Home » yerramsetti sai » Humourology - 2


    "ఆ! అలాగే! థాంక్యూ!"

 

    అతను వెళ్ళిపోయాక మా రచయిత వెధవనవ్వు నవ్వాడు.

 

    "దెబ్బ తినేశాను గురూ! ఫోన్ నంబర్ అడిగినప్పుడయినా పేరు కూడా రాస్తాడనుకున్నాను."

 

    ఇలానటి సంఘటనలు మా రచయితతో పాటు చాలా అనుభవంలో కొచ్చాయి నాకు. ఇక మిగిలింది రెడ్డి.

 

    రెడ్డి ఫార్మాసిస్ట్, డిస్పెన్సరీలో మందులూ వగైరా ఖచ్చితంగా గుర్తు పెట్టుకునే ఇస్తాడు అందరికీ. అందులో ఏ ఢోకా లేదు. అక్కడే మతిమరుపూ లేదు. ఎటొచ్చీ ఆయన మతిమరుపేంటంటే ఎవరి దగ్గరయినా తీసుకున్న వస్తువు గురించి మర్చిపోవడం.

 

    ఓ పేషెంట్ దగ్గర తీసుకున్న బాల పెన్ మరో పేషెంట్ కి బలవంతంగా ఇచ్చి పంపించేసిన సంఘటనలు కోకొల్లలు. తనెప్పుడయినా పెన్ గానీ, బాల పెన్ గానీ కొంటే కేవలం కొద్దిగంటలు మాత్రమే అతని దగ్గరుంటాయ్! ఆ తరువాత ఇక వెతకడమే పని! ఒక్కోసారి అతని దగ్గర పది పదిహేను బాల్ పెన్ ళు చేరిపోతాయ్. ఏది ఎవరి దగ్గర తీసుకున్నాడో గుర్తుండదు. ఏది ఎవరికి రిటర్న్ చేయాలో తెలీదు.

 

    ఓ సారి నాకో ఖరీదయిన బాల పెన్ తెచ్చిచ్చాడు.

 

    "చాలా బాగుంది." అన్నాను నేను-నాకు చూపించడానికి తెచ్చాడనుకొని.

 

    "అవును. ఎక్కడ కొన్నావ్?" అడిగాడు.

 

    "నేను కొనడమేమిటి?" అన్నాను ఆశ్చర్యంగా.

 

    "నువ్వు కొనలేదా ఇది?" ఇంకా ఆశ్చర్యంగా అడిగాడు.

 

    "అబ్బే ఇదసలు నాదికాదు-"

 

    "నీది కాదా?"

 

    "నేను నీకెప్పుడూ బాల్ పెన్ ఇవ్వలేదు."

 

    "అదేమిటి నిన్న ఉదయం మీ ఇంటికొచ్చినప్పుడు రాసుకోడానికి ఇచ్చావ్ కదా?" అడిగాడు అయోమయంగా.

 

    "నేనివ్వలేదు. నేను కొత్తగా రికార్డ్ చేసిన పాటల కేసెట్ అడిగి తీసుకెళ్ళావ్. అంతే! ఇంకేం తీసుకోలేదు-"

 

    "ఏమిటి? పాటల కేసెట్ మీది తీసుకెళ్ళానా?" ఇంకా ఆశ్చర్యపోతూ అడిగాడతను.

 

    "నిన్నే కదా తీసుకెళ్ళావ్ అప్పుడే మర్చిపోయావా?"

 

    "కాసెట్ నేను యోగిబాబు నడిగి తీసుకెళ్ళాను కదా!"

 

    "కాదు గురూ! నా దగ్గరే తీసుకెళ్ళావ్!"

 

    "మరి నేనివాళ పొద్దున్న అది యోగిబాబుకిస్తే అబ్బ ఎన్నాళ్ళకు తిరిగి ఇచ్చావురా అని తీసుకున్నాడే?"

 

    "అయ్యో కొంపముంచావ్ గురూ! అది నాది! పద- వెళ్ళి యోగిబాబుని కనుక్కుందాం! లేకపోతే గోవిందా అయిపోతుంది."

 

    ఇద్దరం యోగిబాబు ఇంటికెళ్ళాం.

 

    "ఒరేయ్- ఇవాళ నీకిచ్చిన కాసెట్ ఇతనిదంట్రా! నీదికాదు" అన్నాడు రెడ్డి.

 

    "నాకు కాసెట్ ఇచ్చావా?" ఆశ్చర్యంగా అడిగాడు యోగిబాబు.

 

    "అదేమిట్రా! ప్రొద్దున్న వచ్చినప్పుడు నీకు కాసెట్ ఇవ్వలేదూ? అబ్బ ఎన్ని రోజులకు తిరిగిచ్చావురా అని తీసుకున్నావ్!" రెట్టిస్తూ అడిగాడు రెడ్డి.

 

    "నీ తలకాయ్!"

 

    "అంటే?"

 

    "పొద్దున్న ఇక్కడికొచ్చినప్పుడు నువ్వు నాకిచ్చింది గొడుగు."

 

    "గొడుగేమిటి?"

