Home » Balabhadrapatruni Ramani » అనూహ్య
నన్నోసారి చూసి తల తిప్పుకుని, "తన్మయీ.... నేను ఓసారి హాస్పిటల్ దాకా వెళ్ళొస్తాను. నువ్విక్కడే వుండు" అని వెళ్ళిపోయాడు.
నాకు చర్నాకొలతో కొట్టినట్లుగా అయింది.
గబగబా కిచెన్ కి నడిచి టి కలపసాగాను.
పక్కగదిలో నుండి తన్మయి ఏదో కూనిరాగం తీయడం వినిపిస్తోంది.
టీ చేశాక ఆమెకి ఇవ్వలా లేక ఒక్కదాన్నే తాగేయాలా అన్న ధర్మసందేహం మొదలైంది. పక్క ఇంటివాళ్ళకి ఇవ్వవలసిన అవసరం ఏముందీ? అనుకుని కప్పులో పోసుకుని హాల్లోకి వచ్చాను.
టీ.వీ. ఆన్ చెయ్యగానే ఏదో స్త్రీ ల కార్యక్రమం అనుకుంటూ వస్తోంది.
ఆ భర్త భార్యని నానడుర్భాషలాడ్తు తిట్టీ, కొట్టి ఇంట్లోంచి వెళ్ళిపోయాక ఆ భార్య స్నేహితురాలి దగ్గరకొచ్చి ఏడుస్తోంది.
ఆ స్నేహితురాలు అతన్ని వదిలేసి స్వతంత్రంగా బతకమని సలహా ఇస్తోంది.
"లేదు...లేదు ఆయన తప్పక మారతాడు. ఆయన తోటే నా బతుకు ముడిపడివుంది. ఈ మాంగల్యనికి ముడిపడడమే కానీ విప్పించుకోవడం తెలీదు" భారీ డైలాగ్స్ వల్లిస్తూ గ్లిజరిన్ కన్నీళ్లు దారా పాతంగా కార్చేస్తోంది తన్నులు తిన్న ఇల్లాలు.
"అతను మారేదాకా ఇలాగే తన్నులు తింటూనే వుంటావా? ఛీ.... నీదీ ఓ బతుకేనా? చక్కగా స్వతంత్రంగా నీ కాళ్ళమీద నువ్వు బతుకు! అతన్ని వదిలెయ్" అంది స్నేహితురాలు.
నాకు ఆ స్నేహితురాలిని చూస్తే చాలా ముచ్చటేసింది వెంటనే నిజయకి ఫోన్ చేసి నాటకు చూడమని చెప్దామనిపించింది. కానీ తిడుతుందని భయపడి ఊరుకున్నాను.
నెక్ట్స్ సీన్లో స్నేహితురాలి మాటప్రకారం భర్త నుండి విడిపోయి హీరోయిన్ నానా కష్టాలూ పడుతున్నట్లుగా చూపించారు.
అంటే.... భర్త తన్నినా, తిట్టినా , కిరుసిన్ పోసి కాలుస్తాడని తెలిసినా విడిపోవడం అంత మంచి పని కాదని చెప్పడమే వీళ్ళ ప్రధాన ఉద్దేశమా?
నేను టెన్షన్ గా చూస్తుండగా అక్కడ ఆపి మిగతాది వచ్చేవారం అన్నారు!
నాకు తిక్క రేగింది. ఇలాంటిచోట్ల ఆపితే ఎలా? నాటకం చూపి భర్తల నుంచి విడిపోయి స్వతంత్రంగా బతకాలనుకునే చాలామంది ఆడవాళ్లు ఏంచెయ్యాలో తెలీక డైలమాలో పడిపోరూ!
ఏడురోజులు ఏడుస్తూ గడపడం అంటే మాటలా? వెంటనే లేచి కార్డు తీసు కుని టి.వీ స్టేషనుకి లెటర్ రాద్దనునుకున్నాను.
ఇంతలో "హలో....వివేక్ వున్నాడా? అనే ప్రశ్న వినిపించింది.
తల ఎత్తితే వివేక్ ఫ్రెండ్ సారథి!
నవ్వుతూ నిలబడివున్నాడు.
నేనుకూడా నవ్వుతూ- "రండి.... రండి... ఇప్పుడే బయటికి వెళ్ళారు.... వచ్చేస్తారు" అని ఆహ్వానించాను.
అతను సోఫాలో "కూర్చుని - ఒక్కరే వున్నారా?" అని అడిగాడు.
ఇంతలో గదిలో నుంది తన్మయి కూనిరాగం వినిపించింది.
అతను నా వైపు విచిత్రంగా చూస్తూ-" ఎవరో వున్నట్లున్నారు?" అన్నాడు.
నాకు వచ్చివెలక్కాయి గొంతులో పడినట్లయింది. ఏం చెప్పాలీ? మా వారి సెక్రెటరీ ఆయన బెడ్ రూమ్ లో వుందనా? లేక మా మేనకోడలని అబద్దమా లేక.... అని ఆలోచిస్తూ వుండిపోయాను.
