Home » Sree Sree » Srisri Kathalu
బాధ కవిత్వానికి పర్యాయపదం
చక్కని పద్యాలురాసి నీకు వినిపించాడే చవితినాడు, ఆ
కుర్రాడు చాలా బాధపడుతున్నాడని వినీ వినగానే నాకేదో
వేదనా, అణులేశం ఆవేశం, ఆ మట్టునే ఆగ్రహం వచ్చి,
అటువంటివాళ్ళ అవస్థలమీద ఖర్చు పెట్టడానికి నాదగ్గర
కన్నీళ్ళు లేవన్నాను.
బాధపడటం చేతకానివాళ్ళు పద్యాలు రాస్తే బాధపడటం భరించలేని వాళ్ళు పద్యాలు చదివితే, పద్యాలు అందులోకీ యతిప్రాసల్లేని అర్ధంలేని పద్యాలు రాసి బాధపడడం, అర్ధంలేని బాధపడడం, యతిప్రాసల్లేని బాధపడడం అన్నాన్నేను.
ఆ కుర్రాడు నా దగ్గరికి వచ్చిన మాట నిజమే. పద్యాలు చదివినమాట నిజమే. నే నతన్ని పొమ్మన్నమాటా నిజమే. నే నతన్ని యెందుకు పొమ్మన్నానో చెప్పడానికే ఈ కథ.
కథ అన్నాను? సంఘటనల్లేని, సంచలనంలేని, కర్త, కర్మ, క్రియల్లేని కథనాన్ని కథనడం ఎలా? ఇప్పుడే చెబుతున్నాను ఒక పూరిల్లుగాని, పచ్చకర్పూరంకాని, చివరికొక సిగరెట్టూకాని తగలెట్టేటప్పుడు బయల్దేరే పొగలో కనిపించే కదలికపాటిది కూడా ఈ రాతలో మీకు కనబడదు. మెదడు తగలబడి పోయేటప్పటి పొగ కాని పొగ కదలనట్టు కనిపించే కదలడం జరగనట్టు కనిపించే జరగడం ఇందులో చూపించాలని ఎందుకో ప్రయత్నం.
నీ తరువాతి తరం యువకుని నీ దగ్గరికి వచ్చినప్పుడు నిర్దాక్షిణ్యంగా పోమ్మన్నావు. అతని పాటలోని బాధ నీ కళ్ళ వెనక నీళ్ళలో ఈదుతోందని నీకు బాగా తెలుసు. అయినా పొమ్మన్నావు. ఉప్పెనగా ఉద్గమించబోతున్న కన్నీళ్ళను అటకాయించి.
'అపాయానికి ఇటూదారి' అని ఎక్కడైనా ఎవరైనా ఒక హెచ్చరికను ప్రతిష్టిస్తే ఎంత బాగుండును. అప్పుడు మనం అంతమందిమీ అటు వెళ్ళడం మానేద్దుము.
మానేస్తామా? ఏమో అబ్బా? నా మట్టుకు నేను అపాయాలని అన్వేషించడంలోనే ఆనందం పోగుచేసుకుంటాను. ఇంకా యెందరో ఉన్నారు. ఇలాంటి నాలాంటి వాళ్ళు. అపాయం స్వభావాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలంటారు వాళ్ళు. నిషేధాలు విధిస్తూ నిలబడే పోలీసుల బలం నిరుపయోగం వీళ్ళ విషయంలో.
అపాయం బోర్డుకట్టి అటువెళ్ళకుండా ప్రజల్ని శాసనాలద్వారా అరికట్టి అపాయానికి ఇవతలివేపు క్షేమాన్ని వెదజల్లడానికి ప్రభుత్వాలన్నీ కృషిచేస్తూనే ఉంటాయి. కాని ఏం లాభం? అవతల ఏముందో చూడడానికి మానవుడిలో కుతూహలం ఉన్నంత కాలం బోర్డుచేసే హెచ్చరిక నిశ్శక్తం, నిర్వీర్యం.
సుమతీ శతకం స్తవనీయమే. సెన్సారుబోర్డు అభిలషణీయమే. శాసనసభ అవశ్యం గౌరవనీయమే. అయితే నేం? అపాయానికిగల ఆకర్షణని నేను కొనియాడడం మానలేను.
ఈ కుర్రాడున్నాడే వీడు అపాయాల స్వభావం కనిపెట్టాలని ఉబలాటం ఉన్నవాడు. ఆ పద్యాలు చదివినప్పుడే తెలిసింది నాకా సంగతి. పద్యాలుగా అవి బాగానే ఉన్నాయి కాని, అవి బతకవని నాకు తెలుసు. ఎందుకో చెప్పనా?
