Home » Sree Sree » Srisri Kathalu
ఎక్కడిదా అంధకారం? ఫ్లెమిష్ చిత్రకారుల వర్ణలేపనంలో, బోదిలేర్, రాన్ బో కవుల సంక్షోభ కవిత్వంలో, డీ క్విన్సీ నల్లమందు పొగలలో, డీన్ స్విఫ్ట్ మానవద్వేషంలో, షోహెన్హార్ తత్వజిజ్ఞాసలో, బిథోవెన్ కళ్ళవెనక, డోస్టవ్ స్కీ గ్రంథపుటలలో, ఎడ్గార్ పో ఆత్మలో, దండక, ఆఫ్రికా అరణ్యాలలో, సైబీరియా ఎడారులలో ఉత్తర ధ్రువ రాత్రుల మంచుకప్పిన మైదానాలలో ఎక్కడనుండి వచ్చిన అంధకారం అది?
నా చీకటిలో గిలగిల కొట్టుకుంటూ సూదులవంటి, బాణాలవంటి భావాలతో, తప్తతైల ప్రవాహాల నిరంతర స్నానంలో, పగిలిన అగ్ని పర్వతాల ప్రచండార్భాటంలో ప్రకోపించిన పంచభూతాల నిరంకుశ పరిపాలనలో గగన చుంబకములైన మహా తరంగాలు ఘూర్నిల్లే ప్రళయ సముద్రాలతో నా మెదడంతా అల్లకల్లోల మయ్యేది.
చచ్చిపోతున్న ఓ వ్యక్తీ! చాలించు ఇక నీ సరదారాత! చస్తానని ఎవరిని జడిపిస్తావు? చాలా చూశాం ఇలాంటివి. ఈ కార్యం చేసేవారెవరూ ఇన్ని తర్జన భర్జనలు చెయ్యరు. ఒక్కక్షణంలో ముగించుకుంటారు. నూతిలో వురికీ, సముద్రంలో పడీ, విషంతాగీ, ఉరిపోసుకొనీ, ఎత్తునుండి దుమికీ, ఎలెక్ట్రిక్ షాక్ తో ఎట్ సెట్రా! జాబితాలనవసరం. ఒక లక్ష మార్గాలున్నాయి. ఏదైనా స్వీకరిస్తారు. నీలాగనుకున్నావా?
లేదు చాలా ఆలోచిస్తారు నాలాగే! చాలా వితర్కిస్తారు. నాలాగే నాకు తెలుసును మరణించడం అంటే నిండుప్రాణం హరించి పోవడమంటే మీదమీద లేదు. మరణశిక్ష విధించబడినవాడు కూడా ఇష్టంగా ఉరికొయ్య ఎక్కడు. ఎంతోమంది ఉరి తీయబడేముందు తమ్ము తీసుకువెళ్ళుతూన్న వాళ్ళతో కాట్లాడి, వాళ్ళని రక్కి, కరిచి, విలవిల లాడుతారు. దీర్ఘరోగులు కూడా సులువుగా చచ్చిపోరు సమీపించే మృత్యువును ప్రతి రక్తకణంతోనూ ఎదుర్కొంటారు. వైద్యులు కుదర్చలేక పెదవివిరిచిన అసహ్యమైన జబ్బులు మోసుకుంటూ ఎలాగైనా బతికివుండడం కోరతాడు ప్రాణి. మురికి కాలువలోని కుక్క కుళ్ళి కుళ్ళి చచ్చిపోతుంది. కాని ఎంత తిండిలేకపోయినా, ఎంత వానలో తడిసి ఎంత చలిలో కొంకర వారిపోయినా వెంటనే చచ్చిపోదు. ఎన్నో జననాలనీ, మరణాలనీ నేను దగ్గిర ఉండి చూశాను. చూశావా మరి! నేను చచ్చిపోతున్నానంటే నిరాలోచితంగా పిరికితనంగా పెడసరం చేస్తున్నానని ఎంతమాత్రమూ అనుకోవద్దు. ఒక్కొక్క సంగతే జాగ్రత్తగా తూచి ఒక్కొక్క మార్గమే ఓపికగా అనుసరించి ఈ అమూల్యమైన నిరాశ నందుకున్నాను.
గట్టిగా గాలివేసి కొవ్వొత్తి ఆరిపోయింది. చీకట్లోనే ఆలోచిస్తూ అలా వుండిపోయాను కొంతసేపు. మళ్ళీ దీపం వెలిగించి రాస్తున్నాను. ఇంకా పన్నెండు కాలేదు.
