Home » yerramsetti sai » Humourology - 2
ఎన్నికల తుఫాన్
మీకు గుర్తుందో, లేదో- మేము అదివరలో మా కాలనీ తరపున సినిమా తీయడానికని ఓ కమిటీ వేశాము. ఆ సినిమా కథను మాంచి మార్క్సిజం మసాలాతో నింసానంటూ చంద్రకాంత్ ఛటోపాధ్యాయ స్క్రిప్ట్ మాకు సమర్పించాడు.
అందరం కూచుని మొదట పేజీ చదివామో లేదో "మిగతాది ఇప్పుడు కాదు" అన్నారు కమిటీ వాళ్ళందరూ ఖంగారుగా. మొదటి పేజీలోనే హీరో రక్షా తొక్కుతూ తొక్కుతూ నడిరోడ్డు మీద రిక్షా ఆపి రిక్షాలో కూర్చున్న వాడిని "విప్లవం వర్ధిల్లాలి" అంటూ కత్తితో పొడిచేస్తాడు.
"ఇదేమిటి? అది విప్లవం ఎలా అవుతుంది?" అని అడిగాను నేను ఆశ్చర్యంగా.
"మనిష్టం సార్! మనం ఏ రకంగా రాసినా దానిని మార్క్సిజం అనవచ్చు! ఎలాంటి సినిమా తీసినా 'ప్రజలు, రక్తం, విప్లవం' అనే మూడు డైలాగులు చివరల్లో చేర్చేస్తే అది మార్క్సిజం సినిమా అయిపోతుంది. అందాకా ఎందుకూ మీరు ఈ మధ్య టీవీలో వస్తోన్న నగ్జలైట్ల నాటకం చూళ్ళేదా?"
ఆ మాటతో అందరం సైలంటయిపోయాము. ఇంక అతనిని తప్పు పట్టటానికి ఏమాత్రం వీల్లేదనిపించింది. అలా అన్జెప్పి రిక్షావాడు రిక్షాలో కూర్చున్న వాడిని పొడిచెయ్యటం, కాఫీ హోటల్ సర్వర్, తింటున్న వాడిని గొడ్డలితో నరికెయ్యటం, సినిమా స్టూడియోల్లో లైట్ బాయ్ ప్రొడ్యూసర్ని మర్డర్ చేసేయడం- ఇవన్నీ విప్లవమే అంటే ఎలా వప్పుకోగలం? అంచేత అప్పటికి స్క్రిప్ట్ రీడింగ్ నిలిపివేశాము.
ఆ మర్నాడే హఠాత్తుగా బోసుబాబు మద్రాస్ నుంచి వచ్చాడు. అందరం అతని చుట్టూ మూగాము.
"మన కాలనీ సినిమాకి టైటిల్ రిజిష్టర్ చేసేశాను" అన్నాడతను.
"ఏం పేరు పెట్టావ్?" ఆతృతగా అడిగాడు శాయిరామ్.
"గుళ్ళో దేవుడు - ఊళ్ళో యముడు"
అందరం ఆశ్చర్యపోయాం.
"అదేమిటి? కథ తెలీదు కదా నీకు? ఆ టైటిల్ అసలు సరిపోదు దానికి!" అన్నాడు శాయిరామ్. బోసుబాబు ఘోల్లున నవ్వాడు.
"సినిమా ఫీల్డంటే ఏ మాత్రం తెలీని శుంఠళు చేసే కామెంట్ అది!" అన్నాడు మమ్మల్నందరినీ 'ఉసుళ్ళు' అనే పురుగుల్ని చూసినట్లు చూస్తూ.
'శుంఠలు' అన్నందుకు మాకు కోపం వచ్చింది గానీ.. ఆ విషయం బయటపడకుండా నవ్వేశాము. ఎందుకంటే మాకు సినిమా ఫీల్డులో విషయాలు నిజంగానే తెలీదు.
"సినిమా తీయాలంటే కథా, డైరెక్షనూ, యాక్టర్లు ముఖ్యం కాదు. అది ఓల్డ్ టెక్నిక్! ఇప్పుడు మొత్తం పిక్చర్స్ మనం పెట్టే టైటిల్ మీద ఆధారపడి వుంటుంది.
ఫీల్డంటే తెల్సినోళ్ళు ఫలానావాడు సినిమా ఎలా తీస్తున్నాడూ, ఏం తీస్తున్నాడూ అని కొశ్చెన్ చేయరు. ఏం టైటిల్ పెట్టాడని అడుగుతారు. డిస్ట్రిబ్యూటర్లూ, జిల్లా లోళ్ళు అందరూ ముహూర్తం పెట్టగానే ఏకగ్రీవంగా అడిగేదదే కొశ్చెన్! టైటిలేం రిజిష్టర్ చేశారు! అంతే!" అందరం నోళ్ళు వెళ్ళబెట్టి వాడి మాటలు వినసాగాము.
"ఇప్పుడు చూడండి! రేపు షూటింగ్ ముహూర్తం నాడు సినిమా పేరు "గుళ్ళోదేవుడు - ఊళ్ళో యముడు" అని పేపర్లలో వేయించామనుకోండి! అంతే తెల్లారేసరికల్లా మన కాలనీ కమిటీవాళ్ల చుట్టూ డిస్ట్రిబ్యూటర్లూ, జిల్లాల వాళ్ళూ తెగతిరుగుతారు- వాళ్ళ ఏరియాలకు కొనేసుకోడానికి!"
