Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    2. ఇంద్రా ! నీవు  చక్కని తలపోగ వాడవు. అశ్వవంతుడవు. స్తుతివంతుడవు. పరిచారకులు నే కొరకు సోమాభిషవము చేయుదురు. నీవు సేవించుము. మత్తున మునుగుము. సోమాభిషవమైనంత నీ అన్నము ఉపమేయము, ప్రశస్తము కావలెనని ప్రార్థించుచున్నాము.

    3.ఆశ్రితకిరణముల సూర్యుని భజించుము. అట్లే మీరు ఇంద్రుని సకల ధనములను కీర్తించండి. ఇంద్రుడు బలములందు జన్మించినవాడు. జన్మించనున్న ధనములకు జనకుడు. మేము ఆ ధనములను - తండ్రి సొమ్ములో భాగమువలె - అందుకొందుము.

    4. ఇంద్రుడు పాపరహితలకు దానశీలుడు - ధనదుడు అతని దానము శుభావహము. అట్టి ఇంద్రుని స్తుతించండి. ఇంద్రుడు ఉదారుడు. అభీష్టప్రదానమునకు ఆరాటపడును. అతడు సేవకుల కోరికలను తిరస్కరించడు.

    5. ఇంద్రా ! నీవు యుద్ధమున సకల సేనలను అణచి వేసేదవు. శత్రుబాధక ఇంద్రా ! నీవు దైత్య నాశకుడవు. వారి శత్రువులకు జనకుడవు. సకల శత్రువుల హింసకుడవు. బాధించువానికి బాధుకుడవు.

    6. ఇంద్రా ! తల్లి బిడ్డను అనుగమించును. అట్లే నీ బలమును హింసించు వారిని ద్యావాపృథ్వులు వెన్నాడును. నీవు వృత్రుని వధించువాడవు. కావున యుద్ధముచేయు సకల సేనలు నీ క్రోధమును చూచి నిలిచిపోవును.

    7. ఇంద్రుడు అజరుడు. శత్రుప్రేరకుడు. ఇతరులకు పంపనలవికానివాడు. వేగవంతుడు. విజేత, గంత. రథ శ్రేష్ఠుడు అహింసకుడు జలవర్ధకుడు. అతడు మమ్ము రక్షించుటకు ముందుకు రావలెను.

    8. ఇంద్రుడు శత్రుసంస్కర్త అన్యులచే సంస్కరింప జాలనివాడు. బలవంతుడు. బహురక్షణలవాడు. శతక్రతు. సాధారణ ధనాచ్ఛాదకుడు, ధన ప్రేరకుడు. అట్టి ఇంద్రుని మా రక్షణలకు ఆహ్వానించుచున్నాము.

                                 ఎనుబది తొమ్మిదవ సూక్తము
       ఋషి - భృగుగోత్ర 'నేమృషి', దేవత - ఇంద్రుడు, ఛందస్సు - 6 జగతి -
                          7,8,9 అనుష్టప్ - మిగిలినవి త్రిష్టుప్.


    1. ఇంద్రా! పుత్రయుక్తుడవై శత్రువును జయించుటకు వెడలినాను. నీ ముందు సాగుదును. సకల దేవతలు నావెనుక నడచెదరు. నీవు శత్రుధనపు భాగము నాకు ఇచ్చెదవు. అందుకని నా వెంట పురుషార్ధము జరుపుము.

    2. ముందు నీ కొరకు నేను మదకర అన్నరూప సోమము అందిస్తాను. నీ మనసున అభిషుత సోమము నిలువవలెను. నీవు నాకు కుడిభాగమున మిత్రరూపమున నిలువుము. తదుపరి ఉభయులము దస్యులను వధింతము.

    3.యుద్ధాభిలాషులారా ! ఇంద్రుని బలము సత్యమైనచో. అతని కొరకు సత్యస్తోత్రము ఉచ్చరించండి. నేమృషి దృష్టిలో ఇంద్రుడనువాడులేడు. ఇంద్రుని ఎవడు చూచినాడు? మీరు ఎవరిని స్తుతింతురు?

    4. స్తోతా! నేమా! నేను నీ వద్దకు వచ్చినాను. నన్ను చూడుము. నేను సకలలోకములను నామహిమచే అణచి వేయుదురు. సత్యయజ్ఞ ద్రుఢులు నన్ను వర్ధిల్ల చేయుదురు. నేను విచారణ పరాయణుడను. సకల శత్రుభూత భువనములను విదీర్ణము చేయుదును.

