Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర
అతడు మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. లోపల గదిలోంచి వెలుతురు బాత్ రూమ్ వెంటిలేటర్ గుండా బయటకు పడ్తూంది. చిన్న చిన్న ప్లేట్లలా అద్దాలు అమర్చబడి వున్నాయి వెంటిలేటర్ కి.
సన్నగా విరగ్గొడుతూ, అతడు శబ్దం కాకుండా ఒక్కొక్క అద్దాన్నే బయటకు తీశాడు. దాదాపు పదిహేను నిముషాలు పట్టింది క్లియర్ చేయటానికి. అడ్డుగా వున్న ఇనుపవూచని తొలగించటానికి మరో పది నిముషాలు.....
అతికష్టం మీద తడు లోపలికి ప్రవేశించాడు. శరీరం అక్కడక్కడా రక్కుకుపోయి రక్తం వస్తూంది. అతడు పట్టించుకోలేదు.
బయట గదిలోంచి శబ్దం ఏమీలేదు. లైటు వేసుకునే నిద్రకుపక్రమించారా అనుకున్నాడు. అంతలో అతడి అనుమానం నివృత్తిచేస్తూ స్త్రీ కంఠం వినిపించింది. "థాంక్స్, నా కోర్కె తీర్చినందుకు" అని.
ఉద్వేగం ఒక కెరటంలా కొట్టుకుంది అతడిలో.
అది ప్రియంవద కంఠమే.
అతడి చూపు తనని మోసం చేయలేదు.
అతడి చేతిలో ఇనుప వూచ బిగుసుకుంది.
"రేపటివరకూ బయటకు వెళ్ళకూడదన్నారు. కాని న్యూ ఇయర్ కోసం వదిలినందుకు.... ఇప్పుడే వస్తాను. ఒక్క నిముషం-" అడుగుల చప్పుడు బాత్ రూమ్ వేపు రావటంతో రవితేజ కంగారుపడ్డాడు. చప్పున బాత్ టబ్ వెనక్కి వెళ్ళి ప్లాస్టిక్ తెరని ముందుకు లాక్కున్నాడు. క్షణం ఆలస్యం అయివుంటే ఆమె చూసేది. అతడు తెర వెనక్కి వెళ్ళటం, ఆమె లోపలికి రావటం ఒకేసారి జరిగాయి.
ఆమె ఒంటిమీద ఒక్క నూలుపోగు లేదు. వాష్ బేసిన్ వేపు వంగి మొహం కడుక్కుంటూంది. వెనుకనుంచి స్పష్టంగా కనపడుతూంది. ప్లోరోసెంట్ దీపం కాంతి వీపు మీదనుంచి జఘనభాగం మీదుగా క్రిందికి జారుతూంది. ముందుకు పడిన వెంట్రుకల్ని చెవి వెనక్కు తోసుకుంటూ అద్దంలో తన శరీరాన్ని చూసుకుని, బద్దకంగా ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంది.
అంత వెలుగులో నగ్న శరీరాన్ని అలా చూడటం అదే మొదటిసారి. ఈ శరీరాన్ని చూసేనా పోతపోసిన బంగారం అనుకుంది? రెండు నిదురలేని రాత్రులు. అదే ప్రేమ అనుకుని భ్రమపడి, నిదుర విడిచి, కలల నడిచి, మనసు వనమల్లీ వల్లీ విచలిత పల్లవపాళీ అయినది? ఈ స్థనద్వయం మధ్యేనా మోము, రెక్కల మధ్య దాచుకున్న వివాగాళి అయినది. ఈ పొత్తికడుపు మీద తల ఆన్చినప్పుడే నా మందపవనుడు మందాకిని తిన్నెలమీద మన్మధుడైనట్టు తోచింది? ఎంత మూర్ఖుడు మగవాడు. తొలిసిగ్గు తెరలకూ, నలిగిన పక్కకూ మధ్య తేడా తెలుసుకోలేడు. అనాఘ్రాత పెదవులకు, విస్కీ రుచి చూసిన ఆధారాలకు భేదం తెలుసుకోలేదు. ప్రేమకూ కామానికీ మధ్య గీత గీయలేడు.
....బరువెక్కిన నిశ్శబ్దం మధ్యనుంచి ఆమె వెళ్ళిపోయింది.
అతడు మామూలు మనిషి అయ్యాడు.
