Home » yerramsetti sai » Humourology - 2
మనిషికో మతిమరుపు మహిలో సుమతీ!
.... అని అన్నారెవరో! ఎవరా అని చాలాసేపు ఆలోచించాను గానీ ఎంత ఆలోచించినా గుర్తురాలేదు, మర్చిపోయాను.
ఇంతకూ అసలీటాపిక్ ఎందుకొచ్చిందంటే నాకీ మధ్య మతిమరపు ఎక్కువయిపోతోందని మా భవానీశంకరం వార్నింగిచ్చాడు...
ఏ విషయంలో వాడికా అభిప్రాయం ఏర్పడిందో గాని మొత్తానికి వాడు నా మతిమరుపుకి విక్టిమ్ అయి ఉంటాడని మాత్రం ఊహించాను. ఆ రోజు నుంచి ప్రతి విషయం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయడం ప్రారంభించాను. ఈ అబ్జర్వేషన్ లోనే మతిమరుపనేది ఒక్కోమనిషికి ఒక్కో సబ్జెక్ట్ లోనే ఏర్పడుతుందని అనుమానం కలిగింది. అంటే ఫలానా మనిషి ఫలానా విషయంలో మహా మతిమరుపుగా ఉంటాడు సుమా అనే కామెంట్ చేయాలిగానీ, "ఫలానావాడు వట్టి మతిమరుపు వెధవాయ్" అని ఎప్పుడూ జనరల్ స్టేట్ మెంటియ్యగూడదు.
నేనిలాంటి నిర్ధారణకు రావడానికి పరిశోధించిన మా ఫ్రెండ్స్ లో మొదటివాడు అప్పలాచారి.
పరిశోధన టేకప్ చేశాక ఆ మర్నాడే సికింద్రాబాద్ రైల్వేస్టేషనులో అప్పలాచారి కనిపించాడు. వాడు జనగామలో అసిస్టెంట్ స్టేషన్ మాస్టరుగా చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత కలుసుకోవడం చేత ఇద్దరం హస్కాలజీలో మునిగిపోయాం.
"ఉద్యోగం ఎలా వుంది" అడిగాను మధ్యలో.
"మొన్న భలే తమాషా జరిగిందిలే" అన్నాడు వాడు ఉత్సాహంగా.
"ఏమిటది?"
"నేను మామూలుగా నైట్ స్యూటీలో మా స్టేషన్ బయట ప్లాట్ ఫారం మీదున్న సిమెంట్ బెంచీ మీద దుప్పటి ముసుగుపెట్టి నిద్రపోతున్నాను. రాత్రి రెండింటికి సేఫ్టీ ఆఫీసర్ జీప్ లో ఇన్ స్పెక్షన్ కొచ్చి- స్టేషన్ అంతా వెతికి - చివరకు నన్ను నిద్రలేపాడు. ఆయనను చూడగానే నాకు పరిస్థితి అర్ధమయిపోయింది. వెంటనే ఓ ఉపాయం ఆలోచించాను.
"డ్యూటీ స్టేషన్ మాస్టర్ నువ్వేనా?" అనడిగాడు కోపంగా.
"స్టేషన్ మాస్టరా? అర్ధం కానట్లు అడిగాను.
"నువ్వు కాదా?"
"అహ్వహ్వ-" అని నవ్వాను.
"ఏమిటలా నవ్వుతావ్!"
"లేకపోతే ఏమిటయ్యా! నేను పాసెంజర్ ని! సికింద్రాబాద్ బండి కోసం వెయిట్ చేస్తున్నాను" అనేసి మళ్ళీ ముసుగెట్టేశాను. వాళ్ళు మళ్ళీ స్టేషన్ లో కెళ్ళారు. అదే ఛాన్సనుకొని ఛటుక్కున లేచి పక్కబట్టలన్నీ కిందపడేసి, తల దువ్వుకొని, ఇన్ షర్టు సరిజేసుకుని సిగరెట్ వెలిగించాను. అప్పుడు రెండు జేబుల్లో చేతులుంచుకుని "సరిగమలూ- పదనిసలూ" అని పాడుకుంటూ తిన్నగా ఆఫీసులోకొచ్చి వాళ్ళను చూసి ఆశ్చర్యపోయినట్లు ఓవరాక్షన్ చేసి, 'గుడ్ నైట్ సార్" అంటూ విష్ చేశాను. "ఇప్పుడే అలా సిగరెట్ వెలిగించుకుందామని ప్లాట్ ఫారం మీద కెళ్ళాన్సార్" అని చెప్పేసరికి నమ్మేశారు.
