Home » Yandamuri veerendranath » Rakshasudu


    ఈ ఆలోచన రాగానే రామ్మూర్తి అటు కదిలాడు. జనం నుంచి విడివడి భవంతివైపు పరుగెడుతూన్న తండ్రిని చూసి విజయ్ 'ఆగు' అని అరిచాడు. కానీ అతడి అరుపు రామ్మూర్తికి వినపడలేదు. వెనుక నుంచి ఇన్ స్పెక్టర్ వస్తున్నాడని తెలుస్తే అతడు ఆ భవంతివైపు వెళ్ళేవాడే కాదు.

 

    గ్రెనేడ్ పేలటానికి ఇంకా సరీగ్గా ఎనిమిది సెకన్ల టైముంది. రౌతు గుర్రం కళ్ళెం బిగించాడు. ఒక క్షణం ముందుగానీ, ఒక క్షణం వెనుకగానీ బయల్దేరడానికి వీల్లేదు.

 

    జనం అంతా రోడ్డువైపు తిరిగి వున్నారు రోడ్డు కిరువైపులా కర్రలు కట్టబడి వున్నాయి. ప్రెసిడెంట్ కారుతోపాటు ప్రజలూ ఆ కర్రలకు ఇటువైపు పరుగెత్తుకుంటూ సాగిపోతున్నారు... ఫాలో అవుతున్నారు. పదవి నధిష్టించిన కొద్ది కాలంలోనే పెరిగిన ప్రెసిడెంట్ ప్రతిష్ఠకి ఆ ప్రజావాహిని ప్రతీక.

 

    రామ్మూర్తి మూడో అంతస్థు చేరుకొనే టైముకి- అప్పుడు తెలిసింది- వెనుక కొడుకు పరుగెత్తుకు వస్తున్న సంగతి.

 

    మొత్తం సిండికేట్ అంతా బయటపడే తరుణం ఆసన్నమైంది.

 

    రామ్మూర్తి మరి ఇంకేమీ ఆలోచించలేదు. స్థంభం వెనక్కి చేరి పిష్టల్ తీసి ఇన్ స్పెక్టర్ వైపు గురిపెట్టాడు.

 

    పై అంతస్తులో.... ఈ లోపులో ...గన్ మెన్ కీ 'అతడి'కి ఘర్షణ జరుగుతూంది. అటువైపు తిరిగి, ప్రెసిడెంటు వైపు కిటికీలోంచి బైనాక్యులర్ లో చూస్తున్న గన్ మెన్ ... వెనుక నుంచి వచ్చిన 'అతడి'ని చూసుకోలేదు.

 

    అతడు గన్ మెన్ ని క్షణంలో లొంగదీసుకుని.... స్పృహతప్పేలా చేశాడు. అక్కణ్నుంచి క్రిందికి వస్తూంటే... స్తంభం వెనుక నక్కివున్న రామ్మూర్తి కనపడ్డాడు.

 

    గ్రెనెడ్ తో సహా గుర్రం బయలుదేరటానికి ఇంకా రెండు సెకన్ల టైముంది!

 

    మెట్లెక్కి విజయ్ మూడో అంతస్తుకి రాగానే... రామ్మూర్తి స్తంభం చాటు నుంచి బయటకు వచ్చీ రావటంతోనే పిస్టల్ పేల్చాడు. బుల్లెట్ విజయ్ భుజం పక్క నుంచి దూసుకుపోయింది. తెల్లబోయి 'నాన్నా' అన్నాడు. కొన్ని నెలల క్రితమే రొయ్యల గూడెం సముద్రం బ్యాక్ వాటర్స్ దగ్గిర అతడన్నాడు.. "ఎలాటివాడయినా, ఒకతండ్రి తన కొడుకుని చంపుకోడని నా ఉద్దేశ్యం" అని. కానీ అది కళ్ళముందే నిజమవుతూంది. విజయ్ కదిలే ప్రయత్నం చేయలేనంతగా స్థాణువై నిలబడిపోయాడు.

 

    రామ్మూర్తి మరోసారి పిస్టల్ పేల్చబోయాడు. అంత క్లోజ్ రేంజిలో పిస్టల్ పేలి వుంటే విజయ్ శరీరం ఛిద్రమైవుండేది. కానీ అదే సమయానికి పైనుంచి మెట్లమీద పరుగెత్తుకు వస్తూన్న 'అతడు' అదే వూపులో రామ్మూర్తి మీదకు పడ్డాడు. ఆ విసురుకి ఇద్దరూ నిలదొక్కుకోలేక బాల్కనీ మీదకు తూలారు. పాత చెక్కలతో నిర్మించబడిన ఆ బాల్కనీ వారి ఒత్తిడికి తట్టుకోలేక విరిగిపోయింది. ఇద్దరూ అక్కణ్నుంచి గాలిలోకి జారిపోయారు.

 

    వెంట్రుకవాసిలో తప్పిపోయిన మృత్యువుని విజయ్ స్పష్టంగా గుర్తించాడు. ఒక్క గెంతులో విరిగిపోయిన బాల్కనీ దగ్గరకు వెళ్ళి క్రిందికి చూశాడు.