అందరం చాలా గర్వంగా నిజంగా ప్రొడ్యూసర్లలాగా ఫీలయ్యాం! మా చుట్టూ కొన్ని వందలమంది చేతులు చాచి మా గడ్డాలు పట్టుకుని ప్రాధేయపడుతున్న దృశ్యం కళ్ళముందు కనిపించింది.
"నాకు ప్రస్తుతం నాల్రోజులు మాత్రమే ఖాళీ ఉంది! కనుక మనందరం ఇవాళ రాత్రికే 'మచిలీపట్నం' వెళ్ళి లొకేషన్స్ సెలక్షన్ చేసుకురావాలి!" అన్నాడు బోసుబాబు. ప్రొడ్యూసర్ హోదాలో లొకేషన్స్ సెలక్షన్ చేసుకురావాలి!" అన్నాడు బోసుబాబు. ప్రొడ్యూసర్ హోదాలో లొకేషన్స్ సెలక్షన్ కెళ్ళడం చాలా ఆకర్షణీయంగా కనిపించింది మాకు.
ఆ రాత్రికే శాయిరామ్, నేనూ, రంగారెడ్డి జనార్ధన్, గోపాల్రావ్, పార్వతీదేవీ, రాజేశ్వరి, వెంకట్రావ్, యాదగిరి అందరం రైలుకి 'మచిలీపట్నం' బయల్దేరాం! అక్కడ సముద్ర తీరంలో లొకేషన్స్ చూడాలని బోసుబాబు ప్లాన్!
మచిలీపట్నంలో దిగగానే అందరం త్వరత్వరగా హోటల్ కెళ్ళి, స్నానాలో వగైరాలూ కానించి బస్ స్టాండ్ కి చేరుకున్నాం. ముందు మచిలీఫోర్ట్ కెళ్ళాం గానీ అక్కడి సీనరీ బోసుబాబుకి నచ్చలేదు. అక్కడి నుంచీ అందరం 'గోడదేవరపల్లి' కెళ్ళాం. బస్ దిగి ఊరుదాటి సముద్ర తీరం చేరుకునేసరికి మధ్యాహ్నం పన్నెండయిపోయింది.
చాలా బ్రహ్మాండంగా ఉంది సీనరీ అక్కడ. ఆకాశమంతా మబ్బులతో మూసుకుపోవడం వల్ల మరింత ఆహ్లాదంగా ఉంది.
తీరం వెంబడి సరుకు తోటలు సముద్రం వేపు నుంచీ చూస్తోంటే ఎంతో అందంగా కనబడుతున్నాయ్. "ఒండర్ ఫుల్" అన్నాడు బోసుబాబు. "అద్భుతమయిన లొకేషన్! ఇక్కడ హీరో హీరోయిన్స్ మీద సాంగ్స్ షూటింగ్స్ చేయవచ్చు.
జనార్ధన్ పొంగిపోయాడు. తను ఆ క్షణంలోనే హీరో అయిపోయి నట్లనిపించింది అతనికి.
"అవును! నేను ఇటువేపునుంచీ పరుగెత్తుకొస్తాను- హీరోయిన్ అటువేపు నుంచీ పరుగెత్తుకొస్తుంది. ఇద్దరం ఈ పడవ దగ్గర కలుసుకుని- ఎగురుతూ పడవ చుట్టూ తిరిగిపాడతాం!" అన్నాడు ఆనందంగా.
అందరం మరికొంత దూరం నడిచాము.
"ఇక్కడనుంచీ సముద్రంలో టైటిల్స్ వేస్తే ఎలా వుంటుంది?" అడిగాడు శాయిరామ్. బోస్ బాబు కెమేరాలో నుంచి చూస్తున్నట్టు వంగి ఓర కంటితో సముద్రం వేపు చూశాడు.
"సూపర్బ్! టైటిల్స్ ఆకాశం నుంచి కిందకుదిగి సముద్రంలో మునిగిపోతూండేట్లు లాగిస్తే భలే వెరయిటీగా ఉంటుంది!" అన్నాడతను.
పార్వతీదేవి భుజానికున్న ట్రాన్సిష్టర్ లో నుంచి వినిపిస్తోన్న సంగీతం ఠక్కున ఆగిపోయింది.
"ఒక ముఖ్య ప్రకతన! బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం వల్ల రానున్న 48 గంటలలో గంటకు 150 నుంచీ 180 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయ్. విస్తృతంగా వర్షాలు పడే సూచనలున్నాయ్. ఈ వాయుగుండం మచిలీపట్నం ప్రాంతంలో తీరాన్ని దాటవచ్చు! ఆ సమయంలో సముద్ర కెరటాలు పదినుంచీ పదిహేను మీటర్ల ఎత్తున ఎగసిపడతాయ్-"
పార్వతీదేవి మొఖం పాలిపోయింది. మిగతా అందరూ కూడా భయంగా సముద్రం వేపు చూశారు.



