Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
2. ఇంద్రుని స్తోతలు స్తుతింతురు. ఇంద్రుని కొరకు మాదక సోమము సిద్ధము చేయబడును. ఉన్మత్త రసవంత సోమము ఇంద్రుని నోట పోయబడును. సోమము గృహాదులందు సువిస్తృతము. మదకర రసవంతము. క్షరణశీలము. గతి పరాయణము చతుర యోద్థబాణము లక్ష్యము చేరినట్లు సోమము మేషలోమ పవిత్రమున చేరును.
3. వసతీనరీ జలము సోమమునకు స్త్రీవంటిది. ఆ జలములందు సోమము శోధితము మిశ్రితము చేయబడును. ఆ వధువును కలసికొనుటకే సోమము మేషచర్మముపై క్షరితుడగును. సోమము సత్యరూప యజ్ఞమునకు వెళ్లును. అచట దైన్యము ఎరుగని పృథ్విమీద పుట్టిన ఓషధుల అగ్ర భాగమున నిలుచును. యజమాని ఫలసంపన్నుని చేయును. హరితవర్ణ సర్వయజనీయ, గృహస్థిత సోమము శత్రువులను లంఘించిసాగును. సర్వత్ర వ్యాపక సోమము శత్రుబలమును న్యూనపరచి తన తేజస్సున శోభిల్లును.
4. వర్షక సోమము చప్పుడు చేయును. దేవత కొరకు అలంకరించిన స్థానమునకు దేవి వెళ్లినట్లు - సోమము వెనుక గోవులు సాగును. సోమము - శ్వేతవర్ణ, మేషలో మమయ పవిత్రమును దాటును. ఉజ్వల కవచమువలె సోమము దుగ్దాదులను కప్పుకొనును.
5. హరితవర్ణ, అమరసోమము జలములందు శుద్ధిఅగునప్పుడు పాలవంటి తెల్లని శుభ్రవస్త్రమును నలువైపుల చుట్టుకొనును పాపనాశక కార్యమునకుగాను సోమము ద్యులోకపు వీపున - సూర్యని స్థాపించినాడు. అందరి మేలు కొరకు ద్యావాపృథ్వుల మీద ఆదిత్య తేజమును నిలిపినాడు.
6. సోమము - సువీర్య ఆదిత్యుని సర్వవ్యాపి కిరణముల భాతి-సర్వత్ర వ్యాపించును. మదకర, శత్రుఘాతుక, చమసవ్యాప్త, పరిష్కృత సోమము నూలు బట్టలతో కూడా నలుదిశల సంచరించును. సోమము ఇంద్రునకు తప్ప ఇతరులు కొరకు క్షరితుడు కాడు.
7. ఋత్విక్కులు అభిషవించిన మదకర సోమము - నదులు సముద్రమునకు చేరినట్లు స్తుత్యఇంద్రుని చేరును. సోమమా! మా ఇంట బిడ్డలకు, ఆవులకు, సుఖము కలిగించుము. మాకు అన్నము, అన్నము, పుత్రులను ప్రసాదించుము.
8. సోమమా! మాకు వస్తు, హిరణ్య, అశ్వ, గో, యవ, శోభన వీర్యయుక్త ధనమునిమ్ము. నీవు మా పితరులకు పితవు. కావున స్వర్గాదులందున్న కర్మ నిష్ఠ, హనిరూప అన్న కర్తవు. మాకు పితరుడవు.
9. ఇంద్రుని రథము యుద్ధములకు పోవును. మేము శుద్ధిచేసిన సోమము ఇంద్రుని జాడకు పోవును. రాళ్లతో అభిషవించిన సోమము మేషలోమ పవిత్రమును దాటును. హరిత వర్ణసోమము వార్థక్యమును అణచును. వర్వమునంపుటకు సాగును.
10. సోమమా! నీవు మహా ఇంద్రుని కొరకు క్షరితుడవగుము. నీవు ఇంద్రునకు సుఖప్రదాతవు. అనింద్యుడవు. శత్రుంజయుడవు. స్తోతనగునాకు ఆహ్లాదకర ధనము ప్రసాదించుము. ద్యావాపృథ్వులు ఉత్తమ ధనములిచ్చి మమ్ము రక్షించవలెను.
డెబ్బదవ సూక్తము
ఋషి - వైశ్వామిత్ర రేణువు, దేవత - పవమాన సోమము
ఛందస్సు - జగతి - 10 త్రిష్టుప్
1. ప్రాచీన యజ్ఞమునందలి సోమము కొరకు ఇరువది ఒక్క ఆవులు పాలిచ్చినవి. యజ్ఞమున పెరిగిన సోమము శుద్ధికిగాను వసతీవరాది నాలుగు జలములను కల్పించినాడు.