....కర్తవ్యం గుర్తొచ్చింది.
....ఆమె వెళుతూ తలుపు వెయ్యలేదు. అది కలిసొచ్చింది.
అతడు తలుపు సందులోంచి నెమ్మదిగా ముందుకు జరిగాడు.
సోఫాలో కూర్చుని వున్న వ్యక్తికూడా ప్రియంవదలాగే నగ్నంగా వున్నాడు. ఆ గదిలో వాతావరణం మూర్తీభవించిన పెర్వర్షన్ కి ప్రతీకలా వుంది. కొత్త సంవత్సరం ప్రారంభాన్ని వాళ్ళింకా సెలబ్రేట్ చేసుకుంటూనే వున్నారు. మధ్య సగం సీసా ఖాళీగా వుంది. సిగరెట్ పొగ గదంతా నిండి వుంది. ఆమె వెళ్ళి అతడి ఒళ్ళో కూర్చుంది. 'కమాన్ డార్లింగ్' అంటూ అతడు వంగి, ఆమె నోటికి గ్లాసు అందించటం కోసం ఇటువేపు తిరిగినప్పుడు రవితేజకి లైటు వెల్తురులో అతడు స్పష్టంగా కనిపించాడు.
భూమి కంపించినట్టయింది రవితేజకి.
కరాళ కంకాళాల్ని ఆకాశంలోకి విసురుతూ ప్రధమగణంచేసే ప్రళయ నృత్యానికి- పత్రతృణ శరత్ సశ్యాలు కదిలిపోయి, నక్షత్రాలు ఆకాశపు లోయల్లోకి జారిపోయి, భయంకర పారావారం తన వేయిపడగల్ని సాచి ఒక్కసారిగా ఒళ్ళంతా కాటువేసినట్టు అతడు వణికిపోయాడు.
ఆమె శరీరం చుట్టూ చేతులువేసి, ఆమె వక్షం మీద సిగరెట్ వుంచుతానని బెదిరిస్తూ- ఆమె జారిపోబోతుంటే చూస్తూ ఆనందిస్తూ మధ్య మధ్యలో ఆమె నోట్లో బలవంతంగా మధువుపోస్తూ సాడిస్టిక్ గా ఆనందిస్తూంది.....
.....రవితేజ టెక్స్ టైల్స్ చైర్మన్ శర్మ!!!
ప్రియంవదతో కలిసివున్న వ్యక్తి శర్మ అయ్యేసరికి అతడు అప్పటివరకూ అనుకున్నది, చెయ్యాలనుకున్నది అంతా మర్చిపోయాడు. అతడి చేతిలో ఇనుప ఊచ అప్రయత్నంగా జారి శబ్దంచేసింది. ఆ శబ్దానికి బాత్ రూమ్ వైపు చూసిన ప్రియంవధ కెవ్వున అరిచింది. రవితేజ చప్పున స్పృహలోకి వచ్చి, ఒంగి నేలమీదున్న రాడ్ తీసుకోబోయాడు. ఆ అరుపుకీ, బయట గదిలో వున్న మరో వ్యక్తి లోపలికి వచ్చాడు. శర్మ దుప్పటి చుట్టుకుని తలుపు తీశాడు. రవితేజ బాత్ రూంలోంచి ఆ గదిలోకి వెళ్ళేసరికి బయటవ్యక్తి లోపలికి రావడం, జేబులోంచి పిస్టల్ తీయటం అంతా క్షణాల్లో జరిగిపోయింది. శర్మ సర్దుకుని నవ్వుతూ, "వెల్ కమ్ రవితేజా! చివరి క్షణంలో అంతా కనుక్కోగలిగావన్నమాట. కంగ్రాచ్యులేషన్స్" అన్నాడు. లోపలికి వచ్చిన వ్యక్తి చేతిలో పిస్టల్ తను తీసుకుంటూ బయటనుంచి వచ్చిన ఆ వ్యక్తి భాస్కర్.
34
చెంచురామయ్య తో మాట్లాడి ఫోన్ పెట్టేశాక ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ కి ఏం చెయ్యాలో తోచలేదు.
పోలీస్ స్టేషన్ దాదాపు నిర్మానుష్యంగా వుంది. కొత్త సంవత్సరం సందర్భంగా అందరూ డ్యూటీలో తిరుగుతున్నారు.
