Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
2. ప్రధాన ఋత్విక్కులు తమలోతాము కలసికొని సోమమును అభిషుతము చేయుదురు. స్వర్గాది ఫలములు కోరు ఋత్విక్కులు సోమమును జలప్రవాహమున కంపుదురు. స్తోతలు పూజ్య స్తుతులు చదువుచు - ఇంద్రుని ప్రియధామమును - మాదక సోమధారలచే వర్థిల్ల చేయుదురు.
3. సోమ కిరణములు శోధన శక్తివంతములు. అవి అంతరిక్షమున నిలుచును. కిరణములకు తండ్రి సోమము. అతడు ప్రకాశమాన కర్మమును రక్షించును. తన వెలుగులను పరచుకున్న సోమము తన కిరణముచే అంతరిక్షమున. తన వెలుగులను పరచుకున్న సోమము తన కిరణముచే అంతరిక్షమున వ్యాపించును. ఋత్విక్కులు సకలమును భరించు శక్తిగల - జలములందు సోమమును ఆవిష్కరింతురు.
4. సోమకిరణములు సహస్రధారలు కలవి. అంతరిక్షమున వర్తమానములు. అవి దిగువనున్న భూమికి వర్ణము కలిగించును. ద్యులోకపు ఉన్నత ప్రదేశమున నిలిచినా మధుజహ్వ, పరస్పర సంగరహిత సోమ కిరణములు శీఘ్రగాములగును. కంటి రెప్ప వాల్చవు. "పదేపదే పాశినః సన్తి సేతవః" అడుగడుగుణ నిలిచిన కిరణములు పాపులను బాధించును.
5.సోమ కిరణములు ద్యావా పృథ్వినుండి అధికముగా ప్రాదుర్భవించును. ఋత్విక్కులచే స్తుతించబడను. కర్మశూన్యులను నష్టపరచును. అవి - ఇంద్రుని కొరకు - తమ జ్ఞానముచే నలుపుచర్మపు రాక్షసులను ద్యావాపృథ్వులనుండి దూరము జరుపుము.
6. సోమరశ్శులు స్తుతియుతములు. క్షిప్రకారులు. అవిప్రాచీన అంతరిక్షమున ఒకేసారి పుట్టినవి. చూపులేనివారు, సాధువులు కానివారు, దేవస్తుతిని విడిచినవారగు పాపులు ఈ కిరణములను త్యజింతురు. "ఋతస్యపన్థాంనతరన్తి దుష్కృతః" దుష్టులు సత్యమార్గమున తరించజాలరు.
7.ఋత్విక్కులు క్రాంత కర్ములు. మనీషులు వారు బహుధారల, విస్తృత పవిత్రమున వర్తమాన సోమపు మాధ్యమికే - అంతరిక్ష - వాక్కును స్తుతింతురు. ఆవాక్కు మరుత్తుల మాతను స్తుతించును. ఆగమనశీల, ద్రోహశూన్య, అహింసనీయ, సుదర్శన, కర్మనేతలగు మరుత్తులు ఆవాక్కును ఆశ్రయింతురు.
8. సోమము సత్యయజ్ఞరక్షకుడు. శుభకర్ముడు. అతని ముందు ఎంతటివాడును బీరములు పలుకజాలడు. అగ్ని, వాయు, సూర్య త్రిరూపములను సోమము తనలో దాల్చును. విద్వాంస సోమము సకల భువనములను వీక్షించును. కర్మ భ్రష్టులను తలవంచి నరుకును.
9. సోమము సత్యరూప యజ్ఞరక్షకుడు. మేషలోమ పవిత్రమున విస్తృతుడు. అతడు వరుణుని - జాలపు - జిహ్వాగ్రమున వసించును. కర్మనిష్ఠులకు మాత్రమే సోమము అందును. కర్మశూన్యులకు అందుట అసంభవము. కర్మశూన్యులు నరకమున పడుదురు.
డెబ్బది నాలుగవ సూక్తము
ఋషి - కక్షీవంతుడు. దేవత - పవమానసోమము. ఛందస్సు - జగతి - 8 త్రిష్టుప్.