2. యజ్ఞకర్తలగు యజమానులు సోమమును జలము అర్థింతురు. సోమమ ద్యావాపృథ్వులను జలముతో నింపును. సోమము తన మహిమచే దీప్తివంతమగు జలమును ఆచ్ఛాదించును. హవియుక్తులగు యజమానులు ప్రకాశమానమగు సోమస్థానమును ఎరుగుదురు.
3. సోమపు కిరణములు ప్రజ్ఞాపకములు -అమరములు - అహింసనీయములు. అవి స్థావర జంగములను రక్షించును. ఆ కిరణములతోనే సోమము జలమును. దేవయోగ్య అన్నమును ప్రసాదించును. అభిషవమైన తరువాతనే సోమము ఆదరణీయములగు స్తుతులను స్వీకరించును.
4. శుభకర్మలు చేయు పది అంగుళులచే పరిశుద్ధమైన సోమము లోకములను వీక్షించుటకు అంతరిక్షమందలి మధ్యమ వాక్కులో వసించును. మానవ దర్శక, క్షరణషీలా సోమము జలమును వర్షించుటకు యజ్ఞములను రక్షించుచు అంతరిక్షమునుండి మానవులను, దేవతలను అవలోకించును.
5. సోమము ఇంద్రుని బలము కొరకు పవిత్రమున శుద్ధమగును. ద్యావాపృధ్వుల మధ్య నిలుచును. నలుదిశల సంచరించును. వీరుడు శత్రువును బాణమున కొట్టినట్లు సోమము దుఃఖద అసురులను మాటి మాటికి హెచ్చరించుచు, దుర్బుద్థి అసురులను హతమార్చును.
6. మాతృభూత ద్యావాపృథ్వులను మాటిమాటికి చూచుచు, నినదించుచు సోమము అవును చూచి అరచుచు పోవు దూడవలెను, నినదించుచుసాగు మరుద్గణముల వలెను, సర్వత్ర సంచరించును. మానవులకు శుభముల నిచ్చు జలములు తెలిసిన శుభకర్మ, క్షరణషీలా సోమము తన స్తుతులు కోరుచు - నన్నువిడిచి మరెవరిని వరించును?
7. అరిభయంకర, జలవర్ధక, సర్వదర్శక, క్షరణశీల సోమము తనకు బలము కలుగునట్లు తన రెండు శృంగములకు ధారలకు - పదునుపెట్టుచు నినదించును. తదుపరి స్వస్థానమగు ద్రోణకలశమున చేరును. మేకచర్మము, గోవుచర్మము సోమమును శుద్ధిచేయున వగును.
8. పాత్రస్థిత , స్వశరీర పరిశుద్ధ, పవిత్ర, హరితవర్ణ సోమము మహొన్నతుడయి, మేహలోమ పవిత్రమున ప్రతిష్ఠితుడవగును. మిత్ర, వరుణ, వాయువుల కొరకు తగినన్ని జలములు, పాలు, పెరుగుతో కలసిన మదకర సోమము శభుకర్మల ఋత్విక్కులచే ప్రదానము చేయబడును.
9. సోమమా! నీవు జలవర్షకుడవు. దేవతల పానము కొరకు క్షరితుడవగుము. ఇంద్రునకు ప్రీతికరమగు పాత్రలో ఉండుము. మమ్ము బాధించక ముందే దుర్గమ రక్కసుల నుండి మమ్ము రక్షింపుము. దారితెలిసినవాడు - తెలిసికొనగోరు వానికి - దారి చూపినరీతి యజ్ఞమార్గము నెరిగిన నీవు మాకు యజ్ఞపథము చూపుము. మమ్ము రక్షింపుము.
10. తోలిన గుఱ్ఱము యుద్ధభూమికి చేరును. సోమమా! ఋత్విక్కుల ప్రేరణలో నీవు ద్రోణకలశమునకు చేరుము - ఇంద్రుని జఠరమున ప్రవేశింపుము. నావికుడు నదిని దాటించును. సర్వఙ్ఞుడవగు నీవు మమ్ము పాపముల నుండి దాటించుము. శూరునివలె శత్రువును హతమార్చుము. నిందక శత్రువుల నుండి మమ్ము రక్షింపుము.
