Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2
12. నీవు వినుట యందు గొప్పవాడవు. ఇది నిజాము నీ మహిమవలన నీవు దేవతలందు గొప్పవాడవు. ఇది నిజము. నీవు శత్రునాశకుడవు. దేవతలకు హితోపదేశికుడవు. నీ తేజస్సు గొప్పది - అహింసనీయము.
13. ఈ ఉష నిమ్నముఖి. స్తుతిమతి. రూపవతి. ప్రకాశవతి. ఆమె సూర్యుని ప్రభావమున ఉదయించినది. ఈ బ్రహ్మాండపు దశదిశల వ్యాపించును. చిత్రగోవు వలె - దర్శనమిచ్చుచున్నది.
14. ముగ్గురు ప్రజలు అతిక్రమించి వెళ్లిపోయినారు. మిగిలినవారు అగ్ని యొక్క నలుదిశలను ఆశ్రయించినారు. జగములందు ఆదిత్యుడు మహామహుడై నిలిచినాడు. వాయువు దిశలందు చొరబడినది.
15. గోవు రుద్రులకు మాత. వసువులకు పుత్రి. ఆదిత్యులకు భగిని, దుగ్ధములకు నివాసస్థానము. మానవా! గోవు నిరపరాధి. అదీన. దానిని వధించరాదు. నేను ఈ విషయము బుద్ధిమంతులగు మానవులకు చెప్పినాను.
16. గోదేవి వాక్యదాత్రి. వచనవిద. సకలవాక్య ఉపస్థిత. ప్రకాశమాన. దేవతలకు నన్ను తెలియపరచునది. మానవుడు కొంచెపు బుద్ధివాడు. గోదేవిని వర్ణించుచున్నాడు.
ఆలోచనామృతము:-
వేదము సకల ప్రాణులను సమానముగ పరిగణించినది. మానవులు, పశువులు, పక్షులు, వృక్షములు, పర్వతములు సమానములని దర్శించినది. వీనిలో అన్నింటిని కాకున్నను కొన్నింటిని దేవతలలో చేర్చినది.
దేవతలలో చేర్చుట అనగా అవి మానవ జాతి జీవనమునకు అత్యవసరములు అని గుర్తించుట. అంతేకాదు. వానికి హాని కలిగించరాదని పూజించా వలెనని నిర్ణయించుట.
మానవుడు పంచభూతములను - తనపిశాచదాహమునాకు - విషపూరితము చేయుచున్న అత్యంత ఆధునికమనుకున్న ఈ రాక్షసయుగమునకు వేదము ఇచ్చిన సందేశము అమృతప్రాయము. కాని ఆశ రక్కసి. అది అమృతమును హరించును.
ఈ సూక్తమున గోవును దేవతను చేసినాడు. ఇది ఎంతయు ఉపయుక్తము సమంజసము - మానవుడు నాడు కాదు నేడు కూడ గోవులవలననే అభివృద్ధి చెందినాడనుట వట్టిభ్రమ మాత్రమే! మనిషిని యంత్రముగా మార్చినది మనిషికి విషమిచ్చి ఆత్మహత్యకు పురికొల్పునది పురోగతి అనిపించు కొనదు!
కృతజ్ఞత, దయ, కరుణ, ప్రేమ, అభిమానము, ఆత్మీయత, అనురాగము, అనుబంధము ఇవి మానవత లక్షణములు. ఇవి మచ్చునకన్న కనిపించని యంత్ర నాగరకతను పురోగతి అనుట రాక్షసలక్షణము!
గోవు పశువు. దానికి ప్రాణమున్నది. అది మనకు పాలిచ్చుచున్నది. తల్లులు రక్కసులయి - తమ చనుమొనల అందమును నిరాకరించినప్పుడు గోవు శిశువులకు మాత అయినది. తనపాలను పాలరూపమునగాని, పొడిరూపమునగాని, ఇచ్చి బ్రతికించినది. అట్లు తల్లి అయిన గోవును నాగరకులమని భ్రమించు పాశ్చాత్యులు నిత్యము వధించి తినుచున్నారు! ఇదియేనా నాగరకత!
