Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
11. సోమము ద్యులోక స్థితుడు. శోభన పత్రవంతుడు. జాలువారువాడు. మాస్తుతులు అత్రిసోమున స్తుతించును. శిశువువలె సంరక్షణ యోగ్యుడు, శబ్దకర్త, సువర్ణమయుడు పక్షివంతుడు. హవివర్థనుడగు సోముని స్తుతులు చేరును.
12. కిరణములు దాల్చిన సోమము సూర్యుని సకల రూపములను వీక్షించుచు ద్యులోకమున వసించును. సోమమందున్న సూర్యుడు శుభ్రతేజమున మెరిసిపోవును. ప్రదీప్త సూర్యుడు ద్యావా పృథ్వులను శోభాయమానము చేయును.
(శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత ఏడవ అష్టకము తొమ్మిదవ మండలమున నాలుగవ అనువాకము సమాప్తము.)
అయిదవ అనువాకము ఎనుబది ఆరవ సూక్తము
ఋషి- తొలిచతుర్థదశకములకు ఆకృష్ట, మహఋషులు, రెండవ దశకమునకు సికత, నివావరులు. మూడవ దశకమునకు పృశ్న, అజూయులు అయిదవ దశకమునకు గృత్సమదుడు. దేవత - పవమాన సోమము. ఛందస్సు - జగతి.
1. క్షరణశీల సోమము - మనోవేగమున వ్యాపించి ఉన్మత్తు రసము కలిగి గుఱ్ఱపు పిల్లవలె పరువులెత్తుచున్నది. సోమరసము ద్యులోక ఉత్పన్నము. సుందర పత్రములు కలిగి, మధురతాయుక్తమై, అత్యంత మాదకమగు దీప్తరసము ద్రోణకలశమున కేగుచున్నది.
2. సోమమా! నీ యొక్క రసము మాదకము, వ్యాప్తము. దానిని - అశ్వమురీతి చేయుదురు. మధుర, ప్రవృద్ధ, క్షరణశీల సోమము - పాడియావు దూడవద్దకు వెళ్లునట్లు -వజ్ర ఇంద్రుని వద్దకు వెళ్లును.
3. సోమమా! యుద్ధమున కంపిన అశ్వమువలె రణరంగమున దూకుము. ద్యులోకమునుండి మేఘనిర్మాతవద్దకేగుము. వర్ధక, సోమధారక ఇంద్రుని కొరకు మేషలోమ దశాపవిత్రమున పరిశుద్ధడవగుము.
4. సోమమా! నీ ధారలు మనోవేగవంతములు. వ్యాప్తములు. దివ్యములు, ఆకసమునుండి రాలునవి దుగ్ధయుక్తములు అవి ద్రోణకలశమున కరుగుచున్నవి. నిన్ను తయారించు ఋషులు నిన్ను అభిషవింతురు. నీ ధారలను కలశమున చేర్చెదరు.
5. సోమమా! నీవు సర్వదష్టవు. నీవు ప్రభువవు. నీ మహా కిరణములు సమస్త దేవతల దేహములను ప్రకాశింప చేయును. నీవు వ్యాపకుడవు. రసధారలను స్రవింప చేయుదువు. "పతిర్విశ్వస్య భువనస్య రాజసి" విశ్వపతిపై లోకములను శోభిల్ల చేయుదువు.
6. క్షరణశీల, అవిచలిత, విద్యామాన సోమపు ప్రజ్ఞాపక కిరణములు అటునిటు సంచరించును. హరితవర్ణ సోమము దశాపవిత్రమున శోధితమైనపుడు నివాసశీల సోమము స్వస్థానమగు ద్రోణ కలశముకు చేరును.
7. యజ్ఞప్రజ్ఞాపక, శోభనయజ్ఞ సోమము క్షరితమగును. సోమము - అలంకృతమగు దేవతల స్థానములకు సాగును. అపరి మిత ధారలతో ద్రోణకలశమున ప్రవేశించును. సేక్త సోమము పవిత్రమును దాటి దిగువకు దిగును.
8. నదులు సముద్రము నందువలె సోమమహారాజు జలములందు సంగమించును. జలము నుండి పవిత్రమునకు చేరిన సోమము ఉన్నత దశాపవిత్రమున ఉండును. అతడు పృథ్వికి నాభియగు యజ్ఞన వసించును. సోమము ద్యులోక ధారకుడు అగును.