నేనూ అప్పలాచారీ ఇద్దరం చాలా సేపు నవ్వుకున్నాం. ఆ సంఘటన తల్చుకుని, నెలరోజుల తర్వాత మళ్ళీ సికింద్రాబాద్ లోనే బస్ స్టాపులో కనిపించాడు. మళ్ళీ కుశల ప్రశ్నలయ్యాయి.
"రేపు రెస్టుకదా - అందుకని వచ్చేశాను" అన్నాడు.
"అలాగా!" అన్నాను.
"అది సరేగాని మొన్నామధ్య భలే తమాషా జరిగింది" అన్నాడు ఉత్సాహంగా.
"ఏమిటది?" ఆశ్చర్యంగా అడిగాను.
"నేను నైట్ డ్యూటిలో స్టేషన్ ఆఫీసు బయట బెంచిమీద పడుకుని ముసుగుపెట్టి నిద్రపోతూంటే రాత్రి రెండింటికి డి.యస్.వో. ఇన్ స్పెక్షన్ కొచ్చాడు జీపులో. ఎస్.ఎమ్. ఆఫీసులో నేను కనిపించకపోయే సరికి బయటకొచ్చి నన్ను లేపాడు..." అదే కథ మళ్ళీ చెప్తున్నాడని అర్ధమయిపోయింది నాకు. అయినా వాడు అంత ఉత్సాహంగా చెపుతోంటే అడ్డుపడడం బావుండదని ఓపిగ్గా అంతా విన్నాను.
ఆ తరువాత వారం రోజులకు వాడు కాచిగూడాలో కనిపించాడు మళ్ళీ.
"సేఫ్టీ కాంప్ కొచ్చాన్లే! ఇంకో రెండు రోజులుంటాయి క్లాసులు" అన్నాడు తనక్కడ ఎందుకున్నదీ వివరిస్తూ.
"అన్నట్టు మొన్న భలే తమాషా జరిగిందిలే డ్యూటీలో" అన్నాడు మళ్ళీ.
నాకు కొంచెం భయం వేసింది మళ్ళీ అదే కథ చెప్తాడేమోనని.
"ఏమిటది?" అడిగాను అనుమానంగా. ఒకవేళ ఇప్పుడు చెప్పబోయేది మరో కొత్త సంఘటనేమో అన్న ఆశ అలా అడిగించింది నన్ను.
"నేను ఒకరోజు నైట్ షిప్ట్ లో ఉండగా మా స్టేషన్ ఆఫీసు బయట బెంచీమీద ముసుగుపెట్టి నిద్రపోతున్నాను. సడెన్ గా రాత్రి రెండింటికి జీప్ లో డి.యస్.ఓ, నైట్ ఇన్ స్పెక్షన్ కొచ్చి ఆఫీసులో ఎవరూ లేకపోయేసరికి అనుమానం వచ్చి నన్ను నిద్రలేపాడు. డ్యూటీలో నిద్రపోతే పనిష్మెంట్ ఉంటుంది గదా! అందుకని నేను ట్రిక్ ప్లే చేశా!"
ఆ తరువాత వినడానికి మనస్కరించలేదు నాకు. ఎంత రసవత్తరమయిన కథయినా చదివినకొద్దీ నీరసం పెరిగిపోతుంది కదా! అంచేత వెంటనే వాడి వాక్ ప్రవాహానికి అడ్డుపడిపోయాను.
"ఇదా! ఇది మొన్న కనబడినప్పుడు చెప్పావ్ కదురా" అన్నాను.
వాడు ఆశ్చర్యపోయాడు.
"చెప్పానా?" అన్నాడు నమ్మలేకపోతున్నట్లు.
"అవును!"
"ఎప్పుడు?"
"వారం క్రితం రెస్టులో వచ్చావ్ నువ్వు- అప్పుడు చెప్పావ్."
"ఓహో- చెప్పేశానన్నమాట!"
"అవును!"
"భలే తమాషాగా జరిగింది కదూ?"
"చాలా ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉపయోగించావ్!" అన్నాను మెచ్చుకుంటూ. ఇద్దరం టూరిస్ట్ హోటల్లో 'టీ' తాగాం. వాడు చాలాసేపు రైల్వే యూనియన్ల గురించి మాట్లాడాడు.
"మా యూనియన్లు భలే తమాషా యూనియన్లురా! రైల్వే కార్మికులందరూ జీతాలు పెరగాలని సమ్మె చేస్తూంటే యూనియన్లు అక్కరలేదని సమ్మెను చెడగొట్టేశాయి" నేను ఆశ్చర్యపోయాను.
"అదేమిటి? అసలు జీతాల పెరుగుదల కోసం యూనియన్ లే సమ్మె చేయించాలి కదా?" అడిగాను.
"అదేమరి రైల్వే లో ఫార్స్! ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వింత ఉంటుందేమో చూడు."



