Home » yerramsetti sai » Humourology - 2
"మనకేం భయంలే! సాయంత్రానికి మచిలీపట్నం చేరుకుని బస్సెక్కామంటే తెల్లారేసరికి ఇళ్ళకు చేరుకోవచ్చు-" అన్నాడు శాయిరామ్ స్వగతంగా.
"అవునవును- కొంచెం త్వరగా మనం వెనక్కు తిరగడం మంచిది" అన్నాడు జనార్ధన్.
"మొత్తం పిక్చరంతా ఈ ఏరియాలోనే లాగించేద్దాం!" అన్నాడు బోసుబాబు తన లొకేషన్స్ కార్యక్రమం ముగిసినట్లు ప్రకటిస్తూ.
అప్పటికే టైము సాయంత్రం నాలుగయింది.
మేము ఊరివేపు నడుస్తూండగానే మబ్బులు మరింత మూసుకుపోయాయ్. వర్షపు చినుకులతో పాటు ఉండుండి గాలికూడా వీయసాగింది.
"ఇలాంటి సైక్లోన్ సమయాల్లో సముద్రపు తీరంలో ఉండడం చాలా డేంజర్-" అంది రాజేశ్వరి.
సాయంత్రం అయిదయిపోయింది. అందరం ఊళ్ళోని బస్ షెల్టర్ చేసుకునేసరికి అప్పటికే చీకటి పడిపోయినట్లుంది. బస్ స్టాప్ లో మేమూ, మాతోపాటు ఓ ముసలాయనా తప్పుతే ఇంకెవరూ లేరు.
ఆరయిపోయినా బస్ జాడ లేకపోయేసరికి మాకు ఆందోళన మొదలయింది. మా ఆందోళన ముసలాయన గమనించినట్లున్నాడు.
"నేనూ మచిలీపట్నమే వెళ్ళాలి గానీ- బస్ లు వచ్చే నమ్మకం లేదిక!" అన్నాడు స్వగతంగా. అందరం ఉలిక్కిపడ్డాము.
"ఎందుకంటారు?" అడిగాడు శాయిరామ్ ఖంగారుగా.
"సైక్లోన్ వార్నింగ్ ఇచ్చారు కదా రేడియోలో? అదీ ఆర్టీసీ వాళ్ళు కూడా వింటారు కదా!"
అందరి గుండెల్లోనూ రాయిపడింది.
"ఇప్పుడు మనకేందారి?" అంది పార్వతీదేవి భయంగా.
"అదేదో సినిమాలో ఇలాగే కొంతమంది ఫ్రెండ్స్ ఇలాగే సీషోర్ వెళ్ళి అక్కడ చిక్కడిపోతే ఓ హంతకుడొచ్చి అమరినీ చంపేస్తాడు-" అంది రాజేశ్వరి.
"బస్ రాకపోతే ఏమిటి మన కర్తవ్యం? అడిగాడు జనార్ధన్ తన మేకప్ చెరగిపోయిందేమోనని పాకెట్ అద్దంలో చూచుకుంటూ.
"అంతగా బస్ రాకపోతే- ఇక్కడే ఎవరొకరింట్లో రాత్రి గడిపేద్దాం! పొద్దున్నే బస్ వచ్చేస్తుంది" అన్నాడు శాయిరామ్.
రంగారెడ్డి నవ్వాడు.
"అయిడియా బాగానే ఉంది గానీ ఈలోగా సముద్రం ఒక్క విసురు విసిరిందంటే ఆ ఇంటితో సహా అందరం లోపలికెళ్ళిపోతాం!" అన్నాడు. ఆ మాటతో అందరికీ కాళ్ళూ చేతులు వణకసాగినయ్.
"ఆ మధ్య ఉప్పెనవచ్చి రాత్రికిరాత్రి ఆ చుట్టు పక్కల కొన్ని ఊళ్ళు ఆనవాల్లేకుండా సముద్రంలో కెళ్ళిపోయాయ్" అన్నాడు జనార్ధన్.
"అవును! రేడియోలో సముద్రపు కెరటాలు మరీ పది నుంచి పదిహేను మీటర్ల ఎత్తువరకు వస్తాయని చెప్పారు!" అన్నాడు జనార్ధన్.
దూరంగా బస్ వస్తున్న శబ్దం వినిపించింది సన్నగా.
"అదిగో! బస్సు వెళ్తోంది!" ఆనందం పట్టలేక అంది పార్వతీదేవి. ఆ క్షణంలో ఆమెను చూసిన వారెవరయినా సరే- ఆమెకు ప్రపంచంలో అత్యంత ప్రీతికరమయిన వస్తువు 'బస్సు' అని అర్థం చేసుకుంటారు.
అందరం ఊపిరి బిగపట్టి రోడ్ వేపే చూడసాగాం! దూరంగా రెండు లైట్లు కనిపించాయ్ ముందు.
"బస్సే-బస్సే" ఎగిరి గంతేస్తూ అంది రాజేశ్వరి. తీరా దగ్గర కొచ్చాక చూస్తే అది పోలీస్ జీప్. స్పీకర్ లో తుఫాన్ హెచ్చరికలు చేయడానికొచ్చారు వాళ్ళు.