9. సోమము ద్యులోకపు ఉన్నతస్థానమున ధ్వనులు కలిగించు చున్నది. సోమము తన ధారక శక్తిచే ద్యావాపృథ్వులను ధరించుచున్నది. ఇంద్రునిమైత్రి కొరకు సోమము దశాపవిత్రమున శోధితమై, ద్రోణకలశమున చేరుచున్నది.
10. యజ్ఞప్రకాశక సోమము దేవతలకు ప్రియమగు మధుర రసమును ప్రవహింప జేయును. దేవతల రక్షక , సకల ఉత్పాదక, ప్రచుర ధనవంత సోమము ద్యావా పృథ్వుల నడుమనున్న రమణీయ ధనమును స్తోతలకు అందించును. మాదక సోమము రసరూపము - ఇంద్ర వర్థకము.
11. సోమము గతిశీలుడు. ద్యులోకప్రభువు. శతధార. దూరదర్శి. హరితవర్ణుడు. రసరూపి, అతడు దేవతలకు మిత్రమగు యజ్ఞమందు శబ్దించుచు కలశమున ప్రవేశించును. సోమము స్రవణశీల దశాపవిత్రపు రంధ్రములందు శోధితుడగును. సోమము 'వృషా' వర్షకుడు.
12. సోమము స్పందనశీల జలముల ముందు నడుచును. మధ్యమిక వాక్కునకు ముందు నడచును కిరణములందు ప్రవేశించును. బలలాభమునకు యుద్ధముల నాశ్రయించును. చక్కని ఆయుధములు కలిగి, వర్షించు సోమమును అభిషవ కర్తలు శుద్ధిచేయుదురు.
13. స్తోత్రవంత, శోధనవంత, ప్రేరితసోమము, రససహితమై - పక్షివలె - వేగముగా దశాపవిత్రమున చేరును. క్రాంతప్రజ్ఞ ఇంద్రా! ఈ కర్మములు మరియు వృద్ధివలన ద్యావాపృథ్వుల మధ్య పవిత్ర సోమము ప్రవహించుచున్నది.
14. స్వర్ణస్పర్శి, తేజోరూప కవచ ధారి సోమము పూజ్య అంతరిక్షపు పూరకుడు. సోమము జలమిశ్రితమగును. నవస్వర్గమును సృష్టించును. జలములతో ప్రవహించును. సోమము జలముల తండ్రియు ప్రాచీనుడగు ఇంద్రుని సేవించును.
15. సోమము ఇంద్రునిలో ప్రవేశించును. మహాసుఖములు కలిగించును. సోమమునకు ఇంద్రుని తేజస్విశరీరము అంతకు ముందే లభించినది. సోమపు స్థానము ఉత్తరవేది అగును. సోమము వలన తృప్తిచెందిన ఇంద్రుడు సకల యుద్ధములందు గెలుపొందినాడు.
16. సోమము ఇంద్రుని ఉదరమున ప్రవేశించును. సోమము ఇంద్రునకు మిత్రుడు. అతడు ఇంద్రునకు ఆధారభూతమగు హృదయమును బాధించడు. యువతులు యువకులను కలసి నట్లు సోము జలములను కలియును. శతరంధ్ర మార్గము నుండి సోమము కలశమందు ప్రవేశించును. (శతరంద్ర మార్గము జల్లెడ)
17. సోమమా! నిన్ను ధ్యానించువారు, మాదక సోమమును, స్తోత్రములను ఇష్టపడువారలగు స్తోతలు నివాసయోగ్యయజ్ఞ గృహమున సంచరింతురు. మనీషుల స్తోతలు సోమమును స్తుతింతురు. గోవులు సోమమునకు పాలు ప్రదానము చేయును.
18. దీప్తసోమమా! మాకు సంగృహీతము, ప్రవృద్ధము, అక్షీణమగు అన్నమునిమ్ము. అట్టి అన్నమ్ము మూడు శబ్దించును. ఆశ్రయము కలిగించును. మాధుర్యయుక్తమగును. సమర్ధుడగు పుత్రుని ప్రదానము చేయును.
19. సోమము స్తోతల కోర్కెల తీర్చును. అతడు దూరదర్శి. సూర్య వర్ధకుడు. జలకర్త సోమము కలశమున దూరగోరును. సోమము ఇంద్రుని హృదయమున నిలుచును.
20. సోమము ప్రాచీనుడు. మేధావి. పురోహితులచే నియమితుడు. అతనిని అథ్వర్యులు శుద్ధిచేసినంత కలశమున చేరుటకు ధ్వనులు చేయును. ఇంద్ర, వాయువుల మిత్రుత్వము కొరకు పుట్టినవాడును- మూడు స్థానములందు వ్యాపించిన యజమానుల కొరకు జలమును సృష్టించు సోమము మధుర రసనిష్యంది అగును.
