Home » yerramsetti sai » Humourology - 2


    "ఒకవేళ ఇప్పటికే జీతాలు చాలా ఎక్కువగా వున్నాయని మీ యూనియన్లు అలా చేశాయేమో?"

 

    వాడు పగలబడి నవ్వాడు.

 

    "జీతాలు ఎక్కువా? నీకు తెలీదేమో. మా గుమాస్తా బేసిక్ ఎంతో తెలుసా? రెండువందల అరవై- మరి స్టేట్ గవర్నమెంట్ లో ప్యూన్ బేసిక్ రెండువందల తొంభై-"

 

    ఇద్దరం చాలా రోజుల తరువాత మనసారా నవ్వుకున్నాం.

 

    "అది సరేగాని మొన్న భలే ఫార్స్ జరిగింది తెలుసా?" అనడిగాడు వాడు. నాకు భయం ముంచుకొచ్చింది.

 

    "ఏమిటిది?" రిస్క్ తీసుకునే అడిగాను. ఎందుకంటే ఆ పాత కథ నాకు అంతకుముందే చెప్పబోవటం- నేను తెలుసునని వారించటం వాడప్పుడే ఎలా మర్చిపోతాడా అని ఓమూల మిణుకుమిణుకు మనే ఆశ!

 

    "ఓ రోజు నేను నైట్ డ్యూటిలో వుండగా ఏమయిందంటే- బయట ఉన్న సిమెంట్ బెంచీమీద..."

 

    "ఇది చెప్పావ్ కదురా!" అన్నాను హడావుడిగా అడ్డుపడి.

 

    "చెప్పానా!" ఆశ్చర్యంగా అడిగాడు.

 

    "అవున్రా!"

 

    "ఎప్పుడు?"

 

    "క్రిందటివారం నువ్ రెస్ట్ లోవచ్చినప్పుడు"

 

    "ఏదీ- మా డి.యస్.ఓ. నైట్ ఇన్ స్పెక్షన్ కి రావడం- నేను పాసింజర్ లాగా నటించడం.

 

    "అవున్రా- ఇదే చెప్పావ్! మీ డి.యన్.వో. నీ మాటలు నమ్మి వెళ్ళిపోవడం - అంతా చెప్పావ్."

 

    అప్పటికి గానీ వాడికి సంతృప్తి కలుగలేదు.

 

    వాడు వెళ్ళిపోయాక గానీ నాకు గుర్తు రాలేదు. అది వాడి తాలూకూ మతిమరుపు సబ్జెక్టు అన్నమాట- మిగతా విషయాలేమీ మర్చిపోవడంలేదు వాడు. మిగతా విషయాలేమీ చెప్పినవే చెప్పడం జరగటం లేదు. కేవలం వాడి డ్యూటీలకు సంబంధించిన సంఘటనలే- చెప్పిందే చెప్పడం జరుగుతోంది.

 

    తరువాత చాలాసార్లు కనిపించాడు అప్పలాచారి. కనిపించినప్పుడల్లా ఆ సంఘటనే చెప్పడాన్కి ప్రయత్నించడం - నేను కెవ్వున కేకవేసి వాడికి అడ్డుపడడం జరగుతూనే వుంది. ఆ తరువాత నేను స్టడీ చేసిన మరో కేస్ మా రాజారామ్.

 

    అతనికి లక్ష వ్యవహారాలు. రైల్వేలో టీటీఇ ఉద్యోగం అవడం చేత రిజర్వేషన్ ల కోసం అనుక్షణం ఇంటిచుట్టూ తిరిగే బంధుమిత్రులూ- అతను స్టేజీ ఆర్టిస్ట్ అవడం చేత తరచుగా కలుసుకోడానికొచ్చే నటీనటులు, డైరెక్టర్లు, సమాజాలు, డ్రామాల రిహార్సల్స్, రేడియో ప్రోగ్రాములు, ఇన్ని వ్యవహారాల్లో ఇరుక్కోవడం చేత, ఓ కొత్తరకం మతిమరపు వచ్చేసింది. ఓరోజు ఏదో పనిమీద అతనింటికి వెళ్ళాను.

 

    "అబ్బబ్బబ్బ! నీ కోసం వారం రోజుల్నుంచి ట్రై చేస్తున్నాను" అన్నాడతను.

 

    "ఏమిటి సంగతి?"

 

    "రేడియోలో మా కల్చరల్ అసోసియేషన్ నాటకం రికార్డింగ్ ఉందివాళ! దాని కోసం అర్జంటుగా పావుగంట స్క్రిప్ట్ కావాలి. మీ కాలనీ రైటర్ తో రాయించి ఇవ్వకూడదూ?"

 

    "రికార్డింగ్ ఇవాళా?" ఆశ్చర్యంగా అడిగాను.

 

    "అవును!"

 

    "ఇవాళెలా కుదుర్తుంది? స్క్రిప్టు ఎప్పుడు రాస్తాడు? ప్రాక్టీస్ ఎప్పుడు చేస్తారు?"

 

    "ఏదోకటి- ఎలాగోలా లాగించెయ్. బాబ్బాబు!"

 

    "మరి నేను నాలుగురోజుల క్రితం కనిపించినప్పుడైనా చెప్పలేదే ఈ విషయం?

 

    "నాలుగు రోజుల క్రితం కనిపించావా నువ్వు?" ఆశ్చర్యంగా అడిగాడు.

