Home » Sree Sree » Srisri Kathalu


    కాని ఈ మహాశిల్పుల జీవితాలు కూడా ధనానికే అంకితం అయిపోవడం నాకు జాలి కలిగిస్తుంది. డబ్బు ఎంత క్షమించరాని నేరం చేస్తోంది! అమూల్యమైన రసాత్మలను కొనేస్తుంది. అందమైన భవనాన్ని చూస్తే దీన్ని కట్టినవాడు ఎంతో కొంత డబ్బు  తీసుకున్నాడన్న సంగతి నేను స్మరించడం మానలేను. మువ్వగోపాలపదాన్ని అమోఘంగా అభినయిస్తున్న అమ్మాయి హస్తముద్రల వెనక ధనంచేసే కరాళ నాట్యాన్నే చూస్తాను. ఒక గొప్ప నాటకకర్త సృష్టించిన పాత్రను ఒక ప్రసిద్దుడైన నటుడు ప్రతిభావంతంగా వ్యాఖ్యానిస్తూ ఉంటే "ఏయ్ నువ్వు డబ్బు తీసుకున్నా"వని అరవాలనిపించుతుంది. రాళ్ళనీ రాతిగుండెలనీ కరిగించగల రాగాలాపన సాగిస్తున్న వైణికున్ని చూసి అతని వేళ్ళు కూడా ధనస్పర్శవల్ల మలినమైపోయినవే కదా అని బాధపడతాను. ఏప్రదర్శనానికి వెళ్ళినా నేను కొన్న టిక్కెట్టు నా గుండెల్లో బాకులాగ గుచ్చుకునే ఉంటుంది.
    ఈ బెడదలేవీ లేక ఈ ఆలోచనలేవీ లేక అందరూ ఎంత తృప్తిగా నిశ్చింతగా బతికేస్తున్నారో! అందుకే నాకనిపించుతుంది. నేను ఎందుకు చచ్చిపోవాలి? ఎందువల్ల ఆ మోటారు కారులో పోతూన్న మొద్దబ్బాయి గంగిరెద్దులాగ తయారయి సినిమాకో, షికారుకో వెడుతున్నవాడు చచ్చిపోకూడదు? ఎందువల్ల ఆ సిగరెట్లు కాల్చుతూ, చేతికర్ర తిప్పుతూ క్లబ్బు వరండాలో పచారు చేస్తున్న లంచాలు తినడంలో, తినిపించడంలో ప్రత్యేకత వహించిన ఆ పెద్దమనిషి చచ్చిపోకూడదు? ఇందువల్ల ఆ బనారసు చీర కట్టుకున్న బంగారం పెట్టుకున్న, ఒళ్లంతా అన్ని దిక్కులా బలిసి ఆడవాళ్ళ సభలో ఆగిపోయే ఇంగ్లీషులో ఉపన్యాసం చేయబోతూన్న యువతీ రత్నం మరణించ కూడదు?
    ఓహో! ఇవి వ్యర్ధాలోచనలని భావించవద్దు నేస్తం! నేనూ నీలాగే లోకాన్ని చదువుకుంటున్నాను. నిర్ధనులం నిన్నుజాతులంతా వాళ్ళ బతుకుతో వాళ్ళు తృప్తిపడుతున్నారనీ, చేసిన పాపం అనుభవిస్తున్నారనీ, అసలు వాళ్ళకి ఆత్మలే లేవనీ ఈ కొత్త రచయితలూ, కొత్త నాయకులూ బయలుదేరి వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి, వాళ్ళలో అశాంతి రేగించి తిరుగుబాటు పురికొల్పుతున్నారనీ అంటూన్న చవకరకం విమర్శలు లక్ష్యపెట్టనక్కరలేదు. అసలు మన అభిప్రాయాలను వాళ్ళ మనస్సులలో ప్రవేశపెట్టడం లేదు సరికదా ఇవన్నీ వాళ్ళ హృదయాలలో, నోరులేని వాళ్ళ జీవితాలలో అంతర్గిర్భితంగా అణిగి ఉన్న ఊహలే బైటికి