Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
డెబ్బది తొమ్మిదవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. ప్రభూత దీప్తయజ్ఞమందు - సోమము స్వయముగా మా వద్దకు విచ్చేయవలెను. సోమము హరిత వర్ణము. క్షరణశీలము. మా అన్ననాశకులు నశించవలెను. మా శత్రువులు నశించవలెను. మా కర్మములు దేవతలకు చేరవలెను.
2. మదస్రాని సోమము మా వద్దకు రావలెను. ధనము కూడ రావలెను. సోమపు కృపవలన మేము బలవంతులగు శత్రువులను ఎదిరించగలము. ఎంతటి మొనగాని భాధనైన తిరస్కరించ గలము. మాకు ధనము లభించగలదు.
3. సోమము తన శత్రువునకు, మా శత్రువునకు హింసకుడగును. మరుభూమిలో దాహము వెంటపడినట్లు సోమము ఉభయశత్రువుల వెంట పడును. క్షరణశీల సోమమా! ఆ శత్రువులను హతమార్చుము.
4. సోమమా! నీ పరమ అంశము ద్యులోకమున ఉన్నది. అక్కడినుంచి భూమి మీది పర్వతములపై నీ అంశము అవతరించినది. అక్కడ అది వృక్షములైనది. విప్రులు నిన్ను రాతి మీద దంచుదురు. వారు చేతులతో గోచర్మముపైన, నీటిలో శుద్ధిచేయుదురు.
5. సోమమా! ప్రధాన పురోహితులు నీ సుందర, సురుచిర రూపమునకు ప్రేరణ కలిగింతురు. సోమమా! నీ బలకర, ప్రియకర, మదకర రసమును ప్రకటింపుము. నిందుకలగు మా శత్రువులను నాశము చేయుము.
ఎనుబదవ సూక్తము
ఋషి - భరద్వాజ వసువు. దేవత - పవమాన సోమము. ఛందస్సు - జగతి.
1. సోమము యజమానుల ద్రష్ట. అభిషుతుడు. అతని ధారలు క్షరితమగును. సోమము యజ్ఞరూపమున దేవతలను అర్చించును. సోమము స్తోతల మంత్రములతో వెలుగును. సముద్రము వంటి భూమిని సవదములు వ్యాపింపచేయును.
2. అన్నవంత సోమమా! నీవు వర్షకుడవు. బలకరుడవు. అనాహత స్తుతివచనములు నిన్ను స్తుతించును. నీవు దీప్తుడవు అగుదువు. స్వర్ణభుజములచే అలంకరించ బడిన స్థానమునకు చేరుదువు. హవివంత యజమానుల ఆయువును, మహత్తర కీర్తిని పెంపొందించుము. ఇంద్రుని కొరకు క్షరితుడ వగుము.
3. యజమానులకు అన్నము కలిగించుటకు సోమము ఇంద్రుని పొట్టలో పడును. అత్యంతమదకర, బలకర, రసవంత, సుమంగళ సోమము సకల ప్రాణులను విస్తరింప చేయును. యజ్ఞవేది మీద క్రీడించు హరితవర్ణ, గతిశీల వర్షక సోమము రాలుచున్నది.
4. సోమము అతిశయ మధురము. బహుధారావంతము. మానవులు, వారి పది అంగళులచే ఇంద్రునికొరకు సోమమును దుహింతురు. సోమమా! నిన్ను మానవులు పిండుదురు. రాళ్లు అభిషవించును. నీవు అపరిమిత ధనముల విజేతవు. దేవతల కొరకుప్రవహింపుము.
5. సోమము మధుర రసవంతము. కోరకలు ఈడేర్చునది. సుందర, సుకుమార హస్తముల దశాంగుళులు సోమమును దుహించును. సోమమా! ఇంద్రునకు మత్తు కలిగించుము. సముద్ర తరంగములవలె క్షరితమగుము. ఇతర దేవతల వద్ద కేగుము.
ఎనుబది ఒకటవ సూక్తము
ఋషి , దేవతలు పూర్వమువలె. చంధస్సు జగతి. చివరిది త్రిష్టుప్.
