Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర
ఎదురుగా వచ్చి గుద్దుకున్న కారు అతడి పక్కనుంచి సాగిపోయింది.
అప్పుడు చూశాడు అతడు.
కుడిపక్క- ముందు సీట్లో-
ఒక చెయ్యి కిటికీ బయటకు ఆన్చి-
గాలికి ఎగిరే ముంగురుల్ని సర్దుకుంటూ-
స్టీరింగ్ దగ్గిరున్న వ్యక్తి అప్పుడే వేసిన జోకుకి నవ్వుకుంటూ తల తిప్పి-
తన ప్రక్కనుంచి కారులో వెళ్ళిన మనిషి-
-ప్రియంవద.
33
హోటల్ లో ఎంక్వయిరీ పూర్తిచేసి బయటకు వచ్చిన రాజశేఖర్ వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్ళలేదు. ఒకటే ప్రశ్న అతడిలోకదలాడుతూంది. రవితేజ ఫోన్ లో మాట్లాడినట్టు- అతడు హత్యా చేయకపోతే ఏ కారణంవల్ల అతడు ఇంతకాలం దాక్కున్నాడు?
ప్రియంవద మరణం పట్ల భయపడ్డాడా?
అతడిని ఇంత ఊబిలో ఇరికించి చెంచురామయ్య ఏం సాధిద్దామనుకుంటున్నాడు? పోటీదార్ల వ్యాపారం పూర్తిగా పడగొట్టాలనా అతడి ఉద్దేశ్యం. అదే నిజమైతే మధ్యలో ఈ భాస్కర్ ఎవరు? రాజశేఖర్ రిసీవర్ ఎత్తి చెంచురామయ్యకి ఫోన్ చేశాడు. "హల్లో రామయ్యా హియర్" అని వినిపించగానే, "నేనూ భాస్కర్ ని" అన్నాడు.
"భాస్కరా? ఏ భాస్కర్?" అట్నుంచి అడిగాడు చెంచురామయ్య.
"రవితేజ దగ్గిర భాస్కర్ పేరు పెట్టుకున్నవాణ్ని. పోలీసులు నన్ను చుట్టు ముడుతున్నారు. ఇంతకీ నేను చెప్పొచ్చేదేమిటంటే..."
లైను కట్ అయింది.
రాజశేఖర్ ఆలోచనలో పడ్డాడు. చెంచురామయ్య ఎందుకు ఫోన్ కట్ చేశాడు? తను మాట్లాడుతున్నప్పుడు భాస్కర్ అక్కడే వున్నాడా? అందుకే చీకట్లో వేసిన బాణం సరీగ్గా తగల్లేదా? అతడు నిరాశ చెందలేదు. డిపార్ట్ మెంట్ లో ఇలాంటివి మామూలే.
* * *
రవి తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు.
కొద్దిసేపు తను భ్రమపడుతున్నానా అనుకున్నాడు. కాదు. ఆమె ప్రియంవదే. తన పక్కనుంచే కార్లో వెళ్ళింది.
అతడి రక్తం సలసలా కాగిపోయింది. ఇంతకాలం వున్న నిస్పృహ ఆవేశంగా మారింది. తననో ఫూల్ ని చేసి ఆడుకున్న ఈ మనుష్యుల మీద పగతీర్చుకోకుండా ఎందుకు వెళ్ళిపోవడం?
ఎలాగో తనకి హంతకుడిగా ముద్రపడిపోయింది.
వెళ్లబోయేముందు, తనని అధఃపాతాళానికి తోసేసి హాయిగా నవ్వుకుంటున్న ఆ చెంచురామయ్యకీ, ప్రియంవదకీ బుద్ది చెప్పితే మాత్రం నష్టం ఏముంది. కనీసం ఆ తృప్తి అయినా దక్కుతుంది.
అతడు తల త్రిప్పి చూశాడు.
అప్పటికే ప్రియంవద వున్న కారు దూరంగా మలుపు తిరుగుతూ కనిపించింది.
ఆక్సిడెంట్ జరిగిన గుంపు నుంచి జనం నెమ్మదిగా వెళ్ళిపోతున్నారు.
రవితేజ ఒక మోటరిస్ట్ దగ్గరికి వెళ్ళి "లిఫ్ట్ ప్లీజ్" అన్నాడు.
