Home » yerramsetti sai » Humourology - 2


    "ష్" అన్నాడు జనార్ధన్. "అలా మాట్లాడితే మననిక్కడే వదిలేస్తారు-"

 

    ఆ మాట చాల పవర్ ఫుల్ గా పనిచేసింది. ఆ తరువాత ఆమె ఇంకేమీ మాట్లాడలేదు.

 

    అందరం లారీలో ఎక్కి కూర్చున్నాం. గంట ప్రయాణం తర్వాత రిలీఫ్ కాంప్ చేరుకున్నాం. పెద్ద స్కూల్ బిల్డింగ్ అది! చాలా పెట్రోమాక్సు లైట్లు వెలుగుతున్నాయి. మేమంతా ఓ గదిలో కూర్చున్నాము. తెల్లారుజామున మూడయిందప్పటికి. నిద్ర రాకుండా ఉంటానికి ఏదయినా జానపద గీతం పాడతానన్నాడు యాదగిరి. "రోజూ ఆ చెత్తంతా రేడియోలో వినలేక చస్తుంటే ఈ సైక్లోన్ లో కూడా ఏమిటయ్యా ఆ పరాసికాలు?" అంటూ కోప్పడ్డాడో పెద్దమనిషి.

 

    "అయితే సినిమా పాటేదైనా పాడతాను!" అన్నాడతను ఉత్సాహంగా. ఓ లావుపాటాయన ఆ మాట వింటూనే కోపంగా లేచి నిలబడ్డాడు. "ఏంటీ? తెలుగు సినిమా పాట పాడతావా? ఆడాళ్ళు, పిల్లలు ఉన్నచోట ఆ బూతు పాటలు పాడతావా? పళ్ళు రాలగొడతాను?" అన్నాడు, అందుకు సంసిద్ధమవుతూ. దాంతో యాదగిరి సైలెంటయిపోయాడు.

 

    రంగారెడ్డి, జనార్ధనూ ఈలోగా కాంప్ తాలూకు ప్రభుత్వాధికారులతో మాట్లాడి వచ్చారు. అప్పుడిక మమ్మల్ని మచిలీపట్నం తీసికెళ్ళే ప్రసక్తి లేదని చెప్పారట వాళ్ళు. ఎలాగోలా తెల్లారేవరకు గడుపుతే పొద్దున్నే ఏదొక బస్ లో వెళ్ళి పోవచ్చనుకుని ఊరుకున్నాము.

 

    తెల్లారుజామున ఎప్పుడో నిద్రపట్టేసింది. తిరిగి "ఫలహారాలు" అన్న కేకలువిని మెలకువ వచ్చేసింది. అప్పటికే బాగా ఎండెక్కిపోయింది.

 

    బయటికొచ్చి చూసేసరికి ఓ లారీ చుట్టూ రిలీఫ్ కాంప్ లో జనం మూగిపోయి ఉన్నారు. లారీలో ఇడ్లీలు, కాఫీ సప్లయ్ చేస్తున్నారు.

 

    "త్వరగా రడీ అవండి. మనం బస్ స్టాండ్ కెళ్ళి మచిలీపట్నం వెళ్ళిపోదాం" అన్నాడు రంగారెడ్డి.

 

    అందరం అరగంటలో రడీ అయి బయటకు వెళ్ళబోతూంటే గేటు దగ్గర ఉన్నవాళ్ళు అడ్డగించారు.

 

    "ఎక్కడికి?" అడిగారు.

 

    "మాడి హైద్రాబాదు. మేము హైద్రాబాదు వెళ్ళిపోవాలి!" అన్నాడు శాయిరామ్.

 

    "ఎవరూ ఎక్కడికీ వెళ్ళడానికి వీల్లేదు!" అన్నారు వాళ్లు.

 

    "ఎందుకని?" ఆశ్చర్యంగా అడిగాడు రంగారెడ్డి.