    5. అందమగు అంతరిక్షపు వీపున వంటరిగా కూర్చున్న నన్ను యజ్ఞాభిలాషులు మీదకు ఎక్కించినారు. అప్పుడు వారి మనసే నా హృదయమున ప్రత్యుత్తరమై - పుత్రయుక్తులు నా కొరకు రోదించుచున్నారు. - అని వినిపించింది.

    (మూడవ మంత్రమున నేమృషి లేవనెత్తిన ప్రశ్నలకు ఇంద్రుడు నాలుగు, అయిదు మంత్రములందు సమాధానములిచ్చినాడు. తదుపరి ఋషి వాక్యము:-)

    6. ఇంద్రా! నీవు ధనికుడవు. సోమాభిషవము చేయువారికి ఎంతో చేసినావు. అవన్నియు చెప్పుకొనవలసినవి. పారావత నామక శత్రువుధనము గుంజినావు. దానిని ఋషిపుత్ర శరభునికి అడిగినంత ఇచ్చినావు.

    7. పారిపోవు శత్రువును, వేరుగా నిలిచి నిన్ను రక్షించనివాని మర్మావయములందు ఇంద్రుడు వజ్రపాతము చేసినాడు.

    8. మనోవేగవంతుడు, గమనశీలుడగు గరుడుడు లోహమయ నగరములకు వెళ్లినాడు, స్వర్గముచేరినాడు ఇంద్రునకు అమృతము తెచ్చినాడు.

    9. వజ్రము సంద్రమున నిద్రించును. జలములందు మునిగి యుండును. యుద్ధమందు ఆ వజ్రము సాధించుటకు - ముందుకు ఉరుకువానికే బహుమానము లభించును.

    10. వక్యాము - వెలుగునిచ్చి, దేవతలను ఆనందపరచునది - అజ్ఞానులకు జ్ఞానము కలిగించుచు యజ్ఞమున కూర్చున్నపుడు - నలుదిశలందు అన్నము, జలము వ్యాపించును. అట్టి వాక్కులలో శ్రేష్ఠవాక్కు ఎచటికి ఏగును?

    11. దేవతలు దీప్తిమంతయగు వాగ్దేవిని సృష్టించినారు. ఆ వాక్కునే సకల పశువులు పలుకును. ఆనందకరమగు ఆవాక్కు అన్నము, సరము అందించు ధేనువు వంటిది. ఆ వాక్కును మేము స్తుతించుచున్నాము. వాక్కు మా వద్దకు విచ్చేయవలెను.

    12. మిత్రమా విష్ణూ ! నీ అత్యంత పరాక్రమమును ప్రదర్శింపుము. ద్యులోకమా ! నీవు  వజ్రము సాగుటకు అవకాశము కలిగింపుము. వజ్రమా! నీవు నేను వృత్రుని వధింతము నదులను సముద్రము వైపు పారింతము.

    "ఇంద్రస్యయంతు ప్రసవే విసృష్ఠాః" నదులు ఇంద్రుని ఆజ్ఞానుసారము సాగునుగాక.

    ఆలోచనామృతము:-
   
    1. జీవితము అన్వేషణము మాత్రమే వ్యక్తిజీవితము, వ్యష్టిజీవితము, సమష్టిజీవితము, సమాజ జీవితము, రాష్ట్ర జీవితము, లోకజీవితము సమస్తము అన్వేషణమే ! అన్వేషణమే జీవితము. అందు లభించునది కొంత అందనిది మరింత - మరింత - మరింత. ఎంతో తెలియదు. అందువలన మరింత.

    పార్ధివ ప్రయాణమునకు ఒక గమ్యము - ఒక లక్ష్యము ఉండవచ్చును. ప్రార్థివ ప్రయాణమనగా నెల మీది నడక. నడక కావచ్చును. గమ్యము పార్థివము అయినపుడు చేరుకొను అవకాశమున్నది. తప్పక చేరగలము అని మాత్రము చెప్పాలేము.

    జీవితము పార్థివము - పదార్థము - అర్థము - ఆర్ధికము మాత్రము కాదు. ఆర్థిక లక్ష్యములను సహితము సాధించిన నిదర్శనములు మానవజాతి చరిత్రలో అరుదాతిఅరుదు. లేవని చెప్పిన అతిశయోక్తి మాత్రము కాదు.

    మానవుడు, సకల ప్రాణిజాలము - పంచభూతాత్మకమగు ప్రకృతి వట్టి ప్రాణముతోనూ, పిడికెడు అన్నముతో మాత్రము జీవించుట లేదనుటకు ఊదాహరణలు, ఉపమానములు చెప్పపనిలేదు! అట్లయన  వాల్మీకి ముందు, నిషాదుని బాణపు దెబ్బకు కూలిన మగక్రౌంచమును చూచి ఆడక్రౌంచము విలపింప నక్కరలేదు! క్రౌంచపు విలపింపే జీవితము అనలేము. కాని ఆ వ్యధ - అర్థమును - అన్నమును మించినది. అది  పరమార్థము కాకపోవచ్చును. కాని అర్థమునకు అందనిది! అర్థము కానిది!!! ప్రాణము కన్న మిన్నది !!!