1. సోమము వసతీవరీ జలమున పుట్టును. పసిబిడ్డవలె తల వంచి ఏడ్చును. బలముగల అశ్వమువంటి గమనశీల సోమము స్వర్గమును ఆశ్రయించ కోరును. గోవుల, ఓషధుల రస సహితముగా సోమము నెలకు దిగతలచును. అట్టి సోమమును మేము స్తుతింతుము. ధనాదియుక్త గృహము యాచింతుము. "ఈమహేసుమతీ శర్మసప్రథిః"
2. యజ్ఞములు కారుదెంచు ఇంద్రునకు - సంస్కరించ బడిన సోమము ఎంతో మధురరస పానమగును. ఇంద్రాదుల పృథివీమార్గము ఎంతో విశాలము. ఇంద్రుడు వర్షమునకు ఈశ్వరుడు. గోవుల హితము కోరువాడు. యజ్ఞనేత ఆ ఇంద్రుడు ఈ యజ్ఞమున స్తుతించబడును.
3. ఆకాశరూప ఆదిత్యునీనుంచి సోమము ఘృతదుగ్ధముల పితుకును. సోమమునుండియే అమృతమును, జలములును ఉద్భవించినవి. సోమము యజ్ఞపు నాభియగును. హవిర్దాతలు, స్తోతలు కలసి సోమమును ప్రసన్నుని చేయుదురు. సర్వరక్షక సోమకిరణములు భువిమీద ఉపయుక్త వర్షము కురిపించును.
4. ఋత్విక్కులు జలమున కలిపినపుడు సోమము నాదము చేయును. దేవపాలక సోమము పాత్రలందు ప్రవహించును. పృథ్వియందలి ఓషధులలో - సోమము తన కిరణములచే గర్భము దాల్చును. ఆ గర్భము వలననే మేము దుఃఖవిదారక పుత్ర, పౌత్రులను పొందుదుము.
5. సోమ కిరణములు అనేక ధారలు కలవి. స్వర్గమందు ఉన్నవి. పరస్పరము కలసి ఉండునవి. ఆకిరణములు భూమిమీద పడును. సోమపు నాలుగు కిరణములు ద్యులోకపు దిగువన సోమముచే స్థాపించ బడినవి. అవి జల వర్షకములగును. దేవతలకు హవి అందించును. ఓషధులందు అమృతము చేర్చును.
(సోమపు నాలుగు కిరణములు - సోమస్య సంబంధిన్యశ్చతురసో దీప్తయః కలాః అనిశాయణుడు. సినీవాలి, కూహు, గుంగు, రాకా అను నలుగురు దేవేరులు కావచ్చునని లుడ్విగ్)
6. సోమము శ్వేతరూపము కలిగించును - "శ్వేతంరూపంకృణుతే" బలశాలియు, కోరికలు తీర్చు సోమము స్తోతలకు అధిక ధనము ఇచ్చును. సోమము తన ప్రజ్ఞవలన ప్రకృష్ట కర్మను సాధించును అంతరిక్షమందలి జలపూర్ణ మేఘమును - వర్షము కలిగించుటకు - భేదించును.
7. శ్వేత గో రసయుక్త పాత్రమున సోమము - అశ్వమువలె -దూకును. దేవాభిలాషులగు ఋత్విక్కులు సోమమును స్తుతింతురు. బహుగమనముల కక్షీవంతునకు సోమము పశువులను ప్రదానము చేయును.
8. శోధిత సోమమా! నీయొక్క రసము జలముల కలపి, మేషలోమ దశాపవిత్రమువైపు సాగును. మాదక శ్రేష్ఠ సోమమా! క్రాంత కర్మ ఋత్విక్కులచే సంశోధితుడవై ఇంద్రుని పానము కొరకు ప్రియరసమంతవమగుము.
డెబ్బది అయిదవ సూక్తము
ఋషి - భార్గవ కవి. దేవత - పవమాన సోమము. ఛందస్సు - జగతి.
1. సోమము అన్నమునకు హితకరము లోకప్రియము. గమనశీలము. నీటి నలుదిశల క్షరితమగును. జలమున ఎదుగును. మహాసోమము మహాసూర్యుని రథమును అధిరో హించినది సోమము సర్వద్రష్ట.
2. సోమము సత్యరూప యజ్ఞమునకు ముఖ్యుడు. అతడు ప్రియకర, మదకర రసమును రాల్చుము. సోమము నినదించువాడు. కర్మపాలకుడు. అవధ్యుడు. ద్యులోక దీపిక సోమమును అభిషవించిన తన పుత్రునకు పెట్టిన పేరు అతనిని కన్న తల్లిదండ్రులు సహితము ఎరుగరు.