 

    అదే నాకూ అర్థం కాలేదు. ఒకవేళ నా గొడుగు ఎప్పుడయినా పట్టుకెళ్ళి ఇన్ని రోజులకు తెచ్చి ఇచ్చావేమోనని తీసుకున్నాను. తీరా నువ్వు వెళ్ళాక చూస్తే మా గొడుగు మా ఇంట్లోనే ఉంది. దీనిమీద ఇంకెవరివో ఇనీషియల్స్ ఉన్నాయి చూడు" అంటూ గొడుగు తెచ్చి రెడ్డికిచ్చాడతను. అందరం కలసి ఆ అక్షరాలు చదివాం.

 

    పి.యన్.ఎల్. అనే అక్షరాలున్నాయ్.

 

    "అంటే ఎవరయి ఉంటారు?" అన్నాడు రెడ్డి ఆలోచనలలో పడుతూ.

 

    "ఇంతకూ నా కాసెట్ ఏమయినట్లు?" అన్నాన్నేను భయంగా.

 

    "అదిసరే! క్రికెట్ స్కోర్ విని ఇస్తానన్నావ్ కదా, నా ట్రాన్సిస్టరేమయింది?" అనడిగాడు యోగిబాబు. రంగారెడ్డి షాకయ్యాడు.

 

    "నీ దగ్గర ట్రాన్సిష్టర్ తీసుకున్నానా?" ఆశ్చర్యంగా అడిగాడు.

 

    "నిన్న మధ్యాహ్నం తీసుకున్నావు కదరా?"

 

    "అవును! మళ్ళీ సాయంత్రం ఇచ్చేశాగా?"

 

    "నా కెక్కడిచ్చావురా?" అదిరిపడుతూ అన్నాడు యోగిబాబు.

 

    రెడ్డి కాసేపు ఆలోచించి "ఇదిలా తేలదు గానీ పదండి హాస్పిటల్ కెళ్దాం" అన్నాడు. అందరం కలిసి డిస్పెన్సరీ కెళ్ళాం.

 

    అప్పటికే ఇద్దరు నర్సులు రెడ్డి కోసం ఎదురుచూస్తున్నారక్కడ.

 

    "నా గొడుగు కోసం వచ్చాను" అంది ఒకామె.

 

    "చంపావ్ తల్లీ! ఈ గొడుగు నీదా- ఇదిగో తీసుకో" అంటూ తన చేతిలోని గొడుగు ఆమె కిచ్చాడతను.

 

    ఆమె కెవ్వున అరచింది.

 

    "ఈ గొడుగు నాదికాదు"

 

    అందరం మలేలే ఆశ్చర్యపోయాం.

 

    "మీది కాదా?"

 

    "కాదండీ! నా ఇనీషయల్స్ ఎమ్.ఎన్.డి. అని వుండాలి."

 

    "మరి పి.యాన్.ఎల్. అంటే ఎవరు?" అడిగాడు రెడ్డి అయోమయంగా.

 

    "ఏమో! నాకు తెలీదు."

 

    "చూడమ్మా! ఓ సహాయం చేస్తావా!" నర్స్ నడిగాడు రెడ్డి ప్రాధేయపడుతూ.

 

    "ఏం చేయమంటారు?"

 

    "ప్రస్తుతానికి ఈ గొడుగు తీసుకెళ్ళిపోండి. ఎప్పటికయినా మీ గొడుగు అడ్రస్ దొరికితే మీకు అప్పజెప్తాను."

 

    "సరే-" అయిష్టంగా తీసుకుని వెళ్ళిపోయిందామె.

 

    "మరి నా పెన్ సంగతేమిటి?" అంది రెండో నర్స్.

 

    "మీ పెన్నేమిటి?" మళ్ళీ ఆశ్చర్యంగా అడిగాడు రెడ్డి.

 

    "అదేనండి! నాది నూట అరవై రూపాయల పెన్ను! ఇప్పుడే రాసిస్తానని నిన్న తీసుకుని సాయంత్రం ఈ డొక్కు పెన్ పంపించారు"

 

    "ఆ! ఇది మీది కాదా?"

 

    "కాదు-"

 

    ఈ పరిస్థితిలో మా మధ్యలో ఓ లావుపాటాయన వచ్చి రెడ్డిగారికి ఓ కాసెట్ ఇచ్చాడు.

 

    "ఇది నాది కాదండీ గురూజీ! ఇంకెవరిదో."

 

    నేను ఆత్రుతగా ఆ కాసెట్ తీసుకుని చూశాను.

 

    "అది నీదే గురూ! సందేహం అక్కర్లేదు. తీసుకెళ్ళు" అన్నాడు రెడ్డి నాతో.

 

    "కంపెనీ పేరు కరెక్టే గాని ఇంత మాసిపోయినట్లుందేమిటి?" అడిగాను అనుమానంగా.    

 

    "ఆ- మరేం లేదు. ఇక్కడ డస్ట్ అదీ పడి అలా అయిందిలే!"

 

    ఎందుకయినా మంచిదని ఇంటికెళ్ళగానే కాసెట్ టేప్ రికార్డర్ లో వుంచి ప్లే చేశాను.

 

    అంతకుముందెప్పుడూ వినని శబ్దాలు వినిపించడం ప్రారంభించేసరికి మతి పోయింది.

 

    కనుక ఈ స్టడీ వల్ల నేను తేల్చుకున్నదేంటంటే మనిషికొకే ఒక్క విషయంలో మతిమరుపుండు మహిలో సుమతి అన్న నగ్నసత్యం.


                                *  *  *  *  *


Related Novels


Cine Bethalam

Kanthi Kiranalu

Nirbhay Nagar Colony

Rambharosa Apartments

More