రాలేక లోపలలోపలనే కుతకుతమని ఉడికిపోతూ ఉన్నవి. సమాజగమనాన్ని శాస్త్రీయంగా అర్ధం చేసుకున్నవాడు ఎవరి పక్షం వహించాలి ఈనాడు? నాకు తెలుసును నా బాధ ఎవరి బాధో నాకు తెలుసును. ఒక ఫ్యాక్టరీలో కూలీ, ఆఫీసులో కుర్రాడు, వర్తకుడి దగ్గర గుమాస్తా. వడ్రంగి దగ్గిర పని నేర్చుకుంటున్న అబ్బాయి. హోటేల్ లో పనివాడు, చాలీచాలని జీతం తెచ్చుకుంటూన్న బ్యాంకు గుమాస్తా, పల్లెటూళ్ళో బడిపంతులు, నాటకాల్లో చిల్లరవేషాలు వేసేవాడు, ముద్రాక్షరశాలలో రైలు స్టేషన్లవద్ద బరువులు మోసేవాడు. పొలాలలో పాలికాపు, పట్టణాలలో కాలవలు తుడిచేవాడు. దారిపక్క భిక్షపు వైద్యశాలలో రోగి, గుడిసెలో ముసిలమ్మి (ఆహా స్త్రీలోకంలో ఉదాహరణలు స్మరిస్తే చెయ్యి వణుకుతోంది పురుషులదేం కష్టం? కష్టాలనీ, కష్టాల సహనాన్నీ చెప్పాలంటే స్త్రీలని స్మరించు) ఇప్పుడే చచ్చిపోయిన బిడ్డని చేతుల్లో పెట్టుకున్న పదహారేళ్ళ బాలెంతరాలు మగడు చచ్చిపోయాడని టెలిగ్రాము వస్తే ఏడుస్తూ కూర్చున్న ఇల్లాలు, వృద్ధాప్యం మీదపడినా, చాకిరీ చెయ్యకపోతే దినం వెళ్ళని దీనురాలు నీళ్ళు తోడుతూ అంట్లు తోముతూ బతికే దాసీది గతిలేక శరీరాన్ని అమ్ముకొనే వేశ్
య వద్దు వద్దు ఇక చాలును ఎవరు నన్నర్ధం చేసుకుంటారో ఎందుకు వేరే చెప్పడం?
    ఓహో? అభినవ బుద్ధుడా! ఈ యాతనా ప్రాణాలకు నిర్వాణం సంపాదించడానికా నీ ప్రాణాలు తీసుకుంటున్నావు? ఏ లోకాలకి పోయి ఏ దేవతల ముందు వాదిస్తావు వీళ్ళకి న్యాయం ఇమ్మని? జీవించు బతికి ఉండివీళ్ళకేదైనా తరుణోపాయం ఆలోచించు. ప్రాణాలు నిలుపుకొని వీళ్ళ పక్షాన్ని పోరాడు.
    వ్యర్ధంగా చచ్చిపోతున్నానా? వీళ్ళనంతా చూస్తూ మరణిస్తున్నానా? ఏమీ చెయ్యలేక నిష్క్రమిస్తున్నానా నేను? మరి ఏమి చేస్తున్నా నా చుట్టూ వెయ్యిరహస్యపు కళ్ళు! ఏం చెయ్యాలనుకున్నా ఇదిగో నా వెనకనే ఒక సి.ఐ.డి. ఇదిగో వారంటు! ఇదిగో చెరసాల ఇదిగో ఉరికొయ్య! మాటకి సంకెళ్ళు చేతకి నిరోధం గ్రంథాలకి నిషేధం ఎన్ని లోపాలున్నా ఈ పద్ధతిని అనుసరించ వలసిందే! కాదని ప్రతిఘటిస్తే వజ్రముష్టితో ఆశనిపాతం! ఈ సంఘర్షణ హెచ్చిపోయి కలవారికీ లేనివారికీ తెగతెంపులు జరిగే సంగ్రామంలో, స్పెయిన్ లో, చీనాలో, అదే యాతత్ప్రపంచంలో విజ్రుంభించినప్పుడు ఇవిగో మరఫిరంగులు! ఇవిగో బాంబర్ విమానాలు! ఇదిగో అగ్నివర్షం! ఇదిగో మృత్యువు! ఇదిగో వినాశనం!