"తీర ప్రాంతాలలో ఉన్న గ్రామాలన్నీ సముద్ర కెరటాలకు మునిగిపోయే ప్రమాదం ఉంది గనుక వెంటనే సురక్షిత ప్రాంతాలకు చేరుకోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము-" అంటూ అనౌన్స్ చేస్తున్నారు స్పీకర్ లో.
"ఒకవేళ-మనగోడు చెప్పుకుంటే ఆ జీప్ లో మనల్ని మచిలీపట్నం తీసుకెళ్తారేమో!" అంది పార్వతీదేవి ఆశగా.
ఆ మాట అనడం ఆలస్యం అందరం జీప్ దగ్గరకు పరుగెత్తాం. జీప్ చుట్టూ ఆ ఊరి జనం చేరి వివరాలు వాకబు చేస్తున్నారు.
రంగారెడ్డి చొరవగా ఇన్ స్పెక్టర్ దగ్గరకెళ్ళి మాకో సహాయం చేస్తారా?" అనడిగాడు. కానీ ఆ గాలి హోరులో, జనం గొడవలో అతనికి సరిగ్గా వినిపించినట్లు లేదు.
"అవును! తప్పకుండా మీ అందరికీ ప్రభుత్వం సహాయం చేస్తుంది" అన్నాడతను.
"అది కాదండీ! మమ్మల్ని దయచేసి మీ జీప్ లో మచిలీపట్నంలో వదులుతారా" అడిగాడు శాయిరామ్.
"అవును! మచిలీపట్నంలోనే సైక్లోన్ తీరాన్ని దాటవచ్చని అంటున్నారు" అన్నాడతను.
జీప్ వెళ్లిపోయింది మరో ఊరికి.
మా గొడవంతా విన్న పెద్దమనిషి మా అందరినీ తమ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు. అడిగిందే చాలని అందరం ఇంటికెళ్ళి ఓ గదిలో కూర్చున్నాం. అందరికీ భోజనాలు కూడా అతనే ఏర్పాటు చేశాడు.
"మా సినిమాలో మీకు తప్పక ఓ వేషం ఇస్తాను!" అన్నాడు బోసుబాబు భోజనం చేసి.
"సినిమాలంటే మాకసహ్యం!" అన్నాడా పెద్దమనిషి. అందరం దుప్పట్లు పరచుకొని పడుకున్నామన్న మాటే గానీ సముద్రం మరీ ఇంటిబయటే వున్నట్లు శబ్దాలు వస్తూంటే నిద్ర పట్టలేదు.
ఎలాగోలా నిద్రపడుతూన్న సమయంలో జనార్ధన్ కెవ్వున కేక వేశాడు. దాంతో అందరం అదిరిపోయి లేచి కూర్చున్నాం. జనార్ధన్ వణికి పోతున్నాడు.
"ఏమిటి? ఏం జరిగింది?" అడిగాన్నేను.
"కలొచ్చింది!"
"ఏం కల?"
"అదే మనమందరం ఉప్పెనలో కొట్టుకు పోతున్నామట! అంటే ఈ ఇంటితో సహా! అప్పుడు ఊపిరాడక గిలగిల కొట్టుకుంటూ నీళ్ళు తాగుతూంటే ఎదురుగ్గా టీవీలో హైద్రాబాద్ ప్రోగ్రామ్ కనిపించింది- అంతే ప్రాణాలు పోతున్నట్లనిపించింది. అరచేశాను..."
ఆ తర్వాత ఎవరికీ నిద్రపట్టలేదు. మరో గంట గడిచిందో లేదో పెద్ద శబ్దాలతో నాలుగయిదు బస్ ళు వచ్చినట్లు వినిపించింది.
"అదిగో బస్ వచ్చింది?" అంది రాజేశ్వరి చటుక్కున లేచి కూర్చుంటూ.
"ఛట్! మనం బస్ కోసం ఎదుర్చూస్తున్నాం కాబట్టి ఊరికే అలా అనిపిస్తుంది అంతే!" అన్నాడు శాయిరామ్.
మరుక్షణంలో ఎవరో తలుపులు గట్టిగా బాదసాగారు.
"నేను చెప్పలే! అర్దరాత్రి హంతకులొస్తారని? వచ్చేశారు!" అందామె.
"ష్!" ఆమెవంక చూసి వారించాడు రంగారెడ్డి.
ఇంటాయన తలుపు తెరిచేసరికి ఎదురుగ్గా పోలీసులు నిలబడి వున్నారు.
"త్వరగా తయారయి, మీ విలువయిన వస్తువులు మాత్రం తీసుకుని బయటకు రండి! ఈ ఊళ్ళన్నీ ఖాళీ చేయించమని ప్రభుత్వ తాఖీడు లొచ్చాయ్-" అన్నాడొకాయన.
"అమ్మయ్యా ఇది మొదటిసారి! ఇలా దేవుడు పోలీసుల దూరంలో వచ్చి మనల్ని రక్షించడం!" అంది పార్వతీదేవి.
"వీళ్ళు నిజం పోలీసులేనంటారా?" అనుమానంగా అంది రాజేశ్వరి.
"ఏమిటా పిచ్చి అనుమానం?" కోపడ్డాడు రంగారెడ్డి.
"అదేదో ఇంగ్లీష్ పిక్చర్లో హంతకులు పోలీసుల డ్రస్ లో వచ్చి అందరినీ జీప్ లో తీసుకెళ్లి అడవుల్లో రేప్ లు- మర్డర్లూ చేసేశారు" అందామె.



