Home » Yandamuri veerendranath » Rakshasudu
-ఏ తల్లిని నోరారా 'అమ్మా' అని పిలిచి నాలుకని సార్థకం చేసుకోవాలనుకున్నాడో, ఏ దిగులు పాటకి మంగళం పాడి పెదవుల్ని పవిత్రం చేసుకోవాలనుకున్నాడో, పళ్ళెమైన చేతుల్తో, హారతయిన గుండెతో ఎవరిని తన ఇంటికి ఆహ్వానించాలనుకున్నాడో, అమ్మా-అమ్మా అని కోటికోటి గొంతుల్తో ఎవరినయితే ఇంతవరకూ గుండెల్లో ప్రతిష్టాపించాలనుకున్నాడో- ఆమే - ఈమె!
గౌతమి, తుంగభద్ర- పాలపిట్ట, గువ్వలజంట- రెల్లుపూలు, ఏటికెరటం- అన్నీ అందంగా కనపడేవేళ, విషాదం కూడా ఆనందాన్ని సంతరించుకున్నవేళ, అతడు అడుగు ముందుకేసి "అమ్మా" అన్నాడు.
ఆమె తలెత్తి చూసింది.
ఆ కళ్ళు దయని వర్షిస్తున్నాయి. కన్నీరు అతడిని సరిగా చూడనీయటంలేదు. అక్కడ ముఖ్యమైనది తల్లికాదు... ప్రేమ!
ప్రకృతే ప్రేయసి! బీటవారిన హృదయంపై ఆ ప్రేమే క్షీరవర్షిణి!! ఆమె తనవైపు భూదేవిలా కదిలి వస్తూంటే అతడు వర్షించే కనులతో చూస్తూ వుండిపోయాడు.
"నేను నా కర్తవ్యం నెరవేర్చుకున్నాను. ఇన్నాళ్ళ నా బాధ్యత తీరిపోయింది. ఇక నాకు శలవిప్పించు. మళ్ళీ కలుస్తాను" అని జి.కె. వెళ్ళిపోయాడు.
"బాబూ, ఇలా రా నాయనా! ఇన్నాళ్ళకి నిన్ను ఇలా కలుసుకుంటాననుకోలేదురా. ఈ ఆనందంలో నా మాట కూడా తడబడుతోంది. ఈ క్షణం కోసం ఎంతగా ఎదురు చూశాన్రా! కన్నా- ఎట్లావున్నావురా- ఈ తల్లి జ్ఞాపకం రాలేదుట్రా ఇన్నాళ్ళూ..." ఆమె చేతుల్లో అతడు అప్పుడే పుట్టిన పాపడయ్యాడు. అతడు ఆమెని పొదివిపట్టుకుని తన గదిలోకి తీసుకువెళ్ళాడు.
ఆమెని మంచం మీద కూర్చోపెట్టి అతడు కాళ్ళ దగ్గిర కూర్చున్నాడు.
"అమ్మా! నువ్వు నా తల్లివో కాదో నాకు తెలీదు. నిజంగా నువ్వు నా తల్లివే అయితే, నువ్వన్నట్టు- మనం మొదటిసారి ఈ క్షణాల్ని ఇంత కంటే ఆనందంగా గడపకుండా, ఇలా అర్థంలేని అనుమానాల్తో వేధించినందుకు నీ కొడుకుని క్షమించు, కానీ... కానీ.. నువ్వు నా తల్లివి కాకపోయినా ఏ కొడుక్కో తల్లివే అయ్యుంటావు. ఎవరో నాటక మాడిస్తున్నారని నాకు వార్త వచ్చింది. అందులో నిజమెంతో నాకు తెలీదు. ఇది నాటకమే అయితే దీన్ని నువ్వు నీ కొడుకుల కోసం, కూతుళ్ళ కోసం ఆడుతూ వుండి వుంటావు. ఏ తల్లి చేసినా వారికోసమే కదా! అమ్మా! నా ఊహ తెలిసినప్పటినుంచి నేను తల్లి గురించే ఆలోచిస్తూ వచ్చాను. నా చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఎగతాళి చేసినా ఈ ఆలోచన నన్ను విడిచి పోలేదు. నా దౌర్భాగ్యపు స్థితి ఎవరికీ రాకూడదు. ఇన్నాళ్ళూ ఎదురు చూసినది ముందుకొస్తే ఆమె తల్లో కాదో తెలియని పరిస్థితి! ఈ చేతులు చూశావా అమ్మా! అడవిలో రాళ్ళు, చెట్లుకొట్టి రాటుదేలిపోయాయి కేవలం తల్లి కోసమే ఇన్నాళ్ళూ నేనీ పనులు చేశాను. ఇంతమంది చెప్పినట్టు విన్నాను. ఈ చివరి క్షణంలో నన్ను మోసం చేయకు. నువ్వు నిజంగా నా తల్లివి కాకపోతే ఆ విషయం చెప్పు".
