Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర

 

      "తనకి వ్యాపారంలో అడ్డువెళ్ళేవాళ్ళు ఈ పని చేయించి వుంటారని నమ్ముతున్నాడు రవితేజ".
   
    "పోనీ అతడు ఈ దేశంనుంచి పారిపోవటానికి సాయపడుతున్న వాళ్ళు ఎవరో మీకేమైనా తెలుసా?"
   
    "తెలీదు ఇన్ స్పెక్టర్ గారూ-"
   
    "మీ భర్తగారే-" తాపీగా అన్నాడు రాజశేఖర్. అతడా మాట అనగానే, ఒక్కసారిగా ఏర్పడిన అవతలివైపు సంచలనం ఫోన్ లో తెలిసింది. "నేను....నేను...." ఆ అమ్మాయి కంఠం తడబడింది. "మీరు శర్మగారి భార్య అని నాకు తెలుసు. అరగంట క్రితమే రవితేజ మీతో మాట్లాడాడని కూడా తెలుసు".
   
    అవతలివైపు నుంచి చాలాసేపు నిశ్శబ్దం.
   
    "మీరు మా సంభాషణ పూర్తిగా విని వుంటే- మా యిద్దరి బాంధవ్యం సంగతి కూడా మీకు బాగా తెలిసివుండాలి".
   
    "తెలుసు రవితేజ కోసం మీరింత ధైర్యంతో నాకు ఫోన్ చేయటం మెచ్చుకోదగ్గ విషయం. మీకు అతడు ఫోన్ చేయగానే నేను హోటల్స్ అన్నీ వెతికాను. రవితేజ ప్రియంవదతో కలిసి ఈ ఊర్లో వున్నాడన్న విషయం యదార్ధమే. కానీ అది ఏ విధంగానూ అతడి నిర్దోషిత్వాన్ని నిరూపించదు....."
   
    "అంటే అతడు పట్టుబడితే శిక్ష అనుభవించవలసిందేనా" ఆ అమ్మాయి అంది. "అనవసరంగా ఫోన్ చేశానా?"
   
    "మీరు ఫోన్ చేయకపోయినా ఈ విషయం మీకు తెలిసేది. మీ ఫోన్ ట్రాప్ చేసినట్టే మీ భర్త వెనుక మా మనుష్యులు వున్నారు. ఆయన రవితేజని కలుసుకోగానే అతడ్ని పట్టుకుంటారు....."
   
    "కష్టం".
   
    "ఎందుకు?"
   
    "ఆయన వెనుక సి.ఐ.డి. లున్నారని ఆయనకి తెలుసు-"
   
    "అవును. మొన్నెవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ, 'మా ఇంటిముందు కూడా సి.ఐ.డి. నిల్చున్నట్టు అనుమానంగా వుంది' అంటూండగా విన్నాను" అన్నదామె.
   
    "ఓ.కే. మాడమ్. రేపు మీతో డిటెయిల్ద్ గా మాట్లాడుతాను....."
   
    "నేనిలా ఫోన్ చేసిన విషయం ఎవరికీ చెప్పకండి. రవితేజకి కూడా.....ప్లీజ్...."
   
    "ష్యూర్" నాయి ఫోన్ పెట్టేసేడు రాజశేఖర్. అతడికి కాస్త కన్ ఫ్యూజన్ గా వుంది. రవితేజ ఎప్పటికయినా శర్మని కలుసుకుంటాడన్న నమ్మకంతో శర్మ ఇంటిముందు పోలీసుని నిలబెట్టాడు. అతడి వూహ ఫలించి, అదే జరిగింది. కానీ పోలీసు అసమర్ధత వల్ల గెస్ట్ హౌస్ నించి రవి తప్పించుకున్నాడు. ఆ తరువాత శర్మ ఫోన్ కూడా ట్రాప్ చేయబడింది.
   
    కానీ శర్మ ఫోన్ లో మాట్లాడిన ఏ సంభాషణల్లోనూ "మా ఇంటిముందు కూడా పెట్టారోయ్" అన్న వాక్యం రాలేదు. అంటే ఈ సంభాషణ ఫోన్ ట్రాప్ చేయబడటానికి ముందే జరిగి వుండాలి.
   
