Home » Yandamuri veerendranath » నల్లంచు-తెల్లచీర
32
ఇక్కడ ఇన్ స్పెక్టర్ ఎంక్వయిరీ చేస్తున్న సమయానికి అక్కడ రవితేజ ఆమెతో సంభాషణ ముగించి బయట రోడ్డు మీద తిరుగుతున్నాడు. అర్ధరాత్రి దాటింది. ఈ దేశంలో అతడికి అది ఆఖరి రాత్రి. విదేశాల్లో తన ఆచూకీ తెలుసుకుని పోలీసులు పట్టుకుంటే మళ్ళీ ఈ దేశం వస్తాడు. ఇలా స్వేచ్చగా తిరగటానికి కాదు. లాకప్పు, కోర్టు, జైలు- వీటిలో గడపటానికి.
అతడు తన భవంతి ముందు నిలబడ్డాడు.
చీకట్లో ఎత్తుగా, నీడలా మధ్య నల్లగా పోయిన తన పరువులా వుంది ఆ భవంతి. నేలమీద నిద్రస్థాయినుంచి ఎయిర్ కండిషన్ బెడ్ రూమ్ స్థాయికి వెళ్ళిన తన జీవితం, పరమపద సోపానంలో క్రిందికి దిగిపోయింది. అతడికిప్పుడు ప్రియంవద మీద కూడా కోపంలేదు. ఆమె కూడా ఆ ఆటలో ఒక పావుగా ప్రాణం పోగొట్టుకుంది. అతడికి తనమీద తనకే కోపంగా వుంది.
తన భవంతి నుంచి, తను ఇప్పటివరకూ గడిపిన గెస్ట్ హౌస్ కి ఆ ఆఖరి రాత్రి గడపటానికి వెళ్తూ వుంటే- ఎడమ పక్కన కనబడింది -శ్మశానం.
అక్కడే మాధవిని దహనం చేసింది అతడికి శర్మ చెప్పాడు.
అర్దరాత్రి నిశ్శబ్దాన్ని ఆ శ్మశానానికి పరదాలా కప్పేసి, సమాధుల మధ్యనుంచి వీచే గాలి వెదురు బొంగుల్లో చేరి ఈలాగా మారి, కీచురాళ్ళ లయకి పాటగా నాట్యం చేస్తూంది చీకటి! అతడికి భయం వేయలేదు. అతడే ఒక ప్రేతంలా వున్నాడు. దూరంగా కుక్క ఏడుస్తోంది. కాటికాపరి లేడు.
అతడు లోపలికి ప్రవేశించాడు. పాతిక సంవత్సరాలు కలిసి పెరిగి తనతోపాటు పది సంవత్సరాలు కాపురం చేసిన మాధవి ఇక్కడే ఎక్కడో బూడిదగా మారి వుంటుంది. ఈ మట్టిలోనే ఎక్కడో ఆమె తాలూకు చితాభస్మం కలిసిపోయి వుంటుంది. ఇన్ని సమాధుల మధ్య ఎక్కడని వెతుకుతాడు? బ్రతికి వుండగా మనసులో ఏముందో వెతికి పట్టుకోలేకపోయాడు! ఇప్పుడు మరణించాక ఎలా తెలుసుకుంటాడు?
అదే వాక్యం-
ఒకే దిండుమీద నిద్రించిన మన రెండు తలలు.....ఉత్తర దక్షిణ ధృవాలు! నువ్వు చనిపోయి నన్ను నాకు వదిలిపెట్టి వెళ్ళాక తీరిగ్గా నన్ను నేను పరిశీలించుకునే వీలు దొరికింది. నీ మీద కోపం పోయాక నీ వైపునుంచి ఆలోచించే విశాలత్వం అలవడింది. ఆదిలో నేను- అంతంలో నువ్వు- మధ్యలో నీ సమాధిమీద వెలుగుతున్న దీపం. నా మనసులో చీకటిని పరిహసిస్తూ అది పారద్రోలుతుంది. మన వైవాహిక జీవితంలో నువ్వు నాకేమిచ్చావు అన్న ప్రశ్న సరే. అది అటుంచు నేను నీకేమీ చేశాను అన్న ప్రశ్న విశ్వరూపం దాల్చి నన్ను చీల్చి చెండాడుతూ వుంది. నువ్వు మూఢురాలివన్న నా మూర్ఖత్వంనుంచి నేను బయటపడుతున్నాను. నా కష్టాన్ని నువ్వు అర్ధం చేసుకోలేదనే నేను చితించాను తప్ప నీ స్థాయికి దిగివచ్చి (చూశావా! 'దిగిరావటం' అన్న పద ప్రయోగం మళ్ళీ నా అహాన్ని సూచిస్తుంది.) నిన్ను నాతోపాటు తీసుకువెళ్ళే ప్రయత్నం ఏదీ చేయలేకపోయాను. నిద్రపోతున్న అంధకారాన్ని ఉషస్సు మేల్కొలిపే దాకా వెలుగు రేఖ యెలా విచ్చుకోదో, అలాగే మరణం చివరి అంచువరకూ నడిచేదాకా నాకు బ్రతుకులో సమన్వయం అర్ధంకాలేదు. అర్దరాత్రి అరవై మంది అతిధుల మధ్య అరపెగ్గు తాగుతూ, 'ఆహా' డబ్బు ఆర్జిస్తున్నానని అహంతో ఆత్మవంచన చేసుకునే నేను.....