ఆవిడ నిరుత్తరురాలై అతడివైపు చూసింది. ప్రపంచాన్ని ఏలినవాడు మోకాళ్ళమీద కూర్చుని, తల వంచుకుని అశ్రువుల్ని హృదయంలో దాచుకోవటానికి ప్రయత్నించటం ఆమెను కదిలించిందేమో- కొండల్ని కరిగించగలిగేది, సముద్రాల్ని కదిలించగలిగేది, అడవుల్ని సైతం కాల్చేయగలిగేది అయిన అతడి ఆవేదన ఆమెని కూడా ఉద్విగ్నురాల్ని చేసింది. ఒక్క ఉదుటున మంచంమీద నుంచి లేచి అతడి పక్కన నేల మీద కూలబడుతూ, చేతుల్తో మొహం కప్పుకుని "నేనిక ఈ నాటకం ఆడలేను- నేనిక ఈ నాటకం ఆడలేను" అంది రోదిస్తూ. పది రూపాయల కోసం నాటకమాడే రంగస్థల నటి కూడా అతడి నిజాయితీముందు తలవంచింది. తన ప్రాణాలకొచ్చే ప్రమాదాన్ని కూడా లెక్క చేయకుండా నిజం చెప్పేసింది.
అతడు నిర్వికారంగా ఆమెవైపు చూశాడు.
ఊహించినదే నిజమయింది. రహస్యం బయటపడింది.
"అయిపోయింది- అంతా అయిపోయింది" అనుకున్నాడు.
ఇన్నాళ్ళూ దేనికోసమయితే ఎదురుచూశాడో అది ఇక దొరకదని తేలిపోయింది.
అతడి కళ్ళముందు గతం రీలులాగా తిరిగింది. తల్లిని చూపిస్తానని చెప్పి, అడవిలోకి తోలుకెళ్ళటం - ఎన్నో సంవత్సరాలు అక్కడ ఖైదీగా వుండిపోవటం- తల్లి కోసం జి.కె. పన్నిన ఉచ్చులో చిక్కుబడిపోవటం- అంతా వరుసగా గుర్తొచ్చాయి.
గిర్రున తిరిగే బొంగరం చివరకు ఇక్కడకొచ్చి ఆగింది.
20
అక్కడ ఇసుకవేస్తే రాలనంతమంది జనం వున్నారు. రోడ్డుకి ఇరువయిపులా బారులుదీర్చి నిలబడ్డారు. దాదాపు పదిలక్షలకి తక్కువగా ఉండరు. అందరూ హర్షధ్వానాలు చేస్తున్నారు.
జానకిరాముడి కారు నెమ్మదిగా సాగివస్తోంది. అతడు నిలబడి దారికి ఇటు అటు వున్నవారికి నమస్కారం చేస్తున్నాడు. కారుకు ముందు రెండు మోటారు సైకిళ్ళు- వెనుక ఆరుగుర్రాలు వున్నాయి. ఎర్ర దుస్తుల్లో వున్న అంగరక్షకులు అటూ ఇటూ చూసుకుంటూ పయనిస్తున్నారు.
ప్రెసిడెంట్ తమని సమీపించగానే జనం హర్షాతిరేకంతో చప్పట్లు కొడుతున్నారు.
నాలుగురోజుల విశ్రాంతికోసం నగరానికివచ్చాడు జానకిరాముడు. విమానాశ్రయం నుంచి విశ్రాంతి భవనంవైపుకు వెళుతుంటే చుట్టూ చేరిన జనం వీళ్ళు.
"అంతమంది వస్తారని వూహించలేదు" అంది వాణి.
"మొన్న సాయంత్రం ప్రకటించిన దానికి రెస్పాన్సు ఇది" అన్నాడు సింహం.
అంతకు ముందు రెండు రోజుల క్రితమే జానకిరాముడు కిర్సనాయిలు, గోధుమలు, బియ్యంమీద ధరని 25 శాతం తక్కువ చేస్తున్నట్టు ప్రకటించాడు. భారతదేశ ఆర్థిక చరిత్రలో అంతగా ధరలు తగ్గించటం ప్రప్రధమం. ప్రెసిడెంట్ కి సలహాలు ఇచ్చే నిపుణుల సంఘం ఏర్పాటుచేసిన బృహత్ప్రణాళిక అది. అంతకుముందు ప్రవేశపెట్టిన స్కీముల ద్వారా వచ్చిన డబ్బుని ఈ సబ్సిడీల కోసం వినియోగించటం జరుగుతుంది- అని ప్రెసిడెంట్ ప్రకటించాడు.
ఏది ఏమైనా ప్రజలు థ్రిల్ అయ్యారు! ధరలు తగ్గటం!! దానికన్నా ముఖ్యంగా అది ఏమంత అసాధ్యమైన విషయం కాదని నిరూపించబడటం!!!
జానకిరాముడు కూడా చేసిందేమీలేదు. ఇంతకాలం డబ్బు- మరింత డబ్బున్న వాళ్ళ ఎయిర్ కండీషన్డ్ గదుల తివాచీల అడుక్కి వెళ్ళేది- నిరోధించాడు- అంతే.
ధరలు తగ్గటం ఒకటే ప్రజలకు తెలిసింది. ఆర్థిక శాస్త్రవేత్తలు మరికొన్ని విషయాలను చూసి సంభ్రమం చెందారు. గత మూడు నెలల్లో రూపాయి ధర రెండుసార్లు పెరిగింది. 18.15. వుండేది- పౌండ్ మిడిల్ రేటు- 17.50కి ఒకసారి, 16.70కి మరోసారి పెరిగింది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మార్పు వచ్చింది.
ఈ విషయాలన్నీ అతడు గమనిస్తూనే వున్నాడు- నగరానికి రాబోయేముందు ఫోన్ లో "ఈ మూడు రోజులూ నువ్వు నాతో వుండు" అని అతడిని జానకిరాముడు కోరాడు. అతడు నిరాకరిస్తూ "వద్దు మన ఫ్రెండ్ షిప్, మన రిలేషన్, ఇలా దూరంగా ఉండనీ" అన్నాడు.



