Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

 

      రవితేజ తెల్లబోయి అతడివైపు చూశాడు.

    శర్మ తనని ఒక కోణంలో నుంచే చూశాడు. ఈ స్థితికి రావటం కోసం తను ఎన్ని సుఖాలు వదులుకున్నాడో చూడలేదు. స్వంత ఇంటిని, భార్యని కూడా నిర్లక్ష్యంచేసి ఈ యజ్ఞాన్ని నిర్వహించాడు. ఈ స్థానానికి రావటం కోసం జీవితమంతా ధారపోశాడు. ఈ రంగానికే ఒక గౌరవం కలిగించాడు. ఉప్పెన సృష్టించాడు. ఒక విజయం వెనుక ఇంత కష్టం వుంటుందని తెలియని వీళ్ళు, కేవలం విజయాన్ని చూసి ఈర్ష్య పడుతున్నారు. తనకున్నది ఒకే ప్రపంచం టెక్స్ టైల్స్ బయట ప్రపంచంలో ఇంత అసూయాద్వేషాలు వుంటాయని తెలియనంతగా తన ప్రపంచంలో మునిగిపోయాడు. చివరికి  కట్టుకున్న దానికి కూడా న్యాయం చేయలేకపోయాడు. అదీ తప్పేనా? ఇదంతా దేనికోసం చేశాడు? పేరు కోసమా? ఒక్కసారిగా అదీ పోయింది. డబ్బుకోసమా? అదెంత పాపిష్టిదో ఎదురుగా వున్న శర్మ రూపంలో కనపడుతూనే వుంది.
   
    "నీ భార్య విషయం తెలియగానే నువ్వు మండిపడతావనుకున్నాను. పెద్ద గొడవ జరుగుతుందనుకున్నాను. కానీ నీ బాధని నువ్వు నీలోనే దాచుకున్నావు. అలా, అక్కడ నా ప్లాను ఫెయిలయింది. కానీ నీ అసంతృప్తిని ప్రియంవదతో గడపటం ద్వారా తీర్చుకోవాలనుకున్నావు. మూడు రోజులపాటు హోటల్ లో గడపటం అన్న ఆలోచన ప్రియంవదకి నేనిచ్చిందే. నువ్వు ముంబాయిలో లేవని మిగతా డైరెక్టర్లకి తెలిసేలా అందుకే ముంబాయి ఫోన్ లు చేసాను. నీతో ఇంటికి ప్రియంవదా, భాస్కర్ లు పోన్ లు చేయించారు. అలా నీ చుట్టూ ఉచ్చు బిగించాను".
   
    రవి మాట్లాడలేదు. శర్మవైపే చూస్తున్నాడు.
   
    "ఇదంతా చెంచురామయ్య చేయిస్తున్నాడని నువ్వు అనుకుంటావని నాకు తెలుసు. అందుకే నీకు ఆలోచించుకునే టైము ఇవ్వలేదు. లాయర్ తో ఈ కేసు లాభంలేదు అని నేనే చెప్పాను. కన్విన్స్ చేశాను. కాలు కాలిన పిల్లిలా నువ్వు తిరుగుతూ వుంటే నాలో నేనే పొంగిపోతూ నవ్వుకున్నాను. అంతకుముంచు నువ్వు కొన్ని నెలలక్రితం ఇలానే కంగారుగా తిరిగావు. జ్ఞాపకం వుందా? నా భార్య తాజ్ లో నిన్ను కలుసుకోమన్నప్పుడు...."
   
    "మేమిద్దరం ఇంతవరకు కలుసుకోలేదు. మీరనవసరంగా అపోహ పడుతున్నారు".
   
    "తొందరలో కలుసుకుందురు గానీ" నవ్వేడు శర్మ "స్వర్గంలో...."
   
    రవి అతడివైపు సూటిగా చూశాడు.
   
    ఈ లోపులో ప్రియంవద చీర కట్టుకు వచ్చింది. శర్మ ఆమెతో, "నువ్వు యిక్కడే వుండు. మేమిద్దరం ఇతడితో వెళ్ళి మిగిలిన పనికూడా పూర్తిచేసుకుని వచ్చేస్తాం" అన్నాడు. ప్రియంవద రవివైపు చూసి నవ్వింది.
   
