Home » Dr Dasaradhi Rangacharya » Rigveda Samhitha - Part 2


    3. అతడే - ఆ కళ్యాణకారి, బంధువగు ఇంద్రుడు -పాలిచ్చుపాడియావువలె - మాకు అశ్వములు, గోవులు, యవల  యుక్తధనమును అందించవలెను.
   
    4. వృత్రఘ్న, సూర్య ఇంద్రా ! నేటి పదార్ధములన్నింటిలో తొలుత నీవే వెలువడినావు ఆ విధముగా సకల లోకములు నీవశవర్తులైనవి.

    5. ప్రవృద్ధ, సత్పతి ఇంద్రా ! నీవు అమరుడనమ కొనుచున్నావా? అది నిజమే కదా! "అతో తత్సత్యమిత్తవ"

    6. దూరము కానీ దగ్గర కానీ సొమము అభిషవించు ప్రదేశమునాకు చేరుదువు.

    7. ఇంద్రుడు ధనవర్షకుడు. వరప్రదుడు. వృత్రుని వధించుటకు ఆ ఇంద్రునే మేము బలశాలిని చేయుదుము.

    8. ప్రజాపతి ఇంద్రుని ధనదానమునకే సృష్టించినాడు. ఇంద్రుడు అందరికన్న ఓజస్వి సోమపానమునకు ఏర్పడినవాడు. అత్యంత కీర్తిమంతుడు. స్తుతిమంతుడు. సోమయోగ్యుడు.

    9. స్తుతులతో వజ్రమువంటి తేజస్వి, బలశాలి, అపరాజితుడు, మహామహుడు, ఆహింసిత ఇంద్రుడు ధనాదులు వహించ ఇచ్ఛగించును.

    10. స్థితియోగ్య, ధనిక ఇంద్రా! నీవు మమ్ము కోరుకున్నచో -  స్తుతుడవై, దుర్గమ స్థానమందును మాకు సుగమ మార్గము కల్పించుము.

    11. ఇంద్రా ! నేటికిని నీ బలమునుగాని, రాజ్యమును గాని బాధించగలవాడులేడు. దేవతలు హింసించరు. సంగ్రామ మందలి వీరులు బాధింపరు.

    12. అందమగు దవడల ఇంద్రా ! నీ అప్రతిహత బలమును ద్వావా పృథ్వులు పూజింతురు.

    13. నీవు ఎర్రని, నల్లని ఆవులకు తెల్లని పాలనే ఇచ్చినావు.

    14.సకల దేవతలు వృత్రుని తేజము చూసి పారి పోయినప్పుడు - మృగరూపవృత్రుని చూచి గడగడలాడినపుడు.

    15. అప్పుడు మా ఇంద్రుడు వృత్రహంత అయినాడు అజాతశత్రువు, వృత్రఘ్న ఇంద్రుడు తన శౌర్యమును ప్రకటించినాడు.

    16. ఋత్విక్కులారా ! ప్రఖ్యాత, వృత్రఘ్న, బల ఇంద్రుని స్తుతించి మాకు మరిన్ని దానములు చేసెదరు.

    17. ఇంద్రునకు అనేక పేర్లున్నవి. అతనిని అనేకులు స్తుతింతురు. అతడు విశేషసోమపానమునకు విచ్చేసినపుడు మేము గోవంతులము, బుద్ధిశాలురము అగుదుము.

    18. వృత్రహంతయు, అనేక అభిషవములుకల ఇంద్రుడు గ్రహించవలెను మాస్తుతులు వినవలెను.

    19. అభీష్టవర్షక ఇంద్రా! నీవు ఎట్లు మమ్ము ఉన్నత్తులను చేయుదువు? స్తోతలు చేయు ఎట్టి సేవలకు ధనము దానము చేతువు?

    20. నీవు మత్తునందుము. మాకు వేల ధనములనిమ్ము. నీవు హవ్యదాత నియంతవు అది తెలిసికొనుము.

    21. ఇదంతయు జలసిక్త సోమము  - అభిషుతమైనది దీనిని ఇంద్రుడు స్వీకరించవలెను. సోమములన్నియు అది కోరియే ఇంద్రుని వద్దకు చేరును. త్రావినంత సోమము ఆనందము కలిగించును. సోమము జలము వద్దకు చేరును.

