Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

         

                        ఉపసంహారం
   
   
   
    "హౌ ఈజ్ ది షేర్ మార్కెట్".
   
    ఆమె సీట్లో కూర్చోగానే అతడు అడిగిన మొదటి ప్రశ్న  అది.
   
    "స్టేబుల్ సార్" అతడి సెక్రటరీ అంది.
   
    సమయం పదిన్నర కావొస్తుంది.
   
    "టర్నోవర్ ఫిగర్స్ ఇవ్వండి".
   
    ఆమె కాగితాలు అందించింది. అతడు రెండు నిముషాలు చూసి 'గుడ్' అన్నాడు. "అమ్మకాలు ఏవీ తగ్గలేదు". ఆమె జవాబు చెప్పలేదు కానీ, మనస్సులో అనుకుంది- "ఆడవాళ్ళు ఆర్జీ చీరలు కొనటానికీ, ఆ కంపెనీ యజమాని మీద హత్యానేరపు అభియోగానికి ఏ సంబంధమూ లేదు" అని.
   
    "షేరు మార్కెట్ ఇంకా పికప్ కాకపోవటమే ఆశ్చర్యంగా వుంది" అతనన్నాడు.       
   
    "విషయమంతా ఇంకా పేపర్లలో రాలేదు సార్. బహుశా రేపు రావొచ్చు. రేపట్నుంచీ ధర పెరగవచ్చు".
   
    అతడు తలూపాడు.... "మీ కాలు ఎలా వుంది?"
   
    "ఇపుడు బాగానే వుంది సార్. నో ట్రబుల్".
   
    "ఆ రోజు నేను కిటికీలోంచి చూశాను. మీరు ఎటూ చూడకుండా రోడ్డు దాటుతున్నారు. లేకపోతే మీ మీదకు వచ్చే ఆ వెహికల్ ని చూసే వుండేవారు"
   
    "అవును సార్".
   
    "రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా వుండాలి".
       
    ఆమె మాటల్లో శ్లేష ఏమీలేదు. కానీ అతడు మాత్రం ఆ మాటల్ని మనసులో మరొకసారి మననం చేసుకున్నాడు.
       
    "నేనొక గంటలో తిరిగి వస్తాను" కుర్చీకి తగిలించిన కోటు చేతిలోకి తీసుకుంటూ అతనన్నాడు..... "నిన్నరాత్రి - కొత్తసంవత్సరం ఎలా గడిపారు?"
   
    ఆమె నవ్వింది. "పెద్దోడికి దగ్గు, చిన్నవాడికి జ్వరం మేము పడుకునేసరికి నాలుగయింది. కొత్తయినా, పాతయినా సంవత్సరంలో ప్రతిరోజూ మాకు ఒకేలా  వుంటుంది".
   
    "అదృష్టవంతులు" మనసులో అనుకున్నాడు. అతను తన ఛాంబర్ బయటకొచ్చి చుట్టూ చూశాడు. ఎవరి పనిలో వారున్నారు. టైప్ మిషన్ శబ్దం తప్ప మరేమీ వినపడడం లేదు-అతడు క్రిందికి వస్తూంటే రిసెప్షన్ దగ్గర "ఫోన్ వచ్చింది" అని అందించింది రిసెప్షనిస్టు.
   
    అతడు రిసీవర్ తీసుకుని "హల్లో" అన్నాడు విసుగ్గా. రాత్రంతా నిద్రలేకపోవడం వల్ల కళ్ళు మండుతున్నాయి.
   
    "నేను.... లాయర్ రంగనాధాన్ని"
   
    "చెప్పండి"
   
    "కంగ్రాచ్యులేషన్స్ రవితేజ".
       
    "చెప్పండి" క్లుప్తంగా అన్నాడు. అసలు విషయం త్వరగా చెప్పమన్నట్టు!
   
    అవతలి వైపు నుంచి ఇబ్బందికరమైన మౌనం తటపటాయిస్తున్నట్టు రంగనాధం స్వరం వినిపించింది. "ఐ యామ్ సారీ. శర్మ మాటల్తో నేను తప్పు నిర్ణయం తీసుకోవలసి వచ్చింది".
   
    "దట్సాల్ రైట్..."
   
    మళ్ళీ తటపటాయింపు.
   
    "కోయంబత్తూరు చీరల కంపెనీ ఫైలు వేరే ఇంకో లాయర్ కి యిచ్చారట".
   
    "అవును మీరు చాలా బిజీ అయిపోతున్నారు. కొన్ని ఫైల్స్ ఇంకో లాయర్ కి ట్రాన్స్ ఫర్ చేయమని చెప్పాను...."
   
    "కానీ...."
   
    "నేనిప్పుడు బయటకు వెళ్తూన్నాను. ఏమైనా ముఖ్య విషయాలుంటే తరువాత మాట్లాడండి. అర్జెంటేమీ లేదు. నేను విదేశాలకు పారిపోవడం లేదు. ఫోను పెట్టేశాడు.
   
    వచ్చి కార్లో కూర్చున్నాడు.
   
    "ఎక్కడికి సార్".
   