    అదిమనసా ! కావచ్చును. మనసునకు అవయవ నిర్మాణమున చోటులేదు. అది అగుపించనిది అగుపించక పోవుట వాస్తవము కావచ్చును. కాని మనసే జీవితమును నడిపించుచున్నది అనునది అనుభవైక సత్యము ! మనసు నడుపకున్న క్రౌంచమునకు ఏడ్వవలసిన పనిలేదు! దీరోదాత్తుడగు రాముడు సీతనుబాసి చెట్టుకు పుట్టకు చెప్పుకొని ఏడువనక్కర లేదు!  ఏడ్చినంత మాత్రమున  సీతరాదని ధర్మమునకు విగ్రహరూపుడు రామునకు తెలియదు అనుకుందమా ! తప్పు. అట్లనుకొనరాదు. ఏడ్చినది రాముడు కాడు! ఏడ్పించినది మనసు!! మనసు రాముని కన్న మిన్నయా? కావచ్చును ! కాకున్న అదెట్లు ఏడిపించును?

    కాళిదాసు మేఘసందేశమను కావ్యము సృషించినాడు. అందు యక్షుడు మేఘునితో ప్రియురాలికి సందేశము పంపును. మేఘము సందేశము కొనిపోవునా? ఈ సందేహము కాళిదాసునకే వచ్చినది. "కామార్తాహి ప్రకృతి కృపణాశ్చేతనా చేతనేషు" అన్నాడు. కామార్తుని ప్రకృతిలోని చేతనాచేతన జ్ఞానముండదు అంటాడు.
   
    యక్షుని నడిపించినది - తలపించినది ఏది? మనసే!

    "మనయేవమనుప్యాణాం కారణం బంధమోక్షమోః" అన్నాడు కృష్ణపరమాత్మ. పార్థివమునకన్న - అర్థమున కన్న - వినిపించి, కనిపించు ప్రకృతి కన్న కనిపించని మనసే మనసును నడిపించుచున్నదనుట కొంతవరకు మాత్రమే వాస్తవము. సత్యము మాత్రముకాదు. అట్లయిన ఈ మనిషిని - సమస్త సృష్టిని నడిపించునది ఏది? ఎవడు? అనేషణసాంత్ ఈ అగమ్యగోచరమగు ఋతము లేక సత్యం అనేది ఏదియో తెలియని నిరంతర అన్వేషణము మాత్రమే ! ఈ అన్వేషణలోని భాగము లేక  ఈ అన్వేషణకు ఆదిలేక ఈ అన్వేషణకు మార్గదర్శ మహత్తర వేదము.

    ఈ జీవితము సాగుటకు అచ్చపు మానవ ప్రయత్నము మాత్రము చాలదను మూలసత్యమును వేదము ఎలుగెత్తి చాటినది. అయిన మానవప్రయత్నమునకు అతీతమగు శక్తి ఏది మనిషిని నడిపించుచున్నది?

     ఇది ఒక  మహాప్రశ్న ! దీనికి సత్యమగు సమాధానము మానవునకు లభించుట అసాధ్యము. అసంభవము. అట్లని అన్వేషణ ఆగదు. అది ఎందుకు? ఎందుకనగా జీవితమే అన్వేషణము! అన్వేషణము ఆగిన జీవితము నిలుచును.

    జీవితము నిలువదు. అన్వేషణ ఆగదు.

    నేమ ఋషి ఈ అన్వేషణలో నాటికి ఒక కొత్త  అధ్యాయము ప్రారంభించినాడు. ప్రతి ప్రారంభము కొనసాగవలసిన అక్కరలేదు.

    "నేంద్రో అస్తేతీనేమ ఉత్వ ఆహా"

    ఇంద్రుడు లేడని నేమ మతము. ఇంద్రుడు ఎంతో కాలముగా  ఉన్నవాడు. తాను ఉన్నానని నెమకు నిరూపించ  దలచినాడు చెప్పినాడు.

    నేమ విన్నాడు. కాలగతిననుసరించి కొంత అంగీకరించినాడు. పూర్తిగా నమ్మలేదు. లేదనుట అతిసులభము. కాని ఆలోచనమున - అవలోకమున - తాత్వికమున అది చాలదు. ఇది లేదు.

    అట్లయన ఏది ఉన్నది? అను ప్రశ్న ఉదయించును.