భూమి
అయితే ఏమంటున్నావ్, నేస్తం! నేను చచ్చిపోవడం ఏమీ సమంజసంగా లేదంటావు. నేను సజీవంగా ఉండడం సమాజ క్షేమానికి అవసరం అంటావు. నా బదుకు నాదికాదు అది సంఘంలో ఒక భాగం అదిపోతే సంఘ యంత్రం నడవదు. సమాజంలో నా స్థానాన్ని విసర్జించి పలాయన మవుతున్నానంటావు కదూ? ఉండు. ఉండు ఆ స్థలం నిర్ణయమయిందా? ఆ విలువలు నిర్దేశించబడ్డాయా? నా స్థలాన్ని నేను వెదుక్కుంటూ ఉంటే ఎన్నిరకాల నిరోధాలు ఎదుర్కొంటున్నాయో ఎరుగుదువా? నా చుట్టూ ఎన్ని ముళ్ళకంచెలున్నాయో చూశావా? నన్ను వెలివేసి, సందేహించి, నేనంటే భయపడి. నన్ను అసహ్యించుకుని నన్ను హతమార్చడానికి చూసే ఈ ఇనపపద్దతిమీద నాకేం గౌరవం ఉంటుంది? ఈ కుళ్ళిపోతూన్న సంఘం మర్యాదలను నేననుసరించగలనా? ఈ కపట నాటకంలో నా కిష్టంలేని పాత్ర వహించి ఎలా ఒప్పించగలను?
నేస్తం! నేటి ప్రపంచానికి తెలిసింది ఒక్కటే విలువ ధనం! నా సంగీతాన్నీ, కవిత్వాన్నీ, చిత్రలేఖనాన్నీ ఎవరూ హర్షించరు. డాక్టరునై, వృత్తిలో దిగినప్పుడు కూడా నా యిల్లూ నా వేషమూ నా మోటారుకారూ చూస్తారు కాని డబ్బు తీసుకోకుండా వైద్యం చేస్తానంటే వెర్రివాడికింద కట్టేస్తారు. ఎవరికి వారు, తమ తెలివితేటలనూ, జిత్తులనూ, సామర్ధ్యాలనూ డబ్బుకింద మార్చుకోడానికి ప్రయత్నించడం పరిపాటి. ధనార్జన ప్రధానమై, పరదైవమై, మానవులకు మహదాశయమై పోయింది. ప్రపంచ సమస్య అంటే ఆర్ధిక సమస్య. మనుష్యుల విలువలు కొలవడానికి స్పష్టంగా కనిపించే కొలత ధనం కాక మరేముంది ప్రస్తుత పరిస్థితులలో? ధనంవల్లనే ఆధిక్యం కాబట్టి ధనోపార్జనకే ప్రతివ్యక్తీ పెనుగులాడతాడు. దానం మూల మిదం జగత్. వీడు గుడ్డి గవ్వ చెయ్యడు. మన సామెతలు మన దృక్పథానికి సాక్ష్యం. చెడిపోవడానికీ బాగుపడడానికీ భేదం ధనమే నిర్ణయిస్తుంది. ఏకాగ్రతతో తపస్సుచేసే యోగ్యుల లాగ కొందఱు కుబేరుని వేదికముందు సహస్రనామ జపం చేస్తూనే వుంటారు. వడ్డీలు, లెక్కలు! వడ్డీలకు వడ్డీలు, జీవితమంతా డబ్బు పోగుచేసే యజ్ఞం పెట్టుబడులెందుకు? వాణిజ్యం ఎందుకు? వణిజనీతి అంటారు. పాలలో అట్టే నీళ్ళు చేర్చవద్దు. బియ్యంలో ఎక్కువ రాళ్ళు కలపవద్దు. నేతిలో ఎక్కువ కొవ్వు కలపవద్దు. అసలీ కల్తీ చెయ్యడాలెందుకు? లాభం కోసం వ్యాపారం సాగడానికి, బంగారం కాకి బంగారం, తినే తిండి, కట్టేబట్ట, కట్టడాలూ, కావ్యాలూ, చదువూ, సౌందర్యం అన్నీ అమ్మకానికి సిద్దం అన్నిటికీ "సరసమైన" ధరలు న్యాయమైన వ్యాపారం చెయ్యాలట. ప్రకటనలు! బొమ్మలతో, కరపత్రాలతో, గోడలమీద, విద్యుచ్చక్తితో, విమానాలనుంచి ప్రకటనలు. దేశదేశాలలో ప్రచారం. దేశాలకు