21. సోమము ఉదయమునకు వివిధశోభలు కలిగించును - అయం పునాన ఉషసోవిరో చయత్. అతడు జలములందు సమృద్ధుడగును. సోమము లోకకర్త. అతడు ఇరువది ఒక్క మారులు దుహితుడగును. మదకర సోమము హృదయమందు ప్రవేశించుటకు ద్రవించును.
22. సోమమా! దేవతల ఉదరములందు పడుము. దీప్త సోమమా! నీవు కలశమందు సిద్ధమగుదువు. సోమము ఇంద్రుని ఉదరమున ప్రవేశించి పలుకును. అతడు ఋత్విక్కులచే హుతుడగును. 'సూర్యమారోహయోదివి' - సూర్యుని ఆకసమున ఆవిర్భవింప చేసినాడు.
23. సోమమా ! ఇంద్రుని గుండెలో నిలుచుటకు శిలలచే అభిషవించబడి, దశా పవిత్రమున ద్రవింతువు. దూరదర్శి సోమమా! నీవు మానవుల అనుగ్రహముననే ద్రష్టవైనావు. అంగిరుల కొరకు నీవు వారి గోవులను దాచిన కొండను కదిలించినావు.
24. క్షరణశీల సోమమా! సత్కర్ములు, విప్రులగు స్తోతలు రక్షణాభిలాషులై నిన్ను స్తుతింతురు. నీవు సర్వస్తుతులచే అలంకృతుడవు. సుందరపక్షి శ్యేనము నిన్ను ద్యులోకమునుండి తెచ్చినది.
25. గాయత్రి మున్నగు సప్తఛందస్సులు ప్రీతికరములు. అవి హరిత వర్ణ సోమమును మేషలోమ దశపవిత్రమున క్షరితమున చేసి అందు కొనును. క్రాంతకర్మ సోమమా! మహా ఆయుష్మంతులు నిన్ను అంతరిక్షజలములకు ప్రేరేపింతురు.
26.దీప్తసోమము యాజ్ఞిక యజమానుల శత్రువులను దూరము చేయును. చక్కని మార్గమున కలశమున చేరును. సుందర క్రాంత కర్మ సోమము అశ్వమువలె క్రీడించును. తన రూపమును రసమయము చేసికొనును. దశపవిత్రమున చేరును.
27. పరస్పర సంగతములు, శతధారలు, సోమమునకు ఆశ్రయభూతములగు సూర్యకిరణములు సోమమునందు ప్రవేశించును కిరణముల మధ్య, ద్యులోకమున ఉన్న సోమమును అంగుళులు శుద్ధి చేయును.
28. "తవేమాః ప్రజాదివ్యస్యరేతః" నీ దివ్య తేజమునుండియే సకల ప్రాణులు ఉత్పన్నమైనారు. నీవు సకల భువనములకు స్వామివి. ఈ భువనములన్నియు నీ అధీనములు. నీవు ముఖ్యుడవు. సర్వమునకు స్థానమవు.
29. నీవు ద్రవాత్ముడవు లోజ్ఞాతవు. అయిదు దిశల ధారకుడవు. ద్యావా పృథ్వులను ధరించి ఉన్నావు. నీకిరణములను సూర్యుడు ప్రపుల్లతము చేయును.
(అయిదు దిశలు - ఆకాశము + నాలుగు దిక్కులు.)
30. సోమమా! నీవు దేవతల కొరకు - రసమునదాల్చు దశాపవిత్రమున శోధింపబడుదువు. అభిలాషులు, ప్రధాన పురోహితులు నిన్ను గ్రహింతురు. విశ్వాభువనాని యేమిరే - సకల భువనములు నీకు అర్పితములగును.
31. సోమము మేషలోమ దశాపవిత్రమునకు చేరును. హరితవర్ణ, సేచక సోమము జలములందు పలుకును. ధ్యానవంత సోమాభిలాష స్తుతులు - శిశువువంటివాడును, ధ్వనించువాడును అగు సోముని గుణగానము చేయును.
32. సూర్య కిరణములను చుట్టుకున్న సోమము మూడు సవనములచే యజ్ఞమును విస్తరింపచేయును. సర్వజాత, సకల ప్రాణిపతి సోమము సంస్కరించ బడిన పాత్రయందు ప్రవేశించును.
33. సోమము జలపతి, స్వర్గపతి. అతడు సంస్కరించబడును. యజ్ఞపథమున శబ్దించుచుసాగును. అసంఖ్యాక ధారల సోమమును నేతల పాత్రలందు ప్రవేశపెట్టుదురు. సోమము శోధితుడు. శబ్దకర్త దరిచేరువాడు.