1. అభిషుత సోమము ఆవు పెరుగులో కలిసినప్పుడు. యజమాని మనోరథము తీర్చనపుడు శూరుడగు ఇంద్రుని ఉన్మత్తుని చేసినపుడు అప్పుడు శోధిత సోమపు సుందర తరంగములు ఇంద్రుని ఉదరమున చేరును.
2. రథవాహక అశ్వమువలె - సోమము వేగముగా కలశమునకు ఉరుకును. కోరికలు తీర్చునట్టి, స్వర్గ, మర్త్య జనులను ఎరిగినట్టి సోమము దేవతల ప్రసన్న కారకమగును.
3. శోధిత సోమమా! మాకు గవాదిరూప ధనమునిమ్ము. దీప్తసోమమా! నీవు ధనికుడవు. మాకు మహా ధనమునిమ్ము. అన్నధారక సోమమా! నేను నీసేవకుడను. ప్రజ్ఞానమున మాకు సుఖములు కలిగించుము. నీవు మాకీయదలచిన ధనమును మా నుండి దూరము చేయకుము.
4. చక్కని దాతపూష, పవమానసోమ, మిత్ర, వరుణ, బృహస్పతి, మారుతీ, వాయు, అశ్విద్వయ, త్వష్ట, సవిత, సుందరి సరస్వత్యాది దేవతలు - అందరు కూడి - మా యజ్ఞమునాకు విచ్చేయ వలెను.
5. సర్వవ్యాపిని ద్యావాపృథ్వులు, ఆర్యమ, అదితి, విధాత, మానవప్రశస్య భగుడు, విశాల అంతరిక్షము విశ్వదేవతలు మున్నగువారు క్షరణశీల సోమమును ఆశ్రయించవలెను.
ఎనుబది రెండవ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. సోమము శోభనము. వర్షకము హరితవర్ణము. అభిషుతము సామ్రాట్టువలె దర్శనీయము. జలము వైపు వెళ్లుచు రసము పిండునపుడు ధ్వనించును. సోమము శోధితమై శ్యేనము గూటికి వలె దశాపవిత్రమువైపు సాగును. సోమము జలస్థానమున క్షరితమగును.
2. సోమమా! నీవు క్రాంత కర్మవు. నీవు యజ్ఞము చేయ దలచి పూజ్య పవిత్రమునకు చేరు కుందువు. ప్రక్షాళితుడవై - అశ్వము పగిది యుద్ధమునకు వెళ్లదువు. మా పాపములను నశింప చేయుము. మమ్ము సుఖవంతులను చేయుము. నీట కలసిన నీవు పవిత్రము వైపు సాగుదువు.
3. సోమము వెడల్పు ఆకులు గలది. మేఘము సోమమునకు పిత. పృథ్వినాభి యజ్ఞమున - శిలలపై నివసించును. అంగుళులు జలము వద్దకు దుగ్ధాదులను తెచ్చును. రమణీయ యజ్ఞమందు సోమము శిలలను కలుసు కొనును.
4. సోమమా! నీవు పృథ్విపుత్రుడవు. నేను నిన్ను స్తుతించు చున్నాను. వినుము. భార్య భర్తకు సుఖములు కలిగించును. అట్లే నీవు యజమానికి సుఖములు కలిగింతువు. మా స్తుతులందు సంచరించుము. మీ జీవనము కొరకు నీవు జీవించు చున్నావు. సోమమా! నీవు స్తుత్యుడవు. మా శత్రుబలము విషయమున సావధానుడవము.
5. సోమమా! నీవు ప్రాచీన స్తోతలకు వేలకొలది ధనములు ఇచ్చినావు. అభినవ అభ్యుదయ స్తోతలకు సహితము అట్టి ధనములను ప్రసాదించుము. నీ కర్మము నిర్వర్తించుటకే జలము నీతో కలియును.
ఎనుబది మూడవ సూక్తము.
ఋషి - అంగిరస పవిత్రుడు, దేవత - పవమానసోమము , ఛందస్సు - జగతి
1. సోమమా! నీవు మంత్రములకు స్వామివి. నీ తేజము సర్వత్ర వ్యాపించినది. నిన్ను పానము చేసిన వారి సర్వాంగములకు నీవే ప్రభువువై, విస్తరించెదవు. వ్రతాదులు చేయనివాడు నీ తేజస్సును అందుకొనజాలడు. యజ్ఞ, కర్తయు, పరిపక్వశరీరి యగువాడు మాత్రమే నీ తేజమును గ్రహించగలడు.
