Home » Balabhadrapatruni Ramani » అనూహ్య


                                              

                                    9 వవారం   సీరియల్         
     'ఇచ్చట ప్యూర్ షీ అమ్మబడునూ' అన్న బోర్డు చూసి ఆగిపోయాను. ఇదేం బోర్డూ, 'షీ' అమ్మబడునా? అని పైకి చూస్తే 'ప్యూర్  ఘీ సోల్డ్ హియర్' అన్న ఇంగ్లీషు అక్షరాలు కనిపించాయి. ఘీ కొచ్చిన తిప్పలా అనుకుని బ్యాగ్ లోంచి ఎడ్రెస్ కాయితం తీసి  చూశాను.
    సరిగ్గానే వచ్చాను. జస్ జిత్  ఫిలిం డిస్ట్రి బ్యూటర్స్ ఆఫీస్ వుండేది రెండో అంతస్తులోనే, బోలెడు డబ్బు పోసి బోర్డులు రాయించేవాళ్లు కాస్త అక్షరాలు సరిగ్గా రాయడం వచ్చినవాళ్ళచేత రాయిస్తే ఏంపోయిందీ అనుకుంటూ మేట్లెక్కాను. జస్ జిత్ ఫిలిం డిస్ట్రి బ్యూటర్స్ అన్న  బోర్డున్న ఆఫీసులోకి నడిచాను. అంతా నిశ్శబ్దంగా వుంది.
    "ఓ నలభై ఏళ్ళ వ్యక్తి పాన్ నములుతూ సినిమా బొమ్మలున్న పత్రిక దేన్నో చూస్తున్నాడు.
    ఇంకొక పాతికేళ్ళ  అమ్మాయి టైప్ మిషన్ మీద తల పెట్టుకుని నిద్రపోతోంది.
    నేను లోపలికి  నడిచినా ఇద్దరిలో కదలిక  రాలేదు. నేను ఆ నడివయసాయన దగ్గరకు నడిచి-
    "ఎక్యూజ్ మీ" అన్నాను.
    అతను తలెత్తి చూశాడు. ఇంకా ఆ సినిమా తారల ప్రభావంలోంచి బయటపడినట్లు లేడు! తల స్టయిల్ గా సర్దుకుంటూ, కాలూపుతూ-" ఎస్... చెప్పండి మేడమ్! ఏం పనిమీద వచ్చారూ?" అన్నాడు.
    నేను బ్యాగ్ లో చెయ్యి పెట్టి ఓ పేపర్ కట్టింగ్ తీసి-" ఇది  చూసి  వచ్చానండీ" అన్నాను.
    అతను అయోమయంగా చూస్తూ-"దీనికి మాకూ ఏవిటి సంబంధం?" అన్నాడు.
    నేను తనన్న ఆ మాటలకి ఆశ్చర్యపోతూ చేతిలోని పేపర్ వైపు చూశాను.
    'మాత బాలభవానీ పూజలు రేపట్నుండే, భక్తులు చందాలకి త్వరపడండి...మన పాపాలు పోగొట్టుకునే సులభమార్గం!' అని వున్న  పేపర్ కట్టింగ్ అది! గబుక్కున నాలిక కరుచుకుని వెనక్కి తిప్పాను.
    ఈలోగా అతను- "అడుక్కోవడం కూడా ఫ్యాషన్ అయిపోయిందమ్మా! అందులోనూ దేవుడి పేరు చెప్తే పడనివాడు వుండడని జానానికి తెలిసిపోయింది..." అని ఇంకా  ఏదో అనబోతుండగా-
    నేను ఉక్రోషంగా "ఆగండి... పోరపోట్న పేపర్ వెనక్కి తిప్పి చూపించాను... ఈ ప్రకటన మీదేగా!" అని పేపర్ కట్టింగ్ చూపించాను.
    అతను దాన్ని చూస్తూ-"ఆఁ...ఆఁ! ఇంతకీ మీరు ఉద్యోగం కోసమా?" అన్నాడు.