    మానవుని మంచితనం గురించి పదేపదే నువ్వు చెబుతావుగాని మనుష్యుడిలో ఎంత కల్మషం అణగిఉందో చూడమంటావా? ఔను ఈ మోసాలు, అబద్దాలు, అనుమానాలు హత్యలు ఏ పోలీస్ స్టేషన్ కి ఏ క్రిమినల్ కోర్టుకి వెళ్ళినా స్పష్టంగా కనబడతాయి అమ్మయ్యో! మానవులలో ఎంత దుర్మార్గులున్నారో? వీళ్ళని శిక్షించకపోతే మరి వీళ్ళకి పట్టపగ్గాలుంటాయా?
    ఔనౌను దగాకోరులని సంఘం నిరసించిన వాళ్ళని నేనెరుగుదును కాని వాళ్ళ పాపానికి నీకూ, నాకూ, సంఘ మొత్తానికీ ఎంత బాధ్యత ఉన్నదో గుర్తించావా? అధోగతిలో వాళ్ళు కొట్టుకుపోతూ ఉంటె అందరూ ఒక తన్నుతన్ని ఒక రాయి విసిరేవాళ్ళేకాని ఆ పతితులను ఉద్దరించాలన్న ఆసక్తి చూపిస్తున్న వాళ్ళెందరు? వాళ్ళ పరిస్థితులనూ మనఃస్థితులనూ జాగ్రత్తగా గమనించి, అర్ధం చేసుకుని బాగుచెయ్యవద్దా! ఈ ప్రవర్తనలన్నీ ఒక విధమైన సాంఘిక రోగాలే కావా? వీటిని మన బుద్ధివల్ల చికిత్స చేసుకోలేమా? అందుకే నేను బతకవలసిన అవసరం ఉందంటావుకాదూ? నాలాగే ఆలోచిస్తున్న వ్యక్తులున్నారు. వారికో సంఘం ఉంది. ఒక సిద్దాంతం, ఒక శిక్షణా, ఒక కార్యక్రమం ఉంది. ప్రపంచం అంతటా ఇట్టి సంఘాలుండడమేకాక, నువ్వు కలలు కంటూన్న ఆశయాలను మానవులందరికోసం సాధించడమే దీక్షగాగల మహత్తరదేశం ఒకటున్నది కాబట్టి నాకు నిస్పృహ అనవసరం అంటావు? ఇది నిస్పృహ కాదు నేస్తం! నేను బోధపరచలేను. "మృత్యు ప్రేమ" అని దీనికో ముద్దుపేరు పెట్టనా? ఔను నేను జీవితాన్ని నిరాకరించగలిగినంత గాఢంగా మరణాన్ని ప్రేమిస్తున్నాను. నా నిష్క్రమణ ఒక నిష్ఫలకృత్యం కాదు. అదో కొత్తప్రవేశం మరో కొత్త ప్ర్రారంభం. అదొక సవాలు ఒక సాధనం. ఒక తిరుగుబాటు ఒక దృఢ నిశ్చయం.
    అరే! పన్నెండు కావస్తోంది.
    వీడ్కోలు తీసుకుంటున్నా మళ్ళా వస్తాను నాకు తెలుసును రమణీయమైన ఈ భూలోకానికి నా ఆశీర్వాదం నదులవల్ల, పర్వతాలవల్ల, అరణ్యాలవల్ల, మహానగరాల వల్ల, పల్లెటూళ్ళవల్ల సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ భూలోకం అభ్యున్నతి కాంచునుగాక! ఆనకట్టలతో, వంతెనలతో వేలవేల మైళ్ళ ఇనుప దారులతో, విమానాలతో, శాస్త్రపరిశోధన శాలలతో, టెలిగ్రాఫి, రేడియో శ్రవణాలతో, సినిమా టెలివిజన్ నేత్రాలతో మానవత్వం విజ్రుంభించును గాక లోకమంతా ఏక కుటుంబమై తన విధిని తానే నిర్ణయించుకోగల శక్తిని మానవుడు సాధించునుగాక!
    సరిగ్గా పన్నెండయిం దిప్పుడు.
    