2. సోమము శత్రుతాపకము. శోధకము. అతని తేజస్సు ద్యులోకపు ఉన్నత స్థానము వరకు వ్యాపించినవి. సోమపు శీఘ్రగామి సోమరసము, పవిత్రుడగు యజమానిని రక్షించును. తదుపరి దేవతలను చేరదలచి స్వర్గపు ఉనత ప్రాంతమునకు చేరును.
3. సోమము ఆతిత్యుడు. అతడు వెలుగులు చిమ్మును. సోమము జలము కలిగించి ప్రాణిజాలమునకు అన్నము ప్రదానము చేయును. సోమము జ్ఞాని. అతని ప్రజ్ఞవలననే అగ్నిమున్నగువారు లోకములను నిర్మింతురు - మానవద్రష్టలగు దేవతలు ఓషధులకు గర్భము కలిగింతురు.
4. జలముల భర్త ఆదిత్యుడు. అతడు సోమస్థానమును రక్షించును. సోమము దేవతల జన్మములను రక్షించును. మహాసోమము మా శత్రువులను పాశములచే బంధించును. సోమము పశువుల ప్రభువు "సుకృత్తమా మధునో భక్షమాశత" సుకృతము చేసినవాడే సోమపు మధుర రసము సేవించగలడు.
5. జలవంత సోమమా! నీవు జలముల కలియుదువు మహానుడవగుదువు. దివ్య యజ్ఞగృహమున రక్షింతువు. సోమమా! నీవు సామ్రాట్టువు - పవిత్ర రథవంతుడవై యుద్ధమున కేగుదువు. "జయసి శ్రవో బృహత్" మహాన్నములను గెలుతువు.
ఎనుబది నాలుగవ సూక్తము
ఋషి - ప్రజాపతి దేవత - పమమాన సోమము ఛందస్సు - జగతి
1. సోమమా! నీవు దేవతలకు మదకరుడవు. సూక్ష్మదర్శివి. జలదాతవు. ఇంద్ర, వరుణ, వాయువుల కొరకు క్షరితుడవగుము. మాకు అవినాశ్య ధనములిమ్ము. విశాలపృథ్వి మీద నన్ను దేవభక్తునిగా పేర్కొనుము.
2. సోమము సకలభువనములందు వ్యాప్తము. అతడు జనులను నలుదిశలందు రక్షించును. అతడు యజ్ఞమును ఫలసమన్వితము చేయును. అసురల నుండి విముక్తము చేయుచు సూర్యుడు లోకముల చీకట్లను తొలగించి వెలుగులతో నింపినట్లు - సోమము యజ్ఞమును ఆశ్రయించును.
3. దేవతల సుఖమునకుగాను - కిరణములచే ఓషధులందు - సోమము ప్రవేశపెట్టబడును. సోమము దేవాభిలాషి శత్రుధనవిజేత. దేవసమూహములకు, ఇంద్రునకు మత్తు కలిగించువాడు. అభిషుత సోమము ప్రదీప్త ధారలుగా ప్రవహించును.
4. సోమము గమనశీల, ప్రతిగామి, ప్రాతఃకాల స్తోత్ర ప్రేరకుడై వేల నాలుకలతో క్షరితుడగును. వాయుప్రేరిత సోమము ద్రవీభూత రసమును పైకి లేపును.
5. సోమము దుగ్ధవర్థకము. గోవులు తమపాలతో సోమమును సిక్తము చేయుటకు నిలిచి ఉన్నవి. సోమమును స్తుతించినంత సర్వము ప్రదానము చేయును. కర్మఠ, రసరూప, విప్ర, క్రాంత, ప్రజ్ఞ, అన్నవంత, శత్రుధవ విజేత, సోమము స్వకర్మమున ద్రవించును.