    22. యజ్ఞమునందు వర్ధకులు, యజ్ఞకర్తలగు ఏడుగురు హోతులు యజ్ఞదినాంతమున తేజస్వులై ఇంద్రుని విసర్జింతురు.

    (అవభృతస్నానమైనంత హోతలు తేజస్వులు అగుదురు. యజ్ఞాంతమున అవభృతస్నానము ఇంద్ర విసర్జన జరుగును.)

    23. ప్రఖ్యాత ఇంద్రుని హర్యశ్వములు ఉన్నత్తలు - స్వర్ణకేశలు. అవి  ఇంద్రుని హితకర  అన్నము వైపు సాగించవలెను.

    24. ప్రకాశవంత ధనపతి అగ్నీ !నీ కొరకు ఈ సోమము అభిషుతమైనది. కుశలు పరచబడినవి. స్తోతల సోమపానము కొరకు ఇంద్రుని పిలువుము.

    25. ఋత్విక్కులారా ! యజమానులారా ! ఇంద్రునకు హవిసమర్పించు మీ కొరకు ఇంద్రుడు బలమును పంపవలెను - రత్నములను పంపవలెను. స్తోతల కొరకు సహితము ఇంద్రుడు బల, రత్నాదులవంపవలెను. మీరు ఇంద్రుని పూజించండి.

    26. శతక్రతు ఇంద్రా! నీ కొరకు వీర్యవంతమగు సోమమును, సమస్త స్తోత్రములను సమకూర్చినాను. నీవు స్తోతలను సుఖవంతులను చేయుము.

    27. ఇంద్రా ! నీవు మమ్ము సుఖపెట్టదలచిన మాకు శుభములనిమ్ము. అన్నమునిమ్ము బలమునిమ్ము.

    28. ఇంద్రా ! నీవు మమ్ము సుఖపెట్టదలచిన మాకొరకు సమస్త మంగళములు తెమ్ము.

    29. "యదింద్ర మృళయసినః" ఇంద్రా ! నీవు మమ్ము సుఖపెట్టదలచిన మేము అభిషుత సోమవంతులమై నిన్ను ఆహ్వానింతుము.

    30. సోమపతి ఇంద్రా! హర్యశ్వములమీద స్వారి చేయుచు మా అభిషుత సోమము వద్దకురమ్ము - అభిషుత సోమము వద్దకు రమ్ము. "హరిభిః సుతమ్ యాహిహరిభిః సుతమ్"

    31. ఇంద్రుడు శ్రేష్ఠుడు. వృత్రఘ్నడు. శతక్రతువు. అతడు రెండు ప్రకారములుగా శత్రువధకు ఉగ్రుడుగా, జగద్రక్షణకు శాంతుడుగా - తెలియబడును. కావున అతడు హర్యశ్వములనెక్కి మా అభిషుత సోమము వద్దకు రావలెను.

    32. వృత్రఘ్న ఇంద్రా ! నీవు ఈ సోమపు పానకర్తవు. కావున హరులతో అభిషుత సోమము  వద్దకు విచ్చేయుము. "ఉపనోహరిభిః సుతమ్"

    33. ఇంద్రుడు - అన్నదాతయు, అమరుడగు ఋభువును మాకీయవలెను. వాజనామకుడగు అతని సోదరుని మాకీయవలెను. "వాజీదదాతు వాజనమ్"

    (ఆంధ్రవచన ఋగ్వేదసంహిత ఆరవ అష్టకము ఎనిమిదవ మండలమున తొమ్మిదవ అనువాకము సమాప్తము)

               పదవ అనువాకము             ఎనుబది మూడవ సూక్తము
 ఋషి - అంగిరస బిందులేదా పూతదక్షుడు, దేవత - మరుత్తులు, ఛందస్సు - గాయత్రి.

    1. గోవు ధనికులగు మరుత్తులకు మాత. అది తన పుత్రులకు సోమపానము చేయించును. గోవు అన్నభిలాషి మరుత్తుల రథమునులాగునది పూజినీయ.

    2. సకల దేవగణములు గోవు వడిలో ఉండి తమతమ వ్రతములను ఆచరింతురు. సూర్య చంద్రులు సహితము సకల లోకములను ప్రకాశవంతము చేయుటకు గోవు వద్దనే నిలుతురు.