    అంటే.....రవితేజని గెస్ట్ హౌస్ కి తీసుకువెళ్తున్న సమయానికే శర్మకి తన వెనుక పోలీసులు ఫాలో అవుతున్నారని తెలుసు.
   
    ....కాబట్టి ఇక రేపు అసలతడు రవితేజని కలుసుకోడు. తనిప్పటివరకూ శర్మ ఎలాగూ రవితేజని కలుసుకుంటాడు కదా, అప్పుడు రవిని అరెస్ట్ చేయవచ్చుకదా- అన్న భ్రమలో వున్నాడు.
   
    తను వెంటనే శర్మని కలుసుకుని మొత్తం అంతా వెల్లడిచేసి నయానో భయానో బెదిరిస్తే తప్ప రవితేజ ఆచూకీ దొరకదు. ఆ తరువాత రవి విదేశాలకు పారిపోకముందే ఈ పని జరగాలి. అంటే రేప్రోద్దున్న లోపలే జరగాలి. శర్మ ఎక్కడున్నాడో అతడికి తెలుసు.
   
    అతడు మోటార్ సైకిల్ వేసుకుని క్లబ్ కి బయల్దేరాడు. క్లబ్ ముందు పోలీసు మఫ్టీలో నిలబడి వున్నాడు. "శర్మగారు లోపలున్నారు సార్. రవితేజ టెక్స్ టైల్స్  డైరెక్టర్లందరూ వున్నారు లోపల" అన్నాడు.
   
    రాజశేఖర్ లోపలికి ప్రవేశించాడు. సరీగ్గా అప్పుడే కొత్త సంవత్సరం ప్రవేశించింది. అందరూ లేచి "హాపీ న్యూ ఇయర్- హాపీ న్యూ ఇయర్" అని పరస్పరం విష్ చేసుకుంటున్నారు. అంతా గోలగోలగా వుంది.
   
    బోర్డు డైరెక్టర్స్ కూర్చున్న చోటుకి రాజశేఖర్ వెళ్ళాడు.
       
    అక్కడ వాళ్ళమధ్య శర్మ లేడు.
       
    రాజశేఖర్ కి తన డిపార్టుమెంటు మనుష్యుల అసమర్ధత మీద విపరీతమైన కోపం వచ్చింది. రాజశేఖర్ బయటకొచ్చాడు. బయట నిలబడ్డ పోలీసు అతడివైపు బెదిరిపోతూ చూశాడు.
   
    రాజశేఖర్ అతడితో, "శర్మ లోపలలేడు. వెళ్ళటం నువ్వేమైనా చూశావా?" అన్నాడు.
   
    "కారు ఇక్కడే వుంది సార్".
   
    "నీ మొహం నేను అడుగుతున్నది కారు గురించి కాదు మనిషి గురించి". పోలీసు బిక్కమొహం వేశాడు.
   
    లోపల్నుంచి కేకలు కేరింతలు వినపడుతున్నాయి. దూరంగా టపాకాయలు పేలుతున్నాయి. అంతా గోల గోలగా వుంది. వెయిటర్ వచ్చి డ్రింకు అందిస్తూ "హేపీ న్యూ ఇయర్ సార్" అన్నాడు. "హెక్టిక్ న్యూ ఇయర్" అనుకున్నాడు మనసులో. ఈ సంవత్సరం ప్రారంభమవటమే ఉక్కిరిబిక్కిరి అయ్యేటంత పనితో మొదలైంది. ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని వచ్చి చుట్టుకుంటాయో ఈ సంవత్సరం...."
   
    అతడు తిరిగి లోపలికి వెళ్ళాడు.
   
