Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    44. ఋత్విక్కులారా  ! విప్రుడు, ద్రవణశీలుడగు సోమపు పాటలు పాడండి - మహావర్షధారవలె  సొమము రసరూప అన్నమును దాటిపావును. పాము కుబుసము విడినట్లు - అభిషవ సమయమున సోమము తన త్వచము విడుచును. వర్షక, హరితవర్ణ సోమము ఆటలాడు గుఱ్ఱమువలె - దశాపవిత్రము నుండి కలశమున చేరును.

    45. అగ్రగామి, శోభనుడు, జలమున సంస్కరించబడిన సోమము స్తుతించబడును. సోమము దినములను కొలతవేయువాడు. సోమము హరితవర్ణ, జలమిశ్రిత, శుభదర్శన జలవంత, ధనప్రాపకుడు.

    జ్యోతీరథ:- అతని రథము జ్యోతిర్మయము. అతడు ప్రవహించువాడు.

    46. సోమము ద్యులోక భర్త - ద్యులోకస్తంభము. మాదక సోమము అభిషవించబడును. అతడు  త్రిధాతువు.  సోమము సకల భువనములందు విహరించును ఋత్విక్కులు రూపవంత సోమమును స్తుతించినపుడు అప్పుడు శబ్దాయమాన సోమమును పురోహితులు ఇష్టపడుదురు.
   
    47.శోధన  సమయమున నీ చంచల ధారలు సూక్ష్మమేషలోమమును దాటిపోవును. రెండు అభిషవఫలకములమీద జలమందు కలసిన నీవు కలశమున కూర్చుందువు.

    48. సోమమా ! నీకు మాస్తుతులు తెలియును. నీవు మా యజ్ఞము కొరకు  ద్రవించుము. మేషలోమ దశాపవిత్రమున ప్రియమధువును రాల్చును, దీప్త సోమమా! సకల  భక్షక రాక్షసులను నాశము చేయుము. యజ్ఞమందు సుపుత్రులమగు మేము నిన్ను స్తుతింతుము. - మహాధనము యాచింతుము.

                              ఎనుబది ఏడవ సూక్తము
      ఋషి -  ఉశనుడు. దేవత పవమానసోమము. ఛందస్సు - త్రిష్టుప్.

    1. సోమమా! శీఘ్రముగ వెడలుము. ద్రోణకలశమున కూర్చుండుము. నేతలచే శోధితుడవగుము. యజమానికి అన్నము అందింపుము. బలముగల అశ్వమును మార్జనము చేసినట్లు అధ్వర్యులు సోమమును మార్జన్నము చేయుదురు.

    2. శోభన ఆయుధవంత, క్షరణశీల, దివ్య రాక్షసనాశక, ఉపద్రనములందు రభక, దేవపాలక, ఉత్పాదక, సుబల, స్వర్గస్తంభ, పృథ్విధారక సోమము క్షరితమగుచున్నది.

    3. అతీంద్రిద్రష్ట, విప్రుడు, అగ్రగామి, మాననప్రకాశకుడు ధీరుడగు ఉషనృషి కావ్యగత స్తోత్రమున లభించును.

    4. వర్దక ఇంద్రా! నీ కొరకు  మధువము, వర్షకమగు సోమము క్షరితమగుచున్నది. ఇంద్రుడు వందలదాత. అపారదాత. అగణితధనదాత. అతడు నిత్యుడు, బలవంతుడు, యజ్ఞములందు ఉండును.

    5. అన్నాభిలాషులు, సేవా విజేతలు అశ్వమునువలె, సోమము గోమిశ్రిత అన్నము లక్ష్యముగా అనుర బలము కొరకు మేషలోమము యొక్క జల్లెడనుంచి శోధించబడి సిద్ధము చేయబడును.

    6. అనేకులచే ఆహూతము, శోధ్యమాన సోమము మానవులకు సకల భోజ్యధనములను ఇచ్చును. శ్యేనముచే తేబడిన సోమమా! అన్నము ప్రసాదించుము. ధనము ప్రసాదించుము. అన్నరసము వైపుసాగుము.

    7. గతిశీలము, అభిషుత సోమము - విడిచిన గుఱ్ఱమువలె పవిత్రమువైపు పరుగు తీయును. తన దారకు పదును బెట్టిమహిషము వలెను గవాభిలాషి శూరునివలె పరిగెత్తును.

