చాయి.
”నాకు రాజేశ్వరి అన్నా కూడా ఇష్టమే! కానీ ఆమె అలా చేసింది” అన్నాడు.
”నేను అలాంటి దాన్ని కాదని చెప్పు ఆంటీ!” అంది.
నాగమణి తేలికగా ఊపిరి తీసుకొంది. దేవయాని సిగ్గుపడుతూ అక్కడినించి లేచి లోపలికి వెళ్ళిపోయింది.
”ఇప్పుడో సమస్య తేలిపోయింది. అసలు విషయానికొస్తే! -” అంటూ నాగమణి, జగదీష్ కి ఏం చేయాలో చెప్పాడు విజయ్.
*****
|
|