దేశాలే బజార్లు వర్తకపు న్యాయం వ్యాపారపు సూత్రాలు. సరుకు నమ్మకం. మా షాపులు చూడండి. ఒక్కమారు చూస్తే మరెక్కడికీ వెళ్ళరు. వేశ్య అలంకరించుకొని ఆహ్వానించినట్లే. ఒకడు చెడితేగాని మరొకడు బాగుపడడట! తక్కువకి కొని ఎక్కువకి అమ్మాలాట! ఒకొక్కప్పుడు బజారు నాది పరీక్షించి సామాన్లను చీకట్లో దాచెయ్యాలట! అన్నిటికీ ఖరీదులు కట్టడం పరిపాటి అయిపోయింది. "ఏమండీ! బీరకాయ లెంతకికొన్నారు!" ..."అబ్బే! దగాపడిపోయారండి" ఒకడు కుళ్ళు వంకాయ లమ్మేస్తాడు. ఒకడు చెత్త పద్యాలమ్మేస్తాడు. వంద రూపాయలకీ దమ్మిడీ లాభం హామీ యిచ్చే వ్యాపారం చూపిస్తే ధనంజయున్నయి పోతానంటా డొకడు. పెట్టుబడిదారీ విధానానికి అంత్యకాలం ఆసన్నమయిందని వీళ్ళెవరూ కనుక్కోలేకుండా ఉన్నారేం? ఇంకా ఆ పాత వ్యవస్థనే పట్టుకుని ఊగులాడుతారేం? ఉత్పత్తి ప్రాథమిక దశలో వున్నప్పుడు వ్యక్తి సామర్ద్యానికి ప్రాముఖ్యం ఉండేది. ఇప్పుడో ఇది జూదంగా మారలేదూ! అంతా లాటరీ! అంతా గారడీ! ఎవడెప్పుడు గెలుస్తాడో తెలియదు. ఎవడెందుకు ఓడిపోతాడో తెలియదు. నేటి వ్యవస్థకొక నీతిలేదు. నియమంలేదు.
అందువల్ల ఈ జూదంలో నేను పాల్గొనలేను. పడిన శ్రమకు రూపాయి అణాపైసలతో లెక్క కడుతున్నప్పుడు పని ఎగగొట్టి ధనం సులువుగా ఆర్జించాలని ఉబలాటం కలుగుతుంది పనిలో శ్రద్దపోతుంది. అడుగు, ఈ ఉద్యోగస్తులందరినీ మీరు చేస్తున్న పనిలో మీకెంత ఆసక్తి ఉందని. "ఏమిటో, ఈ జీతపురాళ్ళకోసం కాకపోతే ఎవడిక్కావాలి వెధవ ఉద్యోగం?' అంటారు.
ఏదో ఒక ఉద్యోగంలో తలదూర్చి, ఏదో ఒక వృత్తిలో బోర్డు కట్టి, అడుగునించి ఆరంభించి అభివృద్ధికోసం పడిగాపులు పడుతూ జీవితాన్ని వెళ్ళబుచ్చడమేనా మానవుని పరమావధి? జీవితాన్ని ప్రచోధానం చేసే ఇతర శక్తులు. జీవితాన్ని ఆనందమయం చేసే ఇతరానుభూతులు మరేవీ లేవా? ఒకరినొకరు ద్వేషిస్తూ, తమ్ముతామే అసహ్యించుకుంటూ ఇంతేనా బతుకంటే! తానే చెయ్యగల పని తన మనస్సంతా పెట్టి చెయ్యడం, చేసినందువల్ల తను ఆనందంపొందడం, దాని ఫలితం అందరినీ అనుభవించనివ్వడం ప్రస్తుత పరిస్థితులలో సాధ్యమవుతుందా? ఇది నాది అనుకోడం, దాహ్న్ని దాచుకోడం, దానికోసం ఈర్ష్యపడడం ఎంత వెర్రి మమకారం? ఉన్నత జీవితంలో ఈ విషాలు లేవు. ఒక కవి గీతాలు రాస్తే ఒక వైజ్ఞానికుడు శాస్త్ర పరిశోధన చేస్తే ఒక కళాకారుడు శిల్పం సృష్టిస్తే, ఆ ఫలం అంత సంఘం అనుభవిస్తుంది. సంఘం అంతా దాన్ని పంచుకుంటుంది. అందుకు అభ్యంతరం ఉండకూడదు. ఉంటె సమాజంలో ఇంకా కుళ్ళు నిలిచి ఉందన్నమాట. అందుకే మన దేశంలో వైజ్ఞానికుల కంటే బిచ్చగాళ్ళే ఎక్కువమంది.
