Home » yerramsetti sai » Humourology - 2


    "అంటే మీతో రిహార్సల్స్ ఎకౌంట్సు ఆఫీస్ కాంటీన్ లో అని చెప్పాడా?"

 

    "అవునూ! మీకలా చెప్పలేదా?"

 

    "లేదే-"

 

    అందరం పావుగంట సేపు నిశ్శబ్దంగా నిలబడి ఎవరిళ్ళకు వాళ్ళు చేరుకున్నాం. మర్నాడు అందరం కలసి రాజారామ్ ఇంటికెళ్ళాం!

 

    "ఇవాళ్ళేదో పెద్ద విశేషం ఉన్నట్లుంది అందరూ కలసివచ్చారు!" అన్నాడు రాజారాం నవ్వుతూ!

 

    "నిన్న రిహార్సల్స్ సంగతేమిటి?" అడిగాను చాలా శాంతంగా.

 

    "రిహార్సల్సా? ఏ రిహార్సలు?" తనూ అంతకంటే శాంతంగా అడిగాడు.

 

    "నిన్న మా ఇద్దరినీ ఇన్ స్టిట్యూట్ కీ, వాళ్ళిద్దరినీ ఎకౌంట్స్ ఆఫీస్ క్యాంటీన్ కీ రమ్మన్నావ్ కదా- ఆ రిహార్సలు..."

 

    "అడెడెడెడెడె...." అంటూ నాలిక్కరుచుకున్నాడతను.

 

    "ఆ ఎక్స్ ప్రెషన్ కి అర్థం ఏమిటి?"

 

    "ఆ సంగతే మర్చిపోయాను- అయామ్ సారీ!"

 

    "మరి నిన్న సాయంత్రం ఎక్కడికెళ్ళావ్?"

 

    "వేరే అసోసియేషన్ వాళ్ళు ఓ నాటకంలో చిన్న కారెక్టర్ వేయమని బ్రతిమాలి తీసుకెళ్ళారు."

 

    "మరి మన రేడియో నాటిక సంగతేమిటి?"

 

    "దాన్దేముంది? అందరం ఇప్పుడే రేడియో స్టేషన్ కెళ్ళి రిక్వెస్ట్ చేస్తే రికార్డింగ్ జరిగిపోతుంది. అంతగా కావాలంటే అక్కడే ఓ రిహార్సల్ వేసుకోవచ్చు."

 

    అందరం రేడియో స్టేషన్ కి చేరుకున్నాం.

 

    ప్రోగ్రాం ఎగ్జిక్యూటివ్ దగ్గరకెళ్ళి సారీ చెప్పి జరిగిందంతా వివరించాడు రాజారాం.

 

    అంతా విని ఆయన "కాంట్రాక్ట్ ఏది చూపించండి!" అన్నాడు.

 

    కాంట్రాక్ట్ తీసి చూపించాడు శాయిరామ్.

 

    "ఇది కిందటి నెల తాలూకూ కాంట్రాక్ట్ నాయనా! మీరు అంతులేక పోవడం వల్ల ఇంకెవరిదో ప్రోగ్రాం చేసేశాం."


    
    రాజారాం ఆత్రుతగా కాంట్రాక్ట్ లాక్కుని చూశాడు. నిజమే! రికార్డింగ్, బ్రాడ్ కాస్టింగ్ రెండు తారీఖులూ క్రిందటి నెలవే!

 

    అందరం మరోసారి సారీ చెప్పి ఇంటికి తిరిగి వచ్చాం.

 

    ఇంటిదగ్గర రాజారాం వాళ్ళ తమ్ముడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.

 

    "అదేంటన్నయ్యా- ఇంతలేటుగా వచ్చావ్, మద్రాస్ ఎక్స్ ప్రెస్ డ్యూటీకదా నీది-"

 

    రాజారాం అదిరిపడి టైమ్ చూసుకున్నాడు.

 

    "కొంప మునిగింది. ఆ సంగతే మర్చిపోయాను. బండి ఎప్పుడో వెళ్ళిపో యుంటుంది. ఇప్పుడెలా?" అంటూ కుర్చీలో కూలబడ్డాడు.

 

    "ఇంకేముంది. త్వరగా రైల్వే హాస్పిటల్ కు వెళ్ళి శిక్ చేసేయ్?" సలహా ఇచ్చాడు సుబ్బారెడ్డి. అప్పటికప్పుడు హాస్పిటల్ కు బయల్దేరి వెళ్ళాడు రాజారాం. మరో రెండు రోజుల తర్వాత కనిపించినప్పుడు ఎవరితోనో మళ్ళీ ఏదో నాటిక గురించి మాట్లాడుతున్నాడు. "లేదన్నా! నన్ను నువ్వు రిహార్సల్ కి ఎనిమిదింటికే రమ్మన్నావ్! లేకపోతే ఎనిమిదింటి కెందుకొస్తాను?"

 

    "కాదయ్యా బాబూ! నేను ఆరింటికే రమ్మన్నాను- నీ మూలాన రిహార్సల్ కాన్సలయిపోయింది..." అంటున్నాడు రాజారామ్.

 

    ఆ తరువాత నేను స్టడీ చేసిన కేసు ఓ రచయిత ఫ్రెండ్ ది. ఆయనకు సర్వస్వం తారీఖులతో సహా గుర్తుంటాయి గాని, కథా రచయితగా అభిమానులు, నాటక రచయితగా సమాజాల సభ్యులు, ఎక్కువ సంఖ్యలో ఉండటం మూలాన తక్కువ పరిచయం ఉన్న వాళ్ళను ఇట్టే మరిచిపోతుంటాడు.

