Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    5. ఇంద్రా ! నీవు నీ ఉభయ బాహువులతో గర్వమును విరిచినప్పుడు వృత్రవధకు వజ్రమును ఎత్తినప్పుడు - వృత్రవధకు వజ్రమును ఎత్తినప్పుడు - మేఘమునందలి జలములు గర్జించినప్పుడు - అప్పుడు నలుదిశలనుండి ఇంద్రుని వద్దకేగు స్తోతలు ఇంద్రుని సేవింతురు.

    6. ప్రాణులన్నింటిని ఇంద్రుడు సృష్టించినాడు. తదుపరి అనేకములు పుట్టినవి. అట్టి ఇంద్రునితోనే మేము స్నేహము చేయుదుము. "నమోభిర్వృఇషభంవిశేమ" నమస్కరించి కోరికలు తీర్చి ఇంద్రుని అభిముఖుని చేయుదుము.

    7. ఇంద్రా !నీవు విశ్వదేవతలతో స్నేహము చేసినావు. వారు వృత్రునిశ్వాసకు భయపడినారు. పారిపోయినారు. నిన్నువదలినారు. అప్పుడు నీకు మరుత్తులతో స్నేహముకలిగినది. తదుపరి నీవు సమస్త వృత్రసేనను జయించినావు.

    8. ఇంద్రా! అరువదిముగ్గురు మరుత్తులు - ఒకచోటకూడిన గోయూధమువలె - నిన్ను వర్ధిల్ల చేసినారు. అందువలననే వారు  యజనీయులు అయినారు. మేము ఆ ఇంద్రుని వద్దకు వెళ్లుదుము. ఇంద్రా ! మాకు  భజనీయ అన్నమునిమ్ము. మేమునీకు శత్రుఘాతుక బలము నిచ్చెదము. "శుష్మంతప్ నాహవిషావిధేయ"

    ("నవసుగణేషు సప్తసప్తనిపాదితాః" అని తైత్తరీయము 7 మరుత్తులు x 9 గణములు = 63)

    9. ఇంద్రా ! నీ ఆయుధములు పదునుగలవి. నీ సేనమరుత్తులు. మరి నీ వజ్రమును ఎవడు ఎదిరించగలడు? సోమవంతులు. మరి నీ  వజ్రమును ఎవడు ఎదిరించగలడు? సోమవంత ఇంద్రా ! చక్రము వంటి వజ్రమున. ఆయుధ శూన్యులు, దేవరహితులగు అసురులను పారద్రోలుము.

    10. ఇంద్రుడు మహామహుడు ఉగ్రుడు. కళ్యాణమయుడు. స్తోతలారా ! పశుప్రాప్తికి ఇంద్రుని స్తుతించండి. స్తుతిపాత్ర ఇంద్రుని కొరకు అనేక స్తుతులు చేయండి. ఇంద్రుడు పుత్రుల కొరకు ధనమంపవలెను.

    11. మంత్రములకు లభించువాడును, మహామహుడగు ఇంద్రుని - నడి దాటించునావవలె స్తుతించండి. బహుప్రసిద్ధుడు, ప్రసన్నదాయకుడగు ఇంద్రుడు ధనమివ్వవలెను పుత్రులకు మరింత ధనమీయవలెను.

    12. ఇంద్రా ! నీవు అనుకున్నది ఆచరించుము. నీకు ఆటంకములు ఉండవు. ఋత్విక్కులారా ! ఇంద్రునకు చక్కని స్తుతివాచకములు చదవండి. స్తుతించి ఇంద్రుని సేవించండి. స్తోతలు అలంకృతులు కావలెను. వారు దారిద్య్రకారణముగ ఏడ్వరాదు. ఇంద్రునకు మీస్తుతులు వినిపించండి. ఇంద్రుడు మీకు మరింత ధనము ఇవ్వగలడు.

    13. కృష్ణుడను అసురునకు పదివేల సేనలు కలవు. అతడు అంశుమతి నదీ తీరమున  నివసించువాడు. ఇంద్రుడు తన బుద్ధిబలమున వానిని లోంగదీసినాడు తదుపరి మానవహితమునకుగాను - కృష్ణాసురిని హింసక సేనను హతమార్చినాడు.

    14. ఇంద్రుడు అన్నాడు:- "కృష్ణుడు వేగవంతుడు. అతనిని నేను చూచినాను. అతడు అంశుమతి నదీతీరమున - నిగూఢస్థానమున, విశాల ప్రదేశమున సంచరించువాడు. అతడు సూర్యునివలె కనిపించును. అభిలాషప్రదాతలగు మరుత్తులారా ! మీరు కృష్ణాసురునితో యుద్ధము చేయండి. వానిని సంహరించండి"

    15. ద్రుతగామి కృష్ణుడు అంశుమతి నదీ సమీపమున దీప్తిమంతమగు దేహము కలిగి ఉండును. ఇంద్రుడు - బృహస్పతి సహాయమున -  దేవశూన్యుడు, మీదికి వచ్చుచున్న కృష్ణుని సేనాసహితముగ హతమార్చినాడు.

