Home » Yandamuri veerendranath » Prarthana
వసుమతికి ఈ ఆలోచన బాగానే ఉందనిపించింది. ఒక్కసారి తను 'పాపని ఇంటికి తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఈ ఆలోచనతో ఆమె కిటికీ దగ్గరికి వెళ్ళింది. అయితే ఆమె తనతోపాటు చీకటిలో చాటుగా వస్తున్న రవూఫ్ ని చూసుకోలేదు.
ఆమె కిటికీ దగ్గర నిలబడి లోపలికి తొంగిచూసింది. శేఖరం అక్కడే పచార్లు చేస్తున్నా ఆమె ఉనికి అతడికి తెలియలేదు. ఆమె మాత్రం అతడ్ని చూసి ఆశ్చర్యంగా ఆ రెండో మనిషి "నువ్వా శేఖరం" అంది. ఆ మాటలు వినబడని శేఖరం మామూలుగానే తిరగసాగాడు. కానీ లోపల భార్గవ, వసుమతి కంఠాన్ని గుర్తుపట్టి ఛాంబర్ దగ్గరిగా వచ్చి "నువ్వా!" అనబోయాడు.
కాని ఈ లోపులోనే ఓ అనూహ్యమైన సంఘటన జరిగింది.
వసుమతితోపాటే దూరం నుండి చాటుగా వస్తూన్న రవూఫ్, భార్గవ కూడా కిటికీ వున్న ఛాంబర్ దగ్గరికి వచ్చాడనీ, లోపలున్న యిద్దరు వ్యక్తులూ బయట ఛాంబర్ దగ్గరే వున్నారు అని నిర్థారణ చేసుకోగానే గాలిలోకి రివాల్వర్ పేల్చాడు. అదే సంకేతంగా లాబ్ కి అవతల వున్న తలుపు దగ్గర పొంచివున్న యస్సై, తలుపు గడియ వున్నచోట రివాల్వర్ పెట్టి రెండు షాట్లు వరసగా పేల్చి గడియ ఊడిపడగానే ఒక్క ఊపులో తలుపు తోసుకుని లోపలికి ప్రవేశించాడు.
బయటనుండి ఒకసారి వెంటనే దూరంగా వెనుకనుండి రెండుసార్లు వరుసగా రివాల్వర్ ధ్వనులు వినబడగానే భార్గవ స్థాణువయ్యాడు. క్షణంపాటూ ఏం జరుగుతుందో అర్థంకాలేదు. ఏం చెయ్యాలో తోచలేదు. కానీ అది క్షణంసేపే. కలలోంచి హఠాత్తుగా మెలకువ వచ్చినవాడిలా శేఖరం చెయ్యి పట్టుకొని "క్విక్!" అని బిగ్గరగా అరుస్తూ లోపలికి పరుగు తీశాడు.
శేఖరానికి సంబంధించినంతవరకూ వసుమతి రాకగాని, రివాల్వర్ చప్పుళ్ళుగానీ ఏమీ తెలీదు. ఒక చెయ్యివచ్చి అతణ్ని లోపలికి లాక్కెళుతూంది. ఏదో జరిగిందని అతడు గ్రహించి, అతడు పరుగు వేగం పెంచాడు. విరిగిన తలుపుగుండా లోపలికి ప్రవేశించిన యస్సై వరండాలోంచి పరుగెత్తుకువచ్చి లోపలగది దగ్గరకు చేరుకునే లోపులో ముందు గదిలోంచి వాళ్ళిద్దరూ లోపలికి ప్రవేశించి తలుపు వేసేసుకున్నారు. ఇదంతా కనురెప్పపాటులో జరిగిపోయింది.
లోపల్నుంచి జేవురించిన మొహంతో భార్గవ బిగ్గరగా అరిచాడు. "మీరింకోసారి ఏ మాత్రం ఇలాంటి ప్రయత్నాలు చేసినా ఈ లాబ్ బ్రద్దలు కొట్టేస్తాను- జాగ్రత్త" అతడి మాటలు ఆ ఆవరణలో ప్రతిధ్వనించాయి. నిశ్శబ్దమే జవాబయింది. యస్సై, రవూఫ్ దగ్గరకొచ్చాడు.
"నేను కొంచెం వేగంగా పరుగెత్తి వుంటే వాళ్ళకన్నా ముందే ఆ బాంబుల దగ్గరకు వెళ్ళి వుండేవాడిని సార్" విచారంగా అన్నాడు యస్సై, రవూఫ్ జరిగినదాన్ని చూసి విచారపడలేదు. సంతోషంగా యస్సైవేపు చూస్తూ "ఫరవాలేదు. వాళ్ళ రాజ్యంలోనికి ప్రవేశించాం. ఇంక మనకీ వాళ్ళకీ ఒక్క గోడా, ఒక్క తలుపే అడ్డు! అలాంటి ఆలోచననే ఇంకొకటి తట్టిందంటే ఈ సంవత్సరపు పోలీసు అవార్డులు మనిద్దరికీ తప్పవు" అన్నాడు.
వసుమతి ఇంకా షాక్ నుంచి తేరుకోలేదు. శిఖండిలాగా తనను అడ్డు పెట్టుకుని ఈ ఇన్ స్పెక్టర్ ఈ ఎత్తు వేస్తాడని ఆమె కలలో కూడా అనుకోలేదు. అయినా అదికాదు ఆమె ఆలోచిస్తున్నది.
భార్గవ గురించి....
