Home » Sree Sree » Srisri Kathalu
ఐశ్వర్యం ఎదుట దారిద్ర్యం
సాయంకాలం వీపుమీద సవారీచేస్తూ వచ్చిన కుంటి బిచ్చ
కుర్రవాడు ఇరుకు సందులో బాడుగకు తీసుకున్న "ఈస్టు
అండ్ వెస్టు ఎగుమతి దిగుమతుల కంపెనీ" గుమ్మం
ముందు నిలబడి "అంబా" అని అరిచాడు.
అమ్మతనానికి చిన్నప్పుడే దూరమై పెంట కుప్పల చాటున
పెరిగిన కుంటికర్ర బిచ్చగడు సూర్యుడి ప్రవేశం మొదలు
చంద్రుడి నిష్క్రమణం దాకా నేల నించి నీటినించి ఆకాశం
ద్వారా వ్యాపారంచేసే భవనం ముందు ఆకలి కణాల
కిరణాల ప్రణాలు కదిపితే కుములుతూ కములుతూ గొంతుకలో సగం ఎత్తి "అంబే" అని అరిచాడు.
వ్యాపార మందిరంలోపల రోజంతా తెగమోగిన టెలిఫోన్లూ, టైపురైటర్లూ మూకీభావం వహించాయి. రోజంతా మనుష్యుల్ని మోసిన కుర్చీలు తీరుబాటుగా తమ అరణ్య ప్ర్రారంభాలని జ్ఞాపకం చేసుకుంటున్నాయి.
కుర్ర బిచ్చ కుంటివాడు మొర్రో అని అరిచిన అరుపు కుర్చీలకి వినబడింది గాని ఇంట్లో ఎవరూ లేరని చెప్పడానికి గొంతుక లేనివా కుర్చీలు అంబా అని అరచిన అబ్బాయి కేకకి ఆ దారినే పోతున్న ఓ గోమాత అతడే తన చేటపెయ్య కాబోలునని అరక్షణం అనుమానించి తెలివైంది కాబట్టి తెలుసుకొని ముభావంగా ముట్టెముడుచుకొని వెళ్ళిపోయింది.
ఇక్కడ బిచ్చం దొరకదని ఎవరు చెబుతారా కుర్రాడికి? లక్షలమీద వ్యాపారం జరిగే ఆ భవనంలో ఇప్పుడు పచ్చి మంచి నీళ్ళు కూడా పుట్టవని టెలిఫోన్లు చెబుతాయా టైపు రైటర్లు చెబుతాయా? గదిలోని క్యాలండరు కాగితాలు గాలికి గలగల కొట్టుకుంటున్నాయే గాని ఈ కాస్త కబురు వాడికెలా అందజెయ్య గలుగుతాయి?
వొచ్చిన పాట కూడా మరచిపోయిన బిచ్చ కుంటి కుర్రవాడి మొగంలో సాయంకాలపు జేగురు రంగు పిచిక గూళ్ళు కడుతోంది. విసుగుతో పోరాడుతూ అణగారి పోతూన్న ఆకల్ని ఎగసన దోసుకుంటూన్న కుర్ర కుంటి బిచ్చగాడి కడుపులోని రంపాలు పుట్టిస్తున్నాయి కళ్ళల్లో భూకంపాలు అసందర్భంగా పుట్టి అనవసరంగా పెరిగి అఘోరిస్తున్న బిచ్చ కుర్రకుంటివాడి పిడచకట్టి పోయిన నాలిక ఓడిపోయిన రాజ్యాల తాలూకు వెలిసిపోయిన పతాకంలాగ వేలాడుతోంది.
అనంతంగా అక్కడే నిలబడిపోతాడా యేమిటా కుర్రాడు? ఈ కథ యెక్కడికీ కదలదా యేమిటి? ఆ కదలని కాళ్ళు నేలలోకి కూరుకుపోయి వేళ్ళుతన్ని కుర్రాడే ఒక మర్రిచెట్టయి పోతాడేమిటి?
చింపిరి జుత్తు బికారిగాడి తలకాయ పెట్టెలోని దరిద్రపు సామాన్లు వర్ణిస్తూ ఎదురుగుండా కంపెనీ భవనంలోని ఖరీదైన వస్తువుల ఐశ్వర్యాన్ని సూచిస్తూ ఎంతసేపైనా ఈ రచనని సాగించవచ్చు. సందులో సహా సౌందర్యాన్ని సంతరిస్తూన్న సంధ్యాకాలపు మాధుర్యాన్ని రకరకాల ఉపమానాలతో ప్రశంసించవచ్చు. అయినా ఈ కథ ఎక్కడ ప్రారంభమయిందో అక్కడే ఉంటుంది.
ఎప్పటికైనా ఆ బిచ్చగాడు కుంటివాడు కుర్రవాడు తల యెత్తి చూసి తలుపుకి వేసిన తాళం కప్ప ఇచ్చే సందేశాన్ని అర్ధం చేసుకోగలిగితే, అయ్యా అని అరిచిన నోరు అయ్యో అని నిరాశ ప్రకటిస్తే ఆ యింటి ముందు నిలబడడంవల్ల లాభంలేదని ఆఖరి కతని కాళ్ళకి బోధపడితే అప్పుడీ కథ అంతమవుతుంది.
---౦౦౦---



