Home » Balabhadrapatruni Ramani » అనూహ్య

    "ఇంతకీ అది ఎవరిల్లే?" రాయడం అయ్యాక అడిగాను. "మనదే! చెప్పానుగా, కొన్నాళ్ళు హైద్రాబాద్ లోనే మకాం అనీ... మరి మకాన్ వుండాలిగా!" అని నవ్వింది.
    'అలా చీకూ, చింతా లేకుండా మనసారా నవ్వగలగడం ఎంత అదృష్టం! పెళ్ళిచేసుకోకుండా వుంటే నేను కూడా అంత హాయిగా జీవితం గడిపెదాన్ని' అని మనసులో అనుకున్నాను.
    విజయతో వస్తానని  చెప్పాక, గబగబా తయారయ్యాను వరాలు పాడేపాటలు నా చెవుల్లో  పడ్తూనేవున్నాయి. రోజు ఆ మొగుడు  తాగొచ్చి బూతులు తీడ్తాడనీ, చావగోడ్తాడనీ, చెప్తుంటుంది... మరి ఇంత ఉషారుగా ఎలా వుండగలుగుతుందీ? అని ఆశ్చర్యపోయాను.
    బీరువా తెరిస్తే హేంగర్ల నిండా వున్న చీరలు నన్ను చూసి ఎద్దేవా చేస్తూ 'వరాలులా నిశ్చింతగా వుండగలవా?' అని సవాల్ చేసినట్లుగా అనిపించాయి.
    నాకేం తక్కువా? చీరలూ, నగలూ, హోదా అన్నీ వివేక్ సమకూరస్తూనే వున్నాడు మరి ఎందుకీ బాధ? ఈ నిర్లిప్తతా? అనిపించింది.
    అప్పుడు  స్పురించింది... వరాలుకి వున్నదీ, నాకు లేనిదీ... ఆర్ధిక స్వాతంత్ర్యం!
    నేను బయల్దేరుతుంటే-
    'ఎక్కడికీ?' అని వివేక్ అడగలేదు.
    అడిగితే 'నా కాళ్ళమీద  నేను నిలబడడానికి' అని చెప్దామానుకున్నాను. కానీ  అతను అడగలేదు.
    అసంతృప్తిగానే బయటపడ్డాను.
    మెట్లు దిగుతుంటే, అన్నం  వండలేదని గుర్తొచ్చింది. ఆకలేసేదాకా ఆ సంగతి పట్టించుకొదు తీరా అప్పుడెళ్ళి వెతుక్కుంటాడేమో! పోనీ వెనక్కి వెళ్లి వండుదామా అనిపించినా మనసుని కట్టేశాను.
    ఆడది ఇల్లాలుగా మారాక చాలా విషయాల్లో  మగాడంత కరుకుగా వుండలేదు. అందుకే ఈ మగ జాతికి  ఇంత అలుసు!
                                                                 *        *        *