    "ఔను" అన్నాను.
    "కానీ ఇది టై పిస్ట్ పోస్ట్ కి ఇచ్చిన ప్రకటన మేడమ్..." అని నన్ను తేరిపారజూశాడు.
    "ఏం, నేను టైప్ చెయ్యలేననిమీ అభిప్రాయమా?" కాస్త విసుగ్గా  అడిగాను.
    అతను "కూర్చోండి" అని కుర్చీ జరిపాడు ఆ తర్వాత పడుకున్న అమ్మాయిని ఉద్దేశించి- కనక వల్లీ...కనకవల్లీ...మేడమ్గారికి కాసిని మంచినీళ్ళు పట్రా!" అని కేకేశాడు.
    నిద్రపోతున్న  కనకవల్లీ అదాటుగా లేచి, అతనివైపు చూసి, భారంగా కూజావైపు అడుగులు వేసింది.
    అతను పాన్ దాన్ లోంచి కిళ్లీ తీసి  బుగ్గన పెట్టుకుని మాట్లాడ్తూ- " ఆవిడ మా టై పిస్ట్! మెటర్నిటి లీవ్ మీద  వెళ్తోంది. అందుకే కొత్త కేండిడేట్ కోసం ప్రకటన ఇచ్చాం" అన్నాడు.
    అతను మాట్లాడ్తున్నప్పుడు కిళ్లీతుంపరలు తుళ్ళి పడటంతో నేను కాస్త  వెనక్కి జరిగాను.
    ఇంతలో కనకవల్లి భారంగా నడుస్తూ మంచినీళ్ళూ గట్రా అందించాల్సోస్తుందేమో అనిపించింది.
    అతను స్టూలు చూపిస్తూ- "కూర్చో కనకవల్లి ! మేడమ్ పేపర్లో ప్రకటన చూసి ఉద్యోగం కోసం వచ్చారట" అన్నాడు.
    ఆమె నమ్మలేనివిషయం వింటున్నట్లుగా-" మీరు... ఇక్కడ ఉద్యోగం చేస్తారా?" అంది.
    "ఔనూ...ఏం?" అన్నాను.
    "జీతం ఎంతో  తెలుసా?" అంది కనకవల్లి.
    "తెలీదు ఎట్రాక్టివ్ శాలరీ అని పేపర్లో చూశాను"
    ఆమె నన్ను క్రిందనుండి మీదిదాకా చూసి, "ఆరువందలకి మీరు  ఎట్రాక్ట్ అయిపోతారా?" అని  అడిగింది.
    నేను కట్టుకున్న  గద్వాలచీరా , చెవులకి పెట్టుకున్న రవ్వల దుద్దులూ, చేతినిండా వున్న బంగారు గాజులూ  వాళ్ళని తికనుకపెట్టెస్తున్నాయి కాబోలు! మొహ మొహాలు చూసుకున్నారు.
    నేను చిన్నగా నవ్వుతూ- "జీతం సరే! పనెలా వుంటుంది?" అన్నాను.
    కనకవల్లి ఉస్సూరని నిట్టూర్చి-
    "ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఐదు దాకా  ఆ గడియారం కేసి చూస్తూ గోళ్ళు గిల్లుకుంటూ కూర్చోవాలి! లేదా ఆ టైప్ మిషన్ మీద తల పెట్టుకుని పడుకోవాలి! బాస్ వుంటే పిలిచి కాసేపు కబుర్లు చెప్తాడనుకొండీ..." అంది.
    "కనకవల్లీ....ఉష్... ష్..." అని  అతను అడ్డుకో బోయి, తన  పాన్ తుంపర్లు తన  బట్టలమీదే పడటంతో ఆగిపోయాడు.
