Home » Balabhadrapatruni Ramani » అనూహ్య


                              10 వవారం  సీరియల్    

   "ఇంతకుముందు అనుభవం ఏమైనా వుందా?" అడిగాడతను. "లేదు" అన్నాను.
    అతను టైటుగా బొజ్జమీద పుగిలిపోయేటట్లుగా వున్న షర్ట్ వేసుకుని, గుండ్రటి కళ్ళద్దాలతో భలే ఫన్నీగా వున్నాడు.
    అతని పక్కచైర్లో, కుర్చీ  పట్టనంత భారీగా  వున్నావిడ చిరాగ్గా  నొసలు ముడేసి మమ్మల్నిద్దర్నీ మార్చి మార్చి చూస్తోంది.
     అతను గొంతు సవరించుకుని "స్కూల్లో పనంటే మాటలు కాదు! పిల్లలతో చాలా సహనం అవసరం. ఎంత  శాంతంగా వుంటే స్కూలుకి అంత మంచిపేరు..."అని అతను చెబ్తూవుండగానే ఎవడో కుర్రాడు కిటికీ  లోంచి 'కూ' అని అరిచి పారిపోయాడు.
    అతను చెప్పడం ఆపి, "ఎవడ్రా అదీ రాస్కెల్?" అంటూ  పక్కనేవున్న బెత్తం  పట్టుకుని వెళ్ళి, పారిపోతున్న కుర్రాడ్ని చెవి వూడిపోతుందేమోనన్నంత గట్టిగా  పట్టుకుని లాక్కొచ్చాడు.
     "ఇక్కడ స్కూల్ అయ్యేదాకా  నీల్ డౌన్ చెయ్యి వెధవా!"  అని అరిచి, వచ్చి కూర్చున్నాడు.
    నేను ఏడుస్తున్న  వాడ్నీ, ఎర్రబడిన వాడి చెవినీ బాధగా చూశాను. పట్టుమని పదేళ్లు లేని వెధవకి అలా అరవకూడదని ఏం తెలుస్తుందీ?
    మా చిన్నప్పుడు బడిలో నేను ఎంత అల్లరి చేసినా ఏం అనేవారు కాదు! అమ్మమ్మ మాస్టార్లకి వెన్నపూసా, జున్నుపాలూ, పూతరేకులూ క్రమం తప్పకుండా పంపిస్తుండేది!
    అతను వచ్చి కుర్చీలో కూర్చుంటూ  "ఆఁ! ఇందాకా ఏం  చెప్తున్నానూ? ఓర్పు గురించి కదూ.... ఉపాధ్యాయులకి  ఓర్పు  చాలా అవసరం. అస్సలు కోపం, విసుగూ వుండకూడదు!" అన్నాడు.
    ఇంతలో గణగణ గంట  మ్రోగింది.
    అతను కళ్ళు పెద్దవి చేసి, పళ్ళు కొరుకుతూ, "ఎవడ్రా అదీ? ఇంకా రెండునిమిషాలుండగానే లంచ్  బెల్ కొట్టిందీ? తోలు ఒలిచేస్తా స్కాండ్రల్స్" అని  అరుచుకుంటూ వరండాలోకి వెళ్ళాడు.
    నేను ప్రిన్సిపాల్ అన్న నేమ్ ప్లేటునీ, పక్క చైర్లో కూర్చున్నావిడ్నీ చూసి, సందేహం  తీరక  "మీరేనా ప్రిన్సిపాల్?" అని ఇంగ్లీషులో అడిగాను.
    ఆవిడ బ్లాంక్ గా చూసింది.
    ఈసారి  తెలుగులో అడిగాను. అదే చూపు!
    ఈసారి మరింత కష్టపడి హిందీలో అడిగేశాను.
    కనుబొమలు ముడి కాస్త  విడివడి "హ!" అని  మూల్గింది. ఆ తర్వాత మూతి మళ్ళీ  నిడాయించేసింది. ఈ లోగా ఆవిడభర్త ఎవర్నో  తిడ్తూనే లోపలికి  వచ్చాడు. వస్తూనే  నీల్ డౌన్ చేస్తున్న పిల్లాడ్ని జుట్టుపట్టుకుని గుంజి, వీపుమీద బాదేశాడు.
    నేను ఆ పిల్లవాడి ఏడుపూ, అరుపులూ చూడలేక తల తిప్పేసుకున్నాను. గుండెని ఎవరో సూదులతో గుచ్చుతున్న ఫీలింగ్ ! ఏ తల్లి  కన్నబిడ్డో? 'అమ్మా అమ్మా' అంటూ  ఏడుస్తున్నాడు.
    తన బిడ్డ  పిలుపుకే కాదు.... ఏ బిడ్డ  పిలుపుకైనా ప్రతిస్పందించె  అమ్మతనం ప్రతి స్త్రీ లోనూ  వుంటుందేమో! నేను ప్రిన్సి పాల్ వైపు చూశాను.
     ఆవిడలో  ఏ స్పందన లేదు! రాటుతేలిపోయిన ఆడపోలీసులా కనిపించింది.
    అతను పిల్లవాడ్ని బయటికి పంపించి కర్రతో నావైపు వస్తూవుంటే  నా గుండెలు దడదడలాడాయి! నాకు చిన్నప్పటినుండీ దెబ్బంటే భయం! ఎన్నడూ నా ఇంటిమీద  దెబ్బ పడనీయలేదు అమ్మమ్మ ఈసారి  లెఖ్ఖల మాస్టారు అరచేతిమీద బెత్తంతో కొడ్తే నేను ఏడుస్తూ ఇంటికీ  పరిగెత్తేశాను.
    అప్పుడు అమ్మమ్మ  కవ్వంతో మజ్జిగ చేస్తోంది. అమాంతం వెళ్ళి పీక కౌగిలించేసుకుని  వెక్కిళ్లు పెడ్తూనే సంగతంతా చెప్పేశాను అమ్మమ్మ కాళికా అవతారం  ఎత్తింది. కవ్వంతోటే బడికొచ్చేసింది.
    మాస్టారు క్లాసులో వున్నాడు.

