Home » Yandamuri veerendranath » Prarthana


    ఆమె డి.ఐ.జి. ఇంట్లో రాత్రి తొమ్మిదిన్నరవరకూ కూర్చుంది. అతడు ఇంటికి రాలేదు. ఏదో పార్టీలో వున్నాడనీ - ఆలస్యంగా వస్తాడనీ తెలిసింది. మరుసటిరోజు ప్రొద్దున్న రమ్మని అక్కడి మనిషి చెప్పాడు. ఆమె నిరాశతో ఇంటి మొహం పట్టింది.

 

    ఇంటికి వచ్చాక గుర్తువచ్చింది - తను దాదాపు పన్నెండు గంటల్నుంచీ ఏమీ తినలేదని. ఒక్కసారిగా ఆకలి ముంచుకొచ్చింది. అంతలో తల్లి ఆ బ్రెడ్ పాకెట్టూ అవీ చూపిస్తూ "ఎందుకే ఇవన్నీ తెచ్చావ్?" అని అడిగింది కూతుర్ని.

 

    అంతే! దాంతో శేఖరం గుర్తువచ్చాడు. అతడి ఆకలి గుర్తు వచ్చింది. తన ఆకలి చచ్చిపోయింది. కంచం ముందునుంచి లేచిపోయింది. 'అదేమిటే' అని విడ్డూరంగా చూస్తున్న తల్లికి జవాబు చెప్పకుండా.

 

    పక్కమీద పడుకొని పైకప్పుకేసి చూస్తూ "రేపు అంతా బాగయి కథ సుఖాంతమై, శేఖరాన్ని కలుసుకుంటే తనకి అన్నం సహించని విషయం అతడికి చెప్పాలి" అనుకుంది. ఏమంటాడో తనకి బాగా తెలుసు. తన గురించి అనేది ఒకేమాట-

 

    'అడాలిసెంట్'.

 

                                                                  8

 

    ఆ చారిత్రాత్మకమైన సంఘటన రాత్రి 11-07 నిముషాలకి జరిగింది.

 

    సైన్సు చరిత్రలో బయటపడ్డ గొప్ప గొప్ప వాస్తవాలన్నీ ఎంత యాదృచ్చికంగా బయటపడ్డాయో ఈ సత్యంకూడా అంత యాదృచ్చికంగా బయటపడింది.

 

    ఆ రాత్రి రవూఫ్ తమని రెండో గదిలోకి తోసేసి మొదటి గది ఆక్రమించుకున్న సంఘటన తరువాత శేఖరం మామూలుగా పచార్లు చేస్తున్నా చాలాసేపటివరకూ భార్గవ మాత్రం తేరుకోలేకపోయాడు. ఏ క్షణాన్నయినా వాళ్ళు లోపలికి విరుచుకు పడవచ్చునని అందోళనగా తలుపు వేపుకు చూస్తూ గడిపాడు. అరగంట వరకూ బయటనుండి అలాంటి ప్రయత్నం తాలూకు సూచన ఏదీ కనబడక పోయేసరికి కొద్దిగా సర్దుకుని తన పని కుపక్రమించాడు.

 

    అప్పుడు గమనించాడు. పరికరాల మధ్యగా బుల్లెట్ వెళ్ళడంతో స్టీలు కవరున్న ఓజోన్ ట్యూబ్ స్థానభ్రంశం చెంది ఇంటర్నల్ ఛాంబరులో ఓజోన్ పొరకి రంధ్రం చేసిన సంగతి!

 

    ఎన్నడూ లేనంత నిస్సత్తువ అతడిని ఆ క్షణం ఆవరించింది. మూడు రోజులుగా చేస్తున్న ప్రయోగం అంతా వృధా అయిపోయినందుకు దుఃఖం కలిగింది. శేఖరం వేపు చూశాడు. తనకోసం అతడింత పట్టుదలతో నిలబడ్డాడు. తానేమో నిర్లక్ష్యంతో అసలేం జరుగుతుందీ చూసుకోలేదు. ఇప్పుడు దొరికినంత సమయం మళ్ళీ దొరకడం, మళ్ళీ ఈ ప్రయోగం మొదటినుండి కొనసాగించడం దాదాపు అసాధ్యం.

 

    ఇంతకాలం చేసింది వృధా అయిందన్నమాట! ఏమీ తోచనట్టూ దిగులుగా ఆ ఫ్లాస్కులవేపు చూస్తూ చాలాసేపు ఉండిపోయాడు. తరువాత చివరి ఫ్లాస్కు ఖాళీ చేయడానికి ఉపక్రమించాడు. భూమి చుట్టూ వున్న ఓజోన్ పొరని కృత్రిమంగా సృష్టించి, దానిగుండా ఆల్ట్రావయెలెట్ కిరణాల్ని పంపించాడు ఈ మూడు రోజులూ... ఆ కిరణాన్ని ఓజోన్ ఆపుతుంది. కాబట్టి... అలా పంపించటంవల్ల ఫలితమేమీ లేకపోయినా, అతడు ప్రయోగం ప్రారంభించి నప్పుడు ఆ ఒక్క ఛాన్సు కూడా తీసుకోవటం ఇష్టంలేక ఆ ఛాంబర్ కూడా తయారుచేశాడు. రవూఫ్ రివాల్వర్ తాలూకు బుల్లెట్ తగిలి, ట్యూబ్ కదిలి, రంధ్రం చేసింది ఈ పొరనే. దాంతో అతడు కృత్రిమంగా తయారుచేసిన అట్మాస్ఫియర్...2 పాడయింది.

