Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

 

       ఆమె కిటికీ తెర కాస్త తొలగించి చూసింది.
   
    దూరంగా చీకట్లో రెండు ఆకారాలు అక్కడే నిలబడి వున్నాయి. అందులో ఒకరు రవి. ఆమెకి అతడు ఇంకా ఎందుకు అక్కడే నిలబడి వున్నాడో అర్ధంకాలేదు. తన భర్త ఏమైనా డబ్బు ఇస్తానన్నాడా?.... విదేశాల్లో కొంతకాలం గడపటానికి సరిపోయే డాలర్లు అందజేస్తానన్నాడా?
   
    క్షణం క్రితం తన భర్త గురించి చెడుగా ఆలోచించినందుకు ఆమె బాధపడి సోఫా వెనుకనుంచి రాబోయింది. అదే సమయానికి శర్మ మెట్లు దిగుతూ కనిపించాడు.
   
    అతడి చేతిలో పిస్టల్" వుంది. ఆమె కోసం వెతుకుతోంది అది.
   
                      *    *    *

       
    భాస్కర్ రవితేజవేపు చూసి నవ్వేడు. రవితేజకి అర్ధం కాలేదు. శర్మ తామిద్దరినీ ఇలా ఇంటిముందు వదిలేసి, కార్లో లోపలికి ఎందుకు వెళ్ళిపోయాడో?
       
    అతడి అనుమానం గ్రహించినట్టుగా భాస్కర్ అన్నాడు.
   
    "నీ కథకి ఇది చివరి అధ్యాయం రవితేజా! శర్మగారు తన భార్యని చంపటానికి లోపలికి వెళ్ళారు".
   
    రవి ఉలిక్కిపడ్డాడు.
   
    "లోపలినుంచి పిస్టల్ శబ్దం వినపడగానే నిన్ను ఇలా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతాను.... శర్మగారు అరుచుకుంటూ బయటకు వస్తారు.... మాధవిని చంపిన పిస్టల్ కాంపౌండ్ తుప్పలో దొరుకుతుంది..... రెండు హత్యల హంతకుడిగా నీ గురించి పోలీసులు వెతుకుతారు. నా చెల్లెలు - అదే ప్రియంవదకి, చిన్న ఇల్లు, నాకు రెండు లక్షలు..... చిన్నిల్లు అంటే అర్ధం తెలుసుగా...." నవ్వేడు భాస్కర్ "తాను పార్టీనుంచి ఇంటికి వచ్చేసరికి పిస్టల్ శబ్దం వినిపించిందని, నువ్వు కిటికీలోంచి దూకి పారిపోతుండగా చూశానని శర్మగారు కోర్టులో చెప్తారు. ఎలా వుంది?"
   
    రవి వినటంలేదు. అతడి రక్తం కుతకుత ఉడికిపోతుంది. ఆమె మరణానికి కొన్ని క్షణాల దూరంలో వుంది- అన్న ఆలోచన అతడిని నిలువునా వూపేసింది. భాస్కర్ పిస్టల్ తో నిలబడి వున్నాడు.
   
    రక్షించాలి!
    రక్షించాలి!
    ఆమెని రక్షించాలి!!
    తన ప్రాణం పోయినా సరే!!!
   
    అతడు భాస్కర్ వైపు చూశాడు. తను పరుగెట్టి లోపలికి వెళితే? భాస్కర్ పిస్టల్ పేలుస్తాడు. పేల్చనీ.. తను మరణిస్తే నష్టం ఏముంది? పరువు పోయింది. ప్రతిష్ట పోయింది. హంతకుడిగా ఎలాగూ ముద్రపడింది. ఉరికంబం ఎదురు చూస్తుంది. ఇటువంటి పరిస్థితిలో ఛస్తే నష్టం ఏముంది?
   
    తన చావు ఆమెని బ్రతికిస్తే అంతకన్నా ఏమి కావాలి? అతడు చురుగ్గా ఆలోచించాడు.
   
    పిస్టల్ శబ్దం వినిపించగానే నతా హడావుడిగా అవుతుంది. ముఖ్యంగా శర్మ కంగారుపడి బయటకొస్తాడు. అది చాలు. తన చుట్టూ జనం మూగుతారు. తన ప్రాణాలు పోవటానికి రెండు క్షణాలు ఆలస్యమయితే చాలు. గొంతులో గాలి రెండు క్షణాలు చాలు. ఈ ఊపిరి శబ్దంగా మారి, గొంతులోంచి మాటలుగా బయటకొచ్చి, శర్మ ఘాతకాన్ని బయట పెడతాయి. ప్రపంచం నమ్మకపోయినా ఆమె నమ్ముతుంది. శేషజీవితం ఆ రక్షసుడికి దూరంగా గడుపుతుంది.
   
    అన్నిటికన్నా ముఖ్యంగా - ఆమె బ్రతుకుతుంది.
   
    దానికన్నా ముఖ్యంగా-
   
    ఈ ప్రయోజనం లేని తన జీవితానికి కనీసం చివర్లోనైనా ఒక సార్ధకత ఏర్పడుతుంది.
       
    తన శరీరాన్ని చీల్చే పిస్టల్ గుండు ఆమె మరణాన్ని ఆపే సంకేతం అయితే చాలు.
   