    నేను  చెప్పేదంతా విజయ  ఓరిమిగా వినడం నాకు ఊరటనిచ్చింది. "అందుకే విజయా... అతనితో విడిపోయి స్వతంత్రంగా, స్వేచ్చగా బ్రతకాలనుకుంటున్నాను. అందుకు నాకు ప్రస్తుతం ఉద్యోగం  అత్యవసరం!" అన్నాను.
    విజయ కాసేపు  మాట్లాడలేదు బహుశా నాకు  ఎందులో ఉద్యోగం చూడాలా అని ఆలోచిస్తోందేమో!
     విజయ కీచెన్ లోకి దారితీస్తూ-
    "నీకు ఉద్యోగమా?" అంది.
    నేను అకాక్కయిపోయాను. అది అలా  అంటుందనుకోలేదు. నా నిర్ణయానికి తన  హర్షామోదాలు వ్యక్తపరుస్తుందమకున్నాను.
    విజయ వంటింట్లోకెళ్ళి-
    "అప్పడాలు వేయించుకుందామా?" అంది.
    నేను  కోపంగా అంటే  నీ ఉద్దేశం   ఏవిటే? నాకు  ఉద్యోగం ఎవరూ  ఇవ్వరంటావా?" అన్నాను.
    విజయ అప్పడాలు డబ్బాలోంచి తీస్త
    "కష్టం!" అంది.
    "నువ్వులే... నేను  వేయిస్తాను" అని దాని చేతి లోంచి గరిట అందుకుని "ఏ ఉద్యోగం అయినాసరే  చేస్తాను" అన్నాను.
    "అయితే ఈ పనే  చెయ్యి! జీతం ఎంతిమ్మంటారు వంటలక్కగారూ!" నవ్వుతూ అంది.
    "వాత పెడ్తా" రోషంగా  అన్నాను.
    "ఉహూ! ముందు  అన్నం పెట్టు! ఆత్మారాముడు గొడవచేస్తున్నాడు" అంది.
    భోజనం చేస్తున్నంతసేపూ నేను  నా ఉద్యోగం సంగతీ, అది దాని  కేసులసంగతీ ఒకదానికొకటి అతుక్కోకుండా అతుకులబొంతలా మాట్లాడుకున్నాం.
    "ఫోన్ కావాలా?" అడిగింది.
    "ఉద్యోగం కావాలి" మొండిగా అన్నాను.
    విజయ నడుముమీద చెయ్యి వేసుకుని కనుబొమలు చిట్లించి-
    "ఏవిటీ సీరియస్ గానే అంటున్నావా?" అంది.
    "కాకపోతే జోకా?"  కస్సుమన్నాను.
    "ఇంటర్ మీడియెట్ లో ఇంగ్లీషు లెక్చరర్ ఏదో అందని ఏడుస్తూ కాలేజీ మానేస్తానని ఇంత సీరియస్ గానూ చెప్పావుగా!" వ్యంగ్యంగా అంది.
    "అప్పుడు చిన్నతనం" అన్నాను.
    "ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చేసిందంటావా?" నవ్వు ఆపుకుంటూ అంది.
    నేను కళ్ళెత్తి దానివైపు తీవ్రంగా చూస్తూ-" రాలేదంటావా?" అన్నాను.
    "రాలేదు!" అది గంభీరంగా అంది.
    "విజ్జీ!" కోపం, బాధా కలగలిపి అన్నాను.
    "వివేక్ అంటే  నీకున్న మంచి అభిప్రాయం వల్ల నా ఆలోచన నీకు   అపరిపక్వంగా అనిపించవచ్చు! కానీ.... అతను నన్ను మానసికంగా ఎంత క్షోభపెడ్తున్నాడో నీకు తెలీదు! అతనికి నా వ్యక్తిత్వం గురించి పట్టదు. అతనికి నేనొక అవసరాలు తీర్చే సాధనాన్ని మాత్రమే" అని ఇంకా చెప్పబోయాను.
    నా కళ్ళల్లో చివ్వున నీళ్ళు చిప్పిల్లాయి. 'నా కష్టాల్ని విపులంగా విడమర్చి చెప్పి, చివరికి ప్రాణస్నేహితురాల్ని కూడా కన్విన్స్ చెయ్యలేకపోయాను ఎందుకి వెధవ జన్మ! అనిపించింది.
    విజయ నా చేతిని తన చేతిలోకి తీసుకుని- "నీ బాధ నాకు అర్ధమైంది! ఇప్పటికైనా నిన్ను నువ్వు  తెలుసుకుంటున్నావు అందుకు సంతోషం! మొదట నీ ఇష్టాలేమిటో, అవి  తీరడానికి నువ్వేం చెయ్యాలనుకుంటున్నావో నిర్ణయించుకో.
    కష్టం రాగానే సహాయం కోసం, సానుభూతికోసం ఎదురుచూడడం మానేసి స్వతంత్రంగా, ఏదైనా సాధించాలని ప్రయత్నించు!
    'నాకు చాలా ఏడుపోచ్చింది తెలుసా?' అనే మాటని వదిలిపెట్టు! ఎందుకు ఏడుపోచ్చిందో తెలుసుకుని మరోసారి అలా జరగకుండా చూసుకో!