    "పోలీస్ స్టేషన్ కి".
   
    కారు అయిదు నిముషాల్లో పోలీస్ స్టేషన్ కి చేరుకుంది ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ కుర్చీలో వెనక్కి తలవాల్చి నిద్రపోతున్నాడు.
   
    "హల్లో"
   
    రాజశేఖర్ కళ్ళు తెరచి రవితేజని చూసి "హల్లో!' అన్నాడు. ఎదురుకుర్చీలో రవి కూర్చుంటూ "హాపీ న్యూ ఇయర్!" అన్నాడు.
   
    "మీ కోసం ఇంటికి ఫోన్ చేశాను. ఆఫీసుకి వెళ్ళిపోయారన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇంత తొందరగా మీరు ఎడ్జెస్ట్ అయిపోతారనుకోలేదు. ఇట్సెవండర్".
   
    రవితేజ నవ్వి వూరుకున్నాడు.
       
    "ఇంకా ఆశ్చర్యం ఏమిటంటే మీరింత తొందరగా పరిస్థితుల్ని కంట్రోల్ లోకి తెచ్చుకుని నిర్వహించడం...." ఇంగ్లీషులో అన్నాడు- "మిమ్మల్ని ఇపుడు చూస్తుంటే అసలు మీరేనా ఈ పదిరోజులూ అంత భయపడి అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళింది- అన్న అనుమానం కలుగుతూంది. అప్పుడే లాయర్ని నియమించటం, అతడు వకాలత్ ఫైల్ చేయడం. అంతా అరగంటలో అయిపోయాయి...."
   
    "ఆమెకేం ఫర్వాలేదుగా...."
   
    "నో-నో-ఏమీ కేసు లేదు. ఒక మనిషిని రక్షించడం కోసం ఇంకొక మనిషిని చంపడం నేరం కాదు. మామూలు ప్రొసీజర్స్ తప్పవనుకోండి. ఆమె ప్రస్తుతం ఇంట్లోనే వున్నారు".
   
    "ఏమంటున్నారు శర్మగారు".
   
    "కన్ఫెషన్ స్టేట్ మెంట్ ఇచ్చాడు నేరం వప్పుకుంటూ-"
   
    "ప్రియంవద?"
   
    "జరిగిన హత్యకీ, ఆమెకూ ఏ సంబంధమూ లేదు. ఆమె అక్సెసరీ టూ మర్డర్ కూడా కాదు. హత్యా జరిగిన సమయంలో ఆమె అక్కడ లేదు. మామూలు పరిస్థితుల్లో అయితే ఆమె మీద కేసు అసలు నిలబడదు. కానీ శర్మ యిచ్చిన స్టేట్ మెంట్ లో తామిద్దరూ కలిసి దీన్ని ప్లాన్ చేసినట్టు చెప్పాడు. తను జైల్లో గడపవలసి వస్తోంది. ఉరికంబం ఎక్కుతున్నప్పుడు ఆమె మాత్రం ఎందుకు బయట ప్రపంచంలో వుండాలి అన్న సాడిజం" అన్నాడు.
   
    "సాడిస్ట్" మనసులో అనుకున్నాడు రవి. అతడికి మొట్టమొదటిసారి ప్రియంవద మీద జాలేసింది. ఇంతలో ఇన్ స్పెక్టర్ అన్నాడు- "ఈ కేసులో మీరు నిర్దోషి అన్న అనుమానం నాకు ఎప్పుడు వచ్చిందో తెలుసా రవితేజా?"
   
    "నేను మిసెస్ శర్మకి ఫోన్ చేసినప్పుడా?"
   
    "కాదు."
   
    "మరి?" ఆశ్చర్యంగా అడిగాడు రవితేజ.
   
    "ముంబాయినుంచి విమానం ఆరోజు ఆలస్యంగా వచ్చింది. మీరిక్కడ హత్యచేసి తిరిగి ముంబాయి వెళ్ళి అక్కడ నుంచి రావడం అసంభవం. మీరు ఫోన్ చేసిన సమయానికి ఆ విమానం గాలిలో వుంది. పాపం భాస్కర్ కి ఆ విషయం తెలీదు. అంతకుముందు విమానంలో అతడు వచ్చేసి, మీతో ఎయిర్ పోర్టు నుంచి చేసినట్టు చేయించాడు. అప్పటినుంచీ నా ఆలోచన్లలో హంతకుడు ఎవరు అన్న ప్రశ్నే కదలాడింది తప్ప- మీరని ఎందుకో అనిపించలేదు. పేపర్లు - అరెస్టు వారంట్లూ వీటి సంగతి వదిలెయ్యండి. నా ఇన్వెస్టిగేషన్ కొనసాగింది. కానీ అది మీరెక్కడున్నారో తెలుసుకోవడం కోసం ఒక్కటే! ఒకరకంగా చెప్పాలంటే మీరు అనవసరంగా భయపడి దాక్కున్నారు".
   
    "గిల్టీ ఫీలింగ్...దానికి లాజిక్ వుండదు".
   
