Home » yerramsetti sai » Humourology - 2
"ఆ త్వరగా భోజనాలకు రండి అందరూ! 'క్యూ' కట్టండి!" అరచారు లారీలో ఉన్నవాళ్ళు.
"మళ్ళీ ఇదేమిటి? ఇప్పుడేగా పైన్నుంచి ఆహారం విసిరేశారు?" ఆశ్చర్యంగా అడిగాడు రంగారెడ్డి.
"అది కేంద్రప్రభుత్వం సప్లయ్- ఇదేమో రాష్ట్రప్రభుత్వం సప్లయ్- ఆ మాత్రం తెలీదా" అన్నాడతను చిరాగ్గా.
"అదేమిటి- రెండు-రెండు భోజనాలెందుకు?" మరింత విస్తుపోతూ అడిగాడు రెడ్డి.
జనంలోనుంచి ఓ పెద్దమనిషి వచ్చి రంగారెడ్డి భుజం తట్టాడు చిరునవ్వుతో.
"ఆ మాత్రం తెలీదటయ్యా? కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ వేరు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ వేరు. దగ్గర్లోనేమో ఎలక్షన్లున్నాయ్! అంచేత దేవుడి దయవల్ల వచ్చిన ఈ సైక్లోన్ ని ఎవరికి వాళ్ళే ఉపయోగించుకుని తమతమ ఓటుబాంక్ పెంచుకోవాలను కోవడంలో కొత్తేముంది?"
"ఏడ్చినట్లుంది!" అంది పార్వతీదేవి.
"మేము రెండు భోజనాలెలా చేస్తాం? మావల్ల కాదు".
"కాదంటే పోలీసులు ఊరుకోరు- లాఠీలతో కొట్టి మరీ తినిపిస్తారు" ఎవరో అన్నారు.
"ఓ ప్రక్క మాకు వద్దని చెప్తున్నా ఈ బలవంతం ఏమిటి?"
అందరం చేసేదిలేక రెండు భోజనాలు కానిచ్చి ఎప్పుడు మమ్మల్ని వదుల్తారా అని ఎదుర్చూస్తూ కూర్చున్నాం.
సాయంత్రం అయిపోయింది కానీ పరిస్థితిలో మార్పులేదు. మళ్ళీ అందరం కలిసి అధికారుల దగ్గర కెళ్ళాం.
"ఏమిటండీ అది? అటు సైక్లోనూ లేదు, ఇటు ప్రధానమంత్రీ రారు! ఇంకెంత కాలమిలా? అవతల మాకు ఆఫీస్లున్నాయ్- సంసారాలున్నాయ్" అరిచాడు శాయిరామ్.
"మాకు మాత్రం లేవేంటయ్యా! కొంచెం ఓర్చుకోండి. తొందర పడతారేం? సైక్లోన్ అసలు ఎందుకు ఫెయిలయిందో విచారించడానికి ఓ కమిటీని వేశారు! ఇలా ఏర్పాట్లన్నీ చేసుకున్నాక- అది రాకపోతే ఎవరికయినా ఎంత వళ్ళు మండిపోతుంది? అదీగాక ఎలక్షన్లో విజయావకాశాలన్నీ కేవలం సైక్లోన్ లో కేంద్ర ప్రభుత్వం చేసే రిలీఫ్ ఏర్పాట్ల మీదే ఆధారపడి ఉంటాయ్. అందరికీ తిండీ, బట్ట, ఇళ్ళు కట్టించి ఇవ్వటం - అన్నదానాలు చేయటం ఇవన్నీ చేస్తే మరి ఎలక్షన్లకు ఎంత లాభం?"
గంటసేపు వాదించినా ఉపయోగం కనిపించకపోయేసరికి అందరం వెనక్కు తిరిగి వచ్చేశాం. ఆ రాత్రి కూడా అక్కడే ఉండక తప్పలేదు. మర్నాడు ఉదయం రేడియోలో వచ్చిన ప్రకటన మరింత తమాషాగా కనిపించింది మాకు.
"బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం రాత్రి తీరాన్ని తాకింది. జిల్లూరుర ప్రాంతం జలదిగ్భందనం అయిపోయింది. అయితే వాయుగుండం అలాగే ఉంది. అంచేత ఏ క్షణాన్నయినా అది విజృంభించి విస్తృతంగా వర్షాలు పడి సముద్రపు తీర ప్రాంతాలన్నీ మునిగిపోయే సూచనలున్నాయ్!"
మాకా ప్రకటన ఏమీ అర్థంకాలేదు. ఒకే సైక్లోన్ ఇలా వాయిదాల పద్ధతిలో తాకటమేమిటా అనేదే ఆశ్చర్యంగా ఉంది.
"ఆ ఈ రోజుల్లో అన్నీ వాయిదాల పద్ధతి వ్యవహారాలేగా? కేంద్రం ప్రభుత్వోద్యోగులకు డి.ఏ. వాయిదాల పద్ధతిలోనే ఇస్తున్నారు- సైక్లోన్ కి కేంద్రం చేసే సహాయం వాయిదాల పద్దతే - అంచేత సైక్లోన్లు కూడా అలాగే ఏడుస్తున్నాయేమో?"
అందరం మళ్ళీ రెండు భోజనాలు చేసి నిద్ర పోతూండగా హఠాత్తుగా హడావుడి మొదలయింది.
స్పీకర్లో ఓ జీప్ జోరుగా అరుస్తూ వచ్చింది.
"సైక్లోన్ బాధితులారా! మిమ్మల్ని స్వయంగా కలుసుకొని మీ స్థితిగతులు తెల్సుకుని మీకు సహాయం చేయడానికి ప్రధానమంత్రి గారొస్తున్నారు. కనుక సహనంతో వేచియుండాల్సిందిగా ప్రార్థిస్తున్నాం"
"అమ్మయ్య! ఇంకా కొద్దిసేపట్లో మనకు చెర వదలి పోతుందన్న మాట" అన్నాడు రంగారెడ్డి ఆనందంగా.
సాయంత్రం అయిదవుతూండగా ప్రధానమంత్రి గారొచ్చారు. అందరికీ నమస్కారం చేస్తూ పరామర్శిస్తూ అన్ని సదుపాయాలు లభిస్తోందీ లేనిదీ అడిగి తెలుసుకున్నారు. అప్పటికప్పుడే ఆయన పార్టీ తాలూకూ కార్యకర్తలు ఓ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. తమ పార్టీ ధ్యేయం కేవలం తెలుగు ప్రజల్ని సైక్లోన్ నుంచి రక్షించటమేనని పేర్కొన్నారు. ప్రధానమంత్రి స్వయంగా మాట్లాడుతూ "తెలుగు ప్రజలకు ఎప్పుడూ వచ్చే ఈ సైక్లోన్ బెడద చూస్తుంటే మా గుండె తరుక్కుపోతోంది. అందుకే ఈసారి ఎలాంటి సహాయం కావాలన్నా ఎంత సహాయం కావాలన్నా చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను" అంటూ తన ఆవేదన తెలియపరచారు. మమ్మల్ని చప్పట్లు కొట్టమని పోలీసులు బెదిరించారు.
"నీయవ్వ - అంతా నాటకం! ఇంతకు ముందొచ్చిన సైక్లోన్ కి ఏ ప్రధానమంత్రీ రాలేదు! మరి ఈరాని సైక్లోన్ కి ఏమిటో ఈ హడావిడి?" అన్నాడు రంగారెడ్డి ఆశ్చర్యంగా.
"ఎలక్షన్లు బాబో- ఎలక్షన్లు" అన్నాడొకతను. కొంతమంది నవ్వారు గానీ ఇంకొంతమంది రంగారెడ్డి వంక కోపంగా చూసారు.
