Home » Yandamuri veerendranath » Prarthana


                                                                         7

 

    చేతిలో బ్రెడ్ పాకెట్, కాళ్ళదగ్గర పళ్ళబుట్టా పెట్టుకుని ఆగిన ఆటోలోంచి, గోడకు అవతలవైపున దృశ్యాన్ని చూసిన ప్రియకి కొంచెంసేపుపాటూ ఏం చెయ్యాలో తోచలేదు. అవి ఎలాగైనా వాళ్ళకి అందించాలని, వాళ్ళతోపాటు ఉండడం కోసం లోపల ప్రవేశించాలనీ పుట్టిన కోర్కెని అతికష్టంమీద అణుచుకుంది. అది ఎంత తొందరపాటు ఆలోచనో ఆమెకు తెలుసు.

 

    ఆమె సరాసరి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ కి వెళ్ళి ఆయనను కలుసుకోవాలి అని అనుమతి అడిగింది. పళ్ళబుట్టలో ఆటోలోంచి దిగి, డి.ఎస్.పి.ని కలుసుకోవాలి అని అడుగుతున్న ఆ అమ్మాయిని చిత్రంగా చూశాడు జవాను. అయినా ఏం మాట్లాడకుండా ఆమె అందించిన చీటీ అందుకొని లోపలికి వెళ్ళాడు. రెండు నిమిషాల్లో ఆమెకి పిలుపు వచ్చింది.

 

    డి.ఎస్.పి.కి దాదాపు యాభై ఏళ్ళుంటాయి... డైరెక్టు రిక్రూట్స్ లో వుండే నెమ్మదీ, విషయం విని అర్థంచేసుకుని న్యాయం జరుపుదాం అన్న తనప అతడిలో లేవు. ఇలాంటి వాళ్ళను సవాలక్ష మందిని చూసిన అనుభవంతో విసుగ్గా ఆమె వంక చూసాడు. అదే ఇంకే విజిటరన్నా అయితే అప్పటికప్పుడే పొమ్మనేవాడు కాని వచ్చింది అమ్మాయి అవడంతో ఎదుటి కుర్చీ చూపిస్తూ కూర్చోమన్నాడు.     

 

    ప్రియ ముక్తసరిగా తను వచ్చినపని చెప్పింది.

 

    "వును, మా ఇన్ స్పెక్టర్ చెప్పాడు. ఆ భార్గవ ఎవడో... హి ఈజ్ ఎ క్రిమినల్. వెంటనే అరెస్టు చెయ్యాలి. మా వాళ్ళింకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో అర్థంకావడంలేదు".

 

    ప్రియ కోపాన్ని అణుచుకుంటూ "మీరింత తొందరగా ఒక నిర్ణయానికి రాకండి. అతడు చేసిన దొంగతనం ఏముంది? తన కూతుర్ని తను తీసుకువెళ్ళాడు. అంతేగా!"

 

    "కోర్టు ఆర్డర్ కి వ్యతిరేకంగా!" వ్యంగ్యంగా అన్నాడు.

 

    "స్వంత కూతురికి కోర్టేమిటి?"

 

    "అది తేల్చాల్సింది కోర్టు".

 

    "కోర్టు ఎలాగూ అతని పక్షమే తీర్పు యిస్తుంది. దావా వేసింది స్వంత తల్లికాదు, సవతి తల్లి".

 

    "నీతో వాదించడానికి లేను నేనిక్కడ" విసుగ్గా అన్నాడు. "అయినా అతను నీకేమౌతాడు?"

 

    "ఆయన నాకు తెలుసు" అంది. ఆమె కంఠంలో తడబాటు గుర్తించి అతను వంకరగా నవ్వాడు. ఆ నవ్వు ఆమెకి అసహ్యం కలిగించింది. అంతలో అతనన్నాడు, "భార్గవమీద ఆ కోర్టు కేసే కాదు, ఇన్ స్టిట్యూట్ అధికారులు కూడా ఫిర్యాదు చేసారు".

 

    "ఆయన తప్పేమిటండీ? తన కూతుర్ని తీసుకెళ్ళి తను వైద్యం చేసుకుంటానంటున్నారు- అంతేగా!" నిస్సహాయతా, కోపమూ మిళితమైన స్వరంతో అంది.

 

    "అలా అని చెప్పి ప్రతీ డాక్టరూ తన పేషెంటును ఏ ఉస్మానియాకో, కె.జి.హెచ్.కో తీసుకెళ్ళి వాళ్ళ ఖరీదైన ఆపరేషన్ థియేటర్లలో తలుపులు బిగించి తన స్వంతవైద్యం మొదలెడతానంటే మేము చూస్తూ ఊరుకోవాలా?" హేళనగా అడిగాడు.

 

    "ఎంతో కాదండీ, రెండు మూడురోజులు" ప్రాధేయ పూర్వకంగా అడిగింది. "అతడికేమీ హాని జరక్కుండా చూడండి, చాలు".

 

    "లా చూట్టానికి అతడు నాకేమీ బావగానీ, బావమరిదిగానీ కాదు. నీకు తెలిసినట్టుగా నాకు అతడు తెలీదు కదా" అన్నాడు. 'తెలిసినట్టుగా' అన్న పదాన్ని నొక్కి పలుకుతూ.