ఒకసారి నేను చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో చిక్కుకున్నాను. ఎవరిదో అరచెయ్యి దానిమీద ఒక గుండు సూది అంటీ అంటనట్లు నిలబెట్టి ఉంది. దానిమీద నేను ఒంటికాలి మీద నిలుచున్నాను. అంతవరకు బాగానే వుంది. అటువంటి సర్కసు ఫీట్లు నేను సునాయాసంగా సాగించగలను. ఇక దిగిపోవాలనుకుంటున్న సమయానికి నా నెత్తిమీద గ్రంథాలయాల దండయాత్ర ప్రారంభమైంది. ఎంత బరువుందో యిప్పుడు జ్ఞాపకం లేదు. కాని, ప్రపంచకవుల రచనల సంపూర్ణ సంపుటం నాతలమీద వచ్చి వాలింది. దాని మీద నానాభాషల నిఘంటువులు, ఉగాది సంచికలు ఒత్తుతున్నాయి. ఇంకా ఇంకా మీదిమీదికి పోనుపోనూ అనంతంగా అనేక గ్రంథాలు, షేక్సిపియరు సమస్త రచనల మేలు ముద్రణం వ్యాఖ్యాన గ్రంథాలతో సహా నోస్ డైవ్ చేసినప్పుడు నా మెదడులో అణువు బ్రద్దలైనట్టయింది. ఆకాశంవైపు పెరిగిపోతున్న గ్రంథాల భారం నన్ను క్రుంగదీస్తోంది. అంతసేపూ ఒంటికాలుతో గుండుసూదిమీద నిలబడే ఉన్నాను. గుండుసూదిని కదలకుండా నిలబెట్టగలిగినవాడి చాకచక్యానికి తీసిపోగూడదని పౌరుషానికి నిలుచున్నాను భార బాధ భరిస్తూ, కాలైనా మార్చుకోడానికి వీల్లేదు నా నెత్తిమీద ఎన్ని పుస్తకాలున్నాయో స్పష్టంగా తెలియదు. వాతావరణంలోని వివిధ పరిణామాలను చర్మంతో పీలుస్తూ గ్రంథాల పేర్లు పోలుస్తున్నాను. మధ్యమధ్యన ఎక్కాల పుస్తకాలూ అచ్చుతప్పులతో నిండి అణాకి అర్ధణాకి అమ్ముడుపోతున్న చవకబారు పుస్తకాలు గ్రుచ్చుకుంటున్నాయి. అమూల్యమైన తాటాకు గ్రంథాలతో తంజావూరు లైబ్రరీ నా నెత్తిమీద పడింది. తామ్ర శాసనాలు శిలాశాసనాలు తగులుతున్నాయి. నా రక్తనాళాలలోని నెత్తురు వాటి ఒత్తిడిని అనుభవిస్తోంది.
నామీద గ్రంథాలూ - నాకింద గుండుసూదీ! ఏ తెలియరాని గణితశాస్త్ర సూత్రంవల్ల అవి నిలబడి నన్ను నిలబెట్టాయి.
అరచెయ్యి అభయహస్తం పడిపోతానని భయం లేదుగాని పాడడానికేమి తోచలేదు. పాడాలనే బాధ మాత్రం పొడుస్తోంది. ఏది పాడినా ఈ పుస్తకాల సారమే. జీవితానుభవమే కావ్యవస్తువు కావాలని నాకప్పటికింకా తెలియదు.
ఈ యిరుకు పరిస్థితిలో చిక్కుకొని ఏదో పాటపాడాను. ఆ పాట చాలామందిని ఆకర్షించింది కూడా అరచేతి కిరుపక్కలా ఉన్న అగాథపు లోయల్లో తండోపతండాలుగా క్రిక్కిరిసిపోయిన ప్రేక్షకజనం అయిదునిమిషాల ఇరవై సెకండ్లసేపు కరతాళధ్వనులు చేసి నా పాటని అభినందించారు.
ఆ పాటకు ముగ్ధుడైపోయాడు ఈ కుర్రాడు. దానికి అందమైన అనుకరణం తయారుచేశాడు. అదీ నా కోసం అతణ్ణి పొమ్మన్నాను అందుకే అతని పాటలు బతకవన్నాను.
నువ్వు స్వయంగా అపాయాల్లోకి వెళ్ళు ఎరువు తెచ్చుకొన్న అభిప్రాయాన్ని తగలబెట్టడానికి వీలుగా ఒక అగ్గిపెట్టె నీతో తీసుకు వెళ్ళటం మరచిపోకు. గుండుసూదిమీద ఒంటికాలితో నిలబడడం గొప్పమాటే కాని అదే అంత గొప్పకాదు. ఇంకోమాట - ఎంత గొప్పవాడైనా - నువ్వు వాడివి కావాలని ప్రయత్నించకు. ఇన్నాళ్ళు నుంచి అర్ధానుస్వారంలాగ, ముద్రాసురిడిలాగ బతికేవు. పేపరు వెయిట్ లాగ, రబ్బర్ స్టాంపుతో బతికేవు వెళ్ళు జీవితంలోకి.
రెండోరకం పద్యంలోకూడా బాధ వుంటుంది. కాని అది బతికే బాధకాదు. బతికించే బాధ కానేకాదు.
---౦౦౦---