డెబ్బది ఒకటవ సూక్తము
ఋషి - వైశ్వామిత్ర వృషభుడు, దేవత - పవమాన సోమము ఛందస్సు -
జగతి 9 త్రిష్టుప్
1. యజ్ఞమున ఋత్విక్కులకు దక్షిణలు ఇచ్చెదరు. బలశాలి సోమము ద్రోణకలశమునకు చేరును. జాగృత సోమము ద్రోణకలశమునకు చేరును. జాగృత సోమము ద్రోహులగు రాక్షసులనుండి స్తోతలను రక్షించును. సోమము ద్యులోకమందు సూర్యుని సుదృఢము చేసినాడు.
2. శత్రుహంత వీరునివలె బలశాలి సోమము ధ్వనులు చేయుచు సాగును. తన అసురహంత బలమును ప్రకటించును. సోమము వార్థక్యమును విరుచుచున్నాడు. పానయోగ్య ద్రవమగు సోమము సంస్కరించబడిన ద్రోణకలశమునకు చేరుచున్నాడు. మేషలోమ పవిత్రమున తన గతిపరాయణ రూపమున స్థాపించబడినాడు.
3. సోమము శిలలు, బాహువులచే అభిషుత మగును. పాత్రలందు ప్రవేశించును. వృషము వలె ప్రవర్తించును. స్తోత్రములచే స్తుతుడగును. అంతరిక్షమున సర్వత్ర సంచరించును. ప్రసన్నుడగును. స్తోతలకు ధనము నిచ్చును. జలమున శోధితుడగును. దేవతలకు హవి సమర్పించు యజ్ఞమున పూజితుడగును.
4. ఇంద్రుడు దీప్తుడు, ద్యులోకవాసి, మేఘవర్థకుడు. శత్రుపురధ్వంసి. మదకర సోమము అట్టి ఇంద్రుని తృప్తిపరచును. గోవులు హవిని భక్షించును. తమ స్తనముల పాలను నింపును. తమ మహిమతో పాలను ఇంద్రునకు అర్పించును.
5. చేతివ్రేళ్లు పది సోమమును యజ్ఞభూమికి - యుద్ధమునకు రథము నంపినరీతి - పంపును. మాననీయ స్తోతలు సోమము కొరకు స్థానము కల్పింతురు. అప్పుడే ఆవుల పాలు సహితము అచటికి చేరును.
6. శ్యేనము తనగూటికి చేరును - అట్లే ప్రకాశమాన, పవమాన సోమము - తన కర్మమున కట్టుకున్న బంగారు ఇంటికి చేరును. స్తోతలు యజ్ఞమందు ప్రియసోమమును స్తుతింతురు. పూజనీయ సోమము - అశ్వమువలె - దేవతల వద్ద కరుదెంచును.
7. సోమము శుభంకరుడు. క్రాంతప్రజ్ఞుడు, జల శోధితుడు. అతడు పవిత్రుడై కలశమున ప్రవేశించును. సోమము కోరికలు తీర్చువాడు. మూడు సవనములందుండువాడు. అతడు స్తుతిని అనుసరించి స్వరము చేయును. వివిధపాత్రలకు వచ్చి పోవుచుండును. అనేక ఉషస్సులందు స్వరసాంగత్యమున శోభిల్లును.
8. సోమ కిరణములు శత్రునాశకములు. తమరూపములను ప్రదీప్తము చేసికొనునవి. అవి రణరంగమున ఉండును - రణమున శత్రువులను కూల్చుము. అవి జలదాతలు. హవిరూప అన్నయుక్తములై దేవకాముల వద్ద కేగును. స్తుతలందు కలియును, స్తోతలు పశువులను ప్రార్థించు వాక్యములందు కూడా సోమకిరణములు కలసి [పోవును.
9. ఆవును చూచి ఆబోతు అరుచును. స్తుతులను చూచి సోమము నినదించును. సోమము సూర్యరూపమున ద్యులోకమున ఉండును. సోమము ద్యులోక ఉత్పన్నుడు. శుభగమనుడు. అతడు పృథ్విని వీక్షించును. ప్రజ్ఞానమున ప్రజలను అవలోకించును.
డెబ్బది రెండవ సూక్తము
ఋషి - అంగిరస హరిమంతుడు. దేవత - పవమాన సోమము.
ఛందస్సు - జగతి.
1. సోమము హరితవర్ణము. ఋత్విక్కులు దానిని శుద్ధిచేతురు. అశ్వమునువలె సోమమును అర్చింతురు. కలశమందున్న సోమమున పాలు కలుపుదురు. సోమము ధ్వనిచేయునపుడు స్తోతలు స్తుతింతురు. సోమము స్తోతలకు ధనము ప్రసాదించును.
