Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

   

       "అబద్దం చెప్పవలసి వచ్చినప్పుడల్లా తడబడటం నీ దురలవాటులా వుంది. దీన్ని బట్టి చూస్తూంటే నువ్వు మొత్తం సంభాషణ అంతా విన్నట్టు తోస్తూంది". ఆపరేటర్ మరింత కంగారుగా "లేద్సార్ అంతా వినలేదు" అన్నాడు.
   
    "అంతా విన్లేదంటే కొంత విన్నావన్న మాట".

    అతడు తెల్లమొహం వేశాడు.
   
    "అర్దరాత్రి పూట ఆడగొంతు మొగాయనకి ఫోన్ చేసిందంటే వినకుండా వున్నావా? అందులోనూ యింత ఖాళీగా కూర్చొని....తొందరగా చెప్పేస్తే మంచిది. ఇక్కడ చెప్తావా పోలీస్ స్టేషన్ కి వచ్చి చెప్తావా?"
   
    "ఇక్కడే చెప్తాను సార్".
   
    "చెప్పు".   
   
    అతడు పాఠం ఒప్పచెప్పినట్టు గడగడా చెప్పేసేడు.
   
    "....నన్నిక్కడ గెస్ట్ హౌస్ లో ఒక్కదాన్నే పెట్టి మీరు అక్కడ న్యూ ఇయర్ హాయిగా సెలబ్రేటు చేసుకుంటున్నారా? అదేం కుదర్దు. నేనొక్కదాన్నే ఇక్కడ వుండలేను. నాకు బోరుకొడుతూంది. మీరు వచ్చెయ్యండి. ఇద్దరం కలిసి బయట కెళ్దాం" అందామె. "ఇప్పుడా..." అన్నారు శర్మగారు. "ఆఁ ఇప్పుడే మీరు రాకపోతే వూరుకోను. రావల్సిందే" అంది ఆవిడ. శర్మగారు విసుక్కుని "సరే వస్తున్నాను" అన్నారు. అంతే సార్ జరిగింది. "ఆవిడ పేరు?"
   
    "నాకు జ్ఞాపకం లేదు సార్. ఏదో చెప్పింది".
       
    "నిజంగా లేదా?"
   
    "నిజంగా లేదు సార్. ఈసారి నా మాటలు తడబడటం కూడా లేదు మీరే చూశారుగా సార్...."
   
    "... కొద్దిగా గుర్తు తెచ్చుకో....రాధ....సావిత్రి....పద్మ....కమల.....సుప్రియ ..."   
   
    "అ....అదే...."
   
    "ఏది? సుప్రియా?"
   
    "కాదు సార్....కానీ...ఆ...ప్రియ....అదే...."
   
    చప్పున ఏదో స్ఫురించేట్టు అయి- "ప్రియంవదా?" అని అడిగాడు "కరెక్ట్ సార్. ప్రియంవదే...." అరిచాడు ఆపరేటరు.
   
    తన పదిహేనేళ్ళ జీవితంలో అంత దిగ్భ్రమ ఎన్నడూ చెందలేదు ఇన్ స్పెక్టర్! రాజశేఖర్.
   
    టెలిఫోన్ ఆపరేటరు చెప్పిన పేరువల్ల వచ్చిన షాక్ నుంచి క్రమంగా అతడు తేరుకున్నాడు. పోలీస్ ట్రైనింగ్ లో చెప్పిన వాక్యం తిరిగి గుర్తొచ్చింది. 'ఒక తప్పు చేసినవాడు మరొక తప్పు చేయకపోడు.....తన తప్పుని ప్రపంచం గుర్తించలేదన్న నమ్మకం కుదరగానే మరింత ధైర్యంగా రెండో తప్పుచేసి దొరికిపోతాడు....' అదే జరిగింది ఇప్పుడు.
   
