Home » Balabhadrapatruni Ramani » అనూహ్య
అతను శాంతంగా "నువ్వు నన్ను కొనుక్కున్నావు సరే...ప్రూవ్ ఏమిటీ? మావాళ్లు నీకేమైనా రసీదు ఇచ్చారా?" అన్నాడు.
నేను కోపంగా "మోసం చేస్తే చాతకానిదాన్లా ఊరుకుంటాననుకున్నారా? రేపే ఓ ఉద్యమం లేవదీస్తాను. పబ్లిక్ మీటింగ్స్ పెట్టి ఆడపిల్లలకి బోధిస్తాను. చూడండమ్మా! డబ్బిచ్చి మీరు మొగుడ్ని కొనుక్కోగానే సరికాదు... అందుకు ప్రూవ్ వుండేలా చూసుకోండని! మినిమమ్ పదేళ్లు గ్యారింటీ తీసుకోండి... లేదా మీ డబ్బు రిఫండ్ వచ్చేలా ఎగ్రిమెంట్ తీసుకోండి..." అని ఇంకా చెప్తున్న నన్ను అడ్డుకుని-
"వస్తువు వాడేవాళ్ళని బట్టి కూడా వుంటుంది. ఎలక్ట్రికల్ అప్లయన్ సెస్ వాడడంచాతకాక ప్లగ్ బదులు వేలు పెట్టి 'షాక్ కొట్టింది కాబట్టి ఈ వస్తువు మాకొద్దు' అనే రకాలు మీరు!" అన్నాడు హెళనగా
"వస్తువు సరైనదైతే వెనక్కి ఎందుకివ్వాలనుకుంటాం?" అరిచాను.
"సరైనదో కాదో కొన్నాళ్ళు వేరేవాళ్ళకి ఇచ్చివాడి చూడమనచ్చుగా!
అన్నాడు.
నేను లేచి నిలబడుతూ-" ఇంక మీతో మాటలు అనవసరం. కోర్టులో కలుసుకుందాం" అన్నాను.
"కూర్చో.... త్వరపడి నిర్ణయాలు తీసుకోవద్దు" అన్నాడు వివేక్.
అతను బ్రతిమాలడం మొదలు పెట్టాడని నాకు అర్ధమైంది. గర్వంతో ఒళ్ళు పులకించింది.
"కోర్టుకెళ్తె డబ్బూ టైమూ వేస్టు! మన ఇద్దరికి విడిపోవడం ఇష్టమేకాబట్టి, మ్యూచువల్ అండర్ స్టాండింగ్ తో ఓ ఎగ్రిమెంట్ రాసుకుందాం" అన్నాడు.
నా నెత్తిమీద ఎవరో 'ఠంగ్' న కొట్టినట్లనిపించింది.
"రెండేళ్లు విడిగా వున్నట్లు ప్రూవ్ వుంటే చాలు... తేలిగ్గా విడాకులు వస్తాయి" అన్నాడు.
నేను సోఫాలో నెమ్మదిగా కూర్చుండిపోయాను.
వివేక్ ఏదో ఆలోచిస్తున్నట్లుగా కనిపించాడు. ఇతనికి నాతో సాహచర్యం... కలిసి చేసిన చిలిపి పనులూ, ముద్దుముచ్చట్లూ...ఏవీ గుర్తురావడం లేదా? 'అనూ నీ నడుము ఒంపు ఎంత బావుంటుందీ!' అనేవాడు. అవన్నీ మర్చిపోయాడా? ఎంతమామూలుగా విడాకుల ఎగ్రిమెంట్ గురించి ఆలోచిస్తున్నాడూ?
'అసలేం జరిగింది? ఎందుకు హార్ట్ అయ్యావు? నీకేం కావాలి?' అని అడిగితే ఇతని ఈగో ఊడి పడిపోతుందా?' అనుకున్నాను.
వివేక్ ముందుకి వంగి పెన్ స్టాండ్ లొంచి పెన్ చేతిలోకి తీసుకున్నాడు. క్రింద పెదవిని ఆలోచనగా మునిపంటితో బిగబట్టాడు.
ఆ పెదవులు నా పెదవులని ఎంత ఆత్రంగా హత్తుకునేవీ? ఆ పంటిగాట్లూ, నఖ క్షతాలూ పడని ప్రదేశం నా ఒంటిమీదుందా? అతని చేతులు పనితనం వున్న నేర్పరైన వైణికుడిలా నా తనువుని ఎంత సమ్మోహనంగా శృతిచేసేవీ? ఆ సుమధుర రాగ మాలికలు వేనెలా మరిచిపోగలనూ! ఈ ఎగ్రిమెంట్లవీ వద్దు అంటూ వెళ్లి ఆ మెడని వాటేసుకుని అతని గుండెల్లో ఒదిగిపోతేనో...