    8. సోమధార ఉన్నత స్థానమునుండి పాత్రవైపు సాగును. పణుల నివాసమగు పర్వతపు అహస్య స్థానమున ఉండిన గోవులను ఈ సోమధారమే పట్టుకున్నది. ఇంద్రా! ఉరుమువలె నినదించు సోమధార నీ కొరకే క్షరితమగుచున్నది.

    9. సోమమా! శోధితమగు తప్పిపోయిన గోసమూహములను కనిపెట్టినావు. శీఘ్రదాత సోమమా! నీవు అన్నవంతుడవు. అన్నము సాంతము నీకు చెందును. మేము నిన్ను స్తుతించుచున్నాము. మాకు మహాధనమును ప్రసాదించుము.

                                  ఎనుబది ఎనిమిదవ సూక్తము
                                             ఋష్యాద్యాః పుర్వవత్

    1. ఇంద్రా! నీ కొరకు సోమము అభిషుతమగును. నీ కొరకు ద్రవించును. నీవే సోమమును చేతువు. నీవే స్వీకరింతువు. నీకు బలము కలుగుటకును సహాయక మగుటకును సోమపానము చేయుము.

    2. సోమము రథమువలె మరిన్ని బరువులు మోయును. మహానుడగు సోమమును జనులు రథమువలెనే సిద్ధము చేయుదురు. సోమము ప్రచురధనదాత. యుద్ధార్ధులు సోమమును యుద్ధమునకు తీసికోని పోవుదురు.

    3. సోమము  వాయువు వలె నియుతాశ్వములకు స్వామి. వాయువువలె స్వేచ్ఛాగమనుడు. అశ్వినులవలె పిలుపును ఆలకించువాడు. ధనికుని వలె అందరకు ప్రార్థనీయుడు. సూర్యునివలె వేగవంతుడు.

    4. సోమమా! నీవు ఇంద్రునివంటి మహాకార్యము చేసినావు. నీవు శత్రుహంతవు పురధ్వంసివి. నీవు అశ్వసమముగా అహినామ్నులహంతవు. అంతేకాదు సకల శత్రుహంతవు.

    5. అగ్ని అరణ్యమున పుట్టును. తన బలము వ్యక్తము చేయును. సోమము జలమున  పుట్టును తనబలము వ్యక్తపరచును. యుద్ధమొనరించు వీరునివలె సోమము శత్రువు ముందు భయంకర శబ్దము చేయును - తాను వర్థిల్లును.

    6. ఆకసమునందలి మేఘము వర్షించును. నదులు దిగువకు  సముద్రమునకు సాగును. అభిషుతసోము మేషలోమమును దాటును. కలశమునకు చేరును.

    7. సోమమా! నీవు బలశాలిని మరుత్తుల బలముతో సమముగా  క్షరితుడవగుము. స్వర్గపు సుందర వాయువువలె వీచుము. జలములె  మాకు  మంచి బుద్ధిని ప్రసాదించుము. నీ రూపములు అనేకములు. శత్రుంజయ  ఇంద్రునివలె నీవు కీర్తనీయుడవు.

    8. సోమమా! నీవు వరుణరాజువు. నీ  కార్యములను నేను త్వరత్వరగా నిర్వహింతును. నీ తేజస్సు గొప్పది. నీవు గంభీరుడవు. నీవు ప్రియమిత్రునివలె పరిశుద్ధుడవు. ఆర్యమవలె పూజ్యుడవు.
       
                                    ఎనుబది తొమ్మిదవ సూక్తము
                                            ఋష్యాద్యాః పూర్వవత్

    1. ఆకాశము నుండి వర్షము కురిసినట్లు యజ్ఞమార్గమున సోమము ప్రవహించుచున్నాది. అనంతధారల సోమము ద్యులోకమున ఆసీనుడగును.

    2. పాడి ఆవులకు  సోమము మహారాజు. సోమము పాలలో  కలియుచున్నాడు. అతడు  యజ్ఞపునావను ఎక్కును. శ్యేనము తెచ్చిన సోమము  జలములందు పెరుగును. ద్యులోక పుత్రుడగు  సోముని పాలకులు దుహింతురు. అథ్వర్యులు సహితము దుహింతురు.

    3. సోమము శత్రుహింసకుడు. జల ప్రేరకుడు. హరిత వర్ణుడు. రూపసి, ద్యులోకస్వామి యాజమానల సోమమునకు వ్యాప్తి కలిగింతురు. సోమము యుద్ధములందు శూరుడు. దేవతలందు ముఖ్యుడు. పణులు అపహరించిన గోవులను వెదకుటకు దారి అడుగుచున్నాడు. సోమసహాయమున్నే సేచక ఇంద్రుడు లోకములను రక్షించుచున్నాడు.