 

    ఆమె మొహం జేవురించింది. కుర్చీలోంచి విసురుగా లేచి నిలబడింది. "మనిషికీ మనిషికీ వున్న సంబంధం కేవలం మీకుతెలిసినదొకటే' కాదండీ, ఇంకా చాలా వున్నాయి. అది తెలుసుకోవాలంటే మీరు మానసికంగా చాలా ఎదగాలి. మీరు అనాలోచితంగా తీసుకుంటున్న ఈ చర్యవల్ల ఆయనకేమన్నా అపాయం జరిగితే దేశం ఒక మంచి సైంటిస్టుని కోల్పోవడానికి మీరే కారణభూతులవుతారు. ఆ పాపం మీదే" అనేసి అక్కడినుండి విసురుగా వెళ్ళిపోయింది.

 

    ఆమె నేరుగా గుమ్మందాటుతూ ఎదురుగా వస్తూన్న ఒక యువకుడిని దాదాపు డాష్ ఇవ్వబోయి, అతికష్టంమీద తమాయించుకుని పక్కకి జరిగి 'సారీ' చెప్పి వెళ్ళిపోయింది.

 

    అతడు ఆమె వెళ్ళినవేపే క్షణంపాటు చూసి లోపలికి నడిచాడు. అతడిని చూసి డి.ఎస్.పి. ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి శాల్యూట్ చేసాడు.

 

    "ఆ పాపం మీదే అంటుంది- ఎవరా అమ్మాయి?" ప్రశ్నించాడు ఆ యువకుడు.

 

    "ఏ... ఏ... ఏం లేద్సార్" అన్నాడు డి.ఎస్.పి. తడబడుతూ-

 

    పై అధికారిని చూసి అన్ని డిపార్టుమెంట్లకన్నా ఎక్కువ భయపడేది పోలీసు డిపార్టుమెంటులోనే.

 

                                                              *    *    *

 

    మరుసటిరోజు ప్రొద్దునకి ఈ వార్త నెమ్మదిగా ప్రాకడం మొదలుపెట్టింది. ప్రొద్దున్నే మామూలుగా ఇన్ స్టిట్యూట్ కి వచ్చేవాళ్ళందర్నీ దూరంగా వుంచటం పోలీసులకి కష్టమయినపని అయ్యింది. గుంపులు గుంపులుగా ఆవరణలో చేరి వాళ్ళు మాట్లాడుకోసాగారు. అందులోనూ లోపల వున్నది అప్పటివరకూ తమతో పనిచేసి రాజీనామా ఇచ్చిన భార్గవ అయి వుండడం వారిలో మరింత కుతూహలాన్ని కలిగించింది. వాళ్ళు అక్కడినుండి కదలకపోవడంతో వెంటనే వెళ్ళి తమ తమ పనులు చూసుకోవలసిందిగా శంకర్ లాల్ సర్క్యులర్ ఇవ్వవలసి వచ్చింది. ఉద్యోగులు కనుక భయపడి తమ తమ స్థానాలకు వెళ్ళిపోయారు. కానీ బయట ప్రహరీగోడకి అవతల వున్న రోడ్డుమీద మాత్రం జనం క్షణక్షణానికీ పెరగసాగారు.

 

    చుట్టూ పోలీసులు. వాళ్ళ చేతుల్లో తుపాకులు. రకరకాల వదంతులు ప్రాకడానికి దోహదం చేసినాయి. ఏదో హత్య చేసిన హంతకుడు లోపల ఉన్నాడని ఒకరంటే, కాదు- రేప్ చేసిన మనిషి పారిపోయి వచ్చి అక్కడ దాక్కున్నాడని మరొకరన్నారు.

 

    గాలికన్నా వేగంగా ఈ రూమర్లు వ్యాప్తి చెందాయి. ఈ లోపులో ఒక వ్యక్తి కొంచెం సాహసించి గోడకి దగ్గిరగా వున్న పోలీసుని పిలిచి, లోపల ఒక పాపకూడా వున్నదన్న సంగతి సేకరించాడు. దాంతో లోపల వున్నది హంతకుడు అన్న పుకారు లేవదీసిన వ్యక్తి, ఆ హంతకుడు పాకిస్తాన్ వెళ్ళిపోవడానికి ప్రభుత్వంతో బేరం పెట్టాడనీ, దానికి పాప ప్రాణం అడ్డుగా పెట్టాడనీ, దానికి పాప ప్రాణం అడ్డుగా పెట్టాడనీ, తన రూమర్ కి జోడించి మళ్ళీ జనంలోకి వదిలాడు.

 

    రేప్ చేశాడన్న పుకారు పుట్టించిన వ్యక్తి, లోపలున్నవాడు తల్లిని రేప్ చేసి కూతుర్ని సాక్ష్యం ఇవ్వకుండా చంపడానికి తీసుకువచ్చాడు అని తన రూమర్ ని సమర్ధించుకున్నాడు. ఈ విధంగా తెలిసిన కాస్త వాస్తవానికి తమ అభూత కల్పనలను జోడించి సంతృప్తి పడసాగారు జనం.

 

    గోడకవతల ఈ గోల జరుగుతూండగా- ఇన్ స్టిట్యూట్ లోపల మేనేజింగ్ డైరెక్టర్ తో పత్రికా విలేఖరులు గొడవ పడసాగారు. ఈ వార్త గురించిన వివరాలు చెప్పడానికి, వాళ్ళని లాబ్ తాలూకు ఫోటోలు తీసుకోవడానికి అతడు అనుమతి నిరాకరించడంతో ఈ గొడవ ప్రారంభం అయ్యింది. ప్రభుత్వం అనుమతి లేకుండా లోపలికి ప్రవేశించడానికి తానొప్పుకోనని అతని వాదన. పత్రికలవాళ్ళ విషయంలో అలాంటి అభ్యంతరాలుండకూడదని వాళ్ళ వాదన.


Related Novels


Vennello Godaari

Rudranethra

Rakshasudu

Stuvartapuram Police Station

More