"ఆఁ! ఇలా రాద్దాం...మేము విడిపోవాలని మన స్పూర్తిగా నిర్ణయించుకున్నాం. ఒక సంవత్సరంపాటు విడివిడిగా జీవితాలు గడిపిచూసి, ఈ విముఖత ఇలాగే కోనసాగితే శాశ్వతంగా విడిపోతాం...ఎలా వుంది? సంవత్సరం అంటే పెద్దటైమ్ ఏం కాదుగా!" అన్నాడు.
'కారుడ్రైవర్నో, పనిమనిషినో' మార్చుకున్నంత తేలిగ్గా మాట్లాడేశాడు.
నేను ఏం మాట్లాడలేనట్లు అతని కళ్లల్లోకి చూశాను. అక్కడ నేను కోరుకున్న భావాలేం నాకు దొరకలేదు!
'అనూ...నాకు నిన్ను పోగొట్టుకోవాలని లేదు. అందుకే ఈ సంవత్సరం గడుపు పెడ్తున్నాను' అని అతను అనుంటే ఎంత మధురంగా వుండేదీ?
"ఈ సంవత్సరంలోగా నాకు వచ్చే పార్ట్నర్ నాకూ, నీకు నచ్చే పార్ట్నర్ నీకూ దొరకకపోరు! సరిపెట్టుకుంటూ, రాజీపడ్తూ బ్రతుకంతా ఈడవడం నాకూ ఇష్టంలేదు!" అన్నాడు వివేక్.
అప్పుడోచ్చాయి నా కళ్ళల్లోకి నీళ్ళు! 'రిజెక్షన్' అనేది ఎంత నరకమో నాకు అప్పటీదాకా అనుభవం లేదు. తెలిశాక ఇంక బ్రతుకు వేస్టు అనిపించింది.
అతను లేచి దగిలోకి వెళ్తూ-
"బెస్ట్ ఆఫ్ లక్" అన్నాడు.
'హూ! లక్...' నాకు నవ్వొచ్చింది. పెళ్ళిచూపుల్లో అతన్ని చూసి ఎంత మురిసిపోయనూ... అతనికి నచ్చనని తెలిశాక నా అదృష్టానికి ఎంతగా ఉప్పొంగి పోయానూ... ఆ పొంగు ఇంత త్వరగా తీసేస్తుందనీ... ఎండిన బీడె మిగుల్తుందనీ ఊహించలేదు!
ఎందుకిలా జరుగుతోంది? అతను నన్నెందుకు అలక్ష్యంచేశాడు? నేనేం తక్కువ చేశానని?
ఈ ప్రశ్నలకి నాకు జవాబు దొరకలేదు. అతన్ని అడగడానికి 'అహం' అడ్డొచ్చింది.
అద్దంలో కనిపిస్తున్న అందమైన నా ప్రతిరూపం జవాబుచెప్తోంది.
'అతను కాదు ఈ ప్రపోజల్ లేవనెత్తింది! రాయి తెస్తావా? కొబ్బరికాయ తెస్తావా? అన్నట్లు మగాడితో ఈ ప్రపోజల్ పెట్టేముందే ఆలోచించాల్సింది. అతను ఎప్పుడూ రాయే తెస్తానంటాడు! కాయ తెస్తాను కొట్టుకు తిందాం అనేటంత పిచ్చివాడు ఈ లోకంలో ఏవడుంటాడు?'
* * *
"మరోసారి ఆలోచించుకొండి" అంది విజయ.
వివేక్ పెన్ క్యాప్ తీసి ఎగ్రిమెంట్ పేపర్లమీద సంతకాలు పెట్టాడు.
నేను ఉక్రోషంగా-" ఆలోచించుకోవాల్సింది ఏం లేదు! సంవత్సరం ఎప్పుడు అయిపోతుందా అని ఈ క్షణం నుండే ఎదురుచూడడం ప్రారంభిస్తాను!" అని నేనూ సంతకాలు పెట్టేశాను.
విజయ ఓ నిట్టూర్పు విడిచి -"హూ! ఈ ప్లాట్ అనూ పేరుమీద వుంది కాబట్టి అది ఇక్కడే వుంటుంది. మరి వివేక్ మాటేమిటీ?" అంది.
"త్వరగా వెకేట్ చెయ్యమను" కోపంగా అన్నాను.
"నాకు కొంచెం టైమ్ కావాలి" అన్నాడు వివేక్.
"ఎందుకూ? హాస్పిటల్ వుందిగా!" అన్నాను.
"వెళ్ళిపోవాలీ అని గట్టిగా అంటే ఈ క్షణమే వెళ్ళిపోతాను" అన్నాడు.
"వెయిట్...వన్ మినిట్! నాదో ఐడియా!" చిటికెవెస్తూ అంది విజయ.
"ఏవిటే కోపంతీసి నీ ఇంట్లోగానీ వుండమంటావా?" చిరాగ్గా అడిగాను.
"నువ్వు నీ ఇంట్లో వుండనీయనంటే నాకు తప్పదుగా" అంది విజయ.
నేను దిమ్మెరపోయి చూశాను.
"కంగారుపడకు! ఇంత పెద్ద ప్లాట్ నీ ఒక్క దానికి అనవసరం! ప్లస్ నీకు ఉద్యోగం దొరికేవరకూ ఆర్ధికంగా ఆధారం కావాలంటే అతనిని నువ్వు పేయింగ్ గెస్ట్ గా నీ ఇంట్లో వుంచుకోవాలి!" అంది.
"వెనకటికెవడో నీ ఎడమచెయ్యి తియ్యి నా పుర్రచెయ్యి పెడతా అన్నాడట!" చిరాగ్గా అన్నాను.
"ఓరిమిగా ఆలోచించు... ఈ ఏర్పాటువలన అంతా గుంభనంగా జరిగిపోతుంది. బయట లోకానికి మీరు జవాబు చెప్పుకోవాల్సిన పరిస్ధితి అప్పుడే రాదు. అమ్మమ్మకి ఈ విషయం వెంటనే తెలియదు ఎలాగూ కోంతకాలం పోయాక నీకూ ఓ కోత్తతోడు దొరుకుతాడు గనుక అప్పుడు చెప్పినా ఫరవాలేదు...."
ఆ మాటకి నాకెందుకో మనసంతా చేదుగా అనిపించి అతనివైపు చూశాను.
అతను మాత్రం వెంటనే "నా రూమ్ లో ఏం జరిగినా తను పట్టించుకోకూడదు! నా గర్ల్ ఫ్రెండ్స్ విషయం అస్సలు పట్టించుకోకూడదు!" అన్నాడు.
"నో! నా ఇంట్లో అలాంటివి జరిగితే నేను ససేమిరా ఒప్పుకోను" అన్నాను.
విజయ నచ్చచెప్తున్నట్లుగా-" పక్కింటి ఆయన ఏంచేస్తే నీ కెందుకే? అమ్మమ్మ ఆరోగ్యం సంగతికూడా ఓసారి ఆలోచించు పెళ్ళయిన మొదటి ఏడాది నిండగానే తన మనవరాలు మొగుడితో విడిపోయి పుట్టింటి కోచ్చేస్తే ఆవిడ గుండె తట్టుకోగలదా?" అంది.
నాకు ఆ పరిస్ధితి తలుచుకుంటేనే ముచ్చెమటలూ పోశాయి!" అమ్మో! తట్టుకోలేదు" అన్నాను గాభరాగా.
"అయితే ఎగ్రిడా?" ఉషారుగా అంది విజయ.
"అమ్మమ్మకోసం ఒప్పుకుంటున్నాను!" అమ్మమ్మ అనే మాట వత్తి పలికాను.
వివేక్ లేచి నిలబడి "ఈ క్షణం నుండీ నాకు మన పక్కింటి ఆవిడ ఎంతో ....ఎదురింటి బామ్మగారు ఎంతో నువ్వూ అంతే... నా రూమ్ కి ఎవరొచ్చినా, ఏంచేసినా నువ్వూ పట్టించుకోకూడదు" అన్నాడు.
"నా రూమ్ కి ఎవరొచ్చినా మీరూ కుళ్ళుకోకూడదు" అక్కసుగా అన్నాను.
అతను హేళనగా నవ్వాడు.
"మీరు ఇలా పోట్లాడుకోకూడదు. గుడ్ నై బర్స్ లా వుండాలి" అంది విజయ.
అతను నావైపు అదోలా చూస్తూ-" పాలున్నాయా, పోంగించుకుని గృహప్రవేశం చేస్తానూ" అన్నాడు.
అప్పుడు కొట్టింది మాడువాసన! పాలన్నీ పొంగి, ఇరిగి గిన్నె బొగ్గులా మాడిపోయింది.
"అయ్యో!" అంటూ వంటింట్లోకి పరిగెత్తాను పాలు పొంగితే శుభం!
మరి ఇగిరిపోతేనో... ఏమో!!