    రెప్పపాటు కాలంలో అతడు ఇంత ఆలోచించాడు.
   
    ఇక టైమ్ లేదు.
   
    శర్మ అప్పుడే యింటి లోపలికి వెళ్ళాడు. ఇక సమయం ఎక్కువ లేదు.
   
    అతడొకసారి గుండెల్నిండా ఊపిరి పీల్చుకుని చటుక్కున వెనుదిరిగి, మెరుపుకన్నా వేగంగా శర్మ ఇంటివైపు పరుగెత్తసాగాడు. ఈ హఠాత్ పరిణామానికి భాస్కర్ నివ్వెరపోయినా, వెంటనే తేరుకొని, పరుగెడుతున్న రవిని వెనుకనుంచి గురిచూశాడు. ఇటువంటి విషయంలో ఎంతో అనుభవమున్నవాడిలా ఏ మాత్రం తొణక్కుండా గురి సరిగ్గా చూసి ట్రిగ్గర్ నొక్కాడు.
       
    ఒకటి..
    రెండు....
    మూడు...
   
    మూడుసార్లు నొక్కినా పిస్టల్ పేలలేదు. అతడికి సేఫ్టీక్యాచ్ గురించి గుర్తొచ్చింది. దాన్ని రిలీజ్ చేసే లోపలే రవితేజ గేట్ లోపలికి ప్రవేశించబోతున్నాడు. ఇద్దరికీ మధ్య పదిహేను గజాల దూరం వుంది. భాస్కర్ కి తను చేయబోయిన తప్పు, రవి ఆలోచన అర్ధమైంది. పిస్టల్ శబ్దం బయటకు వినిపించడానికి వీల్లేదు.
   
    రవితేజ వెనుకే పరుగెత్తడం ప్రారంభించాడు.
   
    అతడు ఇటువంటి విషయాల్లో ప్రొఫెషనల్. సరిగ్గా నాలుగు గజాల దూరంలో వుండగా పిస్టల్ విసిరేడు. అది రవితేజ తలకి తగిలి, గేటు ముందు పడింది.
   
    రవికి కళ్ళు బైర్లు కమ్మాయి. అలాగే తల పట్టుకొని కూలబడి పోయాడు. శర్మ లోపల్నుంచి పరుగెత్తుకు వచ్చాడు. "ఆవిడ లోపల లేదు" అన్నాడు.
   
    ఇద్దరిమధ్యా సూదిపడితే వినపడే అంత నిశ్శబ్ధంలోంచి.....సోఫావెనుక చప్పుడు వినిపించింది.   
   
    ఇద్దరూ చప్పున చూశారు.
   
    వెనుకనుంచి పులి పరుగెత్తుకు వస్తుంటే ప్రాణాలకి తెగించి పరిగెత్తే జింకపిల్లలా ఆమె వాళ్ళిద్దరి మధ్యనుంచి దూసుకుపోయింది.
   
    గాలికన్నా వేగంగా....
   
    తుఫానుకన్నా తీవ్రంగా...
   
    "షూట్ హర్" శర్మ అరిచాడు.
   
    భాస్కర్ చేతిలో ఆయుధం లేదు.
   
    "షూట్" పిస్టల్ అతడివైపు విసురుతూ అరిచాడు.
   
    ఆ లోపులే రవి మోకాళ్ళమీద లేచాడు. అతడు కళ్ళు విప్పేసరికి ఒకవైపు భాస్కర్, కొద్దిదూరంలో శర్మ కనిపించారు. అతడు నెమ్మదిగా లేస్తూ వుండగా భాస్కర్ ఆమెవైపు పిస్తోలు గురిపెట్టడం కనిపించింది. రవి అతడివైపు దూకబోతుంటే అంత కన్నా వేగంగా భాస్కర్ అతడివైపు తిరిగాడు.
       
    "నో..... నాట్ హిమ్!" శర్మ అరిచాడు. ఆ మాటలు అర్ధమవగానే ఆమె వెనుదిరిగింది. భాస్కర్ శర్మ మాటలు వినిపించుకోకుండా రవిని కాల్చబోతున్నాడు.
   
    ఆమె దృష్టి తన కాళ్ళపక్క పడివున్న పిస్టల్ మీద పడింది. వంగి దాన్ని తీసుకొని, ఒక ఉన్మాదావస్థలో వున్న దానిలా వరుసగా బుల్లెట్స్ పేల్చింది.
   
    ప్లాప్.....ప్లాప్.....ప్లాప్..
   
    భాస్కర్ శరీరం తూట్లుపడి రక్తం కాలువలు కట్టింది. గిలగిలా కొట్టుకొని, శరీరం క్షణం తరువాత అచేతనం అయింది.
   
    శర్మ, రవి ప్రేక్షకులు అయ్యారు.
   
    ఆమె అలాగే నిలబడి వుంది.
   
    పిస్టల్ నుంచి పొగలు ఇంకా వస్తూనే వున్నాయి.
   
    ముందు మోటార్ సైకిలు వెలుతురు ఆమె మీద పడింది. తరువాత ఇన్ స్పెక్టర్ తాలూకు మోటార్ సైకిల్ ఆ ఇంటిముందు ఆగింది.
   
   
   
                           ---* * * *---


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More