Home » Yandamuri veerendranath » Rakshasudu


    జానకిరాముడికి అతడంటే గౌరవం, భయం భక్తి అన్నీ. చూస్తూ ఉండగానే తనని ప్రెసిడెంట్ ఎలా చేశాడో అతడికి ఇప్పటికీ నమ్మశక్యం కాదు.

 

    అతడికి మాత్రం ఆనందంగా వుంది- తన అంచనాలకు మించి జానకిరాముడు ఆ పదవిలో చాకచక్యంగా పనులు నిర్వహించటం, అయితే ఇందులో చాలాభాగం ఖ్యాతి అడ్వయిజరీ బోర్డుకి వెళ్ళాలి. ఏదో ఒక 'భయం' వుంటేగానీ ఈ దేశ ప్రజలు మాటమీద సవ్యంగా నడుచుకోరు అని గ్రహించిన ఆ కమిటీ దాదాపు మార్షల్ పద్ధతిలోనే పరిపాలన కొనసాగిస్తుంది.

 

    అయితే దీనికి వ్యతిరేకులు కూడా వున్నారని ముందే చెప్పటం జరిగింది. పరిపాలనా యంత్రాంగంలో నష్టపోతున్న కాపిటలిస్టులంతా ఒక సిండికేట్ గా ఏర్పడ్డారు.

 

    సరిగ్గా ఆ రోడ్డుమీదే- రోడ్డుకి పక్కగా వున్న మేడమీద, ఒక గదిలోంచి ఒక గన్ - రోడ్డుమీదకు గురి పెట్టబడివుంది. భద్రతా సిబ్బందిలో ఒకరు ఈ సిండికేట్ తో కుమ్మక్కై, జానకిరాముడి హత్యకు తోడ్పడుతున్నారు. ఆ సిబ్బంది మనిషి- జానకిరాముడి వెనుక వస్తున్న గుర్రాల్లో ఒకదాని మీద వస్తున్నాడు. ఆ గుర్రం పేరు కూడా జానకిరాముడే.

 

    ప్రెసిడెంట్ ఎన్నికల సమయంలో జానకిరాముడిని ఎగతాళిచేయటం కోసం వంకచెక్కా రామ్మూర్తి తన గుర్రానికి ఆ పేరు పెట్టాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ ని చంపటానికి ఆ గుర్రాన్ని ఉపయోగిస్తున్నాడు.

 

    సిండికేట్ పథకం ఏమిటంటే నిర్ణీతమైన స్థలానికి వచ్చేక - వెనక వున్న గుర్రాల్లోంచి ఇది ముందుకు వచ్చి- ప్రెసిడెంట్ కారు పక్కగా పరుగెడుతుంది. చూసేవాళ్ళకి అది బెదురుతూ వచ్చిందనుకుంటాను. ఈ లోపులో ఆ గుర్రం మీద వున్నవాడు గ్రేనేడ్ ని ప్రెసిడెంట్ వున్న కారులోకి విసురుతాడు. విస్ఫోటనం జరిగి- ప్రెసిడెంట్ హత్య కావింపబడతాడు. ఆ గుర్రాన్ని నడిపే వాడికి అయిదు లక్షలు లంచంగా ఇవ్వబడింది.

 

    ఈ ప్లాన్ లో ఏదైనా ఆటంకం ఏర్పడితే, మేడ మీద గన్ ద్వారా హత్య జరుగుతుంది. అందుకే దాన్ని కూడా సిద్ధంగా ఉంచారు.

 

    ఈ విధంగా రెండు రకాలుగా వ్యూహం పన్నబడింది.

 

    ఇంకో అయిదు నిముషాల్లో జానకిరాముడి కారు అనుకున్న స్పాట్ కి చేరుకుంటుంది.

 

    ఇనస్పెక్టర్ విజయ్ భద్రతా ఏర్పాట్లు చూసుకుంటూ ముందువెళుతున్నాడు. అంతకుముందు రెండు రోజుల్నుంచే ప్రెసిడెంట్ వెళ్ళబోయే దారికి ఇరువైపులా వున్న ఇళ్ళ ఫోటోగ్రఫీ పరిశీలించబడింది.