అదే రాత్రి ఆత్మీయత కరువైన పక్కమీద, బెడ్ లాంప్ ఓదార్పుతో ఒంటరిగా పడుకుని, నేను రాగానే, ఆ చిరాకుని అసంతృప్తిగా ప్రకటించే నీ మీద విసుక్కునే హక్కుని ఎలా కలిగివున్నాను? పక్క డైరెక్టరు కొన్న కొత్త కారు బావుందని ఒకసారి డ్రైవ్ చేసి చూసి అభినందించే నేను, పక్కింటావిడ కొన్న కొత్త నగ బావుందని నువ్వు మెళ్ళో వేసుకుంటే చీదరించుకుంటానెందుకు? మీరు కట్టుకున్న టై బావుందని ఒకమ్మాయి అంటే గర్వంగా నవ్వుకునే నేను- మీరీ చీరెలో బావున్నారని నిన్నెవరైనా అంటే ఉడుక్కున్నానెందుకు? మాయమైన గతం నుంచి నాకు సంకేతం వస్తుంది. వాస్తవం బీడుమీద నా కన్నీరుపడి హృదయాన్ని చీల్చుకుని పశ్చాత్తాపం మొలకవెల్వడుతూంది. జీవితయాత్ర, మృత్యుద్వారం గుండా వెళుతూన్న సమయాన మాత్రమే శాశ్వత నిత్యసత్యాలు గోచరమవుతాయి. నీ స్నేహితుడు నీకు ప్రేమ గురించి వ్రాసిన ఉత్తరం చదివి, ఇద్దరు అజ్ఞానులు చేరి జ్ఞానం గురించి మాట్లాడుకున్నట్టుంది అని నవ్వుకున్నాను. నా ప్రియురాలు నాకు వ్రాసిన ఉత్తరం చదివి ఎంత అదృష్టవంతుడిని అని పొంగిపోయాను. ఒకే తప్పు ఇద్దరు చేసినప్పుడు ఆ ఉత్తరం కృష్ణశాస్త్రిలా వ్రాసినా కృష్ణారెడ్డిలా వ్రాసినా, తప్పు తప్పేకదా అన్న సత్యాన్ని మర్చిపోయాను. నువ్వు దక్షిణ ప్రాంగణంలో కూర్చున్నప్పుడు నేను ఉత్తర శ్మశానంలో వెతికాను. ఎవరో కవి అన్నట్టు-
"నీకు సత్యం అర్ధవంతం.
నాకు నిజం భయంకరం...
ఏ కేంద్రంలో మనిద్దరం కలుసుకోవటం?
ఓ ప్రత్యూష పవనంలోని మందార లతాంతమా!
నేను ప్రదోషవేళా తమాల శాఖాగ్ర ఘాకాన్ని
అటు-ఆనంద సుధర్మవైపు నువ్వు వెళ్ళు.
నక్షత్రధూళిని జల్లుతూ....
ఇటు-కలల బూడిద రాసులమీదనే
కూలబడతా నే కన్నీళ్ళు చిమ్ముతూ"
ఎన్నివేల సమాధులు ఇక్కడ, ఎన్ని వందల చితులు ఇక్కడ ఎంతమంది విభిన్న మనస్కులు అవతలివారితో రాజీ పడలేక, మృత్యువుతో రాజీపడ్డారో, ఎంతమంది ప్రేమార్తులు చితిమంటలో చల్లారిపోయారో, ఓ నా ప్రియబాంధవీ నన్నుక్షమించు. నాతి చరామి అన్న మాటకు నేను న్యాయం చేకూర్చలేకపోయాను. పెళ్ళయిన రోజునుంచీ నిన్నొక మనిషిగా చూడలేకపోయాను. నీకూ ఒక మనసు వుంటుందనీ, దానికీ కొన్ని కోర్కెలుంటాయనీ తెలుసుకోలేకపోయాను. నా అజ్ఞాతపు నేత్రాలతో నీలోని మూర్ఖత్వాన్నే చూశాను తప్ప, నా జ్ఞాన చక్షువుతో నీ అంతరంగాన్ని గ్రహించలేకపోయాను. కన్నీళ్ళతో విమానాశ్రయంలో తన భర్తకి వీడ్కోలు ఇస్తున్న ఇల్లాలైన్ చూశాను తప్ప- నా ఎడబాటులో నా భార్య కళ్ళలో కనీసం ఒక చుక్క నీటిని కూడా తెప్పించలేకపోయిన నా ప్రేమ రాహిత్యాన్ని గుర్తించలేకపోయాను. కాలిన చేతుల్తో, ఆకులకోసం వెతక్కుండా, దోసిలిబట్టి గుర్తు తెలియని నీ సమాధింముందు నిలబడి క్షమాపణ వేడుకుంటున్నాను. నన్ను క్షమించు నన్ను అసహ్యించుకోకు. జాలిపడు.....వెళ్ళొస్తాను" అతడు లేచి తూలుకుంటూ శ్మశానం నుంచి బయటకు వచ్చాడు.
