Home » Yandamuri veerendranath » Prarthana


    "ఏం ఉపయోగ పడటమో! ఇలా నిద్రలేకుండా అనుక్షణం టెన్షన్ తో మనం ఏం సాధించగలం? ప్రార్థనని తిరిగి ఆస్పత్రికే అప్పజెపుదామా?"

 

    "వద్దు వద్దు. ఇంతవరకూ వచ్చాక దీని అంతేమిటో చూడవలసిందే. ఈ రాత్రి నేను నిద్రపోను. నా కంఠంలో ప్రాణం వుండగా వాళ్ళు మనల్ని ప్రయోగశాలనుండి ఖాళీ చేయించలేరు".

 


    "కానీ ఎంతకాలం?"

 

    "విధి మనల్ని పూర్తిగా ఓడించేవరకు లేదా సృష్టిని మనం గెలిచే వరకూ. ఏది ముందు జరిగితే అది".

 

    దూరంగా ఎక్కడో ఎనిమిది గంటలు కొట్టింది.

 

                                       *    *    *

 

    ఆందోళనగా చేతి గడియారంవైపు చూసుకుంది ప్రియ.

 

    ఎనిమిదయింది. బాగా చీకటి పడింది. డి.ఐ.జి. ఇంటిదగ్గర విజిటర్స్ రూమ్ లో కూర్చొని ఉందామె. దాదాపు మూడు గంటల నుండి వేచి వుంది.

 

    రెండురోజుల నుంచీ ఆమె తిరుగుతూనే వుంది. ఇన్ స్టిట్యూట్ కి ఆహారం తీసుకువెళ్ళే ప్రయత్నం విఫలమయిన తర్వాత ఆమె మరి అక్కడ ఉండలేదు. అక్కడ పోలీసులతోపాటూ తనూ ఓ ప్రేక్షకురాలిలా నిలబడి చూడటమే కానీ మరేమీ సాధించలేనని ఆమెకు తెలుసు. టైమ్ వేస్టు తప్ప మరేమీ కాదు. ఈ ఆలోచనతో ఆమె మరి ఇన్ స్టిట్యూట్ వైపు మరోసారి వెళ్ళలేదు. సమస్యని ఇంకొకవైపు నుండి నరుక్కురావడానికి ప్రయత్నించింది. ముందు పై అధికారి అయిన డి.యస్.పి. దగ్గరికి వెళ్ళింది.

 

    డియస్పీ వెకిలిగా మాట్లాడిన తర్వాత ఆ రోజు మధ్యాహ్నమే ఆమె యస్పీ దగ్గిరకు వెళ్ళింది. యస్పీ, డియస్పీకి పూర్తి వ్యతిరేకం. మంచి వాడే! కానీ రూల్స్ ని పూర్తిగా ఒంటబట్టించుకున్నవాడు "అవును నిజమే" అన్నది అతని ఊతపదం.

 

    "అవున్నిజమే!! ఆ అమ్మాయి అతని సొంత కూతురే!! కానీ తల్లిని కాదని కూతుర్ని తీసుకుపోవడం నేరం కదా!"

 

    "కానీ ఆవిడ సవిత తల్లండీ!!"

 

    "అవున్నిజమే! కాని కోర్టు ఆర్డరుంది కదా!"

 

    "పోనీ అ తల్లి దగ్గరనుండి తన కభ్యంతరం లేదని లిఖిత పూర్వకంగా తెప్పిస్తే...."

 

    "అవున్నిజమే! తెప్పిస్తారు. కానీ మోహన్ లాల్ కపాడియా ఇన్ స్టిట్యూట్ పబ్లిక్ యూరినల్స్ కాదుకదా, లోపలికెళ్ళి తలుపేసుకోవడానికి!"

 

    ఆమె కోపాన్ని అణుచుకుని "అవున్నిజమే" అని విరక్తిగా అనేసి అక్కడనుండి లేచి వచ్చేసింది.

 

    అక్కడనుండి ఆమె సరాసరి పత్రికాఫీసుకి వెళ్ళింది. మంచి సర్క్యులేషన్ ఉన్న ఇంగ్లీషు దినపత్రిక అది. నేరుగా వెళ్ళి ఎడిటర్ ని కలుసుకుంది. ఆ ఎడిటర్ నేషనలిస్టు భావాలున్నవాడు. ఆమె చెప్పినదంతా విన్నాడు. లోలోపలే చాలా ఆశ్చర్యపోయాడు. అసలు కథ ఇదన్నమాట.... తమకి ఇప్పటివరకూ వచ్చిన వార్త వేరు! "ఒక తండ్రి తన కూతురికి, ఆస్పత్రి మందులు ఇవ్వడం ఇష్టంలేక, దూరంగా తీసుకెళ్ళి పోయి, ఆ పిల్ల మరణంకోసం ఎదురు చూస్తున్నాడు"..... ఇదే తనకి తెలిసింది. వెనుకున్న సత్యం తెలీదు.

 

    ముఖ్యంగా 'కాన్స్-క్యూర్' సంగతి!

 

    దాన్ని భార్గవ ఎదిరించిన సంగతి!!

 

    అతడు రాజీనామా ఇవ్వవలసి వచ్చిన పరిస్థితుల సంగతి!!!

 

    ఆ రోజు ప్రొద్దున్న శేఖరమూ, తనూ కలిసి లాబ్ కి వెళ్ళినపుడు భార్గవ బ్రెయిలీలో అన్ని విషయాలూ శేఖరానికి వివరించి చెపుతూ వ్రాసిన కాగితాన్ని ఎడిటర్ ముందుకు తోసింది ఆమె. దాంట్లో వివరాలన్నీ వున్నాయి- మొత్తం కథంతా.