"ష్యూర్" అన్నాడు మోటార్ సైకిలిస్ట్, "కొత్త సంవత్సరం ఎవరేమడిగినా కాదనకూడదు. ఎటు వెళ్ళాలి?" మందు వాసన గుప్పున కొట్టింది అతడి దగ్గిర్నుంచి.
"నా గర్ల్ ఫ్రెండ్ ఎవరితోనో కార్లో వెళుతూంది. ఆవిడని ఫాలో అవ్వాలి".
కళ్ళు చిట్లించాడు- మోటార్ సైకిల్ మీద హిప్పీలా కూర్చున్న ఆ కుర్రవాడు రవి చెపుతున్నది అతడికి మొదట అర్ధంకాలేదు. అర్ధంకాగానే "హుర్రే" అని గట్టిగా అరిచి, "ఎక్కండి" అన్నాడు తనలో తనే జేమ్స్ బాండ్ ని వూహించుకుంటూ.
మరుక్షణం ఆకారు వెళ్ళినవైపు మోటారు సైకిల్ రాకెట్ లా దూసుకుపోయింది. క్రమక్రమంగా కారుకీ మోటార్ సైకిలిస్ట్ కీ మధ్య దూరం తగ్గుతోంది.
"దాన్ని ఆపి లోపలున్న వాళ్ళని చితక బాదుదామా బ్రదర్" అడిగాడు ఆ యువకుడు.
"వద్దు వద్దు మీ కభ్యంతరం లేకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో ఫాలో అవుదాం" అన్నాడు రవి. అతడి ఉద్దేశ్యం కారులో భాస్కరో, చెంచురామయ్యో వుంటారు. మొత్తం ముగ్గుర్నీ కలిపి పట్టుకోవాలి. పట్టుకొని ఒక్కసారి చంపెయ్యాలి. అంతేగానీ ఇలా నడిరోడ్డు మీద గొడవ పెట్టుకుంటే తననే అరెస్టు చేయిస్తారు.
అతడి మనసులో, తను ఈ రాత్రి ఏం చెయ్యాలో ఒక ప్లాను సిద్దమైంది. ప్రియంవధ ఏ ఇంటికి వెళుతూందో ముందు చూస్తాడు. తరువాత తనూ లోపలి ప్రవేశించి ఒక్కరొక్కర్నే విడివిడిగా చంపి- విదేశాలకి పారిపోతాడు. కనీసం కసి తీర్చుకున్నానన్న సంతృప్తి అయినా మిగులుతుంది!
"మీ పేరేమిటి బ్రదర్?"
"రవి"
"కొత్త సంవత్సరం ప్రారంభంలోనే నీ గర్ల్ ఫ్రెండ్ ని వేరే ఇంకొకరితో చూడవలసి వచ్చినందుకు....సారీ బ్రదర్. నేనైతే నరికి పోగులు పెడతాను".
"నేను చేయబోతున్నదీ అదే"- మనసులో అనుకున్నాడు. కారు ఒక ఇంటిముందు ఆగింది. రవి మోటార్ సైకిల్ దిగి, "థాంక్స్" అన్నాడు.
"హాపీ న్యూ ఇయర్? పాత గర్ల్ ఫ్రెండ్ గురించి మర్చిపోండి. 'కో' అంటే కోటిమంది అమ్మాయిలు. కొత్త సంవత్సరంలో...."
"....కొత్త జీవితం థాంక్యూ" పూర్తి చేశాడు రవితేజ. "....నేను అడగ్గానే వచ్చినందుకు కృతజ్ఞతలు. మీక్కూడా హాపీ న్యూ ఇయర్".
"వెళ్ళొస్తా బ్రదర్. అదిగో మీ పిట్ట ఇంట్లోకి వెళ్తోంది. ఆ నడక చూస్తూంటే కాస్త మందుమీద వున్నట్టుంది. సారీ బ్రదర్ బ్యాడ్ సెలక్షన్!" స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు అతడు షేక్ హాండిచ్చి.