 

    "ఎందుకేమిటయ్యా! సైక్లోన్ రిలీఫ్ కాంప్ కి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చామనుకున్నారు? వెంటనే వదిలేయటానికా?" వెటకారంతో అడిగాడు.

 

    "కానీ సైక్లోన్ రాలేదుగా? ఎండ చూడండి! కాలిపోతోందప్పుడే!"

 

    రాకపోతే మేమేం చెయ్యాలి!"

 

    "మమ్మల్ని వదిలి వెయ్యాలి" అన్నాడు శాయిరామ్.

 

    "అదేంకుదరదండి? అఫీషియల్ గా 'సైక్లోన్ రద్దయిపోయింది' అని మాకు పై నుంచి టెలిగ్రాం గానీ మెసేజ్ గానీ రావాలి! అంతవరకు ఎవ్వరూ కదలడానికి వీల్లేదు" అన్నాడొకతను.

 

    "కానీ వెళ్ళేవాళ్ళను వెళ్ళనిస్తే మీకే ఈ తలనొప్పంతా తగ్గుతుంది కదా?"

 

    అతను నవ్వాడు.

 

    "భలే వారే సార్ మీరు! మా ఉద్యోగాలు తిన్నగా ఉండటం మీకిష్టం లేదా ఏమిటి? ఎలక్షన్ల ముందు సైక్లోన్ లు వస్తే దానిని ఎలక్షన్ కోసం వాడుకోవటం మామూలేగా! అందుకే రిలీఫ్ కాంప్ లో ఉన్నవారిని జాగ్రత్తగా కనిపెట్టి ఉండమనీ అన్ని సౌకర్యాలు కలుగజేయమనీ పైన్నుంచి ఆర్డర్స్ వచ్చాయ్. మీ అందరినీ ఇప్పుడు వదిలివేస్తే మాకు మాటరాదూ?"

 

    మేమంతా మొఖమొఖాలు చూచుకున్నాం. సరిగ్గా అప్పుడే టేబుల్ మీదున్న ట్రాన్సిస్టర్ లో మళ్ళీ ప్రత్యేక సైక్లోన్ బులెటిన్ వెలువడింది.

 

    "బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం నేడు ఉత్తరదిశగా ప్రయాణించి క్షీణించి పోయింది. అందువల్ల కొద్దిపాటి వర్షాలు కోస్తాతీరంలో పడే సూచనలున్నాయ్! అంతకుమించి ఎలాంటి ప్రమాదం లేదని మెటీరియోలజీ డిపార్ట్ మెంటువారు తెలియజేస్తున్నారు"

 

    వెంటనే రంగారెడ్డి ముందుకొచ్చాడు.

 

    "ఇంకేం కావాలయ్యా మీకు! సైక్లోన్ లేదంటున్నారుగా?" వాళ్ళు ఏమీ చెప్పలేక "పదండి! మా ఆఫీసర్లతో మాట్లాడుదురు గాని!" అన్నారు.

 

    నేనూ, రంగారెడ్డి, శాయిరామ్, జనార్ధన్ అతనితోపాటు వాళ్ళ ఆఫీసర్ దగ్గరకు వెళ్ళాము.

 

    అంతావిన్నాక అతను చిరునవ్వుతో తల అడ్డంగా ఊపాడు.

 

    "వీల్లేదండీ! రిలీఫ్ కాంప్ లో నుంచి ఎవ్వరినీ బయటకు పోకుండా చూడమని ఆదేశాలొచ్చాయ్, ఇంతకుముందే."    

 

    "కానీ సైక్లోన్ క్షీణించి పోయిందని ఇందాక రేడియోలో చెప్పారు కదా?" అడిగాడు శాయిరామ్.

 

    "అలా చెప్పినందుకు రేడియోస్టేషన్ అధికారుల మీద చర్య తీసుకుంటున్నారు"

 

    "అంటే వాళ్ళు చెప్పింది తప్పా?" ఆశ్చర్యంగా అడిగాడు రంగారెడ్డి.