    "పద" అన్నాడు భాస్కర్ రవి వెంటనే కదలకుండా, ప్రియంవదతో అన్నాడు. "అర్దరాత్రి పుట్టినరోజు నాడు ఫోన్ చేయటం నుంచి, అదే మొదటిసారి మొగాడ్ని ముద్దుపెట్టుకోవటం- అనేదాకా అద్భుతంగా నటించావు ప్రియంవదా! నువ్వు నాకిచ్చిన కాగితం గుర్తుందా! పదహారేళ్ళ అమ్మాయి మాటకారి అబ్బాయంటే ముచ్చట పడుతుంది.....నిజమైన అమ్మాయెప్పుడూ తెలివితేటలకే పడిపోతుంది.... వగైరా!... అందులో చివరి వాక్యంగా ఇంకొకటి చేర్చు....'బరితెగించిన అమ్మాయి డబ్బుకోసం ఏమైనా చేస్తుంది' అని - నాకు నిన్ను చూస్తుంటే కోపంగా లేదు ప్రియంవాదా, జాలివేస్తూంది. కేవలం నటనలోనే ప్రేమని ఇంత అద్భుతంగా చూపించగలిగిన నువ్వు, నిజంగా ప్రేమించడం నేర్చుకుని వుంటే, ఒక పురుషుడి జీవితానికి ఎంతో తృప్తిని ఇచ్చి వుండేదానివి. ఇలా శర్మలాటి నక్కల దగ్గర ఎముకలు ఎరుకుంటూ, డబ్బు ఇచ్చే సుఖాల కోసం కక్కుర్తి పడేదానివి కాదు. నా జీవితం ఏమైనా కానీ, నేను మాత్రం నేర్చుకున్న పాఠాన్ని నీకు చెపుతాను- ఆనందం అనేది పనిలో, డబ్బులో, చివరికి సెక్సులో....దేనిలోనూ లేదు. అర్ధరాత్రి దాటాక నిద్రలో మెడచుట్టూ పరుచుకునే రెండు చేతుల మధ్య నిశ్చింతలో వుంది.....నీ జీవితంలో ఏ స్టేజిలోనూ అది నీకు లభించదు శర్మ ద్వారా!"
   
                                       *    *    *
   
    ఆమె కిటికీ దగ్గిర నిలబడి చీకట్లోకి చూస్తూ వుంది.
   
    ఆమె మొహం రక్తం ఇంకిపోయినట్టు పాలిపోయి వుంది. ఇన్ స్పెక్టర్ చెప్పిన ఒక వాక్యం ఆమెని కలవర పెడుతూంది.
   
    "రవితేజ విదేశాలకి పారిపోవడానికి సాయపడుతున్నది మీ భర్తగారే" అన్న వాక్యం అది.
   
    ఇన్నేళ్ళ వైవాహిక జీవితంలో ఆమెకి భర్త గురించి బాగా తెలుసు స్త్రీకోసం, తాగుడు కోసం, గుర్రాల కోసం ఏమైనా చేస్తాడు. తాగుడు లేకపోతే మతిభ్రమిస్తుంది. గుర్రం ఓడిపోతే పిచ్చెక్కుతుంది. తన చర్మం మీద మచ్చలే దానికి సాక్షి, బట్టల కంపెనీని దాదాపు నిర్వీర్యం చేశాడు. రవి రాకపోతే ఎప్పుడో మూతపడి వుండేది. రవి వ్యవహారాన్ని చేపట్టాక కొంతకాలం బాగానే వున్నాడు. కాని మనిషి రక్తానికి అలవాటు పడ్డ పులిలాటివాడు అతడు. రవి అన్ని ద్వారాల్ని మూసివేయటంతో అతడు ఎంత ఫ్రస్టేషన్ అయ్యాడో, తాగిన తరువాత అతడు మాట్లాడే మాటలే ఆమెకి చెప్పాయి. ఆమె ఒక ప్రేక్షకురాలైలా గమనిస్తూనే వుంది. వచ్చిన డబ్బంతా రవి తిరిగి ఆ కంపెనీలోనే ఇన్వెస్టు చేయటం, దానినే ఒక సుస్థిరత్వం కల్పించటం, ఆ capital Budget ....ఇదంతా అతఃదిని ఎంత ఇరుకున పెట్టాయో ఆమెకు తెలుసు. అతడిలోని రాక్షసుడు రోజు రోజుకి విజ్రుంభించటం భార్యగా గుర్తించింది. అటువంటిది..... తన భర్త అతడిని రక్షించటం ఏమిటి?
   