-రవితేజ రెండు నిముషాలు చీకట్లో నిలబడ్డాడు. కార్లోంచి దిగిన ఆకారాల పోలికలు తెలియటం లేదు. ఒక స్త్రీ, ఒక పురుషుడు అని మాత్రం తెలుస్తూంది. "తను సరీగ్గా చూశాడా? అది ప్రియంవదేనా-" అన్న అనుమానం వచ్చింది. నిశ్చయంగా ప్రియంవదే అనుకున్నాడు. పక్కనున్నది భాస్కరా? అతడిని 'అన్నయ్య' గా పరిచయం చేసినట్టు గుర్తు. అతడు శుష్కంగా నవ్వుకున్నాడు. ప్రేమ పేరిట ఇంత మోసం చేసిన స్త్రీ అన్నయ్యగా ప్రియుడిని పరిచయం చేయటంలో ఆశ్చర్యం లేదు.
వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళారు.
అతడు మరికొంచెంసేపు అక్కడే నిలబడి ఆ ఇంటి దగ్గరగా వెళ్ళాడు. మిగతా ఇళ్ళకి దూరంగా విసిరేసినట్టుంది ఆ యిల్లు. సంసారులు వుండే ఇల్లులా లేదు అది. ఇటువంటి కార్యకలాపాలకి, వుంచుకున్నదాన్ని వుంచటానికి సరిపోయే ఇల్లులా వుంది అది. వీధి దీపాలు కూడా లేవు.
అతడు దగ్గిరగా వెళ్ళి ఆ ఇంటిని పరిశీలించాడు. తలుపు వేసి వుంది. లోపల లైటు వెలుగుతూ వుండటం బట్టి కొత్త సంవత్సరాన్ని 'ఇంకా' వాళ్ళు జరుపుకోవటం కొనసాగిస్తున్నారని తెలుస్తూంది. చాలా ఆనందంగా వుండి వుంటారు వాళ్ళు.
అవును మరి. అనుకున్నది దిగ్విజయంగా సాధించారు. వుండకేం చేస్తారు? వాళ్ళ దృష్టిలో తన ఓటమి సంపూర్తి అయింది. రవితేజ టెక్స్ టైల్స్ మూలస్తంభం నిలువునా కూలిపోయింది. ఆ ఆనందోత్సాహాలని ఈ కొత్త సంవత్సరం సంరంభంతో కలుపుకుని ఎంజాయ్ చేస్తూ వుండి వుంటారు.
ప్రహరీ గేటువేసి వుంది. అతడు వెనుగ్గా వెళ్ళాడు. అక్కడ అలికిడి లేదు. శబ్దం చేయకుండా గోడదూకి లోపలికి ప్రవేశించాడు. వెనుకవైపు పిచ్చిమొక్కలు ఇష్టం వచ్చినట్టు పెరిగివున్నాయి. అతడు శబ్దం చేయకుండా ముందువైపు వచ్చాడు. వీధి లైటు లేకపోవటం వల్ల అక్కడంతా చీకటిగా వుంది.
లోపల ఎంతమంది వున్నారో తెలీదు. ముందు అది తెలుసుకోవాలి. ప్రియంవదతో ఫర్వాలేదు. లోపల ఇద్దరికన్నా ఎక్కువ మంది మొగవాళ్ళు వున్న పక్షంలో తన పని కష్టమవుతుంది. లోపలికి ప్రవేశించగానే ఒకరిని స్పృహ తప్పించి లోబర్చుకోవాలి. అది చూసి రెండో వ్యక్తి ఎంత ధైర్యవంతుడయినా బెదిరిపోతాడు.
అతడు చుట్టూ చూశాడు. తీగెకు కట్టివున్న ఇనుప వూచ కనపడింది. దాన్ని భూమిలోంచి బయటకు లాగాడు. లావుగా, రెండు అడుగుల పొడవుతో బలంగా వుంది. ఒక దెబ్బ చాలు మనిషిని స్పృహ తప్పించటానికి. దాన్ని భూమిలోంచి లాగి చేత్తో పట్టుకున్నాడు. ముందు కాలింగ్ బెల్ కొడదామనుకున్నాడు. కానీ తనని చూడగానే ప్రియంవద గట్టిగా అరిచే ప్రమాదం వుంది. అదీగాక, ఇంత అర్ధరాత్రి బెల్ కొట్టేది ఎవరా అన్న అనుమానంకూడా లోపలి వాళ్ళకి రావొచ్చు. కిటికీలోంచి బయటకు చూస్తే ప్రమాదం.