    4. మధుపృష్ఠము భయానకము, గంత, దర్శనీయ సోమమును  బహుచక్ర  రథమున  అశ్వమునువలె - యజ్ఞమున  జతచేయుదురు. అక్క చెల్లెండ్రు, బంధువుల వంటి అంగుళులు సోమమును శుద్ధిచేయును. సమాన బంధమలైన అధ్వర్యులు  మున్నగువారు సోమమును బలశాలిని చేయుదురు.

    5. ఘృతమునందించు  నాలుగు  గోవులు సోమమును సేవించును. గోవులు అందరిని భరించు అంతరిక్షమున ఆసీనులగును. అన్నమును పవిత్రము చేయు గోవులు అనేకములు నలువైపుల సోమమును చుట్టి ఉండును.

    6. సోమము భువికి నిలయము. ద్యులోకమునాకు స్తంభము సకల ప్రజ అతని అధీనము. అతడు  స్తుత్యుడు. మీ కొరకు అశ్వవంతుడు. సోమము మధుర రసవంతము - ఇంద్రుని కొరకు అభిషుతమగును.

    7. సోమమా! నీవు బలవంతుడవు. గొప్పవాడవు. వృత్రఘ్నుడవు. దేవతల పానము కొరకు క్షరితుడవగుము. నీదయ వలన మేము 'సువీర్యస్యసతయఃస్యామ' మంచి బలములకు అధిపతులము కాగలము.

                                    తొంబదవ సూక్తము
               ఋషి - మైత్రావరుణ వసిష్ఠుడు. దేవత - పవమాన సోమము.
                                          ఛందస్సు - త్రిష్టుప్.


    1. సోమము అధ్వర్యులచే ప్రేరితుడు. ద్యావాపృథ్వుల ఉత్పదకుడు. అతడు రథమువలె  అన్నప్రదానము చేయువాడు. ఇంద్రునిపొంది, ఆయుధములకు పదునుపెట్టు, సకల ధనములను చేతబట్టి సోమము మాకిచ్చుట నిలిచినాడు.

    2. త్రిసవనవంతుడు, వర్షకుడు, అన్నదాత సోమమును స్తోతలవాణి శబ్దాయమానుని చేయుచున్నది. జలమిశ్రిత సోమము - వరుణునివలె - జలాచ్ఛాదకుడు. సోమము రత్నదాత స్తోతలకు ధనములిచ్చును.

    3. సోమమా! నీవు శూరులకు శూరుడవు. వీరులకు వీరుడవు. సోమము సమర్థుడు. విజేత, సమనభక్తుడు. తీక్ష ఆయుధవంతుడు. ధనుష్పాణి. యుద్ధమందు అజేయుడు. శత్రుహర్త.

    4. సోమమా! నీ మార్గములు విస్తృతములు. స్తోతలకు అభయ ప్రదానమునకును, ద్యావాపృథ్వులను  కూర్చుటకును క్షరితుడవగుము. మాకు అధిక అన్నము కలిగించుటకు ఉషస్సు, ఆదిత్య కిరణములను  సాధించ దలచి  నినదింతువు.

    5. క్షరణశీల సోమమా! నీవు వరుణ, మిత్ర, విష్ణు, బలి మరుత్తు, ఇంద్ర మరియు అన్యదేవతలకు మాదకుడవగుము వారికి తృప్తి కలిగించుము.

    6. సోమమా! నీవు యజ్ఞవంతుడవు. రాజువలె బలప్రయోగమున సకల పాపములను నష్టపరచి క్షరితుడవగుము. దీప్త సోమమా! మేము సుందర స్తుతుల అర్పించుచున్నాము. మాకు అన్నము కలిగించుము. "పాతస్వస్తిభిః సదానః" మాకు సదా మంగళకరుడవగుము పాలించుము.

    (శ్రీమదాంధ్ర వచన ఋగ్వేదసంహిత తొమ్మిదవ మండలము ఏడవ అష్టకమున మూడవ  అధ్యాయము సమాప్తము.)