    డైరెక్టర్లందరూ పూర్తి కిక్ లో వున్నారు. అతఃడికి ఆశ్చర్యమేసింది. వాళ్ళ మేనేజింగ్ డైరెక్టరు హత్యకేసులో ఇరుక్కుని పదిరోజులు కాలేదు- వీళ్ళు ఇక్కడ ఆ విషయం విస్మరించినట్టు ఆనందిస్తున్నారు. వ్యాపారస్తుల మధ్య స్నేహాలు, ఆప్యాయతలు కూడా ఆ విధంగానే వ్యాపారపరంగా వుంటాయేమో అనుకున్నాడు. పోయినవాళ్ళు పోతూ వుంటారు. వాళ్ళ వల్ల వచ్చిన నష్టం ఎంత? దాన్ని పూడ్చుకోవటానికి ఇంకా ఏం చెయ్యాలి?.....ఇదే ఆలోచనతో ప్రపంచం సాగిపోతూ వుంటుంది.
       
    ఒక డైరెక్టర్ దగ్గిరాకీ వెళ్ళి, "శర్మగారు ఎక్కడికి వెళ్ళారో మీకేమైనా తెలుసా?" అని అడిగాడు.
   
    "లేదు. ఏదో ఫోన్ వచ్చిందంటే వెళ్ళారు".
   
    రాజశేఖర్ ఉలిక్కిపడ్డాడు.
   
    అర్ధరాత్రి పన్నెండింటికి ఫోన్ వస్తే అంత అర్ధంతరంగా పార్టీ మధ్యలో వెళ్ళిపోయడంటే....?
   
    బహుశ ఈ రాత్రికే రవితేజ ఈ ఊరి పొలిమేరలు దాటించే ప్రయత్నం జరుగుతూ వుండవచ్చు. బయట పెట్టిన కాపలావాడిని నమ్ముకుని తను పొరపాటు చేశాడు.
       
    ఒక్కసారి రవితేజ తప్పించుకుంటే ఇక తను ఏమీ చేయలేడు. శర్మ హనకేం తెలీదని దబాయించినా ఏమీ చేయలేడు.
   
    అతడు క్లబ్ లోపల ఇంకో గదిలోకి వెళ్ళాడు.
   
    అక్కడ టెలిఫోన్ ఆపరేటర్ కూర్చుని వున్నాడు.
   
    ఆ సమయంలో ఫోన్ లు రావటం గానీ, ఇక్కడివాళ్ళు చేయటంగానీ లేకపోవటంతో, పి.బి.ఎక్స్ ముందు ఖాళీగా వున్నాడు. డ్రెస్ లో వున్న ఇన్ స్పెక్టర్ ని చూసి లేచి నిలబడ్డాడు.
   
    "ఎన్ని ఎక్స్ టెన్షన్స్ వున్నాయి ఇక్కడ?" అడిగాడు.
   
    "ఎనిమిది సార్".
   
    "పది నిమిషాల క్రితం శర్మగారికి ఫోన్ ఇచ్చింది నువ్వేనా?"
   
    "నేనే సార్".
   
    "ఎవరు ఫోన్ చేసింది?"
   
    "తెలీదు సార్".
   
    "తెలీదా? మర్చిపోయావా?"
   
    "మ.....మర్చిపోయాను సార్".
   
    రాజశేఖర్ అతడివైపు సూటిగా చూశాడు. అతడు తల దించుకున్నాడు ఆ చూపు మలుపువాలు పట్టుకోవటానికి.
   
    "పద" అన్నాడు.
   
    ఆపరేటర్ బెదిరిపోయి "ఎక్కడికి సార్?" అన్నాడు.
   
    "పోలీస్ స్టేషన్ కి".
   
    "ఏం....ఎందుకు సార్?"
   
    "శర్మగారికి ఎవరు ఫోన్ చేశారో గుర్తుతెచ్చుకోవటానికి...."
   
    ఏడుపొక్కటే తరువాయిగా, "గుర్తొచ్చింది సార్" అన్నాడు ఆపరేటరు.
   
    "ఎవరు?"
   
    "ఒకామె".
   
    "పేరు?" ఆశ్చర్యంగా అడిగాడు రాజశేఖర్. ఆ సమయంలో ఆయనకి స్త్రీ ఫోన్ చేస్తుందని అతడు ఊహించలేదు. ఆమె నిశ్చయంగా శర్మ భార్య అయివుండదు.
   
    "చె....చెప్పలేదు సార్?"


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More