34. సోమమా! నీవు బహురస ప్రేషకుడవు. 'సురోనచిత్రో' సూర్యునివంటి పూజినీయుడవు. మేషలోమ పాత్రకు చేరువాడవు. అనేకులచే శోధితుడవు. ఋత్విక్కులు, రాళ్లచే అభిషుతుడవు. నీవు మహాసంగ్రామమునకు ధనపు హితము కొరకు సాగుదువు.
35. క్షరణశీల సోమమా! నీవు అన్నవంతుడవు. బలవంతుడవు శ్యేనముగూటికి చేరినట్లు నీవు పాత్రకు చేరుదువు. ఇంద్రుని కొరకు బలము, మత్తు కలిగించు రసము అభిషుతమైనది. సోమమా! నీవు ద్యులోకమునకు స్తంభమవు. దూరదర్శివి.
36. సోమము నవీనఉత్పన్నము. విజేత. విద్వాంసుడు. జలములపిత. జలధర్త. స్వర్గోత్పన్నుడు. మానవ ద్రష్ట శిశువు వద్దకువలె - గంగాది సప్తమాతృక నదులు సోమమును చేరును.
37. సోమమా! నీవు హరిత వర్ణుడవు. సకలమునకు స్వామివి. అశ్వముల రథము కలవాడవు. సకల బువన గతి విధాయకుడవు. నీ అశ్వములు మధుర ఘృతము, దీప్త దుగ్ధము, జలమును తేవలెను. 'తవవ్రతే తిష్ఠన్తు కృష్టయః'- మానవులు నీ కర్మములందే ఉండవలెను.
38. సోమమా! నీవు సకల భువనముల మానవులద్రష్టవు. జలవర్షకుడవగు నీవి విభిన్నగతులు. మాకు గోవులు మున్నగు వానితో కూడిన సువర్ణధనము నిమ్ము. 'హిరణ్యవహ్వయం స్యామ భువనేషు జీవసే'- హిరణ్యవంతులమగు మేము లోకములందు జీవించ గలము. (లోకములందు జీవించుటకు బంగారమే మూలము అనుచున్నాడు. ఈ ప్రవచనము ఏనాటికైన వర్తించును)
39. సోమమా! నీవు గోవులు, ధనము, సువర్ణము తెచ్చువాడవు. జలములు కలవాడవు. ద్రవించుము. నీవు సువీర్యుడవు. సర్వజ్ఞుడవు. స్తోతలు నిన్ను స్తోత్రముచే ఉపాసింతురు.
40. మధుర సోమరసరము అభిషసమయమున స్తోతలను ఉద్ధరించును. 'మహాసోమము నీటిలో కలసి కలశమున చేరును' సోమపు రథము దశాపవిత్రము. సోమము యుద్ధములకు సాగును. అపారగతుల సోమము మా కొరకు అన్నమును గెలుచును.
41. సోమమా! నీవు అందరి గమ్యవవు రాత్రింబవళ్లు సకల ప్రజలు, సమస్తస్తుతులు నిన్నే కీర్తించును. దీప్తసోమమా ! ఇంద్రుడు నిన్ను సేవించినంత మా కొరకు సంతానయుక్త అన్నమును, ఇల్లునింపు ధనమును యాచింపుము.
42. సోమము హరితవర్ణము. రమణీయము మాదకము సోమమును ప్రాతఃకాల స్తోతలజ్ఞానము మరియు స్తుతులు తెలిసికొన గలవు. సోమము దేవతలు, మానవులు మెచ్చిన సంపదను యజమానులకు ఇచ్చువాడు. మర్త్య, స్వర్గలోక జీవులను తనకర్మములవైపు ఆకర్షించువాడు. అట్టివాడు ద్యావాపృథ్వుల మధ్యకు సాగును.
43. ఋత్విక్కులు ఆవుపాలలో సోమమును కలుపుదురు. వివిధములుగా కలుపుదురు. చక్కగా కలుపుదురు. దేవతలు బలకారక సోమరసమును ఆస్వాదింతురు - మధురగవ్యమున కలుపుదురు. రసము ఉబికినపుడు సోమము క్రిందకు దిగును. సోమము సేచకము. జనులు పశువులను స్నానమునకు నీటికి తీసికోని వెళ్లినట్లు - బంగారు నగల పురోహితులు సోమమును నీటిలోనికి తీసికొని వెళ్లుదురు.