    ఇన్ స్పెక్టర్ అర్ధం చేసుకున్నట్టు తలూపాడు. "నేను మీ స్టేట్ మెంట్ రికార్డు చేసుకోవడానికి రేపొస్తున్నాను. ఇంటికి వెళ్ళి పది గంటలపాటు నిద్రపోవాలి ముందు".
   
    "ష్యూర్ ఇన్ స్పెక్టర్" అని పక్కనే అప్పటివరకు వుంచిన పాకెట్ తీసి రాజశేఖర్ అందిస్తూ, "మా కంపెనీ చీర! తీసుకోండి" అన్నాడు.
   
    "నేను లంచాలు తీసుకోను- రవితేజా!"
   
    "లంచం కాదు, కాంప్లిమెంటరీ".
   
    "పదాలు వేరేగానీ, రెండింటి అర్ధమూ ఒకటే".
   
    "కాదు. నాకు మీతో ఏదైనా అవసరం వుండి యిస్తే అది లంచం. నా సంతోషంతో ఇస్తే అది కాంప్లిమెంటరీ. తీసుకోండి ప్లీజ్!" అతడు దాన్ని తీసుకుంటూ, "కొత్త సంవత్సరం రాత్రంతా ఇంటికి రానందుకు మా ఆవిడ కారాలూ, మిరియాలూ నూరుతూ ఉండి వుంటుంది".
   
    "ఈ చీర ఆ కోపాన్ని కాస్త తగ్గిస్తుంది".
   
    "థాంక్స్" అన్నాడు.
   
    "మీకూ వున్నదన్నమాట ఆ ప్రాబ్లమ్?"
   
    "ఏదీ? ఇంట్లో పోరా?"
   
    "కాదు. తప్పుచేసి దాన్ని కప్పిపుచ్చుకోవడం....కోసం పెళ్ళానికి నగలూ, చీరలూ తీసుకెళ్ళడం-" రవితేజ నవ్వేడు.
       
    "తప్పదు రవితేజా! ఈ ఉద్యోగంలో ఇంతే! నా మొదటి భార్య ఈ పోలీస్ స్టేషనే....రెండోది కట్టుకున్న భార్య రాత్రి పదింటికి ముందు ఇంటికి వెళితే అదృష్టమే".
       
    "మీకెంత జీతం వస్తుంది?"
   
    "కట్స్ పోనూ వెయ్యి".
   
    "రెండు వేలిస్తాను. మా కంపెనీలో వచ్చి చేరండి. నేను నవ్వులాటగా అనడం లేదు. మీలాంటి సిన్సియర్ మనుషులు మాకు చాలా ఉపయోగం జీతం ఒక లెక్కకాదు. అన్నిటికన్నా ముఖ్యంగా మీకు నేను చేసే వాగ్దానం ఏమిటంటే-మా కంపెనీలో పనిచేస్తే ఏ రోజూ అయిదు దాటి పని చెయ్యనవసరం లేదు".
   
    "నిజంగా అంటున్నారా?"
   
    "నిజంగానే అంటున్నాను".
   
    రాజశేఖర్ ఒక్కక్షణం ఆలోచించి, ఇబ్బందిగా "వద్దులేండి, ఇలా అలవాటయిపోయింది. రేపట్నుంచి తొందరగా వెళితే ఇంటిలో ఏం చెయ్యాలో తోచక నాకు పిచ్చెక్కే ప్రమాదం వుంది" అన్నాడు... "ఒకసారెప్పుడో తొందరగా ఇంటికి వెళితే వచ్చింది నేనేనా, ఇంకెవరైనానా అన్న అనుమానం మా వాళ్ళకు గంట వరకు వదల్లేదు".
   
    "మనింట్లో మనం అతిధులుగా వుండడం దురదృష్టం. ప్రమాదకరం కూడా".
   
    "నాకు ప్రమాదకరం కాదనుకుంటున్నాను".
   
    "అదేం?"
   
    "మా డిపార్ట్ మెంట్ లో ఆడవాళ్ళు చాలా తక్కువ. పర్సనల్ సెక్రటరీలు అసలుండరు. ఎంత గొప్ప కేసు పరిశోధించి పట్టుకున్నా అమ్మాయిలు ఆటోగ్రాపులు తీసుకోరు".
   
    రవితేజ మొట్టమొదటిసారిగా బిగ్గరగా నవ్వేడు.
   
    "హాపీ న్యూ ఇయర్".
   
    "సేమ్ టూ యూ".
   
    కారు నెమ్మదిగా వెళుతుంది.
   
    కూలింగ్ గ్లాసెస్ లోంచి రోడ్డు నీలంగా కనబడుతుంది. ఎయిర్ కండిషన్ కారు అవటం వల్ల చల్లటిగాలి వస్తోంది. పోలీస్ స్టేషన్ నుంచి కారు బయటకు వచ్చిన తరువాత డ్రైవర్ వెనక్కి చూసి "ఆఫీసుకా? ఇంటికా సార్" అని నమ్రతగా అడిగాడు.
   
    అతడికి తన కనీస బాధ్యత తెలుసు......ఎక్కడికో చెప్పాడు.
   
   
           
                          అయిపోయింది
                      ----* * * *----


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More