 

    "ఇన్ ఫర్మేషన్ తప్పుకాదు గానీ...ఓ పక్క సైక్లోన్ బాధితులను మన ప్రధానమంత్రిగారు పరామర్శించటానికి వస్తున్నారని తెలిసినప్పుడు - సైక్లోన్ రాదని చెప్పటం తప్పుకాదూ?"

 

    అందరం ఆశ్చర్యపోయాము.

 

    "ఏమిటి ఇక్కడికి ప్రధానమంత్రి గారొస్తున్నారా?"

 

    "అవును"

 

    "ఎందుకు?"

 

    "చెప్పాను గదయ్యా! సైక్లోన్ బాధితులను పరామర్శించడానికి"

 

    "కానీ సైక్లోన్ రాలేదుగా?"

 

    "జిల్లూరు అనేచోట బాగా వర్షాలు పడ్డాయి కదా!"

 

    "అలాంటప్పుడు అక్కడే పర్యటించక ఇక్కడకు రావడం ఎందుకు?"

 

    "అదంతా వాళ్ళిష్టం బాబూ! మనమెవ్వరం కాదంటానికి!" సమాధానపరుస్తూ అన్నాడాయన.

 

    హఠాత్తుగా పైన రెండు హెలికాఫ్టర్ లు రావటం కనిపించింది మాకు. రిలీఫ్ కాంప్ లో ఉన్న వారందరూ ఎగబడుతూ బయటికొచ్చి నిలబడ్డారు.

 

    మరుక్షణంలో హెలికాఫ్టర్స్ నుంచి పెద్ద పెద్ద ఆహార పదార్థాల పాకెట్స్ కింద పడేశారు. అవి సరాసరి కాంపౌండ్ లో కొచ్చి పడ్డాయ్. పాకెట్స్ తగిలి కొంతమంది గాయపడ్డారు.

 

    అందరూ హాహాకారాలు చేస్తూ గాయపడ్డవారిని అంబులెన్స్ లో ఎక్కించారు. వెంటనే అంబులెన్స్ వైద్య చికిత్సా శిబిరానికి బయలుదేరింది.

 

    కొంతమంది కోపంగా మళ్ళీ ఆ అధికారుల దగ్గరకు నడిచారు.

 

    "ఏమిటయ్యా ఇది! అంతపైనుంచి ఆ ఫుడ్ పాకెట్స్ ఎందుకు విసిరేసినట్లు?" అడిగాడు శాయిరామ్ అప్పటికప్పుడే ఆ గుంపుకు నాయకత్వం వహిస్తూ.

 

    "ఆహారం రిలీఫ్ కాంప్ కి ఆ విధంగానే సప్లయి చేయమని ప్రధానమంత్రి ఆదేశమయ్యా!" విసుగ్గా అన్నాడు అధికారి.

 

    "హెలికాఫ్టర్ ద్వారా ఎందుకు? మేమేమయినా నీళ్ళల్లో మునిగి ఉన్నామా? లేక ఈ ప్రాంతం కటాఫ్ అయిపోయిందా?"

 

    "చూడండి బాబూ! సివియర్ సైక్లోన్ వస్తుందనీ, మొత్తం కోస్తాప్రాంతమమతా మునిగిపోతుందనీ, ఎంతో ఆశతో కేంద్రం ఈ ఏర్పాట్లన్నీ చేసింది! ఈపాడు సైక్లోనేమో ఆశించిన ప్రకారం వచ్చి చావలేదు- ఎవరు మాత్రం ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు? చేసిన ఏర్పాట్లు, కార్యక్రమాలు ఈ బోడిసైక్లోన్ రాలేదన్జెప్పి కాన్సిల్ చేసేసుకోలేరు కదా!"

 

    అప్పుడె రెండు లారీల్లో రిలీఫ్ కాంప్ లకు భోజనాలు వచ్చాయ్.


Related Novels


Cine Bethalam

Kanthi Kiranalu

Nirbhay Nagar Colony

Rambharosa Apartments

More