   'ఇసింటా రా  నాయనా' అంటూ  చాటుకి తీసుకెళ్ళింది. 'చెయ్యి పట్టూ' అంది.
    ఆయన అయోమయంగా  చూస్తూ ఏ ప్రసాదమో పెడ్తుందేమోననుకుని చెయ్యి పట్టాడు.
    కవ్వం తిరగేసి అమ్మమ్మ ఒక్కదెబ్బ వేసింది.
    'అమ్మో!' అని అరిచాడు మాస్టారు నొప్పి  భరించలేక కళ్ళమ్మట నీళ్ళుకూడా తిరిగాయి  పాపం!
    "ఏవిటండీ ఇదీ?' అని అరిచాడు.
    'ఇంతవయసొచ్చి నువ్వే  తట్టుకోలేకపోయవే? మరి పసిది... లేత  తమలపాకులాంటి పిల్ల.... అదెలా  తట్టుకుంటుందనుకున్నావ్? ఈ అనసూయమ్మ సంగతి నీకింకా  తెలిసినట్లు లేదు' అంది.
    ఆ తర్వాత బడిలో  నామీద చెయ్యిచేసుకునే  సాహసం ఎవరూ  చెయ్యలేదు! అందుకే నాకు అమ్మమ్మ అంటే అంత ఇష్టం.
    అతను ఆయాసపడ్తూ వచ్చి, సొరుగులోంచి గ్లూకోజ్ తీసి రెండు చెంచాలు నోట్లో వేసుకుని "నాకు కాస్త లో బీ.పీ. ఆఁ.. పిల్లలతో  శాంతంగా  వున్నవాళ్ళకే ఇక్కడ ఉదోగ్యం  దోరుకుతుంది. శాంతంగా వుండగలరా?" అన్నాడు.
    అతనికి 'శాంతం' గురించి  ఓ క్లాసు తీసుకోవాలనిపించినా ఓర్చుకున్నాను.
    "జీతం  ఎవరికైనా స్టార్టింగ్ లో  అయిదువందల  రూపాయలే ఇస్తాము" అన్నాడు.
    'ఇంటర్వ్యూ అయిపోయిందా!' అని నాకు తెగ ఆశ్చర్యం వేసింది.
    "మీరు ఏడోక్లాసుకి మేథమేటిక్స్, ఆరోతరగతికి  సైన్సూ, ఐదో తరగతివాళ్లకి హిందీ, మిగతా  క్లాసులకి ఏయే టీచర్లు రాలేదో చూసి ఆ....ఆ  సబ్జేక్స్ చెప్పాల్సి వుంటుంది" అన్నాడు.
    "కానీ నేను మేథ్స్...సైన్స్ .... అంతంత పెద్దక్లాసులకి" అని నసిగాను.
    అతను కటువుగా "మీరు ఏడు ఎనిమిది  క్లాసులు చదువుకోలేదా?" అన్నాడు.
    నాకు చిరాకేసింది. "చదువుకోవడం వేరూ, టీచ్ చేయడం వేరూ... నా సబ్జెక్ట్స్ అవి కావు. నేను  ఆర్ట్స్ స్టూడెంట్ ని!" అన్నాను.
    "ఆర్ట్స్ చెప్తారా? అఖ్ఖర్లేదు చదువు చెప్తేచాలు!" అన్నాడు మూర్ఖంగా.
    నాకు అతని జ్ఞానంపట్ల పూర్తి అవగాహన కలిగింది.
    ప్రిన్సిపాల్ అయోమయంగా  మా  ఇద్దర్నీ మార్చి మార్చి చూస్తోంది.
    "ఇష్టమైతే వెంటనే వెళ్ళి క్లాస్ తీసుకోండి" అని అన్నాడతను.
    నేను ఓ నిమిషం  ఆలోచించాను. ఇంట్లోకూర్చుని ఊసుపోని ఆలోచనలతో  పిచ్చెక్కిపోవడం కంటే నాయమేకదా! అసలే చిన్నప్పటినుండీ  టీచర్ ఉద్యోగం అంటే  వల్లమాలిన ఇష్టం. అసలు ఆ ఆట ఆడని ఆడపిల్లలే వుండరేమో!
