Home » suryadevara rammohan rao » Vyuham


    "అరేయ్ బచ్చా మా వాళ్ళకి కావల్సిన కేసెట్స్ ఇవ్వరా" అన్నాడు గుండప్ప పొగరుగా.

 

    ఆ యువకుడు భయంతో బిగుసుకుపోయాడు.

 

    ఇస్తే శక్తికి కోపం- ఇవ్వకుంటే గుండప్పకి ఆగ్రహం... ఏం చేయాలో తోచని పరిస్థితిలో పడిపోయాడా యువకుడు.

 

    శక్తి మౌనంగా పరిస్థితుల్ని గమనిస్తూ, పిడికిళ్ళు బిగిస్తూ... వదులు చేస్తున్నాడు.

 

    "ఏంటిబే... కదలవ్... తలుపు దగ్గరే నిలబడిపోయావేంటి?" గుండప్ప రంకెలేస్తున్నట్లుగా అన్నాడు.

 

    శక్తి ఒక క్షణం కళ్ళు మూసుకున్నాడు.

 

    ఆ వెంటనే తేరుకొని- రెండే రెండగల్లో గుండప్పని సమీపించాడు.

 

    "ఈ యువకుడు నాకు అప్పున్నాడు. నువ్విప్పుడు ఫ్రీగా కేసెట్లని, మామూళ్ళని అంటే నా అప్పు ఎలా తీరుస్తాడు?" సూటిగా గుడ్లప్పకేసే చూస్తూ అన్నాడు శక్తి.

 

    గుండప్ప కళ్ళలోకి సర్రున ఎరుపుజీర వచ్చేసింది. అయినా లెక్కచేయనట్లుగా చూస్తుండి పోయాడు శక్తి.

 

    "నువ్వెవడివిరా. నా కడ్డురావటానికి- నేనిప్పుడు కేసట్స్ తీసుకొని వెళ్ళిపోతాను" అంటూ గుండప్ప శక్తి భుజంమీద చేయి వేసి విసురుగా తోసేసాడు.

 

    దాన్ని ముందుగానే ఊహించి శక్తి ఒక్కడుగు వెనక్కి వేసినా క్షణాల్లో తేరుకున్నాడు.

 

    సరిగ్గా అప్పుడు గుండప్ప మనిషి ఒకరు శక్తి వెనుక నుంచి వచ్చి, శక్తి వీపు మీద బలంగా చరిచాడు.

 

    దాంతో శక్తి మెరుపుకన్నా వేగంగా వెనక్కి తిరిగి చేతిని ఇనుపముక్కలా చేసి అతని మొఖం మీద వేసాడో దెబ్బ-

 

    అది తగులుతూనే అతను ఆర్తనాదం చేస్తూ కూలిపోయాడు.

 

    అప్పటివరకు అక్కడేం జరగబోతోందనే ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ప్రజలకు జరగబోయేది అర్థమయిపోయి అసంకల్పితంగానే అందరూ ఒకింత వెనక్కి తగ్గారు.

 

    గుండప్ప రౌడీయిజాన్ని, అరాచకాల్ని అణిచేందుకు వీడియో పార్లర్ ఓనర్ శక్తిని తీసుకొచ్చి ఉండవచ్చని భావించి ఊపిరి తీసుకున్నారు గుండెల నిండుగా.

 

    తన అనుచరుడెప్పుడయితే శక్తి దెబ్బకి కూలిపోయాడో- గుండప్ప రెచ్చిపోయాడు.

 

    దాంతో ఒక్కసారిగా అరుస్తూ శక్తి మీదకొచ్చాడు గుండప్ప.

 

    గుండప్పని బాగా దగ్గరగా రానిచ్చి పిడికిలిని ఉక్కుముక్కలా చేసి గుండప్ప కడుపులో గుద్దాడు శక్తి. ఊహించని ఆ దెబ్బకు గుండప్ప మొదలు విరిగిన చెట్టులా నేలకొరిగిపోయాడు.

 

    ఇక ఆపై ఒక్కక్షణం ఆలోచించలేదు శక్తి-

 

    చూస్తుండగానే మూడే మూడు నిమిషాల్లో గుండప్ప, అతని మనుష్యులు నేలకొరిగిపోయారు.

