Home » Yandamuri veerendranath » Prarthana
ఆనందంతో మాటరాని మనిషీ, ఆనందాన్ని మాటల్లో చెప్పలేని మనిషీ.... మాటలకతీతమైన భావంతో అలాగే చాలాసేపు వుండిపోయారు.
ముందు తేరుకున్నది భార్గవే. చేసింది తక్కువ, చెయ్యవలసింది చాలా వుంది. ఓజోన్ ట్యూబ్ దగ్గిరగా వెళ్ళి పరీక్ష చేశాడు.
చప్పున అతడికో విషయం స్ఫురించింది.
ఓజోన్ కూడా కార్సినోజినే.
తనింతవరకూ మందుల కంపెనీనుండి వెలువడే విషవాయువునే ఈ ప్రయోగంలో వాడుతూ వచ్చాడు. దాని ద్వారా ఫలితం రావడానికి ఎంత ఆలస్యమై వుండేదో!.... అదృష్టం ఈ రూపంలోనే కాదు, ఇంకో విధంగా కూడా లభించింది. ఏ క్లిష్టమయిన లివింగ్ సెల్లో తయారవకుండా, నిశ్చితమయిన క్రోమోజోమ్స్ తో స్పష్టమయిన ఆకారం ఏర్పడటం నిజంగా అదృష్టం.
అతడు తన పనిని కొనసాగించాడు.
ఛాంబర్స్ అన్నిటినీ వాక్యూమ్-డ్రై-ఆఫ్ చేసి, వేర్వేరు వత్తిళ్ళలో, వేర్వేరు ఉష్ణోగ్రతల్లో వుంచి, కార్సినోజిన్ సరఫరా చేశాడు. సరిగ్గా రెండు గంటల తర్వాత అతడి ప్రయత్నం ఫలించింది. ఇరవై మూడు జతల క్రోమోజోమ్స్ వున్న పరిపూర్ణమైన కేన్సర్ సెల్ తయారైంది.
* * *
రాత్రి రెండింటికి రవూఫ్ మోటార్ సైకిల్ ఇన్ స్టిట్యూట్ మెయిన్ గేటుముందు ఆగింది. అక్కడినుండి శబ్దం చెయ్యకుండా లోపలికి తోసుకువచ్చాడు.
సరిగ్గా ఆ సమయానికి వస్తానని అతడు ముందే చెప్పడంవల్ల యస్సై ఎదురు చూస్తున్నాడు. దగ్గిరకు వచ్చి శాల్యూట్ చేశాడు.
"ఎలా వుంది పరిస్థితి?" హిందీలో అడిగాడు రవూఫ్.
"అలాగే వుంది సార్! ఇంకా ఎవరూ నిద్రపోలేదనుకుంటా"
రవూఫ్ విసుగ్గా లాబ్ వైపు చూశాడు. "ఇడియట్స్" అన్నాడు చిరాగ్గా. ఈ రాత్రితో అతడు ఈ పని పూర్తయిపోయిందనుకున్నాడు. కానీ చూస్తూంటే అది అంత దగ్గరలో వున్నట్లు కనబడడంలేదు. అంతలో అతడి దృష్టి దూరంగా లాబ్ దగ్గర నిలబడ్డ వసుమతిమీద పడింది.
"ఈ అర్థరాత్రిపూట ఈవిడ ఇక్కడెందుకుంది?" మొహం చిట్లిస్తూ అడిగాడు.
"ఎంత చెప్పినా వెళ్ళలేదుసార్! రాత్రంతా మెలకువగానే వుంది".
వసుమతి వున్న వేపు రవూఫ్ రెండడుగులు వేసి చప్పున ఆగిపోయాడు. అతడు ఎందుకు ఆగాడో తెలీక యస్సై కూడా అతడు చూస్తున్న వైపే దృష్టి సారించాడు. ఇద్దరి చూపూ శేఖరం వాళ్ళున్న గది పైభాగాన పడింది.
లోపలి దీపపు కాంతి వెంటిలేటర్లోంచి బయట పడుతోంది.
ఇద్దరూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
"ఇదున్నట్టు మనం ఇంతసేపూ గమనించక పోవడం దురదృష్టకరం" అని యస్సైవేపు తిరిగి "క్విక్..." అన్నాడు. అతడి ఉద్దేశ్యం అర్థం చేసుకున్నట్టు వేగంగా అక్కడినుండి కదిలాడు.
* * *
"నాదో చిన్న అనుమానం?"
"ఏవిఁటి?"
"మామూలు కణానికీ, కేన్సర్ కణానికీ తేడా లేదని అంటారు- అటువంటప్పుడు అది మామూలు జీవకణమే అయివుండొచ్చుగా! మీరంత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు?"
భార్గవ, శేఖరంవైపు మెచ్చుకోలుగా చూశాడు. ఏదో మొక్కుబడికి కాకుండా తనతోపాటు ప్రతివిషయంలోనూ అతడు పాలు పంచుకోవడం చాలా ఉత్సాహంగా వుంది. ఈ పరిస్థితుల్లో కావలసింది అదే! భార్గవ చెప్పాడు.
"నా వూహ నిజమైతే ఈ 'ప్యూర్' కేన్సర్ కణం చాలా శక్తివంతమైందే అయి వుండాలి. ఇది ఒక ఆరోగ్యవంతమైన శరీరంలోకి ప్రవేశపెడితే- అక్కడ యాంటిజెన్ గా పనిచేసి అనూహ్యమైన వేగంతో వ్యాప్తి చెందుతుంది. అప్పుడా శరీరంలోంచి ఇంటర్ ఫెరాన్ ని తీసి రోగికి ఎక్కించి యుధ్ధానికి ఆయత్తం చెయ్యటమే కేన్సర్ కి మందు. ఈ రకమైన యాంటీబాడీస్ ని సృష్టించటమే ఇన్నాళ్ళూ నేను కలలుగన్న ఇమ్యూనోథెరపీ.
ఇదంతా అర్థం చేసుకోడానికా అన్నట్టు శేఖరం కాసేపు మౌనంగా వుండి తర్వాత అడిగేడు- "మనం ఇప్పుడు ఈ కేన్సర్ కణాల్ని ఏ శరీరంలో ప్రవేశపెడతాం?"
"దాందేముంది? చాలా సులభం. మన లాబ్ లో వున్న ఏ కుందేల్లోనైనా..." వ్రాయబోతూ సగంలో ఆపుచేసాడు భార్గవ. అతడి మొహం వాడిపోయింది. ప్రక్కగది తమ అధీనంలో లేదు, అందులోనే ప్రయోగానికి కావలసిన జంతువులున్నాయి. తనలో తనే గొణుక్కుంటున్నట్టు 'ఎలా?... ఎలా?...' అనుకున్నాడు. అతడు మౌనంగా వుండటం చూసి శేఖరం "ఏం జరిగింది" అని అడిగాడు.
భార్గవ అతడికి తనకు వచ్చిన క్రొత్త సమస్య గురించి చెప్పాడు.
ప్రతీదానికీ చాలా సులభంగా పరిష్కారమార్గం చెప్పే శేఖరం కూడా ఏం చెయ్యాలో తోచనట్టు ఆలోచనలో పడ్డాడు. అంతలో ఏదో స్ఫురించినట్టు "పోనీ మనం బైటకి వెళ్తే? మీరు సాధించిన విజయం తక్కువదేమీకాదు. ప్రపంచం మీకు జోహార్లర్పిస్తుంది. మిగతా ప్రయోగం బయటే చేసుకోవచ్చు" అని వివరించాడు.
"ప్రపంచం జోహార్లర్పించటానికి కాదు శేఖరం నేనిదంతా చేసింది. వేరే శరీరంలో యాంటీజెన్ ని ప్రభావితంచేసి దాన్ని ప్రార్థన శరీరంలోకి ఎక్కించాలి. నా కూతురు ఎలాగూ చచ్చిపోతుందన్న నిర్ణయానికి వచ్చి తనమీద ఈ ప్రయోగం చేయదల్చుకున్నాను. ఈ వాక్సిడేషన్ నాలుగు గోడలమధ్య జరగాల్సిందే శేఖరం! మందు తాలూకు ప్రభావం సరిగ్గా తెలియనిదే దాన్ని మనిషిమీద ప్రయోగిస్తానంటే బైట ప్రపంచం దానికి ఒప్పుకోదు. ఎలా? ఎలా?"
దూరంగా మూడుకొట్టింది. బైట ప్రకృతి అంతా ఆ చీకట్లో విశ్రమిస్తోంది. ఆశా నిరాశల మధ్య వూగుతూ ఆ ఇద్దరూ ఏం చెయ్యాలో పాలుపోక నిశ్చలంగా కూర్చుని వున్నారు. బైటనుండి పడుతున్న మసక వెలుతురు, చీకటితో పోరాడి ఓడిపోయి నేలమీద నల్లగా పరుచుకుంది. విజయం చేతివరకూ వచ్చి జారిపోయింది.
వాళ్ళలాగే కూర్చుని వున్నారు. స్థాణువుల్లా.... స్తబ్దంగా...
* * *
బయట ప్రకృతి కూడా అలాగే నిశ్శబ్దంగా వుంది. అంతే నిశ్శబ్దంగా ఇద్దరు పోలీసులు ఒక నిచ్చెనని తీసుకుని వెంటిలేటర్ వేపు వెళుతున్నారు. రవూఫ్ దూరంగా వుండి పర్యవేక్షణ చేస్తున్నాడు.
లోపల వాళ్ళకి ఏ మాత్రం శబ్దం వినపడకుండా వెంటిలేటర్ కిందుగా నిచ్చెన అమర్చబడింది. యస్సై నెమ్మదిగా పైకెక్కిలోపలికి తొంగిచూసాడు. తర్వాత కిందికి దిగి రవూఫ్ దగ్గరికి వచ్చాడు.
రవూఫ్ అతడివైపు ప్రశ్నార్థకంగా చూశాడు. యస్సై హుషారుగా "ఇంతకాలం మన దృష్టికి రాకపోవడం వాళ్ళ అదృష్టం సార్. లోపల అంతా స్పష్టంగా కనబడుతోంది. వాళ్ళిద్దరూ ఆ పాప పడుకున్న దగ్గిర వున్నారు" అన్నాడు. రవూఫ్ ఆనందంతో సన్నగా విజిల్ వేసాడు.