    రవితేజని విదేశాలకు పంపే వరకూ ప్రియంవద బయట ప్రపంచంలోకి రావద్దని అడిగివుంటాడు శర్మ. అలాగేనని ఒప్పుకుని వుంటుంది ఆమె. కానీ ఈ కొత్త సంవత్సరం సంబరాల్ని చూసి, అందరూ అనుభవిస్తున్నారు. తనెందుకు అనుభవించకూడదు అన్న ఉక్రోషంతో శర్మకి ఫోన్ చేసి వుంటుంది. శర్మకున్న జాగ్రత్త ఆమెకి వుండవలసిన అవసరం లేదు. అందుకే ఎవరు వినవచ్చార్లే అన్న ధైర్యంతో అసలు పేరు చెప్పింది.
   
    అతను వాచీ చూసుకున్నాడు 12-10.
   
    ఇప్పటివరకూ శర్మ రవితేజని రక్షించటానికి ఇదంతా చేస్తున్నాడు అనుకున్నాడు. ఇప్పుడు అసలు విషయం తెలుసుకున్నాడు కాబట్టి శర్మ రవితేజని విదేశాలకు పంపించే ఏర్లాట్లేవీ చేసి వుండడనిపిస్తూంది. మరేం చేస్తారు?
   
    హత్యా? ?
   
    దానివల్ల అతడికేమిటి లాభం?
   
    ఇన్ స్పెక్టర్ అసహనంగా తల విదిలించాడు. ఎక్కువ టైమ్ లేదు. రవితేజ ప్రాణం రిస్కులో వుందని తెలుస్తూనే వుంది. కానీ అంత అర్ధరాత్రి అతనికోసం ఎక్కడని వెతుకుతాడు?
   
    అసలు శర్మ రవిమీద ఎందుకింత కక్షగట్టాడు?
   
                            35
   
    "ప్రేమమంజరి- అన్న గుర్రం నా జీవితాన్ని పూర్తిగా నీ చేతుల్లో పెట్టేసింది" అన్నాడు శర్మ... "ఆ రోజే కదూ నా షేర్లు అన్నీ నీ పేరు మీద మార్చింది?"
   
    "అన్నీ కాదు. మెజారిటీ శాతం".   
   
    "అవును అప్పట్నించే అన్ని నిర్ణయాలూ నువ్వే తీస్కునే వీలు నీకు దొరికింది. ఎమ్.డి. వయ్యావు".
   
    "ఈ కారణం వల్లనా నన్నింత ఉచ్చులో ఇరికించింది? ఇంత చిన్న కారణంగానా నా భార్యని మీరు చంపింది?"
   
    "మరి నిన్ను ఏదో విధంగా ఇరుకులో పెట్టకపోతే షేర్లు తిరిగి నాకు ట్రాన్స్ ఫర్ చెయ్యవుగా. ఇప్పుడు చూడు విదేశాలకు వెళ్ళిపోయే తొందర్లో అన్ని కాగితాలమీదా పాత తారీఖువేసి సంతకం పెట్టావు...."
   
    "మనుషుల్లో రాక్షసులుంటారని తెలుసు. కానీ మనసుల్లో యింత విషం పెట్టుకుని పైకి నటిస్తారని మాత్రం యిప్పుడే తెలుసుకున్నాను. మీకు నేను దేంట్లో తక్కువ చేశాను? అనుకున్న ప్రకారం లాభాలు పంచుతూనే వున్నానుగా...."

    "తాగుడూ, గుర్రప్పందేలూ నా బలహీనత. వాటిని ఆధారం చేసుకుని నా దగ్గర్నుంచి యాజమాన్యాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు- కానీ అవి ఏ మూలకి? ఒక గుర్రంమీద కాయటానికి కూడా సరిపోయేది కాదు. డబ్బుకోసం విలవిల లాడిపోయేవాడిని. కంపెనీ నా చేతుల్లో వున్న రోజుల్లో...." అతడి మాటల్ని మధ్యలో కట్ చేసి, రవితేజ కసిగా, "కంపెనీ మీ చేతుల్లో వున్నరోజుల్లో దాన్ని పీల్చి పిప్పిచేసి జీవచ్చవంలా మార్చారు. మీమీద నమ్మకం వుంచి డబ్బు పెట్టిన డైరెక్టర్లందరికీ విండో-షో చేసి చూపించారు" అన్నాడు.
   
