Home » Yandamuri veerendranath » Prarthana
చివరికి అతడు పూర్తి వివరాలు చెప్పేటట్లూ, ఫోటోలు మాత్రం దూరం నుండి తీసుకునేటట్లూ ఒప్పందం కుదిరింది.
అతడు విలేఖర్లకి ఈ విధంగా స్టేట్ మెంట్ ఇచ్చాడు.
"కాన్సర్ ని నయంచేసే విధానాలమీద నమ్మకం లేని ఒక తండ్రి ఆసుపత్రి నుండి సొంత కూతుర్ని అపహరించుకుపోయి మందులివ్వకుండా చంపెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నాడు. పాపని రక్షించడానికి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలన్నీ విఫలమౌతున్నాయి. ఆ కన్న తల్లి దుఃఖానికయితే అంతేలేదు".
సాయంత్రం ఎడిషన్ లో వచ్చిన ఈ వార్త చూసి శంకర్ లాల్ ఆనందంతో నవ్వుకున్నాడు. తను అనుకున్నది అక్షరాల జరుగుతూంది.
దీనితో భార్గవ మరణించినా ఎవరి సానుభూతి ఉండదు. కానీ ఇంత ఆనందంలోనూ అతడికో మూల కంగారుగానే వుంది. ఇంత జరిగిన తర్వాత భార్గవకి ఏ మాత్రం విజయం లభించినా అది చంపాలాల్ కీ, నాయుడుకే కాకుండా తనకీ ప్రమాదకరమే. అందుకే రవూఫ్ ని తొందర పెడుతున్నాడు.
లోపల భార్గవ ఖాళీగా లేడని అతడొక్కడికే తెలుసు.
లోక కళ్యాణం కోసం, సర్వజనావళి కోసం ఒక పనిని చెయ్యతలపెట్టినా, దానిని నాశనం చెయ్యాలని ప్రయత్నించేవాడు పూర్వం కోటి కొక్కడుండేవాడు. ఇప్పుడు నూటికొక్కడున్నాడు.
... పేపర్లో వచ్చిన ఈ వార్త చూసి వసుమతి తల్లడిల్లిపోయింది. ప్రార్థనకి భార్గవ కంటే తానెక్కువ కాదనీ, తన భర్త అభిప్రాయాల్ని తనెప్పుడూ గౌరవిస్తుందనీ ప్రతి ఒక్కరికీ చెప్పాలని ఆమె మనసు ఆరాటపడింది. కానీ ఆమె మాట వినేదెవరు?
ఆమె మళ్ళీ ఇన్ స్టిట్యూట్ కి బయలుదేరింది. అంతకుముందు ఫోన్ లో విషయం తెలుసుకున్న వెంటనే ఆమె అక్కడికి ఒకసారి వెళ్ళింది గానీ- లోపలికి వెళ్ళడానికి అనుమతి దొరకలేదు... నిద్రలేమితో మొహం పీక్కుపోయి, తైల సంస్కారం లేని చింపిరి జుట్టుతో ఉన్న ఆమెను చూసి ఆమె చెప్పేది వాచ్ మెన్ కూడా వినలేదు.
కొంచెం సర్దుకొని ఆమె ఈ రోజు తిరిగి అక్కడకు బయలు దేరింది. ఆమె ప్రార్థన తల్లి అని తెలియగానే విలేఖరులు చుట్టుముట్టారు. "మీకూ మీ భర్తకి ఏమైనా పొరపొచ్చాలున్నాయా?"... "భార్గవకీ, ప్రార్థనకీ మధ్య సంబంధాలు ఎలా వుండేవి?".. "మీరు కోర్టుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది?".... వగైరా ప్రశ్నలకి సమాధానాలు చెప్పుకుంటూ ఆమె రవూఫ్ ని చేరుకుంది. అదే సమయాన రవూఫ్ మైకులో అనౌన్స్ చేస్తున్నాడు.
"మిస్టర్ భార్గవా! ఎంతోకాలం మీరలా లోపల ఉండలేరు. వెంటనే బయటకి రావడం మీకు శ్రేయస్కరం. అయిదు నిముషాలు టైమ్ ఇస్తున్నాను. ఈ లోపల బయటకి రాకపోతే లోపలికి స్మోక్ బాంబ్స్ విసరవలసి వుంటుంది..."
బిగ్గరగా వినిపిస్తున్న ఈ మాటల్ని విని వుంటే భార్గవ ఏం చేసి ఉండేవాడో కానీ తన ప్రయోగంలో నిమగ్నమైన అతనికి బయట కలకలం ఏదీ వినబడటంలేదు. శేఖరం సంగతి సరేసరి! పరిశీలనగా గమనిస్తే శేఖరం మొహంలో అలసట కన్పిస్తుంది. నాయుడు ఇంట్లో గడిపిన రాత్రినుంచీ అతడికి కంటిమీద అసలు కునుకులేదు. ముప్పైఆరు గంటలకు పైగా ఆహారం లేదు. ఇంకా ఎంతసేపు వుండాలో తెలీదు. తేల్చేది ప్రార్థనే.... ప్రయోగం ఫలించని పక్షంలో ఆ పాప మరణమే దీనికి ముగింపు చెప్పాలి.
ఆమె వజీనానుంచి హెమరేజ్ మొదలయింది. పెదాలు బాగా నల్లబడ్డాయి. కన్ వల్షన్స్ ప్రారంభం అయ్యాయి.