నాటి వేదకాలమున జమదగ్ని గోవును దేవతను చేసినాడు. దానికి అత్యున్నత స్థానము కల్పించినాడు.
గోవు నిరపరాధి. అదీన. అదితి అని ఆమె ఔన్నత్యమును చాటినాడు. గోవును "మావధిష్ట" - వధించరాదని హెచ్చరించినాడు!
"ప్రమవోచంచికితుషేజనాయ" బుద్ధిమంతులకు - ఆలోచించువారికి ఈ మాట చెప్పుచున్నాను అన్నాడు. ఆలోచించువారికి పని కల్పించినాడు. వారిలో దయ, కరుణ, కృతజ్ఞతలను ప్రేరేపించదలచినాడు.
కరుణించుటయే మానవత !
పశుపక్ష్యాదులను ప్రేమించుట మానవత !!
కృతజ్ఞత తెలియజేయుట మానవత !!!
ప్రాణులను నొప్పించకుండుట మానవత !
తొంబది ఒకటవ సూక్తము
ఋషి - భృగుగోత్రజ ప్రయోగుడు లేదా బార్హస్పత్య పావకుడు.
దేవత - అగ్ని ఛందస్సు - గాయత్రి.
1. అగ్నీ! నీవు ప్రకాశమానుడవు. కవివి. గృహపాలకుడవు. నిత్య తరుణుడవు. హవ్యదాత యజమానికి అన్నము అందించువాడవు.
2. అగ్నీ! నీవు విశిష్ట దీప్తివంతుడవు. జ్ఞాతవగుము. మా మాటలు చెప్పి దేవతలను తీసికొనిరమ్ము. మేము వారిని స్తుతింతుము, సేవింతుము.
3. యువతమ అగ్నీ! నీవు ధనప్రేరకుడవు. మాకు సాయపడుము. మేము అన్నము కొరకు శత్రువును అణచివేతుము.
4. సముద్రమధ్యమున వ్యవస్థితమగు పవిత్ర అగ్నిని ఔర్వమృగము, అప్నవానమువలె ఆహ్వానిస్తాను.
5. వాయువువలె ధ్వనించు, మేఘమువలె గర్జించు, విద్వాంసుడు, బలవంతుడు, సముద్రమందు శయనించిన అగ్నిని ఆహ్వానిస్తాను.
6. సూర్యుని ఉదయమురీతి, భగుని భోగమురీతి సముద్రమందు శయనించిన అగ్నిని ఆహ్వానిస్తాను.
7. ఋత్విక్కులారా ! అహింసనీయ, ఆధ్వరబంధు, బలి వర్ధమాన, బహుతన అగ్నివైపు మీరు సాగండి.
8. ఈ అగ్నియే మమ్ము కర్తవ్యోన్ముఖులను చేయును. అగ్ని ప్రజ్ఞానమున మేము యశస్వులమగుదుము.
9. దేవతలందు అగ్నియే మానవుల సకల సంపదల కారకుడగును. అగ్నీ! అన్నమందుకొని మాముందుకు రమ్ము.
10. అగ్ని హోతలందరిలో అధిక యశస్వి. యజ్ఞమున ప్రధానుడు. స్తోతలారా ! ఈ యజ్ఞమందు అగ్నిని స్తుతించండి.
11. అగ్ని దేవతలందు ముఖ్యుడు. మహా విద్వాంసుడు. అతడు యాజ్ఞికుల గృహమున ప్రదాప్తుడగును. పవిత్ర దీప్తివంతుడును, శయనించు అగ్నిని స్తుతించండి.
12. విప్రస్తోతలారా! అశ్వము వంటి భోగయోగ్యుడు, బలశాలి, మిత్రునివలె శత్రుహంత అగ్నిని స్తుతించండి.