                                    స్వర్గం
    
    కుడిచేతిలో కలం రాస్తూనే ఉంది. ఎడంచేత్తో క్లోరోఫారం సీసా మూత చూస్తూన్నాను. గడియారం రెండు ముళ్ళూ కలుసుకున్నాయి. వీటిని నేను విడిపోనివ్వను. ఈ క్షణాల్ని ఇక్కడే నిలబట్టేస్తాను. ఈ క్షణంకోసం ఆరునెలలనుండి ఆరాటపడుతున్నాను. దీని విచిత్రమైన ప్రవర్తనని అర్ధం చేసుకుందామని ప్రయత్నించాను. శాశ్వతంగా దీన్నిప్పుడు ఆక్రమిస్తాను. ఏంచేస్తున్నాను? క్లోరోఫారం వాసన చూస్తున్నాను. ఇక్కడే వుండికూడా ఎక్కడికో పోతున్నాను. ఇదేమిటి? ఎటు పోతున్నాను? ఒక్కమారే అనేక దిక్కులుగా ప్రయాణం చేస్తున్నానేమిటి? ఈ కొవ్వొత్తి దీపం! ఆకాశమంత అయిపోయి గారడీ శాలువలాగ కప్పేస్తోంది నన్ను. గడియారం కనబడలేదు. మౌనం ప్రవహిస్తోంది. ఇదేం ఇలా కరిగిపోతున్నాను! సరిహద్దులు దాటిపోతున్నాను. ఎన్ని నిచ్చెనలో! అడ్డుగా, నిలువుగా గళ్ళు గళ్ళుగా! పరుగెత్తుతున్న జామెట్రి కలుసుకొంటూన్న సమానాంతర రేఖలు సముద్రాకాశాల సంగీతం జ్ఞాపకాలతో కలిసి స్వప్నాలు చేసే నాట్యం, నిరీశ్వర సాక్షాత్కారం.
    నిరాధారంగా నిరాకారంగా తేలిపోతున్నాను, నిరీశ్వరుడితో నిండిపోతున్నాను. ఈశ్వరుడి ఇంకోవేపుకి పోతున్నాను. పరాజయాలకాల్బలాలతో పరాభవాల నౌకాదళాలతో అనుమానాల విమానాలతో దండయాత్ర సాగిస్తున్నాను. "దేవుడు లేడు" అని నేనన్నప్పుడు నా ఉద్దేశం "దేవుడు ఉన్నాడు" అని ఇది ఎవరి కర్ధం అవుతుంది? నా "ఔను" కి "కా"దని నా ఉంది "కి"లే"దని అర్ధం ఉందనీ, లేదనీ ఉండి లేదనీ లేక ఉందనీ ఎలా నచ్చచెప్పగలను?
    అర్దరాత్రి యిప్పుడు! అయితే ఈ సూర్యుడేమిటి? (కొవ్వొత్తి వెలుగంటారు నాకు తెలుసును.)
    ఇది మరణం అంటారు. కాదంటాను నేను. ఎప్పుడూ నేను పెడసరం గానే వాదిస్తానేం? అందరూ వద్దంటున్న పనులే చేస్తానేం? ఎప్పుడూ ఇంకోవేపు చూస్తానేం? (అప్పటికీ ఇంకోవేపు వున్నది కాబట్టి) అన్నిటికన్నా విశేషం : నిరీశ్వరుడే ప్రత్యక్షమై "నేనున్నాను"
    ఒకచోట గురజాడ ఇలా అన్నాడు.
    "దేవతలతో జోడు కూడితిక్ష్మి
    రక్కసులతో కూడి ఆడితిక్ష్మి
    కొత్త మిస్కుల తెలివి పటిమను
    మంచి చెడ్డల మార్పితిన్!"
    ప్రస్తుతం నేను చేస్తున్న పనికూడా అదే. అంచుల దగ్గిర అంతా యాదృచ్చికమే! అక్కడ పరామాణువుల ప్రవర్తననిగాని, జీవాణువుల స్వభావాన్నిగాని, యిదమిత్దమని నిర్ణయించలేము. ఇదో కఠోరమైన గందరగోళమైన బీజగణిత సమస్య. ధన ఋణ సంజ్ఞలనుబట్టి బ్రాకెట్లను విప్పుకుంటూ వెళ్ళాలి. ఎక్కడ ఒక్క సంజ్ఞ తప్పినా లెక్కంతా తప్పుతుంది.
    -(a-a)+(b-b)-(c-c)+(d-d).....=?
    -(ఔను - కాదు)+(మంచి - చెడు)-(వెలుగు - చీకటి)+(చావు - బతుకు)..... = ?