    3. మాస్తోతలు సర్వత్రగాములు సోమపానమునకు మరుత్తులను స్తుతింతురు.

    4. ఈ సోమము ఆభిషుతమైనది స్వయం ప్రకాశకులగు మరుత్తులు అశ్విద్వయము దీని అంశమును పానము చేయవలెను.

    5. మిత్ర, ఆర్యమ, వరుణులు - దశాపవిత్రమున శోధితమైనదియు, మూడు స్థానములందు స్థాపించబడినదియు, జనస్తుత్వమును అగు సోమమును పానము చేయవలెను.

    (ద్రోణ, కలశధావని, పూత భృదాఖ్యాని త్రీణిస్థానాని)

    6. ఇంద్రుడు ప్రాతఃకాలమున - హోతతో సమముగా - అభిషుతి, గవ్యయుక్త సోమమును సేవించును - ప్రశంసించును.

    7. మరుత్తులు ప్రాజ్ఞులు నీటివలె వంకర నడకలవారు. వారు ఎప్పుడు ప్రదీప్తులగుదురు? శత్రుహంతలగు మరుత్తులు బలవంతులై ఎప్పుడు మాయజ్ఞమునకు వచ్చెదరు?

    8. మరుత్తులారా ! మీరు మహామహులు. దర్శనీయులు. తేజోవంతులు. ద్యులోమంతులు. మీరు మమ్ము ఎప్పుడు పాలింతురు?

    9. మరుత్తులు సకల పార్థివ పదార్థములను, ద్యులోకపు జ్యోతులు విస్తరింపచేసినారు. అట్టివారినే సోమపానమునకు ఆహ్వానించుచున్నాము.

    10. మరుత్తులారా ! మీ బలము పవిత్రము. మీరు అత్యంత ద్యుతిమంతులు. సోమ పానమునుకుగాను మిమ్ము త్వరగా ఆహ్వానిస్తాను.

    11. ద్యావాపృథ్వులను నిలిపి ఉంచిన వారినే ఈ సోమపానమునకు "ఆహ్వానిస్తాను."

    12. నలువైపుల విస్తరించిన వారు, పర్వతములపైస్థిరపడినవారు, జలవర్ణకులగు మరుత్తులను సోమ పానమునకు ఆహ్వానిస్తాను. "హువే అస్య సోమస్య పీతాయే'
   
                              ఎనుబది నాలుగవ సూక్తము
      ఋషి - అంగిరస తిరశ్చి దేవత - ఇంద్రుడు ఛందస్సు - అనుష్టుప్

    1. స్తుతిపాత్ర ఇంద్రా ! సోమాభిషవమైనంత మా స్తుతులు - రథవంత వీరునితో సమముగా -నీ వైపు తరలును. ఆవులు దూడలను చూచి అంబారావములు చేసినరీతి. మా స్తోత్రములు నిన్ను కీర్తించును.
   
    2. ఇంద్రా ! నీవు స్తుతించబడు వాడవు - పాత్రలలో గల అభిషుత సోమము నిన్ను చేరవలెను. ఈ సోమభాగమును త్వరత్వరగా సేవింపుము. నీకు నలువైపుల చరుపురోడాశాదులు పెట్టి ఉన్నవి చూడుము.

    3.ఇంద్రా ! గాయత్రి శ్యేనరూపము దాల్చినది. సోమమును ద్యులోకమునుండి తెచ్చినది. అట్టి అభిషుత సోమమును - నీ ఆనందము కొరకు - మెలమెల్లగా స్వీకరింపుము. నీవు మరుత్తులకు, దేవతలకు స్వామివి కదా!

    4. "తిగశ్చి" హవిద్వారా నిన్ను పూజించును. అతని ఆహ్వానమును ఆలకింపుము. నీవు సుపుత్రులు, గో ధనాదులు అందించి అతనిని పరిపూర్ణుని చేయుము. నీవు దేవతలందు శ్రేష్ఠుడవు.

    5. నవీనము, మదకర వాక్యమును నీ కొరకు కల్పించిన యజమానికొరకు ప్రాచీనము, సత్యయుక్తము, ప్రవృద్ధము, హృదయంగమగు రక్షణలు కలిగింతుము.