 

    "అవును. సంగీత్ థియేటర్ దగ్గర కనిపించలేదూ?"

 

    "సంగీత థియేటర్ దగ్గరా! నేనక్కడికెళ్ళిన గుర్తులేదే?" గుర్తు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తూ అన్నాడు.

 

    పావుగంట టైమ్ గడిచిపోయింది గానీ గుర్తుకురాలేదు.

 

    "సరే, ఆ సంగతి వదిలేయ్. ఇప్పుడేం చేయమంటావ్?"

 

    "రేప్పొద్దున్నకల్లా స్క్రిప్టు రాయించు! చాలు. నేను రేడియో స్టేషన్ కి ఫోన్ చేసి మన ప్రోగ్రామ్ రికార్డింగ్ ఎల్లుండి పెట్టమని రిక్వెస్ట్ చేస్తాను."

 

    "సరే" వప్పుకున్నాను.

 

    ఆ రాత్రి చాలాసేపు తంటాలు పడి స్క్రిప్ట్ రాయించి మర్నాడు ఉదయం తీసుకెళ్లి రాజారామ్ కిచ్చాను.

 

    "ఏమిటిది?" అడిగాడు స్క్రిప్టు తీసుకుని.

 

    "నాటిక."

 

    "నాటికా-"

 

    "అవును,"

 

    "ఎందుకిది!"

 

    నాకు అర్ధమయిపోయింది- ముందురోజు చెప్పినదంతా మర్చిపోయాడని.

 

    "అదేనయ్యా! రేడియో రికార్డింగ్ కి కావాలన్నావ్ కదా?"

 

    "మై గాడ్!" అంటూ అదిరిపడి లేచి నుంచున్నాడు.

 

    "ఏమయింది?" ఆశ్చర్యంగా అడిగాను.

 

    "రికార్డింగ్ రేపటికి పోస్టుపోన్ చేయమని రేడియో స్టేషన్ కి ఫోన్ చేయడం మర్చిపోయాను నిన్న."

 

    నేను అదిరిపడ్డాను.

 

    "అయితే నిన్న వాళ్ళు ఎదుర్చూసి ఉంటారు పాపం."

 

    "అవును ఓ పని చేద్దాం! సాయంత్రం నాలుగుసార్లు రిహార్సల్స్ వేసుకుని రేపు ఉదయం రేడియో స్టేషన్ కి డైరెక్ట్ గా వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే రికార్డ్ చేసేస్తారు" అన్నాడు.

 

    "ఐడియా బాగానే ఉంది" అన్నాను.

 

    "బాబ్బాబు- ఏమీ అనుకోకుండా సాయంత్రం బోయిగూడా ఇన్ స్టిట్యూట్ కొచ్చేయ్. నువ్వూ ఓ కారెక్టర్ వేద్దుగానీ- ఇప్పటికిప్పుడు ఆరుగురు ఆర్టిస్టులను వెతికి పట్టుకోవాలంటే కష్టం! మిగతా వాళ్ళను ఎలాగోలా ఆటోలో తిరిగి లాక్కొస్తాను" అన్నాడు.

 

    "సరేనని నేను సాయంత్రం అయిదింటికల్లా బోయిగూడా ఇన్ స్టిట్యూట్ దగ్గరకు చేరుకున్నాను.

 

    అక్కడ రెడ్డి దిగాలుగా కూర్చుని కనిపించాడు.

 

    "ఏంటి అప్పుడే వచ్చేశావ్?" అడిగా తనని.

 

    "రెండింటికి రిహార్సల్ అన్నాడు కదా రాజారాం"

 

    "రెండింటికా?"

 

    "అవును గురూ! మధ్యాహ్నం రెండింటికి రిహార్సల్స్ అని చెప్పాడు- అప్పటినుంచీ కూర్చున్నాను."

 

    "నాకు అయిదింటికని చెప్పాడే?" అన్నాన్నేను.

 

    ఇద్దరం కలిసి ఆరున్నరవరకూ చూసి నడుచుకుంటూ రాజారామ్ ఇంటికి చేరుకున్నాం. ఇంట్లోలేడతను. ఎక్కడికో పొద్దున్ననగా వెళ్ళాడట! ఆ తరువాత ఎవరికీ కనిపించలేదు. మేము చాలాసేపు అక్కడే తచ్చట్లాడి ఎనిమిది గంటలకు ఇళ్లకు బయలుదేరాం!

 

    దారిలో స్వామి, కుమార్ ఎదురయ్యారు - "రిహార్సల్ కి రాలేదేమిటి?" అడిగారు వాళ్ళు.

 

    "రిహార్సల్స్ కు రాకపోవడమా?" ఆశ్చర్యంగా అడిగాడు రెడ్డి.

 

    "అవును మీరూ లేరు- రాజారామ్ లేడు."

 

    "అదేమిటి? మేమిప్పటివరకూ ఇన్ స్టిట్యూట్ లోనే ఎదుర్చూసి ఇంతకుముందే తిరిగివచ్చాం" అన్నాను.

 

    "ఇన్ స్టిట్యూట కెందుకెళ్ళారు? రిహార్సల్స్ ఎకౌంట్స్ ఆఫీస్ కాంటీన్ లో గదా?" అడిగారు వాళ్ళు.


Related Novels


Cine Bethalam

Kanthi Kiranalu

Nirbhay Nagar Colony

Rambharosa Apartments

More