    ఈ లెక్కని ఎందరు ఎన్నిమార్లు చేస్తే అన్ని జవాబులు వస్తాయి. అందుకే ఎవరి ఆవరణల మధ్య వాళ్ళు ఇమిడిపోతారు. తమకు వెలుపల ఉన్న సంజ్ఞ ఏమిటో కూడా వాళ్ళకి తెలియదు. అన్ని ఆవరణలకీ వెలుపల ఏ సంజ్ఞ ఉందో అసలే తెలియదు. మొత్తం మీద ఈ లెక్కకి
 జవాబు సున్నా అనిగాని, ఒకటి అనిగాని, రెండు అనిగాని నిర్ధారణగా ఎవరూ చెప్పలేరు.
    - (1+1) = - 2
    + (1+1) = + 2, అని లెక్కచేసి, ద్వైతులు రెండంటారు.
    - (1-1) =   0
    + (1-1) =   0 అని లెక్కచేసి, మిధ్యావాదులు సున్నా అంటారు.
                     నే నొక్కన్నే ఏ తర్కానికీ లొంగకుండా, వెలుపలి సంజ్ఞ                       ఏదయినాలక్ష్యపెట్టకుండా.
    1-1    =   1
    1+1    =   1 అని అనడం మానలేదు.
    అంటే దీని అర్ధం; ఔను/కాదు, మంచి/చెడ్డ, వెలుగు/చీకటి, చావు/బ్రతుకు, మనిషి/దేవుడు, అంతా ఒకటే అని. ఇందు మూలంగా శూన్యం మీదనూ, అనేకం మీదను ఏకాంకికిగల ఆధిక్యాన్ని ఉగ్గడిస్తున్నాను. ఈ ఏకం ఎవరో కాదు. మానవుడు అతడే సత్యం అతడే నిత్యం అతడే ఈశ్వరుడు.
    జీవించినా, మరణించినా నేను నేనే కాబట్టి జీవితం సుఖమనీ, మరణం దుఃఖమనీ, జీవితం బానిసతనం. మరణం స్వాతంత్ర్యం అనిగాని వాదించడం మానేస్తున్నాను. పరస్పర ప్రేమవల్ల మానవులంతా సమానులవుతారు. ప్రతిమనిషీ రెండోవాడిలో తన్నూ, దేవున్నీ చూస్తాడు కాబట్టి ప్రపంచంలో వైషమ్యాలకూ, వైక్లబ్యాలకూ తావుండదు.
    ఇదీ నా ఆలోచనల గమ్యస్థానం. భూత, వర్తమాన, భవిష్యత్కాలాలను ఒకే క్షణంగా ముద్దచేసి నేను కల్పించుకున్న నేను నివసిస్తున్న స్వర్గం ఇక్కడ నాకు ఒంటరితనంలేదు. నాతోబాటు ఆమెకూడా అనంతంగా తేలిపోతోంది. ఆమె యెక్కడో, నేనెక్కడో అనుకోవద్దు. నన్ను కలుసుకోవడానికి ఆమె మరణించనక్కరలేదు. ఇద్దరం కలిసే ఇక్కడలో ఇప్పుడులో ఈదుకుపోతున్నాము రెండు స్వప్నాలు రెండు మృత కళేబరాలు రెండు కళేబరాల కార్తిక దీపాలు. (ప్రమిదా, కొవ్వొత్తీ) ఇంకా రెండేమిటి? ఒకే ఒక తనం. ఒకే రెండుతనం లేకపోవడం, ఒకే నిండుతనం.
    ఓహో! సత్యాసత్యాల కవతల సాఫల్యం! నిత్యా నిత్యాలను మించిన సాంగత్యం! మానవ మనశ్శాఖలమీద పుష్పించిన సంగీతం! అనేక స్థలాలలో ఏకకాలమే జీవిస్తున్న అనుభవం! ఏకకాలంలో ఉండడాన్నీ, ఉండకపోవడాన్నీ సాధించే స్వాతంత్ర్యం. ఇది నా కామ్యం! ఇది నా గమ్యం!!!! ఇదీ నా స్వర్గం.
    
                                                                   ---౦౦౦---


Related Novels


China Yaanam

Annapurna Vari Chitralalo Sri Sri Geetalu

Sri Sri Mana Sangeetam

Srisri Kathalu

More