 

    దాని ఇంగ్లీషు తర్జుమాని చదువుతూ ఎడిటర్ మొహంలో రంగులు మారసాగాయి. చదవటం పూర్తిచేసి చాలాసేపు కళ్ళు మూసుకుని అలాగే వుండిపోయాడు.

 

    మనసులోనే ఆమె చెప్పిన వివరాలన్నీ సమీక్షించుకున్నాడు. ఆమె చెప్పేదేగాని ఏమాత్రం నిజమైనా, ఈ వార్త పార్లమెంటుని పునాదుల్తో సహా కదిలించి వేస్తుంది.

 

    అంతేకాదు! ఒక నిస్సహాయుడయిన సైంటిస్టు ఈ కాపిటలిస్టుల చేతిలో ఎలా నాశనమైపోయిందీ మొత్తం దేశానికీ తెలుస్తుంది. పత్రిక ఎడిటర్ గా పుట్టినందుకు కనీసం కప్పబడిపోతున్న ఒక నిజాన్ని వెలికి తీసిన సంతృప్తి అయినా తనకి మిగుల్తుంది.

 

    .... కానీ అతడు వెంటనే నిర్ణయానికి రాలేదు. పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసేడు. పత్రిక ఎడిటర్ తల్చుకుంటే ఇలాంటి వివరాలు బయట పడటం ఎంతసేపు! కొన్ని రోజుల క్రితం భార్గవని ఒక రాత్రి అంతా లాకప్ లో పెట్టారనీ, మరుసటిరోజు ప్రొద్దున్నే శంకర్ లాల్ వచ్చి అతడిని విడిపించాడనీ తెలిసింది. దానికన్నా ముఖ్యమైన వార్త ఏమిటంటే- ఆ రోజే భార్గవ తన పదవికి రాజీనామా ఇచ్చాడు. అతడు మరి ఆలస్యం చేయలేదు. ఒక విలేఖరిని పిలిచి ఆ అమ్మాయితో వెంటనే ఇంటర్వ్యూ తీసుకోమన్నాడు. మరుసటిరోజు ప్రొద్దున్నే పేపర్లో ఈ ఇంటర్వ్యూ కావాలనీ, నలుగు కాలమ్స్ లో వచ్చేలా మొత్తం వివరాలన్నీ తీసుకొమ్మనీ చెప్పాడు. ఇందులో కాస్త రిస్కు వుందని తెలుసు. కానీ కొడితే కుంభస్థలం కొట్టాలి!  

 

    ఆమెకు అక్కడ పని పూర్తయ్యేసరికి సాయంత్రమయింది. విలేఖరికి తనకి తెలిసిన విషయాలన్నీ చెప్పింది.... తను లాబ్ లో ప్రార్థనని చూడటం, ఆమె చేతికి ఐ.వి. ఫ్లూయిడ్స్ వుండటం వివరించింది. కూతుర్ని భార్గవ తీసుకెళ్ళింది సహజ మరణంకోసం కాదనీ, తనకు చేతనయిన రీతిలో ఇమ్యూనోథెరపీ కోసమనీ చెప్పింది. నిజంగా భార్గవకి అందరూ అనుకునే ఉద్దేశ్యమే ఉంటే లాబ్ వరకూ వెళ్ళాల్సిన అవసరమే లేదనీ.... వేరే ఇంకెవరికీ తెలియని చోటే దాక్కోవచ్చనీ తన అభిప్రాయంగా చెప్పింది. ఈ పాయింటులో విలేఖరికి లాజిక్ దొరికింది. దాన్ని హెడ్డింగ్ గా పెట్టదల్చుకున్నాడు.

 

    ఇంటర్వ్యూ ఇచ్చిందన్న మాటేగానీ దీనివల్ల ఎంతవరకూ ఫలితం వుంటుందో ఆమెకే తెలీదు. ఇక్కడ లాబ్ లో వున్నవాళ్ళకి నిద్రాహారాలు లేక క్షణమో యుగంగా గడుస్తూ వుందన్న విషయం ఆమె మర్చిపోలేదు. ఇన్ స్పెక్టర్ రవూఫ్ ప్రమాదం అనే రూపంలో పక్కనే ఏ క్షణమైనా కాటు వేస్తాడని ఆమెకి గుర్తుంది.

 

    అందుకే ఆమె ఇంటర్వ్యూ పూర్తవగానే మళ్ళీ తన పనిలో పడింది. ఈసారి ఇంకా పై అధికారిని కలుసుకోడానికి ప్రయత్నించింది. అతడే డి.ఐ.జి.

 

    ఆమె వయసులో చాలా చిన్నది. లోకజ్ఞానం కూడా అంతగా లేదుకానీ లేత అరచేతులతోనే మినుక్కు మినుక్కుమంటూ కొడిగట్టబోతున్న ఒక చిన్న దీపాన్ని కాపాడటానికి శక్తివంచన లేకుండా ఆ అమ్మాయి చేస్తూన్న ప్రయత్నం మాత్రం గొప్పది.    

 

    పలుకుబడి లేక, సహాయంచేసే ఆప్తులులేక ఒంటరిగా కేవలం పట్టుదలా, నమ్మినదానిపట్ల నిజాయితీ- ఈ రెంటి సాయంతోనే ఆమె ఇంత సాహసాన్ని చేపట్టలేకపోయేదేమో కాని కొన్ని కొన్ని పరిచయాలు ఆమెకి తెలియకుండానే అంతర్లీనంగా మనకి కావలసిన స్ఫూర్తినీ, జీవితం పట్ల కమేండ్ నీ కలిగిస్తాయి. శేఖరంతో పరిచయం కొన్నాళ్ళదే అయినా, ఆమెకి అలాటి ఉద్దీపనని కలిగించింది అది.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More