 

    ...సరిగ్గా అదే సమయానికి గుర్రాన్ని తోలబోయాడు రౌతు.

 

    అప్పుడు పడ్డారు పైనుంచి ఇద్దరూ.

 

    ముందు రామ్మూర్తి.

 

    ఆ విసురుకి గుర్రం ముందు కాళ్ళ మీద కూలిపోయింది.

 

    మరుక్షణం అక్కడ బ్రహ్మాండమైన విస్పోటనం జరిగింది.

 

    గుర్రం తాలూకు మాంసఖండాలు, రౌతు కాళ్ళు-చేతులు గాలిలోకి ఎగిరాయి. రామ్మూర్తి శరీరం బంతిలా ఎగిరి దూరంగా పడింది. మాంసం కాలిపోయి, ఉడకబెట్టిన బంగాళాదుంపలా తయారయింది.

 

    ఆ తరువాత అతడు పడ్డాడు. అతడికి వెన్నెముక ఎన్నిచోట్ల విరిగిందో పూర్తిగా తెలీదు. పక్క టెముక ఊపిరితిత్తుల్లో గుచ్చుకుని, నోట్లోంచి రక్తం చివ్వున చిమ్మింది.

 

    ప్రజల్లో ఒక్కసారిగా హాహాకారాలు చెలరేగాయి. అందరూ అటూ ఇటూ పరుగెత్తసాగారు. అడ్డంగాకట్టిన బ్యారియర్లు విరిగిపోయాయి.

 

    ప్రెసిడెంట్ కారు వేగం పుంజుకుని హడావుడి నుంచి తొందరగా ముందుకు సాగిపోయింది.

 

    వెనక వీధిలో జరిగిన హడావుడీ, ఘోరం తెలియని ప్రజలు యధా ప్రకారం ప్రెసిడెంట్ ను గ్రీట్ చేయసాగారు. కానీ, నెమ్మదిగా వెళ్ళవలసిన కార్లు అంత వేగంగా ఎందుకు సాగిపోయాయో వారికి అర్థం కావటానికి ఐదు నిమిషాలు పట్టింది.

 

    జర్నలిస్ట్ లు ఈ న్యూస్ అందించడానికి పత్రికా కార్యాలయాలకి పరుగెత్తారు. ప్రేలుడు జరిగిన ప్రదేశానికి అంబులెన్సులు వచ్చి ఆగాయి.

 

    పోయే ప్రాణాల్ని ఎవరాపగలరు?

 

    మహా అయితే మరో పది రోజులు నిలపగలరేమో.   

 

                                         * * *

 

                                    ఉపసంహారం

 

    దాదాపు ముప్పైరెండు గంటల తరువాత అతడికి స్పృహ వచ్చింది. నర్సు పరుగెత్తుకు వెళ్ళి డాక్టర్ ని పిలుచుకు వచ్చింది. హాస్పిటల్ ఒక్కసారిగా చైతన్యవంత మయింది.

 

    స్వయంగా ప్రెసిడెంటు మూడు గంటల కొకసారి ఫోన్ చేస్తూ వుండటంతో అతడి కంత ప్రాముఖ్యత వచ్చింది.

 

    అతడు కళ్ళు తెరిచాడు. డాక్టర్ గుండె వేగాన్ని పరీక్షిస్తున్నాడు.

 

    "ఎ... ఎ... ఎన్నిచోట్ల ...ఫాక్చర్స్ ... డాక్టర్... డాక్టర్..." ఒక్కొక్క పదమే కూడగట్టుకుంటూ అడిగాడు. డాక్టర్ చెప్పాడు. దాచే ప్రయత్నమేమీ చేయలేదు. లాజిక్ ఆలోచించగలిగే డాక్టర్ అతడు.

 

    "వెన్నెముక-"

 

    "అదికూడా".

 

    "రక్తంలో మూలగ కలుస్తుందా". ఇంగ్లీష్ లో, మెడికల్ టెర్మినాలజీ పరంగా అడిగాడు. డాక్టర్ మాట్లాడలేదు మౌనం కేవలం అర్ధాంగీకారం మాత్రమే అయ్యే స్థితి కాదది. పూర్తి అంగీకారమే.

 

    సో...

 

    ప్రపంచంలో ఇక ఏ వైజ్ఞానిక శక్తీ తనని రక్షించలేదు. క్షణ క్షణానికి మృత్యువు దగ్గిరవుతూంటే... "డాక్టర్..." అని అతడి కంఠం బలహీనంగా పలికింది. "నేను... నేనెక్కువ... మాట్లాడలేను... వాదన లొద్దు...నా...నా...చివరి క్షణాలు... ఆ స్కూలు విజయ్ కి తెలుసు... సు...సుమతి... ఆశ్ర..."

 

    అతడికి మళ్ళీ స్పృహ తప్పింది.

 

                                         *    *    *


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More