    "అవును కరెక్టు" నవ్వేడు శర్మ.
   
    "కానీ నేనొచ్చి దానికి జీవం పోశాను. ఈ స్థాయికి తీసుకొచ్చాను".
   
    "ఏం లాభం? కంపెనీ పెరగసాగింది. లాభాలు మాకు తక్కువ యిచ్చి, మిగతా డబ్బు అంతా కంపెనీలోనే తిరిగి పెట్టసాగావు. చీరె కొన్నవారికి పెటల్స్ బ్రా, ఫాల్స్ కుట్టి ఇవ్వడం ఉచితం అన్నావు. మేకప్ బాక్స్ బ్లౌజుపీసు ఉచితం అన్నావు. అన్నిటికన్నా ముఖ్యంగా పాపులర్ చీరలు అని పేరుపెట్టి - రెండొందలు ఖరీదుచేసే చీరలు వందకే పోస్టుద్వారా పంపించే స్కీము ఏర్పాటు చేశావు. దానికి అడ్వర్టయిజ్ మెంటు డెబ్బై అయిదు లక్షలు అన్నావు. ఈ లోపులో చెంచురామయ్య పోస్టల్ దొంగతనాలు ఏర్పాటు చేయించి ఈ స్కీమ్ ని దెబ్బకొట్టాడు. దాంతో మ్యాజిక్ మిర్రర్ అన్నావు. మరో కోటి రూపాయలు అందులో వుంచటానికి డైరెక్టర్లని ఒప్పించావు. డబ్బు-డబ్బు-డబ్బు ఎక్కడ చూసినా పెట్టుబడే తప్ప రాబడి లేదు. నాకు వళ్ళు మండిపోసాగింది. నిన్ను ఎలా ఈ పదవినుంచి తప్పించాలా అని ఆలోచించసాగాను. కానీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో చాలామంది నీ పక్షమే నీ వన్నట్టు కంపెనీ దినదినాభివృద్ది చెందుతూ వచ్చింది. విమల్, వెరైటీ చీరలలో పోటీపడి, ఒక స్థాయిలో వాటిని దాటిపోయింది. డైరెక్టర్లందరికీ నువ్వు దేవుడివి. కానీ నాకు? చేతి దగ్గర స్వర్గాన్ని బలవంతంగా లాక్కున్న దుర్మార్గుడివి. నా చేతికి నయాపైసా రానివ్వకుండా వచ్చింది, వచ్చినట్లు తిరిగి పెట్టుబడి పెట్టే రాక్షసుడివి. నా చేతులు కట్టేసినట్టు అయింది. మామూలుగా అడిగితే ఇవ్వవని, నిన్ను ఇరుకున పెట్టే పరిస్థితులు సృష్టించాను..."
   
    "నేను మీ దగ్గర్నుంచి కంపెనీ నా స్వాధీనంలోకి తీసుకున్నప్పుడు నాళిక గీసుకోవటానికి కూడా పనికిరాణి కంపెనీ ఇది- దీన్ని బంగారుబాతు చేశాను".
   
    "నిజమే. కానీ నాకు రోజుకొక బంగారుగుడ్డు అవసరం లేదు. నా జీవితపు చివరి రోజుల్లో మొత్తం బంగారు బాతునే చంపి తినెయ్యాలనుకున్నాను. దానికి నువ్వు, నీ డైరెక్టర్లూ ఒప్పుకోరు.... ఎప్పుడో భవిష్యత్తులో కంపెనీ నెంబర్ వన్ అయితే నాకేమిటి లాభం? నాకున్న అప్పులకీ ఈ లోపులో నేను దివాలా తీస్తాను. నా మిగిలిన షేర్లు కూడా నీకే అమ్మేసి బికారిని అయిపోతాను..."
   