    16. ఇంద్రా ! నీవే ఆఘనకార్యము నిర్వహించినావు. నీవు పుట్టుకతోనే - అప్పటికి శత్రువులులేని కృష్ణ, వృత్ర, నముచి, శంబర, శుష్ణ, పణిమున్నగు ఏడుగురికి శత్రువవు అయనావు. నీవు అంధకారమయ ద్యావాపృథ్వులను వశపరచుకున్నావు. మరుత్తుల యుక్తుడవై జగములకు ఆనందము కలిగించినావు.

    17. ఇంద్రా ! నీవే ఆఘనకార్యము సాధించినావు. నీవు యుద్ధకుశలుడవు. వజ్రము పట్టినావు. "శుష్ణు"ని అనుపమ బలమును నష్టపరచినావు. నీవే "కుత్సరాజర్షి" కొరకు శుష్ణుని తలవంచి ఆయుధముతో వధించినావు. నీ కర్మములతో నీవు గోవులను సాధించినావు.

    18. ఇంద్రా ! నీవే ఆఘన కార్యమును సాధించినావు. మనోరథప్రద ఇంద్రా ! నీవు మానవుల ఉపద్రవ నివారకుడవు. అందువలన నీవు ప్రవృద్ధుడవైనావు. నిలిచిపోయిన సింధుమున్నగు నదులను ప్రవహింప చేసినావు. తదుపరి దస్యులు ఆక్రమించిన జలములను గెలిచినావు.

    19. ఇంద్రుడు శోభన ప్రజ్ఞావంతుడు. అభిషుత సోమము సేవించి ఆనందించువాడు. ఇంద్రుని క్రోధమును సహించగలవాడులేడు. పగటివంటి వెలుగుగల ఇంద్రుడు ధనవంతుడు. అతడు ఎట్టిసాయము లేకుండ మానవులను రక్షించును. అతడు  వృత్రఘ్నుడు సకల  శత్రుసేన  వినాశకుడు.

    20. ఇంద్రుడు వృత్రఘ్నుడు మానవుల పోషకుడు. ఆహ్వానయోగ్యుడు. మేము ఇంద్రుని స్తుతింతుము. యజ్ఞమునకు ఆహ్వానింతుము. అతడు మాకు విశేశరక్షకుడు. ధనదాత ఆడరముగా పలుకువాడు అన్నదాత కీర్తిప్రదాత.

    21. వృత్రఘ్న ఇంద్రుడు మహామహుడు జన్మతోనే అతడు అందరకు ఆహ్వాన యోగ్యుడైనాడు. మానవులకు అనేక హితకర కార్యములు చేసినాడు. సోమపానమువంటి మిత్రుల ఆహ్వానయోగ్యుడు అయినాడు.
   
                                   ఎనుబది ఆరవ సూక్తము
     ఋషి - కాశ్యప రేభుడు, దేవత - ఇంద్రుడు , ఛందస్సు - 10, 13, 15,
                             త్రిష్టుప్ - 14 మిగిలినవి బృహతి


    1. ఇంద్రా ! నీవు  సుఖవంతుడవు. నీవు అసురులనుండి భోగయోగ్యఘనము తెచ్చినావు దానితో స్తోతలను వర్ధిల్లచేయుము. సోత్తలు కుశలు పరచి  ఉంచినారు.

    2. ఇంద్రా ! నీవు  గోవులు, అశ్వములు మున్నగు అవినాశ్య ధనమును సాధించినావు. దానిని సోమభిషము చేయునట్టి, రక్షిణలు ఇచ్చునట్టి యజమానులకు అందించుము. యజ్ఞహీన పణులకు ఇవ్వకుము.

    3. వ్యక్తులందు దేవశూన్యులు, వ్రతరహితులు ఉందురు. వారు స్వప్నవశులు, నిద్రితులు అగుదురు. అట్టివారు తమ కర్మలతోనే తమను పోషించు శనమును నాశనము చేసికొనవలెను. లేదా కర్మశూన్య ప్రదేశమున ఉంచవలెను.

    4. ఇంద్రా! నీవు శత్రుహంతవు. వృత్రఘ్నడవు. నీవు దూరదేశమందుండుము లేదా దగ్గరి దేశమందుండుము. భూలోకమునుండి ద్యులోకమునకేగు హర్యశ్వములతో సమానమగు అభిషుత సోమవంత యజమాని - ఈ  స్తోత్రముతో నిన్ను యజ్ఞమునకు తీసికొని వచ్చును.