 

    నేలకొరిగిపోతున్న గుండప్ప చేతిని ఎవరు చూడకుండా నేరుగా మెలితిప్పి వదిలాడు శక్తి.

 

    దానిమూలంగా గుండప్ప చేయి మరో రెండు మూడు సంవత్సరాల వరకు పనిచేయదని శక్తికి తప్ప మరెవరికి తెలిసే అవకాశం లేదు.

 

ఆ పైన గుమికూడిన ప్రజలే ముందు కొచ్చి శక్తిని పొగిడి చేతులెత్తి నమస్కరించి పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసారు.

 

    పదినిమిషాల్లో అక్కడి కొచ్చిన పోలీసులు కొయ్యబారిపోయి చూస్తుండగా గుండప్ప అతని మనుష్యులు ఆ ప్రాంతంలో చేసే దౌర్జన్యాల గురించి ప్రజలు ఏకరువు పెట్టటంతో, విధిలేని పోలీసులు వార్ని పోలీస్ వ్యాన్ లో పడేసుకొని అక్కడి నుంచి కదిలి వెళ్ళిపోయారు.

 

    కృతజ్ఞతలు తెలుపుకుంటున్న ఆ యువకుడి మాటల్ని అక్కడి ప్రజల ప్రశంసల్ని వింటూనే శక్తి అక్కడి నుండి కదిలాడు భగవాన్ తో.

 

                         *    *    *    *

 

    ఆటోలో వస్తున్నంతసేపు శక్తి భుజబలం గురించే ఆలోచిస్తూండి పోయాడు భగవాన్.

 

    ఒకే ఒక్క శక్తి ఐదుగురు ప్రొఫెషనల్ గుండాస్ ని ఎలా కొద్ది నిమిషాల్లోనే మట్టిగరిపించాడు! అసలేమీ అర్థం కాలేదు భగవాన్ కి.

 

    శక్తి మాత్రం ఆ సంఘటనని ఆ వెంటనే మర్చిపోయాడు. అతని ఆలోచనలిప్పుడు మహిత చుట్టే పరిభ్రమిస్తున్నాయి.

 

                                       *    *    *    *

 

    శక్తికి భగవాన్ కి తెలీని విషయం ఒకటుంది...

 

    మహిత ఆ ప్రాంతానికి సరిగ్గా ఆరు గంటలకే వచ్చి శక్తి చేసిన ఎటాక్ ని ఓ గోడ చాటునుంచి చూసి శక్తిని మనసులోనే మెచ్చుకుంది. ఆ పైన వారికి కనిపించకుండా వెనక నుంచి వెనక్కే వెళ్ళిపోయింది.

 

                                     *    *    *    *

 

    ఆ మరుసటి రోజు వైట్ అంబాసిడర్ కార్లోంచి దిగాడు శక్తి.

 

    ఆలివ్ కలర్ సూట్ లో హుందాగా ఉన్నాడు శక్తి. రౌబాన్ గ్లాసెస్ ని సర్దుకొని ముందు కడుగేసాడు.

 

    అప్పటికి, స్టాఫ్ ఎవరూ రాలేదు. ఒక్క పి.ఎ. సమరంజని తప్ప.

 

    "సార్ మీ కోసం ఫామిలీమేళ షోరూం ప్రొప్రైటర్ రెండుసార్లు ఫోన్ చేసారు. అర్జంటుగా మిమ్మల్ని కలవాలట."

 

    "ఫామిలీ మేళా ప్రొప్రైటర్...

 

    ఆ పేరెక్కడో విన్నాడు తను. జ్ఞాపకం చేసుకోడానికి ప్రయత్నించాడు శక్తి.

 

    ఒక్కసారి బాణశంకర్, కళ్ళముందు కదలాడాడు.

 

    తమ ఫస్టు కస్టమర్ బాణశంకర్ ఫామిలీ మేళ ఎదురుగా షోరూం పెట్టమని చెప్పాడు తను. ఆ తర్వాత బాణశంకర్ తనను కలవలేదు. చేస్తే బాణశంకర్ ఫోన్ చేయాలి.

 

    ఫామిలీ మేళ ప్రొప్రైటర్ ఎందుకు ఫోన్ చేసుంటాడు? ఆలోచిస్తున్నాడు శక్తి. 


Related Novels


Rakthachandanam

Erra Samudram

Daaling

Anitara Sadhyudu

More