"ఏమనుకుని వుంటాడు తన భర్త తన గురించి? ఈ పోలీసుల్ని దగ్గరగా తీసుకువచ్చింది తనే అనుకోడూ? ఈ ఆలోచన తనదే అనుకుని మరింత అసహ్యం పెంచుకోడూ! 'భగవంతుడా! మా భార్యాభర్తల మధ్య యింకా ఎన్ని అనర్థాలు సృష్టిస్తే నీకు తృప్తి కలుగుతుందయ్యా' అనుకుంది.
చిత్తరువులా నిలబడిపోయిన వసుమతిని ఓరగా చూశాడు రవూఫ్. ఆమె ఇంకా షాక్ నుండి బయటికి రాలేదని గ్రహించి - మొహంనిండా నవ్వు పులుముకుని దగ్గరికి వచ్చాడు.
"మీకిదంతా కొత్తగా వుండి వుండవచ్చు మేడమ్! కానీ మాకు అలవాటే! లోపల వారి బారినుండి మీ పాపను కాపాడటమే మా లక్ష్యం" అన్నాడు.
ఆమె అయోమయంగా అతనివేపు చూస్తూ "వాళ్ళు బారినుండి కాపాడట మేమిటి? వాళ్ళెవరనుకున్నారు? ప్రార్థనను ప్రాణంకన్నా ఎక్కువగా ప్రేమించే ఆయనా తన కూతురికి హాని చేసేది? లేక మాతో ఒకడిగా కలిసిపోయిన శేఖరమా?" కోపమూ, ఉక్రోషమూ కలిసిన కంఠంతో అంది.
"భార్గవతో వున్న ఆ రెండవ వ్యక్తి శేఖరమా మేడమ్?"
"అవును. శేఖరమని.... పాపం అతడికి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు. అతడేం అపకారం చేస్తాడు?" అంది, భార్గవతో వున్న శేఖరమే అని ఆమెకు ఎందుకో అనిపించింది.
ఒక్కసారిగా రవూఫ్ ముఖం ఆనందంతో వెలిగింది.
"వ్హాట్!" అని అరిచాడు.
"అవును... ఇన్ స్పె..." చెప్పబోతున్న వసుమతి ఏదో అర్థం అయినట్టూ చప్పున ఆగిపోయింది. రక్తం ఇంకినట్టూ మొహం తెల్లబడింది. కానీ ఆపాటికే రవూఫ్ కి కావలసిన పాయింట్ దొరికిపోయింది.
ఇన్ స్పెక్టర్ రవూఫ్ ఆలోచనలు మిషన్ కన్నా వేగంగా కదులుతున్నాయి. లోపల యిద్దరు పరిపూర్ణమైన వ్యక్తులు ఉన్నారనుకొని ఇన్ని రోజులూ తటపటాయించాడు. ఇప్పుడు శేఖరం కాపలా వున్నా- అతడ్ని పట్టించుకోనక్కరలేదు. భార్గవ నిద్రపోతున్న సమయంలో మరొక్కసారి ఆ రెండోగది తలుపుల్ని కూడ షూట్ చేస్తే భార్గవ నిద్రలేచి బాంబులు వున్నచోటుకి వెళ్ళేలోపులో అతడ్ని చుట్టుముట్టవచ్చు. ఈ విషయాలేవీ శేఖరానికి తెలిసే అవకాశం లేదు.
అతడు తనకొచ్చిన ఆలోచనని యస్సైకి చెప్పాడు.
యస్సై- "ఇంకెంతసేపు సర్? ఉన్నది ఒకడే అయితే వాడెంత సేపు మెలకువగా వుండగలడు? ఈ రాత్రే మన పని పూర్తవుతుంది" అన్నాడు ధీమాగా.
"ఈ జరిగిన హడావుడికి భార్గవ అప్పుడే నిద్రపోతాడనుకోను. ఇంకో రెండుగంటలు వేచి వుందాం. ఆ రెండవవాడి నీడ మనకి పరిచయమేగా! వాడొచ్చినప్పుడు చెప్పు. ఈ లోపులో నేను వెళ్ళి ముందు గది మనం ఆక్రమించుకున్నామన్న మెసేజ్ డియస్పీగారికి పంపించి వస్తాను" అన్నాడు. ఇంత సంభాషణ జరుగుతున్నా వసుమతి కదలలేదు. అసలామె ఈ మాటలన్నీ విన్నదో లేదో కూడా అనుమానమే. తాను నోరు జారి చెప్పిన విషయం ఇంత ప్రమాదానికి దారి తీస్తుందని ఆమె ఊహించలేదు.
ఈ లోపల భార్గవ జరిగిన సంఘటన కలిగించిన అలజడి నుండి తేరుకున్నాడు. ఏం జరిగిందని ఆందోళనగా అడుగుతున్న శేఖరానికి వివరాలన్నీ చెప్పాడు. "అదృష్టవశాత్తూ ఎక్స్ ప్లోజివ్స్ లోపల గదిలో వుంచుకున్నాం కాబట్టి సరిపోయింది..."
"వెనక తలుపు గడియ షూట్ చేసి లోపలికి రావచ్చు కదా?" అడిగాడు శేఖరం.
"మన దగ్గర వున్న ఎక్స్ ప్లోజివ్స్ ని చూసి భయపడి వుంటారు".
"దేవుడి విగ్రహాన్ని బ్రద్దలు కొట్టడానికి తీసుకున్న ఎక్స్ ప్లోజివ్స్ మనకీ విధంగా ఉపయోగపడ్డాయన్నమాట?"