 

    ఓ సారి నేనూ ఆ రచయితా వెళ్తొంటే ఓ పెద్దమనిషి స్కూటర్ మీద ఎదురయి 'హలో' అంటూ పలకరించి స్కూటర్ ఆపాడు.

 

    "హలో హలో" అన్నాడు రచయిత.

 

    అతను స్కూటర్ రోడ్డు పక్కకు లాగి స్టాండ్ వేస్తూ "ఇతనెవరో ఎంత తన్నుకున్నా గుర్తుకురావటం లేదే!" అన్నాడు నాతో నెమ్మదిగా.

 

    "దాన్దేముంది? అతనినే అడిగేస్తే సరి-"

 

    "అబ్బే, హర్టయిపోతాడు. అలా బాగుండదు."

 

    "మరేం చేస్తావ్?"

 

    "మాటల్లో పెట్టేసి వివరాలు లాగేస్తే దొరికిపోతాడ్లే-" అన్నాడు ధైర్యంగా.

 

    "బాగున్నారా?" అన్నాడతను దగ్గరకొచ్చి.

 

    "ఓ! ఆల్ ఓకే!" అన్నాడు మావాడు.

 

    "ఇంకా అదే ఆఫీస్ లో ఉన్నారా?" అడిగాడతను.

 

    "అవునండీ! అక్కడే! అక్కడే!- ఇంకెక్కడికి పోతాం?"

 

    "మనం కలిసి చాలాకాలం అయిపోయింది" నవ్వుతూ అన్నాడతను.

 

    "అవును! చాలా రోజులయింది! నిజమె౧ మీరు అదే ఆఫీసా, లేక మరెక్కడికయినా మారారా?" అడిగాడు ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ.

 

    "మా ఆఫీసు ఒక్కటే కదండీ సిటీలో - ఇంకెక్కడికి మార్తాము?"

 

    "హ్హ హ్హ హ్హ! అవునవును! నిజమేననుకోండి- ఒకోసారి ప్రమోషను అవీ రావచ్చు కదా."

 

    "మీకా భయమేమీ అఖ్ఖర్లేదు. నేనీపోస్టులోనే రిటైరయిపోతాను! మీ కథలు పత్రికల్లో కనిపించినప్పుడల్లా - నేనూ మా మిసెస్- మిమ్మల్ని గుర్తుచేసుకుంటూంటాం!" అన్నాడతను.

 

    "ఓ అలాగా - అహహ-"

 

    "ఒకసారి మా ఇంటికి డిన్నర్ కి తీసుకురమ్మని మా తమ్ముడు కూడా గొడవ చేస్తున్నాడు."

 

    "ఓ- తప్పకుండా వస్తాను- తప్పకుండా వద్దాం."

 

    "మా ఇల్లు మీకు గుర్తుండే ఉంటుంది. రెండుమూడు సార్లు వచ్చారు కదా!"

 

    "ఆ ఆ! బాగా గుర్తుంది-" అప్పటికే మావాడి మాటలు తడబడుతున్నాయి- ఇల్లయితే ఈ మధ్యలో మారలేదు కదా?"

 

    "లేదు-"

 

    "అదీ గాకుండా ఇంటిముందు మీ నేమ్ ప్లేట్ ఎలాగూ వుంటుంది కదా? అన్నట్లు ఫుల్ నేమ్ రాసి ఉంటుందా?" ఆఖరుసారి అతనిపేరు తెలుసుకోవడం కోసం ఓ ప్రశ్న వదిలాడు.

 

    "భలేవారే! కొట్టిచ్చినట్టు కనబడుతూంటుంది-"

 

    "మీ అసలుపేరు- అంటే పూర్తి ఇంటిపేరుతో వుంటుందా? లేక షార్ట్ ఫారమ్ వుంటుందా?"

 

    "పూర్తి పేరే వుంటుందిలెండి! ఒక్క నిమిషం!" అంటూ పక్కనే వున్న దుకాణంలో అగ్గిపెట్టి కొని సిగరెట్ వెలిగించుకోసాగాడు.

 

    "ఇతనెవరో ఎంత ప్రయత్నించినా తెలియటం లేదే!" అన్నాడు మావాడు.

 

    "ఇంక అడిగెయ్యటమే మంచిది-" సలహా ఇచ్చాన్నేను.

 

    "ఇంతసేపు మాట్లాడాక ఇప్పుడా అడగడం? ఇంకేమయినా వుందా!" కోప్పడ్డాడు వాడు. అతను మళ్ళీ దగ్గరకొచ్చాడు.

 

    "అయితే ఓ పని చేయండి గురూజీ. ఎల్లుండి ఆదివారం మా ఇంటికి భోజనానికి వచ్చేయండి."

 

    "ఆ! ఎల్లుండా?" గతుక్కుమన్నాడు మావాడు.

 

    "అవును-ఏం?

 

    "ఆ! మరేంలేదు. కానీ ఎల్లుండి కొంచెం పనుంది."

 

    "అలాగా! అయితే సరే మీ ఇష్టం! మీకెప్పుడు వీలుంటే అప్పుడు."


    
    "ఓ యస్! నేనే మీకు ఫోన్ చేసి చేపుతాన్లెండి- మీ ఫోన్ నెంబరేమిటి?"

 

    అతను ఫోన్ నంబర్ ఓ కాగితం మీద రాసి ఇచ్చాడు.

 

    "ఈ నెంబర్ కి ఫోన్ చేసి నా పేరు చెపితే పిలుస్తారు! నో ప్రాబ్లమ్ మరి నేను వెళ్ళిరానా."


Related Novels


Cine Bethalam

Kanthi Kiranalu

Nirbhay Nagar Colony

Rambharosa Apartments

More