    "యద్వాగ్వవదన్త్యవిచేతనాని"

    జ్ఞానము కలిగించు వాక్యము అన్నింటికి కారణమని నేమ ప్రతిపాదించినాడు.

    "దేవీం వాచమజనతా దేవాస్తాం విశ్వరూపా పశవోవదంతి"

    "దేవతలు సృష్టించిన వాక్కునే సకల ప్రాణులు పలుకును" అన్నాడు. ఆవిధముగా వాక్కు ఇంద్రుని కన్న గొప్పది అన్నాడు. అంతేకాదు మనిషి సహితము ఇంద్రుని వంటివాడు అన్నాడు. వజ్రమున్న  వృత్రుని వధింతును. నదులను పారింతును. అన్నాడు. ఇంద్రుని కన్న ఇంద్రుని ఆయుధము గొప్పది  అన్నాడు.

    ఇది అన్వేషణలో నూతనాధ్యాయము మాత్రమే ! అన్వేషణకు అంతము లేదు!!

                                     తొంబదవ సూక్తము.
               ఋషి - భృగుగోత్రజ జమదగ్ని, దేవతలు - వేరువేరు,
         ఛందస్సు -3 గాయత్రి-  14-16 త్రిష్టుప్ - మిగలినవి బృహతి


    1. ఏ మానవుడు హవిదాత యజమాని కొరకును, తన అభీష్ట సిద్ధికొరకును మిత్రావరుణులను సంబోధించునో అతడు విధివిహితముగా యజ్ఞమున హవిసమర్పించినవాడు అగుచున్నాడు.

    2. మిత్రావరుణులు అత్యంత వర్ధితబలులు. మహాదర్శనులు. దీప్తిమంతులు. విద్వాంసులు. వారు రెండు బాహువుల వంటి సూర్య కిరణములతో కర్మలు చేయుదురు.

    3. మిత్రావరుణులారా! ఒక గమనశీల యజమాని మీవద్దకు వచ్చును. వచ్చినవాడు దేవదూత అగును. అతని బాహువుల వంటి సూర్య కిరణములతో కర్మలు చేయుదురు.

    4. ఎన్నిమారులు పలకరించినను పలకని - ఎంత పిలిచినను బదులివ్వని, సంభాషణలకు పిలిచినను స్పందించని శత్రువు బాహుబలము నుండి యుద్ధమున మమ్ము రక్షించండి.

    5. యజ్ఞధనులారా ! భజనీయము, యజ్ఞగృహమున ఉత్పన్నమగు స్తోత్రములతో మిత్రునికొరకు పాడండి. ఆర్యమ కొరకు పాడండి. వరుణుని ప్రసన్నుని చేయుటకు పాడండి. మిత్రాది ముగ్గురు రాజుల కొరకు పాడండి.

    6. అరుణవర్ణ జయసాధన, వాసప్రదపృథివి, అంతరిక్షము ఆకాశమును మూడింటి కొరకు దేవతలు ఒక పుత్రుని - సూర్యుని - కలిగించినారు. అహింసిత, అమర  దేవగణములు మానవ స్థానములను వీక్షింతురు.

    7.సత్యప్రణేతలగు అశ్విద్వయమా ! నేను ఉచ్చరించు దీప్తివాక్యముల కొరకును, కర్మల  కొరకును విచ్చేయండి. హవ్యమును ఆరగించుటకు విచ్చేయండి.

    8. అశ్వినులారా ! మీరు అన్నవంతులు. ధనవంతులు. మీదానము రాక్షసశూన్యము. దానిని మేము అడిగినపుడు- అప్పుడు మీరు జమదగ్నిచే స్తుతులై, పూర్వముఖులు, స్తుతివర్ధక నేతలై విచ్చేయండి.

    9. వాయువా ! మా సుందర స్తుతులు వినుము. స్వర్గమునంటు యజ్ఞమునకు రమ్ము. పవిత్ర ఘృత, వేదమంత్ర, కుశాదుల మధ్య శుభ్రసోమము నీకొరకు వేచి ఉన్నది.

    10. నియుత అశ్వవంతవాయువా ! అధ్వర్యుడు సరళ మార్గమున సాగును. అతడు మీ కొరకు హవిని వహించును. మా కొరకని, నీవు శుద్ధసోమమునకు, దుగ్ధమిశ్రిత సోమమును సేవించుము.

    11. సూర్య ! నీవు గొప్పవాడవు. ఆదిత్యా! నీవు గొప్పవాడవు. ఇది నిజము. నీవు మహామహుడవు. నీ మహిమ స్తుతించబడును. "దేవ మహాఅసి" దేవా! నీవు మహానుడవు ఇది నిజము.


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More