 

    వాణి, సింహాలతో అతడు ముందు జీపులో వెళుతున్నాడు. అకస్మాత్తుగా అతడి దృష్టి ఒక పోర్టికో మీద పడింది. అక్కడ కూడా జనం వున్నారు. కానీ అందులో ఇద్దరు వ్యక్తులు-

 

    ఒకరు వంకచెక్కా రామ్మూర్తి!

 

    మరొకరు కృష్ణమూర్తి!!

 

    వారిద్దర్నీ అక్కడ... ఆ ప్రదేశంలో చూసి అతడి కేదో అనుమానం పొడసూపింది. మామూలు ప్రజల్లాగా ప్రెసిడెంట్ ని చూడటానికి అలా రోడ్డు పక్కన నిలబడవలసిన అవసరం వారికి లేదు. అంతేకాదు. వారు నిలబడిన విధానం కూడా అనుమానాస్పదంగా తోచింది.

 

    నెమ్మదిగా వెళుతూన్న సింహం, వాణీలకు అతడెందుకు దిగాడో అర్థం కాలేదు. సింహం కూడా దిగాడు. వాళ్ళిద్దరూ జనంలో కలిసి పోయారు.

 

    సరిగ్గా ఆ సమయంలో జి.కె. అతడిని చూశాడు.

 

    తల్లిగా నటించమని పంపిన స్త్రీ, దొంగ తల్లి అని అతడికి తెలిసి పోయిందని తెలియగానే అతడు తనని చిత్రవధచేస్తాడనీ అనుకున్నాడు. అతడు అదోలాటి వైరాగ్య భావంతో ఈ ద్వేషాలకి అతీతంగా మారాడని అనుకోలేదు.

 

    అతడిని ఇలా అకస్మాత్తుగా చూడగానే జి.కె. భయభ్రాంతుడయ్యాడు.

 

    అంతలో వంకచెక్కా రామ్మూర్తి కూడా అతడిని చూశాడు! తనని చూడగానే అసంకల్పితంగా రామ్మూర్తి చూపు ఎదురింటి మేడవైపు సారింపబడటం అతడి దృష్టిని దాటిపోలేదు. వెంటనే అతడు కూడా అటు వైపు చూశాడు.

 

    అదే సమయానికి కిటికీలోంచి బయటకు రాబోతున్న బారెల్ చప్పున లోపలికి వెళ్ళిపోయింది. కొస మాత్రం కనపడింది.

 

    అంతలో ప్రజల హర్షధ్వానాలు దగ్గిరయినయ్.

 

    ప్రెసిడెంట్ కారు సమీపిస్తున్న సూచన అది.

 

    అతడు మరి ఆలస్యం చేయకుండా ఆ మేడవైపు పరుగెత్తాడు.

 

    అంతకు కొద్ది క్షణాల ముందే కృష్ణమూర్తి ఆ మేడ వెనక్కు చేరుకున్నాడు.

 

    తన వైపే పరుగెత్తుకు వస్తూన్న అతడిని చూడగానే జి.కె. అనుమానం బలపడింది. ఇన్నేళ్ళు పనులు చేయించుకుని చివర్లో దొంగ తల్లిని చూపించినందుకు అతడు పగ తీర్చుకోవటానికే వస్తున్నాడనుకున్నాడు. అతడు తల్లికోసం ఎంతగా ఎదురు చూశాడో జి.కె. కి తెలుసు. ఇక తనని వదలడు.