    నువ్వు జీవితంలో స్వేచ్చని కోరుతున్నావు, అది అతన్ని సాధించడానికి కాకుండా నిన్ను నువ్వు  సంస్కరించుకోవడానికైతే లాభంగా వుంటుంది. ప్రతి మనిషికీ గాలీ, తిండీ, నీరూ ఎంత అవసరమో, స్వేచ్చకూడా అంతే అవసరం!
    అన్నింటికీ మనం మరొకరిమీద ఆధారపడుతున్నంత కాలం అది మనకు లభించదు!
    ఆ వ్యక్తి తల్లైనా, తండ్రయినా, మొగుడైనా ఎవరైనా సరే! ఇప్పటిదాకా నువ్వు  మిసెస్ వివేక్ గా అందరికీ తెలుసు! ఇప్పటికైనా నువ్వు నువ్వుగా ఏవిటో పరిచయం చేసుకో! వ్యూపాదశ నుండి సీతాకోక చిలుకగా మారడం వెనుకనున్నకష్టం, పాఠ్యపుస్తకంలో బొమ్మలు చూసే మనకు తెలీదు...గొంగళిపురుగుకే తెలుస్తుంది!" అంది.
    నేను లేచి నిలబడి నా బ్యాగ్ అందుకున్నను. విజయ కూడా లేచి-
    "సారీ! నిన్ను హార్ట్ చేశాను" అంది.
    "మనసులో భావాలు బయటికి చెప్తేనే హార్ట్ అయిపోయే లాంటి స్నేహం కాదు మంది!" అన్నాను.
    విజయ నా బుగ్గమీద గట్టిగా ముద్దు పెట్టుకుంది. "అనూ...మళ్ళీ ఎప్పుడు రాక?" అంది.
    "త్వరలోనే విడాకులకోసం!" అని గబగబా బయటికి నడిచాను.
    'నా వ్యక్తిత్వం ఏవిటో వీళ్ళకి తెలియజెప్పాలిగా!' అని మనసులో అనుకున్నాను.
    విజయ కళ్ళల్లో ఎక్స్ ప్రెషన్ చూడదలుచుకోక గబగబా అడుగులు వేశాను.
                                                                 *        *        *
    ఒక దోమ 'జుయ్యి'మని నా చెవి పక్కనుంచి పాట పాడుకుంటూ ఎగిరిపోయింది. 'దోమ నాకన్నా గొప్పగా బ్రతుకుతోంది. జీవించినంత కాలం జీవితాన్ని ఓ పాటగా మార్చుకుని, హాయిగా స్వేచ్చగా రెక్కలు జాపుకుని ఎగిరిపోగలదు!' అనిపించింది.
    వివేక్ వస్తూనే-" విజయ దగ్గరకు వెళ్ళి విడాకులు కావాలన్నావుటా?" అన్నాడు.
    అతను అలా అడిగేసరికి కాస్త తడబడ్డాను. కానీ  పెళ్ళిరోజురాత్రి అతని ప్రవర్తన గుర్తుచేసుకుని, "ఔను! చెప్పానుగా..." అన్నాను.
    అతను  తన మెడ నుంచి టై ఊడదీసుకుంటు- "అయితే నిజమేనన్నమాట!" అన్నాడు.
    నేను చిరాగ్గా "మీరు నా మాటని ఎందుకు  సీరియస్ గా తీసుకోలేదూ?'  అన్నాను.
    అతను సోఫాలో  కూర్చుంటూ "నువ్వు  నానుంచి విడిపోయి  ఎలా బ్రతుకుతావు?" అన్నాడు.
    "ఏదో ఒకటి చేసి "విసుగ్గా అన్నాను.
    "నీకు ఏదీ సరిగ్గా రాదుగా..." అతను  నవ్వాడు.
    నేను రోషంగా  "అది మీ  అభిప్రాయం ప్రపంచానికి కాదు. నేనేమిటో చూపిస్తాను" అన్నాను.
    "నీ మొహం! ప్రపంచానికేం  తెలుస్తుంది. వస్తువు వాడిన వాడికి తెలుస్తుంది సామర్ధ్యం" అన్నాడు 'సామర్ధ్యం' అన్నమాట వత్తిపలుకుతూ.
    "వస్తువుకి భార్యకి తేడా కూడా తెలీని వ్యక్తితో కాపురం చెయ్యడం అవివేకం!" అన్నాను.
    "నాకు  నువ్వు ఫీలింగ్స్ వున్న భార్యలా ఎప్పుడైనా ప్రయత్నించావా?" అడిగాడు.
    "సరే...వాదనలోద్దు. నేను మిమ్మల్ని లాంఛనాల పేరిట బోలెడు డబ్బిచ్చి కొనుక్కున్నాను. మీరు  నాకు పనికిరాలేదు కాబట్టి నా డబ్బు నాకు  వాపసు చెయ్యండి. లేకపోతే రేపే కంజ్యూమార్ ఫోరమ్ కి వెళ్ళి రిపోర్ట్ చేస్తాను" ఆవేశంగా అన్నాను.


Related Novels


Priyathama O Priyathama

Trupti

Swargamlo Khaideelu

Madhuramaina Otami

More