ఈ లోపులో బయట జన ప్రవాహం ఎక్కువయింది. పేపర్లలో వార్త చదివి అది ఏదో తిరనాళ్ళులాగా జనం అక్కడికి చేరుకోసాగారు. పోలీసులకి వాళ్ళని అదుపు చెయ్యడం కష్టం అయింది. అది లా అండ్ ఆర్డర్ సమస్య అయి కూర్చుంది. కన్నకూతుర్ని హత్యచేస్తున్న కిరాతకుణ్ణి, అతణ్ణి బంధించకుండా చూస్తూ ఊరుకున్న పోలీసులనీ దుయ్యబడుతూ అక్కడికక్కడే ఒక ఛోటా ప్రజానాయకుడు స్పీచ్ యిచ్చాడు. ప్రజల్లో ఉద్రిక్తత కట్టలు తెంచుకుంది. రోడ్డు ప్రక్కన ఉన్న కంకర రాళ్ళను లోపలికి విసరసాగారు. చిన్నసైజు లాఠీచార్జీ జరిగింది. గుంపు చెల్లాచెదరయింది. ఇదంతా చూసి వసుమతి భీతావహురాలయింది.
అసలిదంతా ఎందుకు జరుగుతుందో, తన భర్త ఇంత మూర్ఖముగా కూతుర్ని తీసుకుని అలా తలుపులు బంధించు కోవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందో, పైగా బాంబులతో ఎందుకు బెదిరించవలసి వచ్చిందో ఆమెకి అర్థంకాలేదు. ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ ఇష్టంలేకపోతే ఇంటికి తీసుకు వచ్చెయ్యొచ్చు. కోర్టు ఆర్డరుపట్ల కోపం వచ్చివుంటే ఆ విషయం తనతో ఒక్కమాట చెప్పవచ్చు. తను మాత్రం కాదంటుందా? ఎందుకింత కమ్యూనికేషన్ గాప్? ఎందుకు పరిస్థితులు ఇంత తీవ్రతరమయ్యేవరకూ లాక్కొచ్చాడు?
ఆమె ఆలోచనల్లో వుండగా లాఠీచార్జీ ప్రారంభం అయింది. రాళ్ళు విసిరే జనాన్ని పోలీసులు చెల్లా చెదురు చేయసాగారు. లాఠీచార్జీ జరిగిన తరువాత అక్కడ జనం కొద్దిగా తగ్గారు. రవూఫ్ భోజనానికి ఇంటికి వెళ్ళిపోయాడు. సాయంత్రంఅరకూ అక్కడ నిలబడ్డ జనం కూడా ఇటు పోలీసులు ఎంతసేపటికీ ఏమీ చెయ్యలేక పోవటంతోనూ, అటు లోపలినుండి ఏ అలికిడీ వినబడక పోవటంతోనూ అసంతృప్తులై అక్కడినుండి చెదిరిపోసాగారు. రోడ్డుమీద ఆక్సిడెంట్ అవగానే గొప్ప ఆసక్తితో ఆగి ఎవరికీ గాయాలు తగల్లేదని తెలిసి కదిలిపోయేటప్పుడు కలిగే అసంతృప్తి లాంటిది అది.
..........
మరో మూడు గంటలు గడిచాయి.
ఆకలిని పళ్ళ బిగువున అదిమిపెట్టి పైకి మామూలుగా కనబడడానికి ప్రయత్నిస్తున్నారిద్దరూ. నడుస్తున్న శేఖరం గోడ దగ్గిరకి చేరుకుని నిముషంపాటూ దానికి ఆనుకుని సేద తీర్చుకుని తిరిగి వెనక్కి పచార్లు చెయ్యవలసి వస్తోంది. అతడి మొహం పీక్కుపోయి వుంది.
భార్గవ పరిస్థితి కూడా అంతకు తక్కువగా ఏమీలేదు. మూడు రోజులక్రితం ఆత్మహత్య ప్రయత్నం తలపెట్టినప్పటినుండి ఇప్పటి వరకూ అతడు దాదాపు ఏమీ తినలేదు. అదీగాక రవూఫ్ చేసిన గాయం కాలి దగ్గర ఇంకా బాధపెడుతూనే వుంది.
బయట వసుమతి, రవూఫ్ తిరిగి రాగానే అతడి దగ్గిరగా వెళ్ళి "మీరేమీ చెయ్యలేరా? పాపకి ఆస్పత్రి మందులు ఇవ్వకుండా ఉండటమే ఆయనకీ కావల్సిందయితే నేనూ ఒప్పుకుంటాను. పాపని ఇక్కడ దాయవలసిన అవసరంలేదు. మా ఇంటికే వెళ్ళిపోవచ్చు. కొంచెం ఈ విషయం మైక్ లో చెప్పండి" అంది.
రవూఫ్ ఆమె మాటలపై అంతశ్రద్ధ చూపకుండా, సాలోచనగా ఆమెవైపు చూశాడు. దగ్గిరగా వచ్చిన ఆమెను చూడగానే అతడికి ఓ ఆలోచన మెరుపులా స్ఫురించింది. ఈమెను ముందు పెట్టుకుని తను నాటకం ఆడవచ్చు.
మొహంలో తనకొచ్చిన ఆలోచన తాలూకు అనందం ఏదీ ప్రతిబింబించకుండా "తప్పకుండా అలా చెయ్యవచ్చు మేడమ్! కానీ ఈ విషయం చెప్పడానికి మైక్ ఎందుకు? ఛాంబర్ కిటికీ దగ్గరకు వెళ్ళి కిటికీలోంచి చెప్పండి. నేచెప్పేకన్నా మీరు చెపితే మీ భర్త కన్విన్స్ అవుతారు" అన్నాడు.