"అవునవును! ఎలక్షన్ల మహత్యం కాకపోతే అదివరకు సైక్లోన్స్ కేమో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో గొడవ చేసినా పట్టించుకోకుండా, సైక్లోన్ వచ్చిన ఆరునెలలకు సెంట్రల్ టీమ్ రావటం, వాళ్ళు మరో నెలరోజులు కూర్చుని కాలిక్యులేటర్స్ తో లెక్కలు కట్టి రిపోర్ట్ సబ్మిట్ చేయటం- అప్పుడు ఆర్ధిక సహాయం అందజేయటం జరిగింది. ఇప్పుడేమో తెలుగు ప్రజల బాధలు చూసి గుండె తరుక్కుపోవడం, సైక్లోన్ రాకముందే సహాయాలు అందజేయటం, సగం సైక్లోన్స్ కే ప్రాంతాల్ని పర్యటించేయడం ఏడు కోట్లు కాష్ డౌన్ చేసేయడం-" అంటూ శాయిరామ్ అరిచేసరికి అందరూ ఘోల్లున వన్నారు. ఈ హడావుడి చొసి మరికొంతమంది రంగారెడ్డి చుట్టూ చేరారు. వాళ్ళ ప్రోత్సాహం చూచి రంగారెడ్డి మరింత విజృంభించాడు.
"సోదరీ సోదరీమణులారా! చూడండి ఈ నాటకం! గమనించండి ఈ ఘోరం. పిల్లికి చెలగాటం- ఎలుక్కి ప్రాణసంకటం సామెత విన్నారు కదా మీరు! ఇక్కడ అదే జరుగుతోంది..." అంటూ అతను స్పీచ్ మొదలుపెట్టాడు.
అక్కడి అధికారులు, పోలీసులు పరిస్థితిని గమనించారు. ఇంకాసేపుంటే రంగారెడ్డికి పెద్ద ఫాలోయింగ్ రావటం, ఆ తరువాత ప్రజలు రంగారెడ్డి జిందాబాద్ అని అరవటం- ఆ తర్వాత ఎలక్షన్లో రంగారెడ్డి నిలబడి గెలవటం ఖాయమని అనుమానించినట్లున్నారు.
వెంటనే రంగారెడ్డిని పక్కకు పిలిచి "మిమ్మల్ని వదిలేస్తున్నాం- మీరు వెళ్ళిపోవచ్చు-" అన్నారు.
ఆ మాట అన్నదే చాలని అందరం 'బ్రతుకు జీవుడా' అని రిలీఫ్ కాంప్ నుంచి బయల్దేరాము.
కొంతదూరం నడిచామో లేదో హఠాత్తుగా కేకలు వినిపించనియ్. పోలీసులు, ఇతర అధికారులు పరుగుతో వచ్చారు.
"ఎవ్వరూ కాంప్ వదలి వెళ్ళకండి!" అని అరచాడొకతను.
"మళ్లీ ఏమయింది" అడిగాడు రంగారెడ్డి కోపంగా. గవర్నమెంట్ వాళ్ళు రిలీఫ్ కాంప్స్ ని వీడియో ఫిలిమ్ తీస్తున్నారు. ఫిలిమ్ తీసి టీవీన్యూస్ లో చూపిస్తారు! అంతవరకూ అందరూ ఇక్కడే ఉండాలి" అన్నాడు. ఆమాట అనడమే ఆలస్యం అందరూ క్రాఫ్ లు దువ్వు కోవటం, బట్టలు మార్చుకోవడం, ఆడాళ్ళు మేకప్ చేసుకోవటం ప్రారంభమయింది. ఎలాగైతేనేం మరో రెండు గంటలకు వీడియో షూటింగ్ ముగిసింది. "ఏదేమయినాసరే మన సినిమా షూటింగ్ ఈ ఏరియాలో పెట్టటానికి వీల్లేదు!" అన్నాడు జనార్ధన్.
"అవును! వేరే లొకేషన్స్ చూద్దాం" అన్నాడు బోసుబాబు ఉత్సాహంగా.
అందరం బయటకు వస్తుంటే ఓ పోలీస్ జీప్ వేగంగా వచ్చింది.