        ఓం నతామినన్తిమాయనో నధీరావ్రతా దేవానాం ప్రథమాధ్రవాణి
        నరోదసే అద్రుహా వేద్యాభిర్న పర్వతానినమేత స్థినాంసః

               నాలుగవ అధ్యాయము        తొంబది ఒకటవ సూక్తము
    ఋషి - మారీచ కశ్యపుడు. దేవత - పవమాన సోమము. ఛందస్సు - త్రిష్టుప్.

        ఓం అసర్జివ క్వారథ్యెయథా జౌధియామనోతా ప్రతామో మనీషీ|
        దశస్వసారో అధిసానో అవ్యేజన్తి వహ్నింపద వాన్యచ్ఛ ||

    1. యుద్ధభూమిలో అశ్వమును చేతితో పరిమార్జనము చేసినట్లు శబ్దాయమాన, క్షరణశీల సోమమును యజ్ఞమందు పరిమార్జనము చేయబడును. సోమము దేవతల మనసులకు అనుకూలుడు.  దేవఃలందు శ్రేష్ఠుడు. సుత్తులకు అధిపతి. భగినీ రూప దశాంగుళులు యజ్ఞగృహమునకు మోయు సోమమును ఉన్నత స్థానమగు - మేషలోను దశాపవిత్రమునాకు పంపును.

    2. సాధువులగు  సహుష వంశస్తోతలు అభిషవించిన, దేవసమీపవర్తి సోమము యజ్ఞమునకు వెడలును. అమర సోమము కర్మనిష్ఠనరులచే పవిత్ర అభిషవచర్మము, గోరసము, జలములద్వారా అనేకమారులు శోధితుడై యజ్ఞమునకు వెడలును.

    3. సోమము కామవర్షకుడు, మాటిమాటికి శబ్దము చేయువాడు అతడు జలవర్షక  ఇంద్రుని  కొరకు చక్కని తెల్లని  ఆవుపాలవద్దకేగును. సోమము స్తోత్రవంతుడు. స్తోత్రజ్ఞుడు. సువీర్యుడు. అతడు హింసారహితమగు అనేక మార్గముల నుండి చిన్నకన్నముల పవిత్రమునుదాటి ద్రోణకలశమునకు వెళ్లును.

    4. సోమమా! సుదృఢ రాక్షసనగరములను ధ్వంసము చేయుము. పవిత్రమున శోధితుడవై అన్నము తెమ్ము. దూరమునుండియు దగ్గరనుండియు చేరు రాక్షసులున్నారే - వారినాయకుని నీఘాతుక ఆయుధములచే హతమార్చుము.

    5. సర్వ  ప్రార్థనీయ సోమమా! నీవు ప్రాచీనుడవు. మావి నవీన సూక్తులు. శుభంకర స్తుతులు. వానిని ప్రాచీనములు చేయుము. సోమమా ! నీవు బహుకర్మవు. శబ్దాయమానుడవు. నీ అంశము రాక్షసులు సహించలేనిది. హింసకము. మహామాహము. అట్టి నీ అంశము యజ్ఞములందు మాకు లభించవలెను.

    6. పవమాన సోమమా! మాకు జలము , స్వర్గము, గోధనము, అనేకమంది పుత్రపౌత్రులను ప్రసాదించుము. మా క్షేత్రములకు శుభములు కూర్చుము. అంతరిక్షమున నక్షత్రములను విస్తృతపరచుము. మేము చిరకాలము సూర్యుని దర్శించవలెను.

                                     తొంబది  రెండవ  సూక్తము
                                          ఋష్యాద్యాః పూర్వవత్

    1. సోమము శోధ్యమానము. పురోహితలు  పంపినది. హరితవర్ణ. యుద్ధమందు శత్రువధకు రథమునుసంచాలితము చేసినట్లు - దేవతలను ఉపాసించుటకుగాను సోమమును మేషలోమ పవిత్రమునసంచాలితము చేయుదురు.  సోమమునకు ఇంద్రుని స్తోత్రము  ప్రాప్తించును. అతడు ప్రసన్నకర అన్నములచే దేవతలను సేవించును.

    2.మానవద్రష్ట, క్రాంతప్రజ్ఞ సోమము జలములందు కలియును. స్వస్థానమగు పవిత్రమున వ్యాపించును. స్తోత్రముల కొరకు హోతలు దేవతల వద్ద కేగునట్లు-సోమము యజ్ఞమునకేగును. తదుపరి చమసాది పాత్రలందు నిలుచును. అప్పుడు విప్రులగు సప్తర్షులు సోమము వద్దకు విచ్చేయుదురు. 


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More