ఇక ఈ రాత్రికి ఈ కేసు విషయంలో తను చేసేది ఏమీ లేదు అని అతడు నిశ్చయించుకుని బయటకు వెళ్ళబోతున్న సమయంలో ఫోన్ మ్రోగింది.
"హల్లో, పోలీస్ స్టేషన్" అన్నాడు తన ఏరియా చెప్తూ.
"మాధవిగారి హత్యకేసులో ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఆఫీసర్ తో మాట్లాడాలి" అని అట్నుంచి ఒక కోమల కంఠం వినిపించింది.
"ఇన్ స్పెక్టర్ రాజశేఖర్ హియర్, నేనే ఆ కేసు చూస్తున్నది. చెప్పండి" మీరెవరు?"
"దానికంత ప్రాముఖ్యత లేదు ఇన్ స్పెక్టర్ గారూ! నేనొక ముఖ్యవిషయం మీతో చెప్పాలి".
"చెప్పండి".
"మాధవిని హత్య చేసింది రవితేజ కాదు".
"మరి?"
"ఆయన ఆ సమయంలో ముంబాయిలో లేడు. ఈ ఊర్లోనే వున్నాడు".
"మీకెలా తెలుసు?"
అట్నుంచి మాట్లాడుతున్న ఆమె దానికి సమాధానం చెప్పకుండా "నేను చాలా రిస్క్ తీసుకుని ఈ ఫోన్ చేస్తున్నాను ఇన్ స్పెక్టర్ గారూ! రవితేజ ఈ దేశంనుంచి వెళ్ళిపోవటానికి ఏర్పాట్లు జరిగాయి. రేపే అతడి ప్రయాణం. దురదృష్టం ఏమిటంటే, హంతకుడు కాకపోయినా అతడిమీద ఈ నేరం మోపబడింది. ఆ ముద్రతోనే అతడీ దేశం వదిలి వెడుతున్నాడు".
"అతడు హంతకుడు కాకపోతే ఆ విషయం పోలీసులకి లొంగిపోయి చెప్పవచ్చుగా".
"భయపడుతున్నాడు. భయంలో మనిషికి తనేం చేస్తున్నాడో తెలీదు. ఇందులో పూర్తిగా ఇరుక్కుపోయాననీ, బయటకు రాలేనన్న నిరాశా నిస్ప్రుహల్లో మునిగివున్నాడు. స్వతహాగా రవి దైర్యవంతుడే! ఇంతకన్నా పెద్ద ప్రోబ్లమ్స్ ని చాలా ఎదుర్కొన్నాడు. కానీ ప్రియంవద ఎఫైర్ లో అతడి మనసు తప్పు చేశానన్న భావం బాగా పెరిగిపోయింది. ఎప్పుడైతే గిల్టీ ఫీలింగ్ ఏర్పడిందో అప్పుడే మనిషిలో భయం కూడా ప్రవేశిస్తుంది. అదే కారణం ఇన్ స్పెక్టర్ గారూ, ఏ కోర్టులోనూ నిరూపించలేని కారణం..."
"మీకు అతని గురించి బాగా తెలిసినట్టుందే....."
"ఏమీ తెలీదు. కానీ అతడు నిజం చెపుతున్నాడన్న నమ్మకం వుంది. మీరు ఎంక్వయిరీ చేయండి. అతడు ఈ ఊర్లోనే వున్నాడని సాక్ష్యం దొరుకుతుంది".
"ఈ ఊర్లో వుండి హత్యచేసి వుండవచ్చుగా-"
"అది చెయ్యటానికి ఇంత ప్లాన్ అనవసరం".
"అతడు మాకు దొరుకుతేగానీ ఏ విషయమూ బయట పడదు-"
"రవితేజ రేపే ఈ దేశంనుంచి వెళ్ళిపోతున్నాడు. దాన్ని మీరు ఆపాలి! మీమీద నమ్మకంతో ఈ విషయం చెపుతున్నాను. అతన్ని ఉరికంబం ఎక్కించటం కోసం కాదు. అతడిద్వారా అసలు హంతకుడిని పట్టుకోవటానికి. రేపతను ఈ దేశం వదిలి వెళ్ళిపోతే శాశ్వతంగా అతడి కోసమే వెతుకుతారు పోలీసులు అసలు వాళ్ళని వదిలేసి-"
"అసలు వాళ్ళెవరో మీకేమైనా అనుమానం వుందా?"



