Home » yerramsetti sai » Humourology - 2
"సోదర సోదరీమణులారా! ఎవ్వరూ కాంప్ వదలడానికి వీల్లేదు. ఎందుకంటే మన ప్రితమ ముఖ్యమంత్రి గారు సైక్లోన్ బాధితులందరినీ స్వయంగా పరామర్శించడానికి ఇక్కడికొస్తున్నారు. అంతవరకూ దయచేసి వేచియుండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము"
ఆ మాటతో మాకు వళ్ళు మండిపోయింది.
"ఏమిటయ్యా వేచి వుండేది? ఇక్కడసలు సైక్లోనూ లేదు, గాడిద గుడ్డూ లేదు. ఒక అరగంట గాలీ, గంట వర్షానికి ఇంత హడావుడేమిటి?" అన్నాడు రంగారెడ్డి విరుచుకుపడుతూ. రంగారెడ్డిని చూసి ఆ ఊరి వాళ్ళంతా కూడా ఎదురు తిరిగారు.
"అవును! మా అందరికీ ఇళ్ళూ, పొలాలూ, ఇంకా మిగతా పనులూ ఏమీ లేవనుకున్నారా? మేం ఉండం! ఏం చేస్కుంటారో చేసుకోండి!" అన్నారు.
అధికారులకు ఏం చేయాలో తోచలేదు.
"అలా సడెన్ గా వెళ్ళిపోతామంతే ఎలా కుదుర్తుందయ్యా! మీ కోసం ముఖ్యమంత్రిగారు ప్రత్యేకంగా ఆహార పొట్లాలు హెలికాప్టర్ల ద్వారా కింద పడేయడానికి రెండు హెలికాప్టర్లను కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఆహారపొట్లాల సప్లయ్ కోసం ఇంకో కాంట్రాక్టర్ ని రెండు కోట్ల రూపాయలకు ఏర్పాటు చేశారు. ఆ కాంట్రాక్ట్ లు సైక్లోన్ రాలేదని చెప్పి కాన్సిల్ చేస్తే వాళ్ళూరుకుంటారా? కొంచెం మన ముఖ్యమంత్రి పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి-"
అందరూ గొడవ పడుతూండగానే మా పైన్నుంచి రెండు హెలికాప్టర్ లు రెండు రౌండ్లు కొట్టి అరడజను పెద్ద సైజు పులిహోర పొట్లాలు పడేసి వెళ్ళిపోయినయ్. అవి నెత్తిమీద పడి పదిమందికి నెత్తి పగిలింది.
జనమంతా వాటి కోసం ఎగబడి కుమ్ముకోవడంతో - త్రొక్కిసలాట జరిగింది. ఆ త్రొక్కిసలాటలో రెండొందల మందికి గాయాలు తగలటం - వారిలో పదిమంది పరిస్థితి విషమంగా తయారవటంతో వాళ్ళందరినీ లారీల్లో తీసుకుని దగ్గరలో వున్న ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్ళబోయారు.
తమను ప్రభుత్వాసుపత్రిలో చేరుస్తున్నారన్న విషయం తెలీగానే పరిస్థితి విషమంగా వున్నవారిలో ఎనిమిదిమంది లారీ దూకి చెట్లల్లోకి పారిపోయారు. మిగతా ఇద్దరూ ఆ షాక్ కి తట్టుకోలేక ప్రాణాలు వదిలేశారు.
దాంతో జనమంతా ఎదురుతిరిగారు.
"ఏమిటయ్యా ఇది? పొద్దున్నేమో రెండుసార్లు భోజనం చేయించారు. ఇప్పుడు ఒక్కటి కూడా దిక్కులేదు- మాదార్ని మమ్మల్ని పోనీండి!"
"అరె! పోటానికి వీల్లేదని చెప్తుంటే మీక్కాదూ? ముఖ్యమంత్రి ఎంత రాత్రయినా ఇక్కడికొచ్చి మిమ్మల్ని కలుసుకుని మాట్లాడేదాక ఒక్కరు కూడా కాంప్ వదలడానికి వీల్లేదు."
"మేం ఉండమయ్యా- ఏం చేస్తారో చేస్కోండి" అంటూ రంగారెడ్డి శాయిరామ్ ముందుకి కదిలేసరికి ఇంకొంతమంది వారిని వెంబడించారు.
సడెన్ గా కలెక్టర్ ఎస్పీకి ఏదో చెప్పడంతో పోలీసులు హఠాత్తుగా వెళ్తున్నవాళ్ళ మీద లాఠీ ఛార్జ్ మొదలుపెట్టారు.
"ఓర్నాయనో- కాళ్ళ మీద తగిలిందిరో- దేవుడో" అని అరుస్తూ అందరూ దెబ్బలు తిని కుంటుకుంటూ మళ్ళీ గవర్నమెంట్ కాంప్ లో కొచ్చారు.