ఎనుబది అయిదవ సూక్తము
ఋషి - భార్గవ వేనుడు. దేవత - పవమానసోమము. ఛందస్సు -
జగతి - 11,12 త్రిష్టుప్
1. సోమమా! చక్కగా అభిషుతమగుము. ఇంద్రుని కొరకు నలువైపుల వ్యాపించుము. రసమును రాల్చుము/ రాక్షసులు, వ్యాధులు దూరమందుండవలెను. నీయొక్క రసపానమున పాపులకు ఆనందము కలుగరాదు. ఈ యజ్ఞమందు నీ యొక్క. రసము ధనయుక్తము కావలెను.
2. క్షరణ శీలసోమమా! నీవు నిపుణుడవు. దేవతలకు ఇష్టమగు మాదకుడవు. మేము నిన్ను స్తుతింతుము. మమ్ము రణభూమి కంపుము. శత్రువులను పరిమార్చుము. మా వద్దకు విచ్చేయుము. ఇంద్రా! యుద్ధమున మా శత్రువులను హతమార్చుము.
3. క్షరణశీల సోమమా! నీవు అహింసితుడవు, మాదకతముడవు అయిద్రవించుము. నీవు స్వయముగా సోమవవు. ఇంద్రునకు అన్నమవు - "ఇంద్రస్యభవసిధాసిః" సోమము విశ్వ సామ్రాట్టు. అతనిని స్తోతలు స్తుతింతురు - యశమును పాడుదురు.
4. సోమము సహస్రనేత్రుడు. శతధారావంతుడు. ఆశ్చర్యకరుడు. మహామహుడు. ఇంద్రుని కొరకు అభిషుతమగు మధువును ద్రవీభూతము చేయును.
సోమమా! మాకుగాను క్షేత్రములను, జలమును గెలువుము. పవిత్రమువైపు మరలుము. సేచక సోమమా! మా స్తోత్రమార్గములను విశాలపరచుము.
5. సోమమా! నీవు పలుకుదువు. కలశమున నిలుతువు. గోదుగ్ధమున కలియుదువు. మేషలోమదశాపవిత్రమునకు సాగుదువు. శోధితుడవు. అశ్వమువలె అర్చనీయుడవు. ఇంద్రుని ఉదరమున క్షరితుడవగుదువు.
6. సోమమా! నీవు సురుచివి. దివ్యజన్ములగు దేవతల కొరకుణు, ఇంద్ర, మిత్ర, వరుణ, వాయు, బృహస్పతిమున్నగు వారి కొరకును - మధుమంతుడవు, అహింసనీయుడవై క్షరితుడవగుము.
7. అధ్వర్యుల దశాంగుళులు - అశ్వసమ గతిశీల - సోమమును కలశమున శుద్ధి చేయును. విప్రుల నడుమ స్తోతలు సోమమును కీర్తింతురు. క్షరణశీల, మదకర సోమము ఇంద్రునిలో ప్రవేశించును.
8. క్షరణశీల సోమమా! మాకు సువీర్యమును, కోశమును, భూఖండమును, విశాల గృహమును ప్రసాదించుము. మా కర్మములను ద్వేషించువారిని ప్రభువులను చేయకుము. "జయేమ త్వయా ధనధనమ్" నీ దయవలన సకల ధనములను జయింతుము.
9. దూర దర్శక, వర్షక సోమము ద్యులోకపువాడు. అతడు ద్యులోకమునందలి నక్షత్రాదులను శోభిల్ల చేసినాడు. కాంతప్రజ్ఞుడును, మహారాజును అగు సోమము దశాపవిత్రమునకు తరలును. వరదర్శక సోమము నినదించుచు ద్యులోకమునుండి అమృతము కురిపించును. "దివఃపీయూషందుహతే".
10. మధుర వచన 'వేనులు, - వేరువేరుగా -దుఃఖరహిత స్థానమున సోమాభిషవము చేయుదురు. వారలు - సేక్త ఉన్నత స్థానస్థిత, జలములందు వర్ధమాన, రసరూప సోమమును - సముద్రమువలె వర్ధమాన ద్రోణకలశమున జలతరంగములందు అభిషేకింతురు. వారు మధురస సోమమున దశాపవిత్రమునకు చేర్చెదరు.'
(వేనులు - ఈ సూక్తపుద్రష్ట వేనుడు. అతని వంశీయులు వేనులు)