    రవి అతడివైపు పెర్ ప్లెక్స్ డ్ గా చూశాడు. "మీ మనసులో ఇంత ఆలోచన వుందని చెప్తే నేనే ఇంకేదైనా మార్గం వుందేమో ఆలోచించేవాణ్ని. నేను మీకేం ద్రోహం చేశానని నన్ను ఇంత హీనస్థితికి తీసుకొచ్చారు? మీ స్వంత మనిషికన్నా ఎక్కువగా..."
   
    "స్వంత మనిషా?" బిగ్గరగా నవ్వేడు శర్మ-"నా భార్య కూడా అలా స్వంత మనిషనుకుని నీకు ప్రేమలేఖ వ్రాసిందనుకుంటాను.."
   
    మొహంమీద బలంగా కొట్టినట్టు అయింది రవితేజకి.
   
    "ప్రేమలేఖా?" అన్నాడు.
   
    "అవును నా భార్య నీకు వ్రాసిన సుదీర్ఘమైన ఉత్తరాన్ని నేనూ చదివాను. అసలప్పుడే దానిని నరికి పోగులు పెట్టాలనుకున్నాను. కానీ నెమ్మదిగా ఆలోచిస్తే నాకో ప్లాన్ స్ఫురించింది. ఒకే దెబ్బకి రెండు పక్షులు. స్వంత పెళ్ళాం ఇంకో కుర్రాడిని చూసి ముచ్చటపడితే ఏ భర్త వూరుకుంటాడు? నువ్వు వూరుకున్నావేమోగానీ నాకంత శాంతీ సహనాలు లేవు. ఆ రోజునుంచీ నువ్వంటే మరింత కోపం పెరిగింది. అందరికీ నువ్వంటే గ్లామరే. ఆటోగ్రాపులు తీసుకునే అమ్మాయిలు..... నువ్వంటే పడిచచ్చే డైరెక్టర్లు..... ఇంతవరకూ ఏ కంపెనీ ఎగ్జిక్యూటివ్ కీ లేని పరపతి నీ కొచ్చింది. గతంలో ఈ రంగంలో ఎవరికీ లేదు ఇంత పాపులారిటీ! ఒక కంపెనీ ఎగ్జిక్యూటివ్ కి జనంలో ఇంత పాపులారిటీనా? ఎన్నో సంవత్సరాల్నుంచీ ఈ రంగంలో పాతుకుపోయిన మా కేవరికీ లేని పేరు నీకు రావటం చూసి నా మనసు కుతకుతా ఉడికిపోసాగింది. చీరెల్తో నువ్వు ఆడుకున్నావు. చీర కట్టిన ప్రతి స్త్రీ నాలుకమీదా నీ పేరు ఆడసాగింది. మీ జీవితకాలం మొత్తంలో మేము సాధించలేనిది, ముఫ్ఫై ఏళ్ల వయసులో నువ్వు సాధించావు. చివరకు నా భార్యకూడా నీకు వ్రాయటం ఆ మండే అగ్నికి పరాకాష్ట. ఆ ఉత్తరంతో అగ్నిపర్వతం బ్రద్దలైంది. నిన్ను చంపకూడదు. నిన్ను కుమిలి కుమిలి పోయేలా చేయాలి. సరీగ్గా ఆ సమయంలో సుధాకర్ పిక్నిక్ లో నీ భార్యతో చనువుగా ప్రవర్తించటం నా కళ్ళపడింది. ఆ విషయం ఆకాశరామన్నగా నీకు ఫోన్ చేయించింది నేనే-"


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More