2. సుభుజ కర్మనేతలు పది అంగుళులతో సోమమును అభిషవించునపుడు - ఇంద్రుని జఠరామున ఋత్విక్కులు సోమము సమర్పించునపుడు - అప్పుడు విద్వాంసులగు స్తోతలు ముక్తస్వరమున మంత్రములు ఉచ్చరింతురు.
3. సోమము దేవతలను ప్రసన్నము చేయ దలచును. కలశమునకు చేరును. దుగ్ధాదులను కలసికొనును. అప్పుడు సూర్యపుత్రి ఉష శ్రేష్ఠస్వరమును సైతము సోమము తిరస్కరించును. స్తోతసోమమును పర్యాప్తముగ స్తుతించును. చేతులకు పుట్టినవి, పరస్పరము కలసినవి అటునిటు కదులు అంగుళులు సోమమును కలియును.
4. సోమము కర్మనేతలచే శుద్ధించ బడినది. శిలలచే అభిషుతము. దేవతల పసన్నకర్త గోపతి ప్రాచీనుడు. పాత్రలందు ప్రవహించువాడు. బహుకర్మవంతుడు. మానవ యజ్ఞసాధకుడు. దశాపవిత్ర పరిశుద్ధుడు. అతడు తన ధారలతో యజ్ఞమందు - ఇంద్రుని కొరకు - పాత్రలందు వాలును.
5. ఇంద్రా ! కర్మ కర్తల భుజములచే ప్రేరిత, అభిషుత సోమము నీ బలము కొరకు విచ్చేయును. నీవు సోమపానము చేయుము. నీ కార్యములు నిర్వర్తించుము. నీవు యజ్ఞమున శత్రువులను జయింతువు. పక్షి కొమ్మమీద కూర్చున్నట్లు హరితవర్ణసోమము అభిషవణ ఫలకమున ఆసీనుడగును.
6. ఋత్విక్కులు క్రాంత కర్మలు మనీషులు. వారు శబ్దించు, క్రాంతదర్శి సోమమును అభిషవింతురు. పునరుత్పన్నమగు గోవులు, మాననీయస్తుతులు ఎకత్రితమై - సత్యరూప యజ్ఞనదనపు ఉత్తరవేదిన - సోమమున కలిసికొనును.
7. ఉత్తరవేది ద్యులోకధారి, పృథ్వికినాభి ఉన్నతపద, ఋత్విక్కులు సోమమును ఉత్తరవేదిపై ఉంచుదురు. సోమము ప్రవహించునది. జలమధ్య స్థితము. ఇంద్రుని వజ్రస్వరూపము. కామ వర్దకము. వ్యాపక ధనవంతము. సోమము ఇంద్రునకు మత్తు కలిగించును. ఇంద్రుని సుఖము కొరకు క్షరితమగును.
8. సుకర్మసోమమా! పార్థివ శరీరధారి మానవులకొరకు త్వరత్వరగా వాలుము. నీకు మూడు సవనములుచేయు స్తోతలకు ధనాదులనిమ్ము. మా ఇంటిని పుత్ర, ధనాదులనుండి వేరు చేయకుము. మాకు నానావిధ సువర్ణాది సంపదలు కలుగవలెను.
9. క్షరణశీల సోమమా! మాకు అనేకము, అశ్వసహితము, సహస్రదానయుక్తము, పశ్వాది సమన్వితము సువర్ణ సహిత ధనమును ప్రసాదించుము. మాకు ఎక్కువ పాలిచ్చు గోసంపద ప్రసాదించుము. మా స్తుతులు ఆలకించుటకు విచ్చేయుము.
డెబ్బది మూడవ సూక్తము
ఋషి - అంగిరస పవిత్రుడు. దేవత - పవమానసోమము. ఛందస్సు - జగతి.
1. యజ్ఞపు "స్రక్వ" స్థానమున అభిషవ సోమ కిరణములు పైకి లేచును. యజ్ఞపు ఉత్పత్తి స్థానమున సోమము పైకి లేచును. బలశాలి సోమము ముల్లోకముల మానవాదులను సంచరణ యోగ్యులను చేయును. సోమము సత్యభూతుడు. నౌకకు వలె యజ్ఞమునకు నాలుగు స్థాత్యములున్నవి. అవి సుకృతియగు యజమానికి ఇష్టఫలము లిచ్చును. సోమమును పూజించును.
(స్రక్వము = యజ్ఞపు ఓష్ఠస్థానము స్రక్వేఓష్ఠ ప్రాంతేహనురుచ్యతే అనిశాయణుడు. 1. ఆదిత్య 2. అగ్రాయణ 3. ఉక్థ్య 4. ధృవ ఇవి స్థాత్యములు)