    "అబ్బా...చెప్పనీయండీ...ఆయన లేడుగా..." అని  కనకవల్లి కాస్త గొంతు తగ్గించి-' పని లేదుకదా  అని  ఒక నిమిషంకూడా  ముందుగా  ఇంటికెళ్లకూడదు...ఏ నవలైనా చదవకూడదు! అబ్బబ్బా...పని లేకుండా  కూర్చోవడం  ఎంతటి నరకమో ఇక్కడ చేరాకే తెలిసింది బాబూ" అంది.
    "కనకవల్లీ... అయిందా?" అతను అడిగాడు.
    కనకవల్లీ... అలా అన్ని విషయాలూ చెప్పేస్తే ఇంకెవరైనా నీ వేకెన్సీలో పనిచెయ్యడానికివస్తారా?"  అతను కోపంగా అడిగాడు.
    "ఎవరైనా  నెలంతా పనిచేసేది జీతం డబ్బుల కోసమే! అదే సరిగ్గా ఇవ్వకపోతే ఎందుకు చేయలటా?" కనకవల్లి కోపంగానే  అడిగింది.
    వారి మాటలు విన్న నాకు అక్కడ  పనిచేయాలన్న ఇంట్రెస్ట్ చచ్చిపోయింది.
    "జీతం విషయం ఆలోచించుకోండిమరి...మూడు దఫాలుగా ఇస్తే సరిపోతుందా?" అంది కనకవల్లి.
    నేను లేచి  నిలబడుతూవుంటే చార్లీ స్ప్రే  పరిమళం ఆ గదంతా వ్యాపించింది. వివేక్ చాలా ఖరీదైన పెర్ ప్యూమ్స్ కొంటాడు.
    "జీతం విషయం  కాదు పని విషయమే  ఆలోచిస్తున్నాను" అన్నాను.
    "అబ్బే...అస్సలు వుండదు!" అన్నాడతను.
    "అదే నాకు  నచ్చలేదు అది లేకనే  కదా  నేను ఇక్కడికి వచ్చిందీ!" అన్నాను.
    అతను చిన్నగా  నవ్వి-
    "మిమ్మల్ని చూడగానే  అనుకున్నాను పొరపాటుపడి  ఇక్కడికి వచ్చారనీ!" అన్నాడు.
    కనకవల్లి ఆరాధనగా చూస్తూ-
    "మీ చీర ఖరీదు చెయ్యని ఈ ఆఫీసులో ఎందుకొచ్చిన ఉద్యోగం అండీ" అంది.
    నేను "వస్తా చాలా థాంక్స్ !" అని బయటికి  నడుస్తూ అనుకున్నాను, ఈ సారి  ఉద్యోగంకోసం వచ్చేటప్పుడు కాస్త ఆలోచించి అలంకరణ చేసుకోవాలని!  
    నేను మేడమెట్లు ఎక్కుతుంటే సుమతి ఎదురుపడి- "ప్రొద్దుట నేనిచ్చిన బాలభావనీ పేపర్ కట్టింగ్ చూశావా?" అంది.
    "ఆఁ!" అన్నాను అదే నాకింత పని తెచ్చి పెట్టింది. దాన్ని తెరగేసి చూడకపోయినా బావుండేది!
     "రోజూ ఉదయం  నూటొక్కసార్లు ఆ జపం చేసుకో.... ఇంకే సమస్యలూ  వుండవు!" అంది.
     నేను తల  ఊపాను. న్నెఉ సమస్యల్లో వున్నానని  వీళ్ళకి తెలిసిపోయిందా? అనుకున్నాను.
    ఇంట్లోకి వెళ్ళేసరికి వివేక్, బొంగరం మావయ్యా మాట్లాడుకుంటూ కనిపించారు.
    నేను  నా రూమ్ లోకి వెళ్తూవుంటే-
    "ఏమ్మా!  ఎండనపడివస్తున్నావు? ఎక్కడినుండీ?" అడిగాడు  బొంగరంమావయ్య.
    అతను వివేక్  ముందు 'అమ్మా' అని సంబోధిస్తాడు.
    నేను జవాబు చెప్పేలోగానే-
    "ఉద్యోగ విజయాలు నాటకం చూశారా?" అని అడిగాడు వివేక్.