13. అగ్నీ ! యజమానులు చేయు స్తుతులు భగినులవలె నీ గుణగానము చేయును. నిన్ను సేవించును. నిన్ను వాయు సమీపమున స్థాపించును.
14. అగ్నియందు మూడు దాగినవియు, కట్లులేని కుశలున్నవి. అగ్నియందు జలమునకు సహితము స్థానము ఉన్నది.
15. అగ్ని అభీష్టప్రదుడు. ప్రకాశమానుడు. అతని స్థానము సురక్షితము - భోగ్యము అతని దృష్టి సూర్యునివలె శుభప్రదము.
16. అగ్నీ ! ఘృతము నీకు దీప్తిసాధకము. ఘృతమున ప్రజ్వరిల్లుము. జ్వాలలతో దేవతలను పిలువుము. యజ్ఞము చేయుము.
17. అంగిర అగ్ని విద్వాంసుడు అమరుడు. హవ్యదాత. ప్రసిద్ధుడు. దేవతలు తల్లులవలె - అగ్నిని సృష్టించినారు.
18. అగ్నీ! ఋషినగు నావద్ద గోవులేదు. కట్టెలు కొట్టు గొడ్డలిలేదు. వాటిని అన్నింటిని నీకే అర్పించినాను.
19. యువతమ అగ్నీ! నీ కొరకు నేను కొన్ని, కొన్ని కర్మలు చేయునప్పుడు గొడ్డలితో చీల్చని కర్రలనే స్వీకరింతువు.
20. నీ జ్వాలలు దహించు కర్రలును, నీ జ్వాలారూప జిహ్వలు దాటిపోవు కర్రలును ఘృతసమములు కావలెను.
21. మానవుడు అగ్నికి కర్రపుల్లలు అందించి మండించును. మనసుతో కర్మలు ఆచరించును. ఋత్విక్కులద్వారా సమిధలు సమర్పించును.
(ఇది ప్రపత్తికి దగ్గరిది. అన్నియు నీకే అర్పించినామ. ఉన్నవానినే ఉత్తమములను కొనుము. స్వీకరించుము అని ప్రార్ధించుట)
తొంబది రెండవ సూక్తము
ఋషి - కాణ్వసోభరుడు, దేవత - అగ్ని - మరుత్తులు , ఛందస్సు - వివిధము
1. సకల కర్మములు - యజమానులద్వారా - అగ్నికి ప్రదత్తములగును. అప్పుడు అతిశయ మార్గజ్ఞాత అగ్ని ప్రత్యక్షమగును. ఆర్యుల వర్ధకుడగు అగ్ని తగురీతిని ప్రాదుర్భూతుడైనంత మాస్తుతులన్నియు అగ్నినిచేరును.
2. దివోదాసు అగ్నిని ఆహ్వానించినాడు. భూమాత ముందు - దేవతలకు హవ్యము వహించుతాకు అగ్ని సిద్ధపడలేదు. ఏలననగా దివోదాసు బలప్రయోగమున అగ్నిని ఆహ్వానించినాడు అందువలన అగ్ని స్వర్గమందే ఉండినాడు.
(ఆహ్వానమునకు బలవంతముకాదు ఆర్ద్రత అవసరమని చెప్పుట)
3. కర్తవ్యపరాయణులను చూచి అన్యులు కంపింతురు. కావున మానవులారా! మీరు ఇప్పుడే సహస్రఫలదాత అగ్నిని యజ్ఞమందు మీ కర్మలతో సేవించండి.
4. నివాసదాత అగ్నీ ! ధనదానము కొరకు నీవు శిక్షణ నిచ్చువాడును - నీకు హవ్యము సమర్పించువాడును - మంత్ర ప్రశంసక, స్వయం సహస్ర పోషక పుత్రుని పొందును.