    5.వృత్రఘ్న ఇంద్రా ! నీవు స్వర్గపు దీప్తి స్థానమున ఉన్నను, సముద్ర మధ్యమందు ఎక్కడనో ఉన్నాను భూలోకమున ఎచట ఉన్నను, అంతరిక్షమున  ఉన్నను విచ్చేయుము.

    6. ఇంద్రా !నీవు సోమపాయివి, బలపతివి. సోమము  అభిషవమైనది. మాకు చాలా  ధనమును, మంచి  వాక్కును, బలసాధక అన్నమును ప్రసాదించుము. ఆనందింప చేయుము.

    7. ఇంద్రా ! నీవు మమ్ము విడవకుము. నీవు మాతో పాటు పానము చేయుము. మత్తుడవగుము. మమ్ము నీ రక్షణలందు ఉంచుము. నీవు మాకు బంధువవు. మమ్ము విడవకుము "ఇంద్ర పరావృణక్"

    8. ఇంద్రా ! మాతోపాటు కూర్చుండుము సోమాభిషవమైనది. సోమపానము చేయుదము. ధనిక ఇంద్రా! స్తోతకు మహత్వ రక్షణ ప్రదానము చేయుము. సోమాభిషవమైనంత మా చెంత కూర్చుండుము.

    9. వజ్రధర ఇంద్రా! దేవతలు నిన్ను అతిక్రమించలేరు. మానవులు నిన్ను అడ్డుకొన జాలరు. నీవు నీస్వంత బలమున సమస్త భూతములను వశపరచుకున్నావు. దేవతలు నిన్ను అతిక్రమించజాలరు. 'దేవాశత'

    10. సమస్తసేన - పరస్పరము కలసి - శత్రువిజేత, నేత ఇంద్రుని ఆయుధాదులతో తేజోవంతుని చేయుము. స్తోతలు - తమ  ప్రకాశమునకుగాను - సూర్యరూపింద్రుని యజ్ఞమందు ప్రతిష్టింతురు. ఇంద్రుడు బలిష్ఠుడు. శత్రువినాశకుడు. ఉగ్రుడు. ఓజస్వి. ప్రవృద్దుడు. వేగవంతుడు. స్తోతలు కర్మలతో - ధనము కొరకు - ఇంద్రుని స్తుతిస్తారు.

    11. రేభనామక ఋషులు - సోమపానము చేయుమని - ఇంద్రుని స్తుతించినారు. స్వర్గపాలక ఇంద్రుని వర్ధిల్ల చేయుటకు జనులు స్తుతించినప్పుడు ఇంద్రుడు బలము, పాలనలతో వారిని కలసి కొనును.

    12. కశ్యపగోత్రజులగు రేభలు, నేమిసమముగా - చూచుటయేకాక ఇంద్రుడు స్తుతించినారు. విప్రులు మేకవలె ఉపకరించు ఇంద్రుని స్తుతులతో నమస్కరింతురు. స్తోతలారా! మేఉ శోభన దీప్తివంతులు. ద్రోహశూన్యులు. మీరు ఇంద్రుని చెవుల వద్ద పూజాయుక్తములగు మంత్రములు చదివి స్తుతించండి.

    13. ఇంద్రుడు ఉగ్రుడు ధనికుడు. వాస్తవముగా బలసంపన్నుడు. శత్రువులు అడ్డులేనివాడు యోగ్యుడు అట్టి ఇంద్రుని నేను ఆహ్వానిస్తాను. పూజ్యతమ, యజ్ఞయోగ్య ఇంద్రుడు మా సుతులకు యజ్ఞాభిముఖుడు కావలెను. వజ్రధర ఇంద్రుడు మా ధనమునకు గాను సకల  మార్గములు సుగమములు చేయవలెను.

    14. ఇంద్రా ! నీవు బలశాలివి. శత్రుహంతవు. శంబరుని సమస్త  పురములను స్వబలమున నష్టపరచు మార్గము గ్రహించినావు. ఇంద్రా !నీ భయమున సమస్త భూతములు, ద్యావాపృధ్వులు గడగడలాడును.

    15. బలి, విభిన్న రూప ఇంద్రా! ప్రశంసనీయమగు నీ సత్యము నన్ను రక్షించవలెను. వజ్రధర ఇంద్రా! నావికుడు జలములు దాటించినట్లు - పాపములనుండి మమ్ముదాటింపుము. రాజా ఇంద్రా! వివిధరూపములు కలిగి  అభిలాషణీయ ధనమును మాకు ఎప్పుడు ప్రసాదింతువు?