రాత్రి పన్నెండింటికి ముఖ్యమంత్రి కారూ దాని వెనుక పాతిక ఏ.సి. కార్లూ వచ్చాయ్.
వెంటనే ముఖ్యమంత్రి కారు టాప్ మీద కెక్కాడు.
"సోదరులారా! సైక్లోన్ బాధితులను కూడా కేంద్ర ప్రభుత్వం 'రాజకీయం' చేయడానికి ప్రయత్నిస్తోంది. మీకు అన్నివిధాలా సాయం అందించే హక్కు కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. అయినా గానీ కేంద్రం జోక్యం చేసుకుని మాకు ఆటంకాలు కల్పిస్తోంది. మీరంతా మరో నాలుగురోజులు మా రిలీఫ్ కాంప్ లోనే సుఖంగా ఉండటానికి అన్ని ఏర్పాట్లూ చేసేశాం! కనుక ఎవ్వరూ కాంప్ వదలకండి!"
"మాకు రాత్రి తిండి దొరకలేదు" ఎవరో అరచారు వెనుకనుంచి.
ముఖ్యమంత్రి కోపంగా కలెక్టర్ వేపు తిరిగాడు.
"కంట్రాక్టర్ రెండువేలు ఆహార పొట్లాలు హెలికాప్టర్ ద్వారా వదిలినట్లు చెప్పాడు సార్" అన్నాడు కలెక్టర్.
"అవున్సార్- కావాలంటే చూడండి! బిల్లు కూడా నా దగ్గరుంది" అన్నాడు కంట్రాక్టర్.
"మా కలెక్టర్ గారు, కంట్రాక్టర్ గారు రెండువేల పైచిలుకు ఆహారపొట్లాలు వేశారని చెప్తున్నారు.
అయినా ఎవరకీ అవి అందలేదని అంటున్నారంటే - ఇదంతా కేంద్ర ప్రభుత్వ కుట్ర అని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను. మా పార్టీ, మా ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజల క్షేమమే ధ్యేయంగా పని చేస్తాయని కూడా మీకు మనవి చేస్తున్నాను- జైహింద్-"
అందరూ వెళ్ళిపోయారు.
"ఇప్పటికయినా మేము మా ఇళ్ళకు వెళ్ళిపోవచ్చా?" కుంటుతూ ముందుకొచ్చి అడిగాడు రంగారెడ్డి.
"ఇప్పుడు వెళ్ళండయ్యా! ఎవరొద్దన్నారు?" అన్నాడు ఓ అధికారి.
"ఇంత రాత్రివేళ ఎలా వెళ్తాం?" అడిగింది పార్వతీదేవి భయంగా.
అప్పుడే ఆమె చేతిలోని ట్రాన్సిష్టర్ లో మ్యూజిక్ ఆగిపోయింది.
"ఆకాశవాణి- ఆంధ్రప్రదేశ్ లో సంభవించిన భయంకరమయిన సైక్లోన్ వల్ల నిరాశ్రయులయిన రెండు లక్షల మందిని భారత ప్రధాని నేడు స్వయంగా కలుసుకున్నారు. ఇప్పటికేవారి పునరావాస కార్యక్రమాల కోసం ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు చేయటం జరిగినా, అది చాలని దృష్ట్యా, మరో నలభై కోట్లు తమ సహాయ నిధి నుంచి ఖర్చు చేయాలని నిర్ణయించారు. సైక్లోన్ బాధితులను ఆడుకోవటంతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ప్రధాని ఆవేదన వెలిబుచ్చారు. రేపు ఉదయమే ప్రత్యేక కేంద్ర బృందం సైక్లోన్ బాధిత ప్రాంతాలను సందర్శించి పరిస్థితిని తాజాగా సమీక్షించాలని ప్రధాని ఆదేశాలిచ్చారు-" అందరం ఉలిక్కిపడ్డాం.
"ఆలస్యం చేస్తే మళ్ళీ ఆ కమిటీ వచ్చేవరకూ మనల్ని కాంప్ లో బంధిస్తారు- త్వరగా పదండి! కాలినడకన ఎంతదూరం వీలయితే అంతదూరం పారిపోదాం-" అన్నాడు జనార్ధన్.
అందరం చీకట్లోనే ముందుకి కదిలాం.
"అవునూ! కేంద్రం ఈ ఒక్క రోజులోనే ఇరవై కోట్లు ఖర్చు పెట్టిందంటున్నారు- రాష్ట్ర ప్రభుత్వమేమో పదికోట్లు ఖర్చుపెట్టిందంటున్నారు- ఆ డబ్బంతా ఎక్కడ ఎలా ఖర్చయి ఉంటుంది?" అడిగాడు శాయిరామ్.
ఆ ప్రశ్నకు ఎవరూ జవాబు ఇవ్వలేదు.
అందరూ ఆ కాంప్ కి వీలయినంత దూరం వెళ్ళిపోవాలన్న తొందర్లో ఉన్నారు.
* * * * *