5. ఎంతో ధనమున్న అగ్నీ! నీకు హవ్యము సమర్పించువాడు - వాని దృఢశత్రు పురమున జొచ్చి అశ్వసాయమున - అక్కడి అన్నమును నష్టపరచును. వర్ధిల్లు అన్నమును అందుకొనును. మేము సహితము దేవస్వరూపుడవగు నీకు హవ్యము సమర్పింతుము. నీలో సకల విధ ధనములను అందు కొందుము.
6. దేవతలను ఆహ్వనించువాడును, ఆనందమయుడును, మానవులకు ధనదాతయునగు అగ్ని వద్దకే మదకర సోమపుతొలి పాత్ర చేరును.
7. అగ్నీ! నీవు దర్శనీయుడవు. లోకపాలకుడవు. యజమాని దేవాభిలాషి. చక్కని దాత. అతడు - రథవాహకునివలె నీకు పరిచర్యలు చేయును. నీవు మా పుత్ర పౌతృలకు ధనవంతుల ధనము దానము చేయుము.
8. అగ్ని సర్వశ్రేష్ఠదాత. యజ్ఞవంతుడు. సత్యశీలి. విశాలుడు. ప్రదీప్తి. తేజోవంతుడు. స్తోతలారా అగ్నికి స్తోత్రములు ఉచ్చరించండి.
9. అగ్ని ధనికుడు. అన్నవంతుడు. సందీప్తుడు. వీరుని వంటి ప్రతాపవంతుడు. అతడు పిలిచినంత యశస్కర ధనమును ఇచ్చును. అతని అభినవ బుద్ధి, అన్న సహితమై అనేక సార్లు మా వద్దకు రావలెను.
10. స్తోతలారా !ప్రియులలో ప్రియతముడు, అతిథి, రథనియంత అగ్నిని స్తుతించండి.
11. అగ్ని జ్ఞాని. యజ్ఞయోగ్యుడు. ఉదయించునదియు వినసొంపగు ధనమునకు ప్రవర్తకుడు. కర్మద్వారా స్వేచ్ఛగా వెలుగు అగ్నిజ్వాల నిన్నుగామి సముద్ర తరంగమువలె దుస్తరము. అటువంటి అగ్నిని స్తుతించండి.
12. అగ్ని వాసప్రదాత. అతిథి. బహుస్తుతుడు. దేవతల ఉత్తమ ఆహ్వానకర్త. సుందర యజ్ఞవంతుడు. ఆ అగ్నిని మా కొరకు ఎవరును ఆటంక పరచరాదు.
13. వాసప్రద అగ్నీ! నిన్ను స్తుతులు, అభిగమనములతో సేవించువానిని హింసలు చేరరాదు. చక్కని యజ్ఞవంతులు, హవ్యదాతలగు స్తోతలు - దూత కార్యమునకు నిన్నే స్తుతింతురు.
14. అగ్నీ! నీవు మరుత్తులకు ప్రియుడవు. మా యజ్ఞకర్మమునకు మరుత్తుల సహితుడవై విచ్చేయుము. సోభరి యొక్క శుభంకర స్తుతుల వద్దకు విచ్చేయుము. సోమపానము చేయుము. మత్తున తేలిపొమ్ము.
విద్వాంసుడు, బహుభాషావేత్త, కవి, కథకుడు, నవలాకారుడు, నాటకకర్త, బాలసాహిత్యరచయిత, విమర్శకుడు, చలనచిత్ర రచయిత, వ్యాపకర్త, అనువాదకుడు, వక్త, కార్మికోద్యమ కార్యకర్త, స్వాతంత్ర్యసమరయోధుడు, ప్రగతి పధగామి, ప్రసన్నుడగు దశారథి రంగాచార్య విరచిత ఆంధ్రవచన ఋగ్వేద సంహితమున ఎనిమిదవ మండలము సమాప్తము.
"మాసీమవద్య ఆభాగుర్వీకాష్ఠాహితం ధనమ్ అపావృక్తా అరత్నయః"