* * *
అతడు ఆ సందులోంచి మెయిన్ రోడ్డుకొచ్చి అక్కడి వాతావరణం చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటివరకూ నిర్మానుష్యంగా వున్న వీధులు ఒక్కసారిగా రద్దీగా కనపడినయ్. స్కూటర్లు, కారుహారన్లు, జనం....అర్దరాత్రి అకస్మాత్తుగా అంతమంది జనం బయటికి ఎందుకు వచ్చారో అతడికి అర్ధంకాలేదు. వాళ్ళ అరుపులు విన్నాడు.
"హాపీ న్యూ ఇయర్...." అని పరస్పరం అభినందించుకుంటూ అరుచుకుంటూ జనం సాగిపోతున్నారు. ఆరోజు కొత్త సంవత్సరం అడుగిడబోతూ వుందని అతడికి అప్పుడు జ్ఞాపకం వచ్చింది. జనవరి ఒకటో తారీఖునే తన ప్రయాణం ఎందుకు నిర్ణయింపబడిందో కూడా అతడికి అర్ధమైంది. ఆ రోజు ప్రభుత్వాధికారులు ఎక్కువమంది నిఘా వుండరు. "హాలీడే మూడ్" లో వుంటారు. ఒక స్కూటరిస్టు పక్కనుంచి సాగిపోతూ ఒంటరిగా నడిచి వెళుతూన్న అతడిని చూసి "హాపీ న్యూ ఇయర్" అన్నాడు. రావితేజకి నవ్వొచ్చింది. "హాపీ-హాపీ" అన్నాడు- నాకెలాగూ లేదు. నువ్వైనా ఆనందంగా వుండు బ్రదర్- అన్న ధోరణిలో.
అంతలో అతడి పక్కనుంచి ఒక కారువేగంగా దూసుకు పోయింది. ఫుల్ మందులో వున్నట్టున్నారు లోపలివాళ్ళు. స్టీరింగు అస్తవ్యస్తంగా తిప్పుతూ నడుపుతున్నారు. కారు లోపల్నుంచి నవ్వులు బిగ్గరగా వినిపిస్తున్నాయి. ఎలక్ట్రికల్ పోల్ పక్కనుంచి వెంట్రుక వాసిలో తప్పించుకుని ముందుకు వెళ్ళింది. నడిపే వాళ్ళకే కాదు. ఆ కారుకే ఆనందం ఎక్కువైనట్టుంది.
అతడికి మిస్ విజయవాడ పంపిన కాగితం గుర్తొచ్చింది. ఆ కొటేషన్ ను కొద్దిగా మార్చి అనుకున్నాడు.
"బిగ్గరగా నవ్వటంలో పొలమారే రిస్క్ వుంది.
మందు ఎక్కువైతే ఆక్సిడెంట్ రిస్క్ వుంది.
భార్యని కాదని బయటకు పోవటంలో నిలువు
లోతు బురదలో నడుము విరిగే రిస్క్ వుంది".
మరో రెండు నిముషాలు నడిచి మలుపు తిరిగాడు. అక్కడ రోడ్డు పక్క జనం గుంపుగా చేరి చూస్తున్నారు. అంతకుముందు అతడి పక్కనుంచి తూలుకుంటూ వెళ్ళిన కారు ఎదురుగా వచ్చే మరో కారుని ఢీకొంది అదీ గొడవ.
పెద్దగా ఎవరికి దెబ్బలు తగల్లేదు. అతడు ఆ స్పాట్ కి చేరుకునే సరికి రెండు కార్లవాళ్ళూ ఒకళ్ళ నొకళ్ళు తిట్టుకుంటూ కస్త రివర్సు చేసుకొని ముందుకు వెళ్ళటానికి ఆయత్తమవుతున్నారు. రెండు కార్లు ముందు భాగాలూ బాగా చొట్టలు పడ్డాయి. మామూలు పరిస్థితుల్లో అయితే పోలీసు కేసులూ గొడవా అయ్యేవేమోగానీ, న్యూ ఇయర్ డే అవటం వల్ల, అందరూ మత్తులో వుండటం వల్లా జరిగిన నష్టాన్ని ఎవరూ పట్టించుకోలేదు.



