(180).png)
అతని ఎనాలసిస్ విజయ్ కి, నాగమణికి కూడా నచ్చినాయి. ”మనం దేవయానిని అడిగితే?”
తల ఊపాడు విజయ్.
నాగమణి - ”మనం తోటలో కూర్చుని మాట్లాడుకొందాం”
”పద లేచాడు” జగదీష్, విజయ్ తోటలోకి నడిచారు. పదినిమిషాల తర్వాత దేవయానికి తీసుకొచ్చింది నాగమణి.
”నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలనుకొంటున్నాను అభ్యంతరం లేదుగా” అడిగాడు విజయ్.
ఆమె తల వూపింది.
”నేను అడిగే ప్రశ్నలు కొన్ని మీకు బాధ కలిగించవచ్చు. మీ బావని కాపాడాలంటే ముందుగా యీ కేసు విషయంలో ఓ అవగాహనకొచ్చి పోలీసులకి సహకరించాలి” చెప్పాడు విజయ్.
దేవయాని కళ్ళెత్తి జగదీష్ కేసి చూసింది. అతను సిగరెట్ కాలుస్తూ పరధ్యానంగా వున్నట్టు కనిపించాడు. ”అడగండి”
”మీ డాడీ గురించి నీకు బాగా తెలుసు కదా!”
”తెలుసు”
”మంచివారేనా?”
ఆమె చురుగ్గా చూసింది. ”మంచి వాడో, చెడ్డవాడో నాకు తెలీదు. కానీ ఆయన ప్రవర్తన నేను భరించలేక పోయేదాన్ని”
”ఎందుకని?”
దేవయాని కళ్ళల్లో నీరు గిర్రున తిరిగింది. ”ఏ రాక్షస గణాన ఈ భూమ్మీద పుట్టాడో గానీ, సొంతవాళ్ళని అనుమానించడం, అవమానించడం, హింసించడం అలవాటు అతనికి. చాలా భరించాను. ఇక భరించలేక డిగ్రీ అయిపోగానే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగంలో చేరాను.
”ఇంత ఆస్తి వుండి…”
”బ్లడీ షిట్ ! ఎవరికీ కావాలీ ఆస్తి?”
విజయ్ నవ్వాడు. జగదీష్ ఆమె వైపు తల తిప్పాడు.
”పోనీ నువ్వు కావలసిన వాళ్ళు కోరుకోని వుండొచ్చు!”
”అలాంటి వారెవరూ నాకు తెలిసి లేరు”
”నువ్వెక్కడ వుంటున్నావు?”
”వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో!”
”నీకోసం ఎవరైనా వస్తుంటారా ఎప్పుడైనా?”
”మల్లన్న వస్తుంటాడు. వచ్చేటప్పుడు నాకోసం చికెన్ చేసి తీసుకొచ్చేవాడు. ఇంటి విషయాలు అన్నీ నాకు తెలిపేవాడు!”
నాగమణి చురుగ్గా చూసింది. మల్లన్నని ఇదివరలో తను అడిగితే దేవయాని ఎక్కడ వున్నదీ చెప్పలేదు. తెలీదని చెప్పాడు. ఇక్కడే ఏదో తిరకాసుందనిపించింది నాగమణికి. ఆ విషయమే వాళ్ళతో అంది వెంటనే.
”అతనికి అబద్ధం చెప్పవలసిన పని ఏముంది?” అంది దేవయాని.
విజయ్ లేచి నించుని పక్కనే వున్న కొబ్బరి ఆకుని తెంపుతూ - ”చాలా వుందమ్మా! ఇక్కడ మనం మాట్లాడుతున్నా మాటలు మననుంచి ఎవరికీ పోకూడదు. ఇక్కడున్న మన నలుగురం ఈ హత్య చేయలేదు”
”నరేంద్ర?” అడిగింది నాగమణి.
”ఈ హత్య జరిగిన సమయంలో మా చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. కనుక ఈ హత్య అతను చేయలేదని నేను ఖచ్చితంగా చెప్పగలను!”
”ఆ విషయం అతన ఒప్పుకోడేమో! కసికొద్దీ!”
”ఒప్పుకు తీరతాడు!” అన్నాడు విజయ్ తల పంకిస్తూ.
”ఎలా?” జగదీష్ ఆశ్చర్యంగా చూసాడు.
”అవును జగదీష్, సాధారణ పరిస్థితిలో అతను మన మీద కసితో మనం అతని ఫ్లాట్ లో ఆ సమయంలో అతన్ని కొట్టినట్టు ఒప్పుకోక పోవచ్చు. కానీ ఈ హత్యా నేరాన్ని అతని పైకి నెడితే భయంతో ఎలిబీ కోసమైనా ఇది ఒప్పుకుంటాడు”
జగదీష్ కళ్ళు మెరిసాయి. ”అయితే ముందు అతను భయపడే విధంగా మనం చేయాలి” చెప్పాడు జగదీష్.
”ఎలా చేయాలి?”
”దేవయానితో ఫోన్ చేయిద్దాం! నరేంద్ర జి.కె.ని హత్య చేస్తుండగా చూసిన ప్రత్యక్ష సాక్షిగా దేవయాని ఎవరో గొంతు గుర్తుపట్టలేడు. ఆమె ఆ విషయాన్ని పోలీసులకి చెప్తానని పెట్టేస్తుంది.”
”గుడ్ ఐడియా!” అన్నాడు విజయ్.
”సరే! అసలు హంతకుడెవరో చెప్పండి” అంది దేవయాని.
|
|