    ఆమెలో ఏదో అనుమానం పెరిగి పెద్దదవుతూంది. అందులోనూ ఇన్ స్పెక్టర్ చెప్పినదాన్ని బట్టి ఈ రోజు ఆఖరి రాత్రి. తనేం చెయ్యగలదు? అసలు-వాళ్ళిద్దరూ ఎక్కడున్నారో కూడా తెలీదు. తన భర్త తెలివితేటలు గురించీ, క్రిమినల్ బ్రెయిన్ గురించి తన వివాహ సమయంలోనే ఆమె గుర్తించింది. రాజకీయాల్లో  సర్వం పోగొట్టుకున్న తన తండ్రిని ఎలా మర్చిపోయేలా చేశాడో ఆమెకు ఇంకా గుర్తుంది. అంత క్రిమినల్ తెలివితేటలున్న తన భర్త ఈ రోజు రవిని రక్షించాడంటే-
   
    రవి దగ్గరున్న షేర్ సర్టిఫికెట్లు...
   
    అవును తెలివిగా వాటిని తన పేరుమీద మార్చుకోవటానికే రవిమీద ప్రేమ నటించి వుంటాడు.
   
    కంపెనీ వ్యవహారాలన్నీ తిరిగి తన చేతుల్లోకి తీసుకోవటానికే ఇలా రక్షిస్తున్నట్లు నాటకం ఆడి వుంటాడు.
       
    ఎలాగో విదేశాలకు వెళ్ళిపోతున్నాను అన్న భ్రమలో రవి ఆ కాగితాలన్నిటి మీద సంతకం పెట్టి వుంటాడు.
   
    ఏం చేయాలి? ఏం చేయాలి?
   
    ఆమె ఆలోచనల్ని చెదురుస్తూ రోడ్డుమీద దూరంగా ఒక కారు ఆగింది. ఆమె కళ్ళు చిట్లించి చీకట్లో చూసింది. అది తమ కారే. కాని అందులోంచి దిగింది తన భర్త కాదు.
   
    ఎవరో ఇద్దరు వ్యక్తులు....
   
    అందులో ఒక వ్యక్తి రవి.... కారు మళ్ళీ కదిలింది.
   
    ఆమె కెందుకో భయం వేసింది. ఏదో అదృశ్యశక్తి మృత్యువుని సూచిస్తూ ఆమెకు సంకేతం పంపుతూంది.
   
    కారు గేట్లోంచి లోపలకు వస్తూంది.
   
    కిటికీ తెర మూసేసి ఆమె కిందకి పరుగెత్తింది.
   
    కాని అప్పటికే ఆలస్యం అయింది.
   
    భర్త లోపలికి వస్తూండటం చూసి ఆమె సోఫా వెనక్కు తప్పుకుంది. శర్మ మెట్లెక్కి లోపలి మేడమీదకు వెళ్తున్నాడు. ఆమెని చూడలేదు. ఆమెకి క్షణం టెన్షన్ పెరిగిపోతోంది. బయట రోడ్డు మీద రవి, మరో వ్యక్తి వున్నారు.
   
    రవిని కలుసుకుని అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలి. ఇప్పుడు కలుసుకోలేకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ అతడిని కలుసుకోలేకపోవచ్చు. తన భర్త అతడిని విదేశాలకి పంపించవచ్చు లేదా....ఆమె మరి ఆలోచించలేకపోయింది.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More