 

    పాడయిపోయిన ఛాంబర్ ని ఖాళీచేసి, శుభ్రం చేద్దామనుకుంటూ మళ్ళీ ఎందుకో అందులో పదార్థాన్ని కూడా మిగతా వాటిలాగే పరిశీలిద్దామనుకున్నాడు. కొన్ని రసాయనాలతో కూడిన ఉప్పునీటితో ఆ కణాల్ని 'ట్రీట్' ముక్కలుగా కత్తిరించి వాటి ఫోటోలు తీసి చూసేడు.

 

    అతడి భృకుటి ముడిపడింది.

 

    ఫోటోగ్రాఫ్ లో సన్నటితీగెలు కనిపించాయి.

 

    తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు.

 

    తిరిగి మరికొన్ని కణాల్ని ఉప్పునీటిలో ట్రీట్ చేశాడు. వాటిని తిరిగి ఫోటో తీసి చూసాడు. ఆ తీగెలు తిరిగి కనిపించాయి.

 

    క్రోమోజోమ్స్!!

 

    అతడి చేతులు వణకసాగాయి. నుదుటిమీద చెమట పట్టింది. 'కారియోటైప్' ద్వారా లెక్కకడితే కాస్త అటూ యిటూగా వాటి లెక్క తెలుస్తుంది కానీ, అతడు ఆ లెక్క గురించి అంతగా పట్టించుకోలేదు.

 

    వణుకుతున్న చేతుల్తో అతడు ఎలక్ట్రానిక్ మైక్రోస్కోపును సరిచేశాడు. లోహపు వాయువుని పదార్థం మీదకు వెదజల్లడం వల్ల ఏర్పడే నీడల ఆధారంతో మిల్లీమీటర్ లో మిలియనో వంతు భాగాన్ని కూడా చూడగలిగే అత్యంత అధునాతనమైన పరికరం అది.

 

    రొట్టెని తరిగినట్టూ సన్నగా తరిగే మైక్రోటోమ్ లో దాన్ని స్టెయిన్ చేసి, దానిమీద్ క్రొమోటిన్ (రంగు) జల్లాడు.

 

    ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ క్రింద దాన్ని పెట్టి కెమేరా ఆన్ చేశాడు.

 

    ఆటోమాటిక్ కెమేరా ఫోటోలు తీయసాగింది. కొంచెంసేపట్లో ఫోటోలు బయటికి వచ్చాయి. అతడిలో క్షణక్షణానికి టెన్షన్ పెరిగిపోతూంది. ఒక్కొక్క ఫోటోనే లైటుక్రింద పెట్టి చూసేడు.

 

    సడెన్ గా అతడు వూపిరి బిగపట్టాడు.

 

    ఫోటో తరువాత ఫోటో.....

 

    ఆస్టర్ బాడీ రెండుగా విడిపోవటం క్రోమోజోమ్ లు దారాల్లా ఏర్పడడం.... అవి చెరోవైపుకీ చేరుకోవటం నె...మ్మ...ది.....గా ఆ కణం రెండుగా చీలిపోవటం- చీలిన ఆ రెండు కణాలచుట్టూ తిరిగి పరిపూర్ణమయిన పొర ఏర్పడటం...

 

    అప్పుడు అతడు ఆనందంతో పెట్టిన కేకకి గది గోడలు కదిలి పోయాయి.  

 

    అతడు చిన్నపిల్లాడిలా కేరింతలు కొట్టాలనుకున్నాడు. యువకుడిలా నాట్యం చెయ్యాలనుకున్నాడు. వయసు గుర్తొచ్చి గంభీరంగా వుండాలనుకున్నాడు. మూడిట్లో ఏ ఒక్కటీ చెయ్యలేకపోయాడు. చుట్టూ వున్న పరికరాల్తో ఆప్యాయంగా మాట్లాడాడు. వాటికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. సృష్టికి ప్రతిసృష్టి జరగటం చూసి బ్రహ్మదేవుణ్ణి ఈర్ష్య పడవద్దని కోరుకున్నాడు కదిలే గాలి తెమ్మరకీ, నిశ్చలమైన పాలవెన్నెలకీ తను సాధించిన విజయం గురించి చెప్పుకున్నాడు.

 

    అలౌకికమయిన ఆ స్థాయీ భావం నుంచి విడివడకుండానే అతడు శేఖరాన్ని చూసి, ఒక్క అంగలో వెళ్ళి అతడిని చేతుల్లోకి తీసుకున్నాడు. "నా యీ విజయానికి అసలు కారణం నువ్వు మిత్రుడా! నువ్వు!! ఆత్మహత్యకు సిద్ధపడిన ఒక జీవన్మృతుడని నీ మాటల్తోనూ చేతల్తోనూ ప్రభావితం చేసి, తిరిగి గమ్యంవేపు నడిపించావు. ఒక వర్షం కురిసిన సాయంత్రం జరిగిన మన పరిచయం యింత గొప్ప పరిణామానికి దారితీయటం నా అదృష్టం.... నీకెలా కృతజ్ఞతలు చెప్పుకోను?" అని అందామనుకున్నాడు. అనందంతో నోటమాట రాలేదు. కానీ శేఖరం ఆ స్పర్శలో తేడాని కనుక్కోగలిగాడు. విజయం సంగతి తెలిసిపోయింది. భార్గవ మొహాన్ని ఆప్యాయంగా తడిమాడు. కళ్ళదగ్గిర తడి తగిలి ఆగిపోయాడు. చెంపలమీదకు ధారాపాతంగా కారుతున్న కన్నీటిని తుడుస్తూ 'కంగ్రాట్స్' అందామనుకున్నాడు, అనలేకపోయాడు.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More