(సోమము అభిషవించినందున యజమాని సోమమునకు పుత్రుడగును. పుత్రుడు యజమానికి సోమము పెట్టిన పేరు సోమయాజి. తల్లిదండ్రులు పెట్టినవి నక్షత్రవ్యావహారిక నామములు. కావున మూడవ పేరగు సోమయాజి తల్లిదండ్రులకు తెలియదు.)
3. సోమము దీప్తమంతము ఋత్విక్కులచే సువర్ణమయ అభిషవచర్మమున ప్రతిష్ఠింపబడినాడు. యజ్ఞనిర్వాహకులగు ఋత్విక్కులు సోమమును అభిషవింతురు. సోమము కలశమున శబ్దము చేయును. మూడు సనవములందుండు సోమము యజ్ఞదినమందు ప్రాతః కాలమున శోభించును.
4. శిలలచే అభిషుత, అన్నహితైషి, శుద్ధ సోమము ద్యావాపృథ్వులను ప్రకాశవంతము చేయును. మేషలోను పవిత్రము వైపు సాగును. నీటికలిసి, మత్తునిచ్చు సోమధార నిత్యము మీద ప్రవహించును.
5. సోమమా! శుభములు కలుగుటకు నలువైపుల వ్యాపింపుము. కర్మనిష్ఠులచే సంశోధితుడవై క్షీరాదులందు కలియుము. వచనఎంత, శత్రుహంత, అభిషుత మహా సోమమా! పశస్త ధనములనిచ్చు ఇంద్రుని మా వద్దకంపుము "ఇంద్రంచోదయ దాతవే మఘమ్."
(శ్రీమదాంధ్ర వచన ఋగ్వేద సంహిత తొమ్మిదవ మండలము ఏడవ అష్టకమున రెండవ అధ్యాయము సమాప్తము.)
ఓం నతామనన్తి మాయినో నధీరావ్రతా దేవానాం ప్రథమాధ్రవాణి
నరోదసీ అద్రుహా వేద్యాభిర్నపర్వతాని నమే స్థివాంసః
మూడవ అధ్యాయము డెబ్బది ఆరవ సూక్తము
ఋషి - భార్గవ కవి. దేవత - పవమనా సోమము. ఛందస్సు - జగతి
ఓం ధర్తాదివఃపవతే కృత్వ్యోరసోదక్షో దేవానామను మాద్యోన్నభిః
హరిఃసృజానో అత్యోన సత్వభిర్వృథా పాజాంపి కృణుతే నదీప్వా.
1. సోమము సర్వధారకము. అంతరిక్షమున క్షరితుడగును. శోధనీయుడు. రసరూపి, దేవతల బలము, ఋత్వికువర్థకుడు స్తుత్యుడు హరిత వర్ణుడు. ప్రాణులచే చేయబడినవాడు. వసతీ వరిలో అశ్వమువలె తన వేగము పెంచును.
2. సోమము - వీరులవలె - తన ఉభయ హస్తములందు ఆయుధములు ధరించును. గోవులణు వెదుకునపుడు స్వర్గము ఇచ్చగించును. యజమానులకు రథవంతుడు అగును. ఇంద్రుని బలమునకు ప్రేరణ కలిగించును. సోమమును కర్మలుచేయు విప్రులు పంపుదురు. సోమమునందు దుగ్ధాదులు కలుపబడును.
3. క్షరణశీల సోమమా! వర్థిష్ణువవు అగుము. ఇంద్రుని ఉదరమున ప్రచర ధారగా వసింపుము. విద్యుత్తు మేఘములను పితికినట్లు నీవు స్వకర్మములచే ద్యావా పృథ్వులను పితుకుము. మాకు బహు అన్నము ప్రసాదించుము.
4.విశ్వసామ్రాట్టు సోమము క్షరితుడగును. అతడు సర్వదర్శకుడు. సత్యభూతుడు. ఋషి శ్రేష్ఠుడు. సోమము ఇంద్రుని కర్మలు ఇచ్ఛగించినాడు. సోమము సూర్యకిరణములచే శోధించ బడును. సోమపు కర్మమును విప్రులు సహితము వ్యాపింపచేయ జాలరు. సోమము మాస్తుతులకు పాలకుడు.