గొంతు బావుంది" నవ్వుతూ అన్నాడు.
నాకు గభాల్ని రూమ్ లో కెళ్ళి ఆ గొంతుని కసిక్కన నోక్కేయాలనిపించింది.
మాట మార్చడానికి, "మీ మిసెస్ ని కూడా తీసుకురావాల్సింది!" అన్నాను.
"తను బాగా బిజీకదా! పగలంతా కాలేజ్ లో టీచింగ్.... సాయంత్రం ఇంటిదగ్గర 'ట్యూషన్స్!" అన్నాడు సారథి.
నన్ను 'ఖాళీ' అని ఎత్తిపొడవడంలేదు కదా అనిపించింది. ముఖం తిప్పుకుని టీ.వీ లో పురుష్ క్షేత్ర్ వస్తుంటే చూస్తూ కూర్చున్నాను.
నా మనసులో మాత్రం చాలా ఆనందంగా వుంది. ఇప్పుడు వివేక్ వస్తే రూమ్ లోకి వెళ్ళకుండా ఇతనితో మాట్లాడ్తూ కూర్చుంటాడు కదా అని!
అతను రెండు నిమిషాలు మౌనంగా కూర్చున్నాక, "ఇంక నే వెళ్లొస్తా .... రాగానే ఫోన్ చెయ్యమని చెప్పండి" అన్నాడు.
నాకు వెళ్ళిపోతాడేమోనని కంగారేసి-" అరె... రే.... కూర్చోండి.... వచ్చేస్తారు" అన్నాను.
అతను "లేదండీ....పనుందీ" అన్నాడు.
"నాకు చాలా బోర్ గా వుంది. కాసేపు వుండండి" అనాలోచితంగా అనేశాను.
అతను లేచే ప్రయత్నం మానేసి నావైపు పరీక్షగా చూశాడు.
తెల్లనీ కోయిల్ చీరలో, తలంటుకున్న కురులు గాలికీ వదిలేసి, నిద్రకళ్ళతో వున్న నాలో ఏం కనిపించిందో గుచ్చిగుచ్చి చూడసాగాడు.
నాకు ఇబ్బందిగా అనిపించి ఓ"టీ తెస్తాను " అని లేవబోయాను.
"వద్దు... మీరు ఇలా కూర్చోండి చాలు!" అన్నాడు. అతని కళ్ళల్లో, గొంతులో మార్పొచ్చింది. బహుశా వివేక్ భార్యగా కాకుండా నన్ను నన్నుగా చూడటం స్టార్ట్ చేసినట్లున్నాడు!
"మీరు మాట్లాడితే వీణ మీటినట్లుగా వీనుల విందుగా వుంటుంది" అన్నాడు.
'కరెంట్ తీగ పట్టుకున్నట్లుగా లేదూ!" అందామనుకున్నాను. నాకు ఈ మధ్యే ప్రపంచంగురించీ, అందులోని మగవాళ్లగురించీ, తెలుస్తోంది!
అమ్మా అమ్మమ్మా చెప్పిన ప్రపంచంలో , చిన్నప్పటినుంచీ చూసిన సినిమాల్లో చదివిన నవలల్లో, మగవాడు ఆడది ఒంటరిగా చిక్కగానే తలుపులు మూసి రేప్ చేసేస్తాడు.
కానీ అది వాస్తవానికి విరుద్దం!
మగవాడు తలుపులు అన్నీ తీసేవుంచే, స్త్రీ ని తియ్యని మాటలతో తనలైనుకి తెచ్చుకుంటాడు! కాస్త ఆలస్యం, కష్టం అయినా ఈ ప్రక్రియనే ఇష్టపడ్తాడు. ఇందులో రిస్క్ తక్కువ!
ఎంతో ఎక్స్ పోజర్ వున్న ఈ రోజుల్లో స్త్రీ మగవాడు తనకిలైను వేస్తున్నాడని తెలీనంత అమాయకంగా పడిపోవడంలేదు!
"ఏవిటి...వుండమని, ఏవీ మాట్లాడకుండా కూర్చున్నారూ?" సారథి కాస్త చనువుగా అన్నాడు.
అతని చూపులు తచ్చాడుతున్న చోట అప్రయత్నంగా సర్దుకున్నాను.
టీ.వీ.లో మాట్లాడుతున్న అమ్మాయిని చూస్తూ-
"ఈ అమ్మాయి బావుంది" అన్నాను ఏదో ఒకటి మాట్లాడాలి కనుక!
"మీ కంటేనా ?" అన్నాడు.
అతనంత డైరెక్ట్ గా అంటాడని నేను అస్సలు ఊహించలేదు. కాస్త ఇబ్బందిగా నవ్వాను.
"మీరో సంగతి గమనించారా? మీరు నవ్వితే, మీ పెదవుల కన్నా ముందు మీ ముక్కు నవ్వుతుంది!" అన్నాడు.
ఎనాలిసిస్ స్టార్ట్ చేశాడన్నమాట!
"మీ ఫిజిక్ చాలా బావుంటుంది!" అన్నాడు సారథి.
ఆ మాటలు తన్మయి వింటే బావుండునని అనిపించింది.
"విచిత్రం చూశారా? నేను ఇన్ని మాట్లాడుతున్నా మీరు నోరు విప్పలేదు. అయినా మీ సమక్షం చాలా హాయిగా వుంది" అన్నాడు.
'హూ! అందుకేనా మా ఆయన బెడ్ రూమ్ లో ఆయన సెక్రెటరీ వుందీ!' అనుకున్నాను.
"ఇంకా డిగ్రీ చదువుతున్న కాలేజి అమ్మాయిలా వుంటారు"
ఆ మాటలకీ నాకు ఒక్కసారిగా చేతిమీదున్న వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. దాన్ని జలదరింపో, పులకరింతో ఏదో అంటారు కాబోలు!
"వివేక్ చాలా అదృష్టవంతుడు" కాస్త బాధగా మొహంపెట్టి అన్నాడు.
'నీ అదృష్టానికే మొచ్చిందీ? కాలేజీలోనూ, ఇంట్లోనూ మీ ఆవిడ పిండిగుండా అయి బోలెడు డబ్బూ, నువ్వు ఊరేగడానికో కారూ అన్నీ అమర్చి పెడ్తోందిగా!' అనాలనిపించింది.
ఇంక అతనిముందు కూర్చోవడం దుస్సహనంగా వుంది!
నేనెవర్నీ ఎక్కువ సేపు భరించలేను అది నా లోపమేమో!
"మీకు డాన్స్ అంటే ఇష్టమేనా?" అని అడిగాడు సారథి.
"ఇష్టమే! కానీ చెయ్యను" సీరీయస్ గా మొహం పెట్టి చెప్పాను.
అతను పెద్దగా నవ్వి-" ఏమో అనుకున్నాను... బాగానే మాట్లాడ్తారు మీరు. అది కాదండీ... రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో ఒడిస్సీ డాన్స్ ప్రోగ్రామ్ కి టికెట్లు కొన్నాను. మా మిసెస్ తనకి రావడానికి వీలు కాదంటోంది. మీరు వస్తారేమో.... మీకు నీలవుతుందేమోననీ..." అని ననుగుతుండగా.
"వీలవదు" ఠకిమని చెప్పాను.
అతని మొహంలో తీరని ఆశాభంగం కనిపించింది.
"రేపు సాయంత్రం ఈ టైమ్ లో ఏంచేస్తారూ?" అని అడిగాడు.
"ఏమీ చెయ్యను. ఇలాగే టీ.వీ ముందు కూర్చుని చెత్త ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటాను. ఎవరైనా వచ్చి ఎదురుగా కూర్చుని ఎక్కువగా మాట్లాడిస్తే నాకు ఇష్టం వుండదు. మనసులో తిట్టుకుంటాను" అనేశాను.
నేను ఆఖరిమాట పూర్తిచేస్తుండగా అతను లేచి నిలబడి ఎర్రనైన ముఖంతో "వెళ్ళొస్తాను" అన్నాడు.
"మంచిది" అన్నాను.
అతను వెళ్ళిపోయాడు.
'అమ్మయ్యా!' అని నిట్టూర్చాను.
ఫోన్ రింగ్ అయింది. "హలో...." అనగానే వివేక్ స్వరం వినిపించింది.
"తన్మయిని పిలు" అన్నాడు.
నేను పక్కకీ చూసేసరికి తన్మయి కనిపించింది. "నీకే" అన్నాను.
ఒక్క అంగలో వచ్చి చటుక్కున తీసుకుంది. "హలో.... అలాగే... ఓ.కే!" సంబరంగాఅంది.
ఫోన్ పెట్టేశాకా నాతో "డాక్టర్ గారు రాత్రికి భోజనానికి రానని చెప్పమన్నారు. నేనూ క్లినిక్ కి వెళ్తున్నాను" అని వెళ్ళిపోయింది.
నేను నిర్లిప్తంగా చూశాను.
'నాది నాది అనుకున్నది....నీది కాదురా....' అనే పాట ఎక్కడిమండో లీలగా వినిపిస్తోంది.
రేపు ఏంచెయ్యాలా? అనే ఆలోచనరావడంతో పేపర్ ముందు పెట్టుకుని 'వాంటెడ్ కాలమ్స్ ' చూడటంలో బిజీ అయిపోయాను.
'గాంధీ మెమోరియల్ స్కూల్లో టీచర్లు కావలెను. అనుభవం వున్నానూ, లేకున్ననూ ఫరవాలేదు' అనే ప్రకటన చూసి ఆ అడ్రెస్ నోట్ చేసుకున్నాను.