    (ఆంధ్రవచన ఋగ్వేద సంహిత ఎనిమిదవ మండలము ఆరవ అష్టకమున ఆరవ  అధ్యాయము సమాప్తము.)

        ఓం నతామినన్తిమాయినో నధీరావ్రతాదేవానాం ప్రథమద్ర వాణి
        నరోదసీ అద్రుహ వేదద్యాభిర్న పర్వతాని నమే స్థివాంసః


               ఏడవ అధ్యాయము        ఎనుబది ఏడవ సూక్తము
                   ఋషి - అంగిరస నృమేధుడు, దేవత - ఇంద్రుడు,
        ఛందస్సు - 10, 11, కకుభ, - 9, 12 పురుష్టిక్ - మిగిలినవి ఉష్టిక్


        ఓం ఇంద్రాయ సామగాయత విస్రాయ బృహతే బృహత్ |
        ధర్మకృతే విపశ్చితే పనస్యవే||

    1. ఉద్గాతలారా ! ఇంద్రుడు మేధావి. విశాలుడు. కర్మకర్త. విద్వాంసుడు. స్తోత్రాభిలాషి అతని కొరకు బృహత్ స్తోత్రములు గానము చేయండి.

    2. ఇంద్రా! నీవు శత్రువులను అణచువాడవు. ఆదిత్యుని తేజస్సుతో ప్రదీప్తుని చేసినావు. దివాకర్తవు, సర్వదేవుడవు సర్వధికుడవు.

    3. ఇంద్రా ! జ్యోతిద్వారా నీవు ఆదిత్యుని ప్రకాశకుడవు. స్వర్గమును ప్రకాశింప చేయువాడవు. దేవతలు నీమైత్రికి ప్రయత్నించినారు.

    4. ఇంద్రా! నీవు ప్రియతముడవు. మహావ్యక్తులను జయించినవాడవు. నిన్ను మరుగుపరచగలవాడు లేడు. నీవు పర్వతము వలె నలువైపుల వ్యాపించిన వాడవు. స్వర్గమునకు స్వామివి. మా వద్దకు విచ్చేయుము.
   
    5. సత్యస్వరూప, సోమపాయ ఇంద్రా! నీవు ద్యావా పృథ్వులను వశపరచుకున్నావు. అందువలన నీవు స్వర్గాధిపతివి. అభిషకర్తల వర్షకుడవు.

    6. ఇంద్రా! నీవు అనేక శత్రుపుర భేదకుడవు. దస్యు ఘాతుకుడవు. మనుష్య వర్ధకుడవు స్వర్గపతివి.

    7. జలకాలాడు వారు ప్రక్కవారి మీద నీరు చిమ్మినట్లు - స్తుత్య ఇంద్రా! నేడు  మేము నీ కొరకు మహానీయ కమనీయ మంత్రములు పఠింతుము.

    8. ఇంద్రా ! నీవు వజ్రధరుడవు. శూరుడవు. నదులు నీటితాపరములను పెంచినట్లు స్తోత్రములతో పెరిగిన  నిన్ను స్తోతలు దినదినము మరింత పెంపొందింతురు.

    9. ఇంద్రుడు గతిపరాయణుడు. అతని రథము విశాలము - సంధియుక్తము. దానిని  లాగు హర్యశ్వములు మాట మాత్రమున రథమునకు చేరును. స్తోతలు అశ్వములను స్తోత్రములతో రథమునకు జతచేయుదురు.

    10. ఇంద్రా ! నీవు బజుకర్మవు. ప్రవీణుడవు. వీర్యశాలివి. సేనలను గెల్చువాడవు. మాకు ధనమును, బలమును ప్రసాదించుము.

    11. నివాసదాత, బహుకర్మవు. ప్రవీణుడవు. వీర్యశాలివి. సేనలను గెల్చువాడవు. మాకు ధనమును, బలమును ప్రసాదించుము.

    12. ఇంద్రా! నీవు బలశాలివి. అనేకుల ఆహ్వాతావు. బలమును  కోరువాడవు. అట్టి నిన్ను స్తుతింతును. మాకు చక్కని వీర్యయుక్త ధనమును అందించుము.
   
                                   ఎనుబది ఎనిమిదవ సూక్తము
               ఋషి - నృమేధుడు దేవత - ఇంద్రుడు ఛందస్సు - బృహతి


    1. వజ్రధర ఇంద్రా! హవివంతులగు నేతలు నీకు  నిన్న నేడు సోమపానము చేయించినారు. నీవు ఈ యజ్ఞమున స్తోత్రవాహకములమగు మా స్తుతులు వినుము. మా ఇంటికి వేంచేయుము.   


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More