 

    జి.కె. మరి ఆలస్యం చేయకుండా జేబులోంచి రివాల్వర్ తీసి అతడిని కాల్చాడు. అయితే జి.కె. తన వెనుక వైపు వస్తూన్న ప్రమాదాన్ని గుర్తించలేదు. అతడు సింహం! జి.కె. పేల్చిన గుండు 'అతడి' భుజంలో దిగబడింది. కానీ సింహం, మరో బుల్లెట్ పేల్చబోతూన్న జి.కె. మెడమీద వెనుక నుంచి చరిచాడు. అది ఎంత బలంగా తగిలిందంటే- ఉరితీత ఖైదీ మెడ వాలిపోయినట్టు జి.కె. మెడ విరిగిపోయింది. ఇన్నేళ్లు అతడు ఆడిన నాటకానికి శాశ్వతంగా తెరపడింది. అతడు మాత్రం బిల్డింగ్ వైపు పరుగెత్తాడు తుపాకీ కనపడిన కిటికి, మూడో అంతస్థులోవుంది.

 

    ప్రజల హర్షధ్వానాల మధ్య ఈ బుల్లెట్ చప్పుడు ఎవరికీ అంతగా వినబడలేదు. పోలీస్ ట్రయినింగ్ పొందిన ఉన్నతాధికారులు మాత్రం ఏదో అపాయాన్ని శంకించారు. వారిలో విజయ్ ఒకడు. అతడు ఈ ఘర్షణ జరుగుతున్న ప్రదేశానికి మరీ దగ్గిరగా వున్నాడు. దాంతో అతడూ జనంలోకి వచ్చాడు.

 

    ఇదంతా దూరం నుంచి చూస్తూన్న వ్యక్తి వంకచెక్కా రామ్మూర్తి!

 

    అతడు మనసులోనే జి.కె.ని విపరీతంగా తిట్టుకున్నాడు. తన అనవసర భయంతో అతడు మొత్తం ప్లాన్ అంతా బయట పెట్టేశాడు.

 

    ఇందిరాగాంధీ హత్య కేసులో హంతకుడు పట్టుబడ్డాడు. కానీ ఈ హత్యలో హంతకుడు గుర్రంతో సహా బ్లాస్ట్ అయిపోతాడు. కాబట్టి ఇక సాక్ష్యాధారాలుండవు.

 

    చాలా ఇరుకు సందు ఇది. రెండు వైపులా ఎత్తయినభవంతులు... పురాతనమైన చెక్క బాల్కనీలు. రోడ్డు కిరువైపులా అయిదారు అంతస్థులున్నాయి. కేవలం ఈ హత్యా ప్రయత్నంలో ఒక భాగంగా ఎన్నో లక్షలు లంచం ఇచ్చి ప్రెసిడెంట్ ప్రయాణానికి అలాటి ఇరుకుసందు గుండా రూట్ ప్లాన్ వేయించింది సిండికేట్.

 

    మరణానికి సిద్ధపడి ఈ పనికి వప్పుకున్న గుర్రం మీదున్న రౌతు తన కాళ్ళ దగ్గిరున్న గ్రెనేడ్ సీలు విప్పాడు. అంటే ఇంకా సరీగ్గా పదిహేను సెకన్ల తరువాత అది పేలుతుంది అన్నమాట. పది సెక్షన్ల తరువాత గుర్రాన్ని ముందుకు దూకించాలి. అయిదు సెకనులలో గుర్రం ప్రెసిడెంట్ కారుని చేరుకుంటుంది.

 

    చచ్చిపోయిన రౌతు కుటుంబానికి సిండికేట్ అయిదు లక్షల రూపాయలు చెల్లించాలని కాంట్రాక్టు. సగం అడ్వాన్సు ఇచ్చేసింది కూడా! ... జానకీ రాముడు మరణిస్తే కలిగే లాభాలతో పోల్చుకుంటే ఆ కాపిటలిస్ట్ లకి ఇదో పెద్ద ఖర్చు కాదు.

 

    కానీ ప్రస్తుతం సమస్య అదికాదు. రౌతు మరణిస్తే పర్వాలేదు. కానీ మేడమీద తుపాకీతో నిల్చున్న వ్యక్తి పోలీసులకి పట్టుబడితే మాత్రం మొత్తం తమ గుట్టు బయటపడుతుంది. అతడిని అక్కణ్ణుంచి వెళ్ళిపొమ్మని వెంటనే చెప్పాలి!


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More