    6. మా స్తుతులను, ఉక్థలను వర్ధిల్ల చేసిన ఇంద్రునే మేము స్తుతింతుము. ఆ ఇంద్రుని అనేక పౌరుషములను మేము కీర్తింతుము భజింతుము.

    7. ఋషులారా ! త్వరత్వరగా రండి. ఇంద్రుడు వృత్రుని వధించినాడు. పరిశుద్ధుడు అయినాడు. అతనిని సోమగానములు ఉక్ధమంత్రములతో స్తుతించండి. దశాపవిత్రము ద్వారా శోధిత సోమము ఇంద్రుని హృష్టుని చేయవలెను.

    8. ఇంద్రా ! నీవు పరిశుద్ధుడవు. విచ్చేయుము. పరిశుద్ధ రక్షణలు, మరుద్యుక్తుడవై విచ్చేయుము. నీవు పరిశుద్ధుడవు. మాలో ధనమును స్థాపించుము నీవు పరిశుద్ధుడవు. సోమయోగ్యుడవు. ఉన్మత్తుడవగుము.

    9. ఇంద్రా ! నీవు పరిశుద్ధుడవు. మాకు  ధనమునిమ్ము. హవ్యదాతకు రత్నములిమ్ము. నీవు పరిశుద్ధుడవు. వృత్రాది శత్రువులను వధించినవాడవు. నీవు పరిశుద్ధుడవు మాకు అన్నము అందించ తలచుము.

    (ఇంద్రుడు రాక్షసులను వధించినాడు అపవిత్రుడు అయినాడు. అతడు తనను పరిశుద్ధుని చేయుమని ఋషులను ప్రార్థించినాడు. ఋషుల సామమంత్రములు మున్నగువానితో ఇంద్రుని పరిశుద్ధుని చేసినప్పటదీ ఈ మాట)

                                  ఎనుబది అయిదవ సూక్తము
               ఋషి - మరుత్పుత్రుడు ద్యుతుడు లేక తిరశ్చి, దేవత - ఇంద్రుడు,
                                    ఛందస్సు - త్రిష్టుప్ - 4 విరాట్.


    1. ఇంద్రుని భయమున ఉషస్సులు తమ గమనములను వర్ధిల్ల చేయును. ఇంద్రుని కొరకే రాత్రులు రానున్న జామును సుందర వదనవంతము చేయును. ఇంద్రుని కొరకే గంగమున్నగు సప్తనదులు మానవులు దాటుటకు వీలుగా ప్రవహించును.

    (రాత్రిముగియు జామున వేదాధ్యయనాదులు జరుగును. అందువలన అవి సుందర వచన వంతములు.)

    2. ఇంద్రుడు ఎట్టిసహాయము లేకనే తన అస్త్రములతో, ఒకచోటకూడిన ఇరువదియొక్క పర్వతశిఖములను భగ్నము చేసినాడు. ఇంద్రుడు వరప్రదుడు. ప్రవృద్ధుడు. అతడు సాధించిన కార్యములను మానవులుకాని దేవతలుకాని సాధించలేరు.

    3. ఇంద్రుని వజ్రము ఇనుముతో చేయబడినది. దానిని అతడు తనేచేతిలో పట్టగలడు. అందువలన ఇంద్రుని చేతులందు ఎంతో బలమున్నది. ఇంద్రుడు యుద్ధమునకు బయలుదేరును. అప్పుడు అతడు శిరస్త్రాణము ధరించును, ఇంద్రుని ఆజ్ఞలు అందుకొనుటకు అందరు అతని వద్దకు వచ్చెదరు.

    4. ఇంద్రా ! నిన్ను యజ్ఞార్హులందు సహితము యజ్ఞయోగ్యునిగా పరిగణిస్తాను. పర్వత్ భేదకునిగా భావింతును. సైన్యముల పతాకగా తలతును, మానవులకు అభిమత ఫలదాతగా ఎరుగుదును. 


Related Novels


Sri Mahabharatam

Dasaradhi Rangacharya Rachanalu - 6

Dasaradhi Rangacharya Rachanalu - 9

Shrimadbhagwatgeeta

More