    నేను కస్సుమని  చూసి లోపలికి వెళ్ళిపోయాను.   
    బొంగరం మావయ్యకి  మంచి ఉషారోచ్చేసింది. "ఆఁ! ఎందుకు చూడలేదూ... మా చిన్నతనంలో రాజమండ్రిలో వరసగా తొమ్మిదిరోజులూ నవరాత్రి ఉత్సవాలు చేసేవారు.
     నాటకాల్లో  వేషం కట్టడానికి కాకినాడ నుండి 'కనకం' అనే పిల్ల వచ్చేది ద్రౌపదివేషం  కట్టేది. పిల్లంటే  అదయ్యా! నిజంగా కత్తేననుకో!"
     బెడ్ రూమ్ లో బట్టలు మార్చుకుంటున్నా నాకు  అతనంటున్న ఆ మాటలు  ఒళ్ళంతా  ముళ్ళు గుచ్చుతున్న ఫీలింగ్ నిచ్చాయి!
    "ట్రై చేశారా గురూగారూ?" వివేక్ సిగ్గులేకుండా అడుగుతున్నాడు.
    "అనుకోకుండా ఓ మాటు వెనకవైపు నుండి దడి తోసుకుని వెళ్ళాను. ఆ పిల్ల బట్టలు మార్చుకుంటోంది. ఎలా వుందనుకున్నావ్?" ఓ నిమిషం మౌనంగా వున్నాడు.
    బహుశా ఆ దృశ్యం మళ్ళీ నెమరేసుకుని గుటకలు మింగుతున్నాడు కాబోలు!    
    " ఆ ఎద వుంది చూశావూ...?"
    నేను గబుక్కున పైట నిండుగా కప్పుకున్నాను. ఆ మాటలు  తలుపు  కంతల్లోంచి దూరోచ్చి నన్ను  మానభంగం చేస్తున్నట్లనిపించాయి!
    ఆయబ మాటలకి వివేక్ బాగా  ఎంజాయ్  చేస్తున్నట్లుగా  పెద్దగా  నవ్వుతున్నాడు.
    'ఛీ!అస్సలు సిగ్గులేని జాతి ఇలా ఇద్దరు స్త్రీలు కూర్చుని ఓపురుషుడిగురించి ఆలోచిస్తారా? చచ్చినా  ఇలా మాట్లాడుకోరు' అనుకున్నాను.
    చీర మార్చుకున్నా బయటికి రావాలనిపించలేదు అలాగే పడుకున్నాను.
     నేను కళ్ళు తెరిచేటప్పటికి చీకటిగా వుంది! పక్క గదిలోనుండి నవ్వులు  వినిపిస్తున్నాయి. లేచి కళ్లు నులువుకుంటూ వినడానికి ప్రయత్నించాను.
    "మీ  మిసెస్ లేరా?" తన్మయి గొంతే అది "ఉంది పడుకుంది" వివేక్ చెప్పాడు.
     ఇంకేం మిసెస్? ఎప్పుడో మిస్ అయిపోయాం! అనుకున్నాను!
    నేను లేచి బయటికి వస్తూ  వుంటే వివేక్  రూమ్ లో తన్మయి కనిపించింది.
    నిన్నటిదాకా అది మా  బెడ్ రూమ్ ఈ రోజున అది... అతని   బెడ్ రూమ్.... మరి రేపూ? ఆలోచించలేక  పోయాను.  ఫోన్ రింగ్ అవుతోంది.
     వివేక్ తీసి-" హలో...ఎస్...స్పీకింగ్...ఆఁ....వచ్చేస్తున్నాను....వితిన్ ఫిఫ్టిన్ మినిట్స్ లో అక్కడ  వుంటాను" అని పెట్టేశాను.
    నేను ఆగి  నాతో  ఏమైనా  చెప్తాడేమోనని చూశాను.


Related Novels


Priyathama O Priyathama

Trupti

Swargamlo Khaideelu

Madhuramaina Otami

More