   "ఓ.కే. సర్!" అన్నాను.
     అతను బెల్ కొట్టి ప్యూన్ ని పిలిచి "మేడమ్ కి ఒకటో క్లాసు చూపించు "అన్నాడు.
    నేను థాంక్స్ చెప్పి ప్యూన్  వెంట నడిచాను.
    క్లాసు రూమ్ అంతా రణరంగంలా  వుంది. చాక్పిస్ పొడి  తెల్లగా  ముసిరిన మేఘంలా చుట్టుకుపోయి వుంది. కానీ అంతమంది చిన్నారులని ఒక్క చోట చూడగానే నాకు చాలా ముచ్చటేసింది. చిరునవ్వు నవ్వాను. వాళ్ళు నవ్వలేదు. కామ్ గా అయిపోయి శత్రువుని చూచినట్లు చూశారు. "గుడ్ ఆఫ్టర్ నూన చిల్డ్రన్" అన్నాను.
    వాళ్ళలో మార్పు లేదు. నా చేతిలోవున్న లావాటి బెత్తాన్నే భయంగా చూస్తున్నారు. అది గ్రహించిన నేను "దీన్నిచూసి భయపడుతున్నారా? నేను కొట్టనే కొట్టాను! ఇప్పటినుండీ మనం ఫ్రెండ్స్ అన్నమాట! ఆడుకుందామా?...." అంటూ దాన్ని మధ్యలోకి పుటుక్కున విరిచేశాను.
    ఒక్కసారిగా పిల్లల్లో కలకలం చెలరేగింది. వాళ్ల హర్షాతిశాయాన్ని నేను ఆనందంగా వీక్షిస్తూ కూర్చున్నాను.
    పావుగంట తర్వాత....
    క్లాసంతా కాగితపు రాకెట్లతో నిండిపోయింది. నా చీరకుచ్చిళ్ళు వాళ్ళు లాగిలాగి ఊడబీకేశారు. జడకూడా రేగిపోయింది. నా చెవులు రెండూ ఆ గోల  భరించలేక ఘళ్లుపడ్డాయి. నా తల మీద  ఎవరో సుత్తులతో బాదుతున్న ఫీలింగ్ తో, నిస్సత్తువగా వాళ్ళని గమనిస్తూ, మధ్యమధ్యలో వాళ్ల మీద  గొంతు చించుకుని అరుస్తూ వుండిపోయాను.
    సాయంత్రానికల్లా టీచర్లకి సహనంతో పాటు బెత్తాలూ ఎంత అవసరమో తెలిసొచ్చింది!
    స్కూలు వదిలే సమయానికి పది లంఖణాలు చేసినదన్లా తయారయ్యాను.
    కొంతమంది టీచర్లు వచ్చి  పరిచయం  చేసుకున్నారు. నా పరిస్ధితి చూసి "మొదట్లో  ఇలాగే వుంటుంది. రావ్రాను  అలవాటైపోయి ఇంత ఇదిగా వుండదులెండి" అని దైర్యం చెప్పారు.
    నాకు మాత్రం స్కూలుటిచర్ ఉద్యోగం  అంటే  సినిమాల్లో చూపించినట్లుగా  పిల్లల్నేసుకుని, పాటలు  పాడుతూ, పార్కులమ్మాటా, పుట్టాలమ్మాటా తిరగడం  కాదనీ, దీనికన్నా మా వరాల్లా పదిళ్ళలో పాచిపనులు చేసుకోవడం సులువనీ అనిపించింది!


Related Novels


Priyathama O Priyathama

Trupti

Swargamlo Khaideelu

Madhuramaina Otami

More