సంఘంలో ఇంకా చాలా కల్మషం నిలిచిఉంది. కాబట్టి సంఘ కార్యాలన్నీ బాధల మధ్యా, కన్నీళ్ల మధ్యా జరుగుతున్నాయి. అయితే ప్రపంచానికి అవసరమైన అల్పకార్యాలన్నీ ఎవరు చేస్తారు? అందరూ అందలం యెక్కితే మోసే వాళ్ళెవరు? సేవ్య సేవక ధర్మం ఇదొక అభ్యంతరమే పూర్వం అందుకే ఆ సామెత ఇప్పుడు మనుష్యుల శ్రమ మానవుని బుద్ధిబలం వల్ల చాలామట్టుకు తగ్గిపోయింది. నేను సుఖంగా వుండడానికి నా నౌఖరును కష్టపెడతాననడానికి వీలులేదు. విద్యుచ్చక్తి నిన్ను సుఖపెడుతుంది. ఆవిరి నిన్ను సుఖపెడుతుంది. విజ్ఞానం నిన్ను సుఖపెడుతుంది నీ సుఖాలను నీ సోదరులందరికీ పంచిపెట్టు. అందులోనే అనల్ప సౌఖ్యం ఉంది.
ఔను ఈ ప్రపంచం మిధ్య అనీ, జీవితం దుఃఖ భూయిష్టమనీ అనేవాళ్ళను నేను లక్ష్యపెట్టను. ఈ విషాదాలన్నిటికీ నీ అజ్ఞానం కారణం. వీటన్నింటినీ తొలగించడానికి వీలుంది. మనుష్యులకు సుఖించడానికి జన్మతః హక్కుంది. ధనికవర్గం ఈ సుఖాన్ని దాచుకుంది. అలా దాచుకోడానికి వీలుగా నేటి పద్దతి సర్వమూ నిర్మించబడింది. ఈ వ్యవస్థను సమర్ధించడానికి కూడా మన పండితులు కొందఱు బయలుదేరుతున్నారు ధనవంతులకే మరింత ధనం! వెనకబడినవాడు వెనకనే దరిద్రుడుగా పుట్టడమే తప్పు అది వాడి కర్మం....అది వాడి పాపం.
ఒక గానసభకాని, ఒక నాటకంగాని జరుగుతూ ఉంటే ఇవతల నేను నిలబడి హాలుమీద రౌడీలు రాళ్ళు విసరడం చూస్తాను. అంతా వాళ్ళని దుండగులని దూషించేవాళ్ళేకాని నేను మాత్రం వాళ్ళ పక్షం వహించి వాళ్ళను అర్ధం చేసుకుంటాను..... ఈ ధనికులంతా లోపల కూర్చుని కళాసామ్రాజ్యం పరిపాలిస్తున్నామనీ, వెలుపలినుంచి జరిగి అల్లరి తమ రసాస్వాదనకు భంగం కలిగిస్తున్నదనీ భావిస్తారు అంతేగాని శిల్పానికి వాయువువలె జలంవలె సార్వజనీనమైన అనుభవయోగ్యత ఉన్నదని అంగీకరించరు. వీళ్ళ పోలీసులు రౌడీలను తరమడానికి సిద్దంగా ఉంటారు. వెలుపలివారి హక్కునే లోపలివాడు అపహరిస్తున్నారని ఎవరు గ్రహించగలరు! తాము అనుభవిస్తూనే ఇతరులను కూడా అనుభవించనియ్యగల విశిష్టత ఉన్నత జీవితానికి లక్షణమని ఎంతమంది అంగీకరించగలరు? ఇందుకా కవులు గ్రంథాలు రాసేది? గాయకులూ గొంతుచించుకునేది? శిల్పులు చిత్రాలు సృష్టించేది? వైజ్ఞానికులు నూతన సత్యాలు కనిపెట్టేది?