5. సోమమా! నీవు శబ్దకర్తవు. అంతరిక్షమున ఉన్నవాడవు. ఆబోతు ఆవులమందలో దూరినట్లు నీవు ద్రోణకలశమున ప్రవేశింతువు. ఎంతో మత్తునిచ్చువాడవై నీవు ఇంద్రుని కొరకు క్షరితుడవు అగుదువు. నీ రక్షణలందు మేము యుద్ధమందు విజేతలమగుదుము.
డెబ్బది ఏడవసూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. బీజావాపన చేయువాడును, మధురరసవంతుడగు సోమము - వజ్రమువంటి శబ్దము చేయుచు ద్రోణకలశమున చేరును. సోమధారలు సత్యఫల ప్రదాతలు. జలమును కురిపించునవి. శబ్దము చేయునవి. అవి పాడియావులవలె సాగుచున్నవి.
2. ప్రాచీన సోమము క్షరితమగును. తల్లి పంపగా శ్యేనము ద్యులోకమునకు చేరినది. అచటినుండి సోము తెచ్చినది. మధురరసవంతమగు ఆసోమమే మూడవ లోకమును వేరుచేయును. కృశానునామక ధనుర్ధారి బాణపు దెబ్బకు బెదరి సోమము ఉద్విగ్నభావంను మధురరసమున కలియును.
3. చక్కని యువతులవలె రమణీయుడు, హవి సేవించువాడు, ప్రాచీన, ఆధునిక సోమము - మరిన్ని గోవులున్ననాకు - అన్నలాభము కలిగించవలెను.
4. అనేకులచే స్తుతించబడు, ఉత్తర వేదిన నిలిచిన క్షరుణశీలసోమము - మమ్ముబాధించు శత్రువులను మనోయోగమున గుర్తించి వధించవలెను. సోమము ఓషధులకు గర్భము కలిగించును. ఎక్కువ పాలిచ్చుగోవులవైపు వెళ్లును.
5. సోమము సర్వకర్త, కర్మఠుడు, రసాత్మకుడు అహింసనీయుడు. వరుణసముడు. అట్టి మహాసోమము అటునిటు సంచరించును. ఆపదలు కలిగినపుడు - సర్వమిత్ర, భజనీయ సోమము క్షరితము చేయబడును. మగగుఱ్ఱము ఆడగుఱ్ఱముల మందలో దూరినట్లు సోమము ధ్వనించుచు క్షరితగును.
డెబ్బది ఎనిమిదివ సూక్తము
ఋష్యాద్యాః పూర్వవత్
1. శోభాయమాన సోమము ధ్వనించుచు, జలములను ఆచ్ఛాదించుచు స్తుతులవైపు సాగును. సోమపు నిస్సారభాగమును మేషలోను దశాపవిత్రము ఉంచుకొనును. శుద్ధిచేయబడిన సోమము సంస్కరించబడిన దేవతల స్థానమునకు చేరును.
2. సోమమా! ఋత్విక్కులు నిన్ను ఇంద్రుని కొరకు అభిషవింతురు. నీవు కావివి. యజమానులు నిన్ను వర్థిల్ల చేయుదురు. జలములందు కలుపుదురు. నీవు రాలుటకు మార్గములు- రంధ్రములు - అనేకములు. నీ కిరణములు హరిత వర్ణములు. అసంఖ్యాకములు. అయిప్రస్తర ఫలకముల మీద నిలుచును.
3. అంతరిక్షమునందలి అప్సరలు యజ్ఞమధ్యమున కూర్చుందురు. విద్వాంసుడగు సోముని క్షరితుని చేయుదురు. దుర్గమువంటి యజ్ఞగృహమున అప్సరలు క్షరణ శీల సోమమును పెంచుదురు. స్తోతలు సోముని అక్షయసుఖములు అర్ధింతురు.
4. క్షరణశీల సోమము - గోవులను, రథములను, సువర్ణములను, సుఖములను, జలమును, అపరిమిత ధనములను - జయించినాడు. మదకర, రుచికర, రసాత్మక, అరుణవర్ణ, సుఖకర్త సోమమును తమ పానమునకు దేవతలు కల్పించినారు.
5. సోమమా! పూర్వోక్త సమస్త పదార్ధములను మాకు కలిగించుము. నీవు శోధితమగుదువు. క్షరితమగుదువు. దూరమందు, దగ్గరలో ఉన్న మా శత్రువులను హతమార్చుము. విస్తీర్ణ మార